You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డబుల్ ఇస్మార్ట్ రివ్యూ: పూరి మరోసారి తన మార్కు చూపాడా, ప్రేక్షకులకు డబుల్ ధమాకా దొరికిందా?
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి, రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా?
ఈ కాంబోలోనే 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ సినిమానే ‘డబుల్ ఇస్మార్ట్.’
ఇస్మార్ట్ శంకర్‌కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ ఏంటి?
శంకర్ క్రిమినల్‌గా మారడానికి కారణం ఏమిటి? అతని గతం ఏమిటి? పోశమ్మకి, బిగ్‌బుల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? బిగ్‌బుల్‌ని చంపాలనుకున్న శంకర్‌కి మెమరీ ట్రాన్స్‌ఫర్ ఎందుకు జరిగింది? భారతదేశం గాలిస్తున్న అతి పెద్ద నేరస్తుడు బిగ్‌బుల్‌తో శంకర్ ఎలా తలపడ్డాడు? అన్నదే కథ.
ఎవరెలా నటించారు?
డబుల్ ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని )
సినిమా మొత్తం మీద ఎక్కడా ఎనర్జీ డ్రాప్ కాకుండా రామ్ నటించాడు. తెలంగాణ యాసలో పెద్ద పెద్ద డైలాగులను కూడా పర్ఫెక్ట్‌గా డెలివరీ చేశాడు.
ఇప్పటిదాకా వచ్చిన పూరి సినిమాల్లోని హీరో పాత్రలకంటే ఈ ఇస్మార్ట్ శంకర్‌కే ఎక్కువ మాస్ అప్పీల్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. రామ్ ఫుల్ ఆన్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన సినిమా ఇది. తన పాత్ర పరిధిలో ఎక్కడా ప్రేక్షకులను నిరాశపరచలేదు రామ్.
బిగ్‌బుల్ (సంజయ్ దత్)
సంజయ్ దత్ పెద్ద డాన్‌గా ఇందులో కనిపిస్తారు. కానీ దానికి తగ్గ పవర్‌ఫుల్ సీన్స్ పెద్దగా లేకపోవడంతో అంతా రామ్ - వన్ మ్యాన్ షోలాగా అనిపిస్తుంది. సంజయ్‌దత్‌కు డబ్బింగ్ కూడా బాగోకపోవడంతో పాత్ర బలంగా లేనట్టే అనిపిస్తుంది.
సంజయ్‌దత్ లుక్ బావున్నా సినిమాలో బిగ్‌బుల్‌ను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ఇంకా బలంగా ఉంటే బావుండేది.
కావ్య థాపర్ :
జెన్నత్ పాత్రలో రామ్‌కు జోడిగా నటించింది కావ్య థాపర్. తన పాత్రపరంగా బాగానే నటించినా, రామ్ ఎనర్జీతో మ్యాచ్ అయ్యే స్కోప్ లేకపోవడం వల్ల కొంత తేలిపోయినట్టు అనిపిస్తుంది.
ట్రైబల్‌గా ఉన్న బోఖా పాత్రలో అలీ తన పరిధిలో బాగానే నటించాడు. 'RAW 'అధికారిగా సాయాజీ షిండే నటించారు. రామ్, సంజయ్ దత్‌తో సమానమైన స్కోప్ ఉన్న ఈ పాత్రలో షిండే తన యూనిక్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించేలా నటించాడు.
సైంటిస్ట్ పాత్రలో మకరంద్ దేశ్ పాండే తన పరిధి మేరకు బాగానే నటించాడు.
ఇస్మార్ట్ శంకర్‌కి స్నేహితుడిగా గెటప్ శీను కాంబినేషన్ కూడా బాగుంది.
అలాగే ప్రతి నాయికగా బని కూడా యాక్షన్ అప్పీల్‌తో బాగా నటించింది.
ప్రీక్వెల్ నుండి సీక్వెల్ దాకా:
మెమరీ ట్రాన్స్‌ఫర్ అనే కాంప్లికేటెడ్ కాన్సెప్ట్‌ను చాలా సింపుల్‌గా చెప్పిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్.’ ఇది పేరుకే సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఉన్నా, మాస్ యాక్షన్ సినిమానే.
కథ కన్నా కూడా రామ్ యాక్షన్‌కి, అపీల్‌కే మార్కులు ఎక్కువ పడ్డాయి ప్రీక్వెల్‌లో.
రామ్‌ని ఆ పాత్రలో, కొత్త యాసలో చూడటం ప్రేక్షకులకు కొత్తగా అనిపించడం వల్ల కథ కన్నా కూడా రామ్ క్యారెక్టరైజేషన్ వల్లే మాస్ ఆడియన్స్‌లోకి వెళ్లింది.
శంకర్ క్యారెక్టర్‌పై ప్రీక్వెల్‌లో స్పష్టత లేదు
సీక్వెల్‌లో పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్‌ను ఇంకా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేశాడు. శంకర్‌కి ఒక ఎమోషనల్ నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రీక్వెల్‌లో మిస్ అయిన ఎలిమెంట్‌తో సీక్వెల్ ఓపెన్ చేశాడు.
‘పక్కా మ్యాడ్ మెంటాలిటీ’ అనేది ట్యాగ్‌గా ఉండే శంకర్‌లో 'డబుల్' అంటే... శంకర్, బిగ్ బుల్ ఇద్దరి బ్రెయిన్స్‌తో ఉన్న అప్‌డేటెడ్ వెర్షన్ చేసి పూరీ మార్క్‌తో మ్యాడ్ లెవెల్‌కి డబుల్ డోస్‌తో తీసుకువచ్చాడు ఈ సీక్వెల్‌ని.
ప్రీక్వెల్ నుండి సీక్వెల్‌కి కంటిన్యుటీ కూడా కథపరంగా బలంగానే ఉంది.
పాటలు ఎలా ఉన్నాయి?
పాటల మేకింగ్‌లో ప్రీక్వెల్ జాడలు కనిపిస్తాయి. ‘స్టెప్పమార్’, 'మార్ ముంతా చోడ్ చింతా' పాటలు రామ్ ఎనర్జీ, డాన్స్, బాడీ లాంగ్వేజ్ వల్ల ‘డబుల్ ఇస్మార్ట్’ హైపర్ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. మణిశర్మ సంగీతం కూడా ప్లస్ అయ్యింది.
‘బిగ్ బుల్’ పాట పర్లేదనిపించేలా ఉంది.
‘క్యా లఫ్డా’ పాట రొటీన్‌గా ఉంది. మొత్తం మీద మాస్ గెటప్‌లో రామ్ డ్యాన్స్, స్టైల్ వల్ల పాటలకు మంచి మార్కులే పడ్డాయి.
సినిమాటోగ్రఫీ
ఈ సినిమాకు శ్యామ్ కె.నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రాఫర్లుగా చేశారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ రిచ్‌నెస్ అంతా ఈ సినిమాటోగ్రఫీలో కనిపిస్తుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ కూడా.
పూరీ మార్క్
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి.
వాళ్ల డైలాగ్స్ కూడా ట్రెండ్ సెట్టింగ్‌గా ఉంటాయి. అదే మార్క్ ఇందులో కూడా కనిపిస్తుంది. కానీ దీని వల్ల సీక్వెల్ మొత్తంలో 'రామ్ వన్ మాన్ షో స్టాపర్'లా అనిపిస్తాడు.
కొన్ని యాక్షన్ సన్నివేశాలు మినహాయించి 'బిగ్ బుల్'గా సంజయ్ దత్‌కి స్కోప్ లేదు. అలాగే పవర్‌ఫుల్ డైలాగ్స్ కూడా పెద్దగా పడలేదు.
మొత్తం మీద ప్రీక్వెల్‌లో లానే ఇది కూడా హీరో మోసిన సినిమానే.
మెమరీ ట్రాన్స్‌ఫర్ తర్వాత...
బిగ్ బుల్ బ్రెయిన్ కాపీ అయ్యాక శంకర్ (రామ్) బిగ్ బుల్‌లా ప్రవర్తిస్తాడు. ఈ షిఫ్ట్‌లో కూడా రామ్ బాగానే నటించాడు. కానీ ఒరిజినల్ బిగ్ బుల్‌కి మాత్రం సినిమా మొత్తం మీద ఈ పవర్ ఉండేలా బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, ఎనర్జీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండకపోవడం వల్ల లోటుగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
1) ఇస్మార్ట్ శంకర్ బాల్యంలో ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా ఓపెన్ చేయడం.
2) బిగ్ బుల్, శంకర్ ఇంట్రడక్షన్ సీన్స్
3) యాక్షన్ సీక్వెన్సెస్
4) పూరీ మార్క్ డైలాగ్స్
5) రామ్ ఎనర్జీ, డ్యాన్స్, డైలాగ్స్ డెలివరీ
6) మాస్ - కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల బోరింగ్ అనిపించదు. స్టోరీలో దాదాపు సగం రన్ టైమ్ స్టోరీ పరంగా లాగింగ్ ఉన్నా, ఈ మాస్ ఎలిమెంట్స్ వల్ల పర్లేదనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
1) సంజయ్ దత్, రామ్ కాంబినేషన్ సీన్స్ బలంగా లేకపోవడం
2) బోఖా పాత్ర అసహజంగా కొంత వెకిలి కామెడీతో ఉండటం
3) హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ గొప్పగా పండకపోవడం
4) స్టోరీలో పెద్ద థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం
మొత్తం మీద సైన్స్ ఎలిమెంట్.. మెమరీ ట్రాన్స్‌ఫర్‌లో లాజికల్ గ్యాప్స్ ఉన్నా, దాన్ని మాస్ యాక్షన్ స్టోరీతో ఫ్యూజన్ చేయడం వల్ల, పూరీ జగన్నాథ్ మార్క్ హీరో క్యారెక్టర్ వల్ల కొంత ఎంటర్‌టెయినింగ్‌గా ఉన్న సినిమా ఇది.
సంజయ్ దత్ పాత్రను కూడా రామ్‌కి మ్యాచ్ చేసేలా జాగ్రత్త తీసుకుని, మెయిన్ స్టోరీని డైల్యూట్ చేసే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కొంత మేరకు తగ్గించి ఉంటే డబుల్ డోస్ ధమాకా అయ్యి ఇంకా బావుండేది ఈ సినిమా.
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)