హైబీపీని తేలిగ్గా తీసుకోకండి...

సాధారణంగా అధిక రక్తపోటును (హై బీపీ) ఒక భయంకరమైన వ్యాధిగా పరిగణించరు. కానీ, రక్తపోటును సరిగ్గా పట్టించుకోకపోతే అనేక వ్యాధులు వచ్చే ముప్పు ఉందని వైద్య ప్రపంచం హెచ్చరిస్తూనే ఉంది.

భారత్‌లో హైబీపీ గురించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో భారతీయులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, తేలిగ్గా తీసుకుంటున్నారని వెల్లడైంది.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐజేపీహెచ్)లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులోని సమాచారం ప్రకారం, 18-54 ఏళ్ల మధ్య ఉన్న భారతీయుల్లో 30 శాతం మంది బీపీని అసలు తనిఖీ చేసుకోరని తేలింది. అంటే ప్రతీ పది మందిలో ముగ్గురు బీపీని చూసుకోవట్లేదన్నమాట.

దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో అత్యధికంగా సగటున 76 శాతం ప్రజలు బీపీని చెక్ చేసుకుంటుండగా, ఉత్తర భారతంలో ఈ సగటు 70 శాతంగా ఉంది.

బీపీని తరచుగా పర్యవేక్షిస్తుండకపోతే చాలా తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గుండె జబ్బులకు దారి తీయడంతో పాటు మరణానికి కూడా కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

తరచుగా బీపీని చెక్ చేసుకుంటూ, జీవన శైలిలో సరైన మార్పుల ద్వారా బీపీని నియంత్రించుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో 50-60ఏళ్ల తర్వాత బీపీ సమస్య మొదలయ్యేది. కానీ, ఇప్పుడు పిల్లలు కూడా హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ రావడానికి ప్రధాన కారణం ఒబెసిటీ. ఒత్తిడి, నిద్రలేమి, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా హైబీపీ వస్తుంది.

‘‘చాలా మంది ఆరోగ్యాన్ని డయాబెటిక్ కంటే ఎక్కువ తీవ్రంగా ఒత్తిడి ప్రభావితం చేస్తుంది’’ అని చెన్నైలోని స్టాన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లోని మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెడ్ చంద్రశేఖర్ అన్నారు.

బీపీని తరచుగా చెక్ చేస్తూ ఉండాలని, ఒకవేళ పరీక్షల్లో బీపీ తగ్గినట్లు తేలితే తీసుకునే మందుల మోతాదు తగ్గించాలని చంద్రశేఖర్ సూచించారు.

‘‘చాలామంది పేద ప్రజలకు క్రమం తప్పకుండా బీపీ మందులు తీసుకోవాలనే అవగాహన ఉండదు. బీపీ కోసం మందులు వాడుతున్న మధ్యతరగతి ప్రజలు కూడా తరచుగా బీపీ నియంత్రణలో ఉందో, లేదో తెలుసుకునే ప్రయత్నం చేయరు’’ అని ఆయన చెప్పారు.

బీపీకి సంబంధించిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

బీపీ ఎంత ఉంటే వైద్య సహాయం అవసరం?

ఆరోగ్యకరమైన ఒక వ్యక్తి సాధారణ రక్తపోటు 120/80 ఎంఎం/హెచ్‌జీ గా ఉంటుంది.

సూక్ష్మంగా చెప్పాలంటే ఈ రెండు అంకెలు గుండె సంకోచ, వ్యాకోచాలను సూచిస్తాయి.

ఒకవేళ ఈ రక్తపోటు స్థాయి 140/90కి చేరితే, మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అధిక రక్తపోటు సమస్య ఉంటే, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలనే అంశాలపై డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.

అలాగే వైద్యులు సిఫార్సు చేసిన మందులను వాడాలి. డాక్టర్ సూచించిన మేరకు మందుల మోతాదును తీసుకోవాలి.

ఇంట్లో బీపీని ఎలా చూసుకోవాలి?

గతంలో వైద్యులు బీపీని చూడటానికి పాదరసం ఉండే స్పిగ్మోమానోమీటర్లను వాడేవారు. కానీ, ఇప్పుడు బీపీని కొలవడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు నాణ్యమైన బీపీ పరికరాల ధర రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య ఉంటుంది. అయితే, ఈ పరికరాలతో బీపీని పరీక్షించే విధానాన్ని ఒకసారి డాక్టర్ లేదా నర్సు ద్వారా తెలుసుకోవాలి.

బీపీని చెక్ చేసుకోవడానికి పావుగంట లేదా 20 నిమిషాల ముందు టీ లేదా కాఫీ తాగొద్దు. ఆల్కహాల్, సిగరెట్ తాగిన తర్వాత కూడా బీపీని పరీక్షించకూడదు. బీపీని పరీక్షించే 20 నిమిషాల ముందు సిగరెట్, ఆల్కహాల్ తీసుకోకూడదు.

బీపీ పరీక్షించే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. కుర్చీలో రిలాక్స్‌గా కూర్చోవాలి. కుర్చీలో వెనక్కి వాలి, పాదాలను నేలకు తగిలేలా కూర్చోవాలి. అలాగే కాళ్లను ముడుచుకోకూడదు. కాలిపై కాలు వేసుకోకూడదు.

పరీక్షించే సమయంలో రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లుగా చూపిస్తే, ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కుడి, ఎడమ ఇలా రెండు చేతుల్ని ఉపయోగించి బీపీ పరీక్షించుకోవచ్చు. వచ్చిన ఫలితాల సగటును లెక్కవేయాలి.

బీపీని ఏ సమయంలో చూడాలి?

బీపీని ఉదయం, మధ్యాహ్నం, ఇంకా చెప్పాలంటే రాత్రిపూట కూడా పరీక్షించుకోవచ్చు.

మామూలుగా మనం నిద్రపోయిన తర్వాత బీపీ 15 నుంచి 20 శాతం తగ్గుతుంది. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం విశ్రాంతి పొందుతుంది. కానీ, చాలామంది రాత్రిళ్లు 2 లేదా 3 గంటలకు పడుకుంటారు. అలాంటివారికి బీపీ తగ్గకుండా ఎక్కువగానే ఉంటుంది.

దీన్నే వైద్యభాషలో నాక్టుర్నల్ హైపర్‌టెన్షన్ అంటారు. అందుకే, చాలామందికి ఉదయం వేళలో గుండెపోటు వస్తుంది.

బీపీ అనేది రోజులో 24 గంటలు నియంత్రణలోనే ఉండాలనే సంగతి చాలా మందికి తెలియదు. అందుకే, చిన్న వయస్సు వారికి కూడా గుండెపోటు రావడం చూస్తున్నాం. ఒత్తిడి, డిప్రెషన్‌ల వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. పెయిన్ కిల్లర్స్ వాడకం కూడా కొన్నిసార్లు అధిక రక్తపోటుకు దారి తీస్తుంది.

రోజూ బీపీని పరీక్షించుకోవాలా?

ప్రతీరోజూ బీపీని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. శరీరంలో అసౌకర్యంగా ఉంటే, ఏవైనా లక్షణాలు కనిపిస్తే బీపీని పరీక్షించుకోవాలి.

అధిక రక్తపోటు వల్ల ఏం జరుగుతుంది?

నిరంతరం అధిక రక్తపోటు వస్తుంటే కళ్లు దెబ్బతింటాయి. గుండె గోడలు, రక్తనాళాలు, కిడ్నీలపై హైబీపీ తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

మెదడుతో అనుసంధానమయ్యే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చు. ఇదే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలు, రక్తనాళాలు ప్రభావితం కావొచ్చు.

బీపీ పెరిగినకొద్దీ గుండెలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. గుండె గోడలు మందంగా మారడంతో పాటు వాపునకు గురవుతాయి. ఇది గుండె సంకోచ వ్యాకోచాలను ప్రభావితం చేస్తుంది. హైబీపీ అనేది గుండెను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది.

అధిక రక్తపోటు లక్షణాలు ఏంటి?

అధిక రక్తపోటు ఉన్నవారిలో తొలుత పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎలాంటి లక్షణాలు లేకుండా నేనేందుకు మందులు వేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు. కానీ, నెమ్మదినెమ్మదిగా హైబీపీ లక్షణాలు బయటపడుతుంటాయి.

టెన్షన్, తలనొప్పి, తల తిరగడం, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి, చిన్న చిన్న విషయాలకు భయపడటం, కాళ్ల వాపు వంటివి తరువాతి దశల్లో కనిపిస్తాయి.

హైబీపీని ఎలా నివారించాలి?

బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలను తినకూడదు. రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలు అంటే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయొచ్చు. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేసేముందు వైద్యుని సలహా తీసుకోవాలి.

ప్రతీరోజు వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. కీళ్ల నొప్పి, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం మంచిది.

ప్రతీరోజూ ఒకేరకమైన వ్యాయామాలు చేయడానికి బదులుగా వేర్వేరు ఎక్సర్‌సైజులు చేయవచ్చు. వారంలో 150 నిమిషాల వ్యాయామం అవసరం. అంటే వారంలో కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా వారంలో 5 రోజుల వ్యాయామాన్ని సిఫార్సు చేస్తోంది.

ఇవన్నీ చేస్తున్నప్పటికీ రక్తపోటు అదుపులోకి రాకపోతే వైద్యులను సంప్రదించాలి.

హైబీపీని పూర్తిగా నయం చేయొచ్చా? హైబీపీ ఉంటే జీవితకాలం మాత్రలు వేసుకోవాలా?

చాలామంది దీర్ఘకాలం పాటు మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. హైబీపీకి శాశ్వత పరిష్కారం కోసం పరిశోధనలు జరుగుతున్నాయి.

అయితే, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చనేది శాస్త్రీయంగా నిరూపితమైంది.

ఏం తినాలి?

హైబీపీతో బాధపడేవారు ఏం తినాలో? ఏం తినకూడదో చెన్నైకి చెందిన డైటీషియన్ భువనేశ్వరి వివరించారు.

అధికంగా ఉప్పు ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని ఆమె చెప్పారు.

‘‘రోజూవారీగా ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. చిప్స్, పచ్చళ్లను తక్కువగా తినాలి. ఉప్పుతో కూడిన ఆహారాలను మానేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మానవ శరీరానికి రోజుకు 6 గ్రాముల ఉప్పు సరిపోతుంది. భారతీయ ఆహారంలో ఉప్పు పరిమాణం 10-12 గ్రాములు ఉంటుంది. కాబట్టి ఉప్పును సగానికి తగ్గించాలి.

మాంసంలో కొవ్వు అధికంగా ఉంటుంది. అదనంగా మాంసం కూరల్లో ఉప్పు, మసాలాలు, నూనెలు వాడుతారు. మటన్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. మటన్‌తో పోలిస్తే, చేపలు, చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎంత పరిమాణంలో తింటున్నామో కూడా చాలా ముఖ్యం’’ అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)