‘బ్యాగ్ కదులుతుండడంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చింది.. చూస్తే అందులో రెండేళ్ల పాప’

    • రచయిత, సెహర్ అసఫ్
    • హోదా, బీబీసీ న్యూస్

లగేజీలో రెండేళ్ల చిన్నారిని ఉంచి, బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూజీలాండ్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.

లగేజీ కంపార్ట్‌మెంట్‌ తెరవాలని ఆ ప్రయాణికురాలు అడగడంతో వెళ్లిన డ్రైవర్‌కు ఆమె దగ్గరున్న బ్యాగ్ కదులుతున్నట్లు అనిపించడంతో ఈ విషయం బయటపడిందని పోలీసులు చెప్పారు.

న్యూజీలాండ్‌లోని కైవాకా పట్టణంలోని ఒక బస్‌స్టాప్ వద్ద ఇది జరిగింది.

''బ్యాగ్ కదులుతుండటం చూసి డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. సూట్‌కేస్‌ను తెరచిచూడగా అందులో రెండేళ్ల పాప కనిపించింది'' అని న్యూజీలాండ్ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ చర్యకు పాల్పడిన 27 ఏళ్ల మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు, చిన్నారి పట్ల నిర్లక్ష్యం వహించినట్లుగా ఆమెపై అభియోగాలు మోపారు.

''పాప ఒళ్లు చాలా వేడిగా ఉంది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించాం. వైద్య పరీక్షలు జరుగుతున్నాయి'' అని ఆ ప్రకటనలో పోలీసులు చెప్పారు.

ఆ పాపకు, మహిళకు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించలేదు.

సోమవారం ఆ మహిళను కోర్టులో హాజరుపరచనున్నారు.

''లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఏదో తేడాగా ఉందని గమనించి, వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్న డ్రైవర్‌ను అభినందిస్తున్నాం. ఆయన ఇలా చేసి, పెద్ద ఘోరం జరుగకుండా చూశారు'' అని పోలీసులు ఒక ప్రకటనలో ప్రశంసించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)