You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య: ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించిన సుప్రీంకోర్ట్ - ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో ఆగస్టు 22లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్ట్ కోరింది. అలాగే, ఆర్‌జీ కర్ ఆస్పత్రిపై మూక దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.
మెడికల్ కాలేజీలోకి వేలాది మంది ఎలా ప్రవేశించగలిగారని పోలీసులను కోర్టు ప్రశ్నించింది.
‘నేరం జరిగిన తరువాత మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దానిని ఆత్మహత్యగా చెప్పే ప్రయత్నం చేశారు’ అని కోర్టు పేర్కొన్నట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.
‘చాలామంది యువ వైద్యులు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి సురక్షితమైన పని వాతావరణం కోసం నేషనల్ ప్రోటోకాల్‌ను డెవలప్ చేయాలి’ అని కోర్టు తెలిపింది.
మహిళలు పనికి వెళ్లలేకపోతే, పని ప్రదేశాల్లో సురక్షితంగా లేకపోతే వారి సమానత్వ హక్కును హరించినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
మీడియాలో కొన్నిచోట్ల బాధితురాలి పేరు వెల్లడించడంపైనా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్‌జి కర్ ఆసుపత్రి ప్రిన్సిపల్‌పై విచారణ జరుగుతున్నప్పుడు, ఆయనకు వెంటనే మరో కాలేజీలో ఎలా పోస్టింగ్ ఇచ్చారని సుప్రీం ప్రశ్నించింది.
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఆస్పత్రి యాజమాన్యం ఏం చేస్తోందని ప్రశ్నించింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు.
"కోల్‌కతా పోలీసులకు తెలియకుండా 7,000 మంది ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లోకి ప్రవేశించలేరు" అని మెహతా కోర్టుకు తెలిపారు.
వైద్యుల భద్రత, సౌకర్యాల కోసం జాతీయ ప్రోటోకాల్‌ను సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు 10 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
“పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతూ, సంఘటన స్థలాన్ని సురక్షితంగా ఉంచాల్సింది. కానీ వారు అలా ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఏ రోజు ఏం జరిగింది?
ఆగస్టు 9 ఉదయం: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది.
ఆమెపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారని పోస్టుమార్టంలో తేలింది.
ఆగస్టు 10: సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు కోల్‌కతాలో ట్రాఫిక్ పోలీస్ వలంటీర్. సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు.
ట్రైనీ వైద్యురాలి హత్యపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి.
ఆగస్టు 11: ఆర్‌జీ కర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
కేసును త్వరితగతిన పరిష్కరించాలని, వైద్యులకు భద్రత కల్పించాలని దేశవ్యాప్తంగా వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ఆగస్టు 12: ఆసుపత్రులలో కొన్ని నిర్దేశిత సేవల్ని నిలిపివేయాలని ద ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్లకు పిలుపునిచ్చింది.
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పదవి నుంచి వైదొలగారు.
సీబీఐకి కేసు
వైద్యురాలి హత్యను అనాగరిక స్థాయి నేరంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభివర్ణించింది. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో దేశం మద్దతును కోరింది.
ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 24 గంటల పాటు (ఈ నెల 17న) వైద్య సేవల నిరాకరణకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఐఎంఏ వైద్యుల భద్రత కోసం పలు డిమాండ్లను ముందుకు తీసుకొచ్చింది.
ఈ కేసుపై మృతురాలి తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఆగస్టు 14: సీబీఐ కేసు దర్యాప్తును ప్రారంభించింది.
ఆగస్టు 15: రాత్రి వేలాదిమంది ఆర్‌జీ కర్ ఆసుపత్రిపై దాడి చేశారు.
ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఆగస్టు 20 (మంగళవారం)న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది.
కేసు దర్యాప్తుపై ఆగస్టు 22లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని, ఆర్‌జీ కర్ ఆస్పత్రిపై మూక దాడి ఘటనపై స్టేటస్ నివేదిక ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)