కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్, పశ్చిమబెంగాల్‌లో నిరసనలు

    • రచయిత, ప్రభాకర్ మణి తివారి
    • హోదా, బీబీసీ కోసం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.

లా కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో కాలేజీ పూర్వ విద్యార్థి ఒకరు ఉన్నారు.

అయితే, నిందితుడికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ)తో సంబంధముందన్న ఆరోపణలతో ఈ కేసు రాజకీయ వివాదంగా మారింది.

పాలక తృణమూల్ కాంగ్రెస్‌, ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అనేక సంస్థలు నిరసన తెలిపాయి.

అయితే, ఈ వాదనలను టీఎంసీపీ తోసిపుచ్చింది. ప్రధాన నిందితుడు చాలా ఏళ్లుగా తమ సంస్థలో అంత యాక్టివ్‌గా లేరని అంటోంది. ఆయన అదే కళాశాలలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు చెబుతోంది.

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కోరింది. పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖలో కమిషన్ చైర్‌పర్సన్ విజయా రహాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, విద్యార్థినికి అవసరమైన సాయం అందించాలని సూచించారు.

విద్యార్థిని ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం, ముగ్గురినీ నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు.

ఈ కేసు 2024లో కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను గుర్తుకు తెచ్చింది.

అప్పట్లో వర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌లలో భద్రత ప్రమాణాలపై చర్చ జరిగింది. ఆ కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది.

పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక పోలీస్ అధికారి బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ ఘటన జూన్ 25 రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 10.50 గంటల మధ్య సౌత్ కలకత్తా లా కాలేజీ క్యాంపస్‌లో జరిగింది'' అని చెప్పారు.

దీనిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం, ఆమెకు పార్క్ సర్కస్‌లోని మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అనంతరం, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మూడో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

ఇద్దరు నిందితులు ప్రమీత్ ముఖర్జీ, జై అహ్మద్ అదే కాలేజీలో చదువుతున్నారు. మూడో నిందితుడు మనోజిత్ మిశ్రా. ఈయన ఆ కాలేజీ పూర్వ విద్యార్థి.

పోలీసులు నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

'కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ చేస్తామని రప్పించి..'

పోలీసులతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటన స్థలాన్ని శుక్రవారం పరిశీలించింది.

''టీఎంసీపీ కాలేజీ యూనియన్‌కు అధ్యక్షురాలిని చేస్తామని చెప్పి క్యాంపస్‌కు రప్పించి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పారు'' అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

''మనోజిత్ మిశ్రా ఫోన్ చేసి యూనియన్ ప్రెసిడెంట్ చేస్తామని చెప్పి కాలేజీకి రమ్మన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె కాలేజీకి వెళ్లారు. ఆ తర్వాత తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని మనోజిత్ ఒత్తిడి చేశారు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో మనోజిత్, ఇద్దరు సహచరులు బలవంతంగా ఆమెను గార్డు గదిలోకి లాక్కెళ్లారు, గార్డును అక్కడి నుంచి పంపించేసి ఈ నేరానికి పాల్పడ్డారు'' అని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనోజిత్ మిశ్రా ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన దక్షిణ కోల్‌కతా జిల్లా టీఎంసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. గతంలో టీఎంసీపీ లా కాలేజీ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు.

అయితే, టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిణంకుర్ భట్టాచార్య విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ''చాలా ఏళ్ల కిందట అతనికి ఏదో ఒక చిన్న పదవి ఉంది. అతను యూనియన్ అధ్యక్షుడు కాదు. టీఎంసీపీ లా కాలేజీ యూనియన్‌లోనూ చాలా ఏళ్లుగా చురుగ్గా లేడు'' అని అన్నారు.

ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, మిగిలిన ఇద్దరు నిందితులకు కూడా టీఎంసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌తో సంబంధముంది. అయితే, ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఈలోగా, ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాతో టీఎంసీపీ, తృణమూల్ కాంగ్రెస్ నాయకుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. ఆ ఫోటోల్లోత్రిణంకుర్ భట్టాచార్య కూడా ఉన్నారు.

'విచారణ కమిటీ ఏర్పాటు చేస్తాం'

దక్షిణ కోల్‌కతా టీఎంసీపీ అధ్యక్షుడు సార్థక్ బెనర్జీ మాట్లాడుతూ, ''నిందితులకు టీఎంసీపీలో ఎలాంటి పదవులూ లేవు. వారికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాం'' అని అన్నారు.

మరోవైపు, ఇదే ప్రశ్నకు టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిణంకుర్ భట్టాచార్య నేరుగా సమాధానం ఇవ్వకుండా ''నిందితులకు తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధముందా లేదా అనేది కాదు, వారిని కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగి. ఆయనకు టీఎంసీపీతో సంబంధం లేదు'' అని అన్నారు.

అయితే, నిందితులకు టీఎంసీపీతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు టీఎంసీపీ ఆఫీస్ బేరర్‌గా కూడా ఉన్నారని అంటున్నాయి.

లా కాలేజీ ప్రిన్సిపల్ నయనా చటర్జీ శుక్రవారం మాట్లాడుతూ, ''ఈ విషయం నాకు తెలియదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ ఘటన ఆ తర్వాత జరిగింది'' అన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. ఆయన్ను 45 రోజులకు నియమించారు. కాలేజీ సమయం పూర్తయ్యాక క్యాంపస్‌లో ఏం చేస్తున్నారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

కలకత్తా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శాంతా దత్తా డే మాట్లాడుతూ, ''ఈ ఘటనపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాం. ఘటనకు సంబంధించి, కళాశాల ప్రిన్సిపల్ నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరాం" అన్నారు.

మంగళవారం నాటికి విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. అనంతరం, దీని గురించి యూనివర్సిటీ యాజమాన్యం కాలేజీ ప్రిన్సిపల్‌కు లిఖితపూర్వక సమాచారం అందిస్తుందని ఆమె తెలిపారు.

మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: బీజేపీ

అయితే, మనోజిత్ తండ్రి విలేఖరులతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా తనకు కొడుకుతో ఎలాంటి సంబంధాలు లేవని, ఇంటికి కూడా రాడని చెప్పారు. ఎప్పుడో ఒకసారి వచ్చి బాగోగులు అడిగి వెళ్తుంటాడని అన్నారు.

కాలేజీ అంతర్గత రాజకీయాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని, తన కొడుకు బాధితుడు అయ్యుండొచ్చని ఆయన అన్నారు.

''మనోజిత్ యుక్త వయసులోనే తృణమూల్ కాంగ్రెస్‌కు ఆకర్షితుడయ్యాడు, కాలేజీలో చదువుకుంటున్న సమయంలో క్రియాశీల రాజకీయాల్లో చేరాడు'' అని ఆయన విలేఖరులతో అన్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం రథయాత్ర కార్యక్రమాలకు సంబంధించి దిఘాలో ఉన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ ఘటనపై స్పందిస్తూ, ''పోలీసులంతా ముఖ్యమంత్రి భద్రతలోనే తలమునకలయ్యారు. అందుకే ఇలాంటి ఘటన జరిగింది'' అని అన్నారు.

''రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆమెకు ఆ కుర్చీలో కూర్చునే హక్కు ఇక ఏమాత్రం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన నిరూపించింది."

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ మాట్లాడుతూ, ''అత్యాచారాన్ని చిన్న సంఘటనగా ముఖ్యమంత్రే అభివర్ణించిన రాష్ట్రంలో, ఇలాంటి ఘటనలు సహజమే. కాలేజీ క్యాంపస్‌లలో అమ్మాయిలకు రక్షణ లేదు. లా చదువుకునే కాలేజీలోనే లా ఉల్లంఘనలు జరుగుతున్నాయి'' అని అన్నారు.

విద్యార్థి సంఘాల నిరసన

ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఆ ప్రాంతంలో ప్రదర్శన నిర్వహించింది.

వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి దేబాంజన్ డే మాట్లాడుతూ, ''సౌత్ కలకత్తా లా కాలేజీలో తృణమూల్ ఛాత్ర పరిషత్ చాలాకాలంగా అల్లర్లు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసు శాఖ, ప్రభుత్వం నోరుమెదపడం లేదు. ప్రధాన నిందితుడిపై ఇప్పటికే అవినీతి, అత్యాచార బెదిరింపుల వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి'' అన్నారు.

ప్రధాన నిందితుడు టీఎంసీపీ దక్షిణ కోల్‌కతా శాఖకు కార్యదర్శిగా ఉన్నారని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడొకరు చెప్పారు. మిగిలిన ఇద్దరు నిందితులకు కూడా తృణమూల్ కాంగ్రెస్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌తో సంబంధముందన్నారు.

మరో సంస్థ అభయ్ మంచ్ కస్బా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించింది. యువతి కుటుంబాన్ని కలవనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ, ''ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగవు'' అని అన్నారు.

ప్రతిపక్షాల మాటల దాడి తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. దోషులకు కఠిన శిక్ష విధించాలని, ప్రతి తృణమూల్ కార్యకర్త ఈ ఘటనను ఖండించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.

ఇతరులతో మాట్లాడినప్పుడు, ఈ ఘటనకు ఆర్‌జీ కర్ ఘటనతో చాలా సారూప్యతలు ఉన్నాయని చాలామంది నాయకులు అభిప్రాయపడ్డారు. ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరంగా మారొచ్చని అన్నారు.

రాజకీయ విశ్లేషకురాలు శిఖా ముఖర్జీ మాట్లాడుతూ, ''నిందితులకు తృణమూల్ కాంగ్రెస్‌తో సంబంధముందా? లేదా అనేది పక్కనపెడితే, రాష్ట్ర రాజధానిలోని ఒక కాలేజీ క్యాంపస్‌లో ఇలాంటి ఘటన చాలా పెద్ద విషయం. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిందితులకు తృణమూల్‌తో సంబంధముందని తేలితే, ఆ పార్టీకి చాలా నష్టం కలుగుతుంది'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)