You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టైటాన్ సబ్, జేమ్స్ కామెరాన్: ‘హెచ్చరించినా పట్టించుకోలేదు.. అందుకే ఈ ప్రమాదం’
టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించడంపై హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచి వేసిందని ఆయన అన్నారు.
కామెరాన్ ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు. 1997 ఆయన టైటానిక్ షిప్ మీద సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది.
సముద్ర గర్భంలోని టైటానిక్ శిథిలాలను చూసేందుకు ఆయన స్వయంగా 33 సార్లు నీటి లోపలికి వెళ్లి వచ్చారు.
టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ను నిర్మించిన ఓషన్ గేట్‌కు సరైన సర్టిఫికేషన్ కూడా తీసుకోలేదని, ఎందుకంటే అది అందులో ఎప్పటికీ పాస్ కాదని కామెరాన్ అన్నారు.
‘‘వాళ్లు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారో తెలియదు. నేను దాని లోపలికి వెళ్లి ఎప్పుడూ చూడలేదు’’ అన్నారాయన.
2012లో ఆయన టైటానిక్ చూడటానికి వెళ్లేందుకు ఆయన ఇందుకు భిన్నమైన టెక్నాలజీని ఎంచుకున్నారు.
డీప్ సీ చాలెంజర్ సబ్‌మెర్సిబుల్ ఎక్స్‌పెడిషన్ ద్వారా ఆయన మహాసముద్రంలో 10,912 మీటర్ల లోతుకు వెళ్లగలిగారు.
తాను ఆదివారం నాడు ఓ షిప్‌లో ఉన్ననని, ఏం జరిగిందో సోమవారం వరకు తనకు తెలియలేదని అన్నారు.
నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలు రెండూ ఒకేసారి ఫెయిలయ్యాయని తెలిసినప్పుడే తాను ఈ ప్రమాదాన్ని ఊహించానని కామెరాన్ అన్నారు.
‘‘సబ్‌మెర్సిబుల్‌కు సంబంధించి ఎలాక్ట్రానిక్స్, కమ్యూనికేషన్సు, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్స్ ఒకేసారి విఫలమయ్యాయి. సబ్ మెర్సిబుల్ కనిపించకుండా పోయింది. నాకు విషయం వెంటనే అర్థమైంది’’ అన్నారాయన.
కమ్యూనికేషన్స్ వ్యవస్థ దెబ్బతిన్నదన్న విషయం తెలియగానే డీప్ వాటర్ సబ్‌మెరైన్స్ కమ్యూనిటీలో తెలిసిన మిత్రులకు ఫోన్ చేశానని చెప్పారు కామెరాన్.
‘‘గంట తర్వాత నాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. వారు బాగా కిందికి వెళ్లిపోతున్నారు. అప్పటికే 3500 మీటర్లకు దిగారు. ఇంకా 3800 మీటర్ల దిశగా వెళ్లిపోతున్నారు’’ అని కామెరాన్ చెప్పారు.
‘‘వారి కమ్యూనికేషన్ వ్యవస్థ పోయింది. నావిగేషన్ పోయింది. ఏదో విపత్తు జరిగితే తప్ప అవి రెండూ ఒకేసారి దెబ్బతినవని నాకు అర్థమైంది. అది కూడా ఘోరమైన విపత్తు అయ్యుండాలి. పెద్ద పేలుడు లాంటిది జరిగి ఉంటుందని నాకు అవగతమైంది’’ అన్నారాయన.
యూఎస్ నేవీ ఏం చెప్పింది?
టైటాన్ సబ్‌మెర్సిబుల్ భూమితో కమ్యూనికేషన్ మిస్ అయిన కాసేపటికే భారీ శబ్ధాన్ని తాము గుర్తించినట్లు యూఎస్ నేవీ అధికారి ఒకరు బీబీసీ న్యూస్ పార్ట్‌నర్ సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు.
ఈ విషయాన్ని కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించామని, వాళ్లు వెంటనే సెర్చ్ ఆపరేషన్ పరిధిని కుదించాలని నిర్ణయించారని ఆ అధికారి తెలిపారు.
‘‘జనం ఈ శబ్ధాల గురించి, ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటుంటే నాకంతా పీడకలలా అనిపించింది’’ అన్నారు కామెరాన్.
గురువారం నాడు రిమోట్ కంట్రోల్డ్ వాహనాన్ని నీటిలోకి దింపిన గంటల్లోనే ఇంకా చెప్పాలంటే నిమిషాల్లోనే దాన్ని గుర్తించగలిగారని కామెరాన్ అన్నారు.
‘‘సబ్ మెర్సిబుల్ చివరిసారి ఎక్కడ ఆగిపోయిందో మళ్లీ అక్కడి నుంచి కదల్లేదు. వాళ్లు దాన్ని అక్కడే గుర్తించారు’’ అని కామెరాన్ చెప్పారు.
హెచ్చరికలను పట్టించుకోలేదా?
టైటానిక్ షిప్ మునకలాగానే, టైటాన్ ఘటన కూడా ఒక ఘోరమైన ప్రమాదమని అన్నారాయన.
‘‘హెచ్చరికలను పట్టించుకోని వైఖరి మరో ప్రమాదానికి కారణమైంది. ఈ విషయంలో ఓషన్‌గేట్ సంస్థకు ఇంతకు ముందే హెచ్చరికలు అందాయని కామెరాన్ చెప్పారు.
ఈ కంపెనీలో పని చేసే వ్యక్తులు కొందరు ఇటీవల కంపెనీ నుంచి వెళ్లిపోయారని, కానీ వారు ఎందుకు వెళ్లిపోయారో తనకు తెలియదని అన్నారు.
డీప్ సీ సబ్‌మెరైన్స్ నిపుణులు కొందరు ఓషన్ గేట్‌కు లెటర్ రాశారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ బృందంలో తాను కూడా ఉన్నానని ఆయన చెప్పలేదు. కామెరాన్ మాటల ప్రకారం, ‘‘మీరు ప్రమాదకరమైన మార్గంలో వెళుతున్నారు’’ అని ఆ లేఖలో ఓషన్ గేట్‌ను నిపుణులు హెచ్చరించారు.
అయితే, ఈ టూరిస్ట్ సంస్థ కార్యకలాపాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన వారిలో కామెరాన్ మొదటి వ్యక్తి కాదు.
2018 మార్చిలో మెరైన్ టెక్నాలజీ సొసైటీ (ఎంటీఎస్) ఓషన్ గేట్‌కు ఒక లేఖ రాసింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక బయటపెట్టిన ఆ లేఖలో ‘‘మీరు చేస్తున్న ప్రయోగం ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అది చిరు ప్రమాదమైనా, పెను విపత్తు అయినా..ఏదైనా కావచ్చు’’ అని అందులో హెచ్చరించింది.
ఈ నౌకలో భద్రతా సమస్యల గురించి ఓషన్‌గేట్ మాజీ ఉద్యోగి ఒకరు 2018లోనే హెచ్చరించినట్లు అమెరికాలోని కొన్ని కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి.
కంపెనీ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ డేవిడ్ లోఖ్రిడ్జ్ కూడా తన ఇన్‌స్పెక్షన్ నివేదికలో ఆందోళనకర విషయాలను గుర్తించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
అయితే, ఓషన్ గేట్ సహ వ్యవస్థాపకుడు గిలెర్మో సోన్లీన్ మాత్రం టైటాన్ అనేక రకాలు పరీక్షలు జరిగాయని చెబుతున్నారు. పదేళ్ల కిందట ఆయన ఓషన్ గేట్ నుంచి నిష్క్రమించారు.
‘‘ టైటాన్ లో భద్రత గురించి మాట్లాడే వాళ్లు కామెరాన్ సహా మరెవరైనా, తాము ఈ టెస్టులను చూశామని చెప్పడం లేదు. వాళ్లకు దీని ఇంజినీరింగ్ గురించి తెలియదు, ఎలా నిర్మించారో తెలియదు, ఎలాంటి టెస్టులు నిర్వహించారో కూడా తెలియదు’’ అని అన్నారు.
టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు ఎలాంటి సర్టిఫికెట్ గుర్తింపు లేదు. అయితే, దానికి అది తప్పనిసరి కాదు.
టైటానిక్ శిథిలాలను చూడాలనుకునే వారెవరికైనా ఇది రిస్కుతో కూడుకున్న వ్యవహారమన్న విషయం తెలుసని కామెరాన్ వ్యాఖ్యానించారు.
‘‘మనం 21వ శతాబ్ధంలో ఉన్నాం. ఎలాంటి రిస్కులు లేకుండా ఉండాలి. 60 సంవత్సరాల నుంచి నిన్నటి వరకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ ఘోరాన్ని మనం నివారించగలిగి ఉండేవాళ్లం’’ అన్నారు కామెరాన్.
ఇవి కూడా చదవండి:
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)