You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇస్రో: మూడో దశలో విఫలమైన పీఎస్ఎల్‌వీ-సి61 ప్రయోగం...
తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ప్రయోగించిన పీఎస్ఎల్‌వీ-సి61 ప్రయోగం విఫలమైంది.
రెండు దశల వరకు సాధారణంగా సాగిన ఈ ప్రయోగం, మూడో దశలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. ఈ ప్రయోగం నాలుగు దశలలో సాగుతుంది.
విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ తెలిపారు.
ఆదివారం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ వాహక నౌక, ఆ తర్వాత కొద్దిసేపటికే విఫలమైంది.
జనవరిలోనే వంద రాకెట్ ప్రయోగాల మైలురాయి
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ - ఈఓఎస్-09 ఉపగ్రహాన్ని ఎస్ఎస్‌పీఓ ఆర్బిట్ (సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్)లో ప్రవేశపెట్టేందుకు పీఎస్ఎల్‌వీ-సి61ను ప్రయోగించారు.
ఈ ఏడాది జనవరిలోనే ఇస్రో వంద రాకెట్ ప్రయోగాల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం ఇస్రో చేపట్టిన ప్రయోగం 101వది. కానీ, ఈ ప్రయోగం విజయవంతం కాలేదు.
మూడో దశలో సాంకేతిక సమస్య
''ఈ రోజు శ్రీహరి కోట నుంచి 101వ ప్రయోగాన్ని చేపట్టాం. PSLV C61 రాకెట్ సాయంతో EOS 09 శాటిలైట్ మిషన్ ను ప్రయోగించాం. మొదటి, రెండు స్టేజ్‌ల వరకూ అంతా సాధారణంగానే నడిచింది. తరువాత మూడో దశ లో మాత్రం మేం కొన్ని ఇబ్బందులను గమనించాం. దీంతో మిషన్ పూర్తి కాలేదు. పూర్తి విశ్లేషణ తర్వాత మళ్లీ మీ ముందుకొస్తాం. థాంక్యూ'' అని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)