విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ

విజయ్

ఫొటో సోర్స్, TVK

చదివే సమయం: 3 నిమిషాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌‌లో ఆసక్తికరమైన ఫలితాలు వస్తున్నాయి.

కొత్తగా పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ టీవీకే ఫలితాల ట్రెండ్స్‌లో ఆధిక్యం కనబరుస్తోంది.

ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇస్తోంది.

డీఎంకే రెండో స్థానంలో, అన్నా డీఎంకే మూడో స్థానంలో ఉన్నాయి.

ఇక కొళత్తూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అసెంబ్లీ ఎన్నికలు 2026

ఫొటో సోర్స్, Getty Images

‘మ్యాజిక్ మార్క్’ దాటిన విజయ్ పార్టీ ట్రెండ్స్

మొత్తంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీ అయినా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు సాధించాలి. రాత్రి 7.30 గంటల సమయానికి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వెల్లడైన ఫలితాలు, సరళి ప్రకారం.. విజయ్ టీవీకే పార్టీ 62 సీట్లను గెలుచుకుని మరో 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే 24 సీట్లు గెలిచి మరో 34 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 22 స్థానాలు గెలిచి మరో 26 చోట్ల ఆధిక్యంలో ఉంది.

బీజేపీ తమిళనాడులో ఒక సీటు గెలిచింది. ఉదకమండలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి భోజరాజన్ 971 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

పీఎంకే 2, కాంగ్రెస్ 2 సీట్లలో విజయం సాధించాయి.

కోల్‌కతాలో బీజేపీ సంబరాలు

ఫొటో సోర్స్, Uttarayan

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

ఇక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు 148 (ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా, ప్రస్తుతం 293 స్థానాలకు మాత్రమే లెక్కింపు జరుగుతోంది)

రాత్రి 7.30కి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రాష్ట్రంలో బీజేపీ 94 స్థానాల్లో విజయం సాధించి మరో 112 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 40 సీట్లలో విజయం సాధించి మరో 41 చోట్ల ఆధిక్యంలో ఉంది.

కాంగ్రెస్ పార్టీ ఫరక్కా, రాణినగర్ స్థానాలలో మాత్రమే విజయం సాధించింది.

కేరళలలో యూడీఎఫ్

కేరళలో యూడీఎఫ్ విజయం

కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మెజార్టీ స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో కేరళలో కమ్యూనిస్టుల కోట పతనం అంచున నిలబడింది. ఇది కమ్యూనిస్టు పార్టీకి చివరి కోట.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి నెలకొంది.

వామపక్ష నేతలు వెనుకబడ్డారనే వార్తలు మొదలైనప్పటి నుంచీ వారు సంబరాలు చేసుకుంటున్నారు.

రాత్రి 7.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 63 సీట్లను గెలుచుకుంది. సీపీఎం 26, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 సీట్లు గెలిచాయి. సీపీఐ 8, కేరళ కాంగ్రెస్ 7 సీట్లు గెలిచాయి. బీజేపీ ఈ రాష్ట్రంలో 3 స్థానాలు గెలిచింది.

నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

అస్సాంలో బీజేపీ మూడోసారి ‘మ్యాజిక్’

అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు గానూ మెజార్టీ మార్క్ 64 కాగా, రాత్రి 7.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన ఫలితాల సమాచారం ప్రకారం.. బీజేపీ 79 సీట్లను గెలుచుకుని మరో 3 చోట్ల ఆధిక్యంలో ఉంది.

కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెలిచి మరో 7 చోట్ల ఆధిక్యంలో ఉంది.

బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 9 సీట్లు, అస్సాం గణపరిషత్ 7, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 2 సీట్లు గెలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒక సీటు గెలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)