You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CSK గెలిచింది, ఒంటి చేత్తో సిక్స్ కొట్టిన వింటేజ్ ధోని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుసగా అయిదు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు సోమవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై నెగ్గి గెలుపు బాట పట్టింది.
లఖ్‌నవూలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
167 పరుగుల లక్ష్యఛేదనను చెన్నై 19.3 ఓవర్లలో పూర్తి చేసింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది.
ఆరేళ్ల తర్వాత 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అందుకున్నాడు ధోని.
స్టేడియం అంతా పసుపు వర్ణం
మొదట బంతితో లఖ్‌నవూను నియంత్రించిన చెన్నై తర్వాత సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది.
లఖ్‌నవూ జట్టు సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ స్టేడియం మొత్తం పసుపు రంగు జెర్సీలతో నిండిపోయింది.
అభిమానుల కేరింతలతో మ్యాచ్‌లో చెన్నై ఆద్యంతం రాణించింది.
గుంటూరు కుర్రాడు యువ ఆటగాడు షేక్ రషీద్ వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో అతను ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
రాహుల్ త్రిపాఠి, రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన శివం దుబే 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 43 పరుగులు చేసి తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాడు.
ముందొచ్చిన ధోని
చెన్నై ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (9) అవుటవ్వగానే జేమీ ఓవర్టన్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. కానీ, ధోని వచ్చాడు.
అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్‌లో ఒక బౌండరీ బాది యాక్షన్ మొదలుపెట్టాడు.
అయితే, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ధోని ఒంటి చేత్తో సిక్స్ కొట్టినప్పుడు అభిమానుల అరుపులతో స్టేడియం దద్దరిల్లింది. ఈ ఓవర్‌లో 13 పరుగులు రావడంతో విజయానికి మిగతా 18 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది.
శార్దూల్ ఠాకూర్ మళ్లీ 19వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగగా ఒక ఫోర్, సిక్స్‌తో దుబే అలరించాడు. ధోని కూడా బౌండరీతో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి సులభంగా జట్టుకు విజయాన్ని అందించారు.
వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 28 బంతుల్లో 57 పరుగులు జోడించారు.
11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో అజేయంగా 26 పరుగులు చేసిన ధోనీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. 2019 తర్వాత ఈ అవార్డు అందుకోవడం ధోనీకి ఇదే మొదటిసారి.
''ఈ అవార్డు నాకెందుకు ఇస్తున్నారు, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు'' అని మ్యాచ్ అనంతరం ధోని అన్నాడు. ఇది నూర్‌కు ఇవ్వాల్సిన అవార్డు అని ధోని అభిప్రాయపడ్డాడు.
ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో విజయం. ధోని కెప్టెన్సీలో మొదటిది.
మొదటి నుంచి తడబాటే
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది.
తమ గత మూడు మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోని ఈ జట్టు చెన్నైతో మ్యాచ్‌లో తొలి 6 ఓవర్ల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
మొదటి ఓవర్‌లోనే త్రిపాఠి అద్భుత క్యాచ్‌కు మార్క్‌రమ్ (6) అవుటయ్యాడు. నికోలస్ పూరన్ (8) ఎల్బీగా వెనుదిరిగాడు.
మిచెల్ మార్ష్ నిలకడ ప్రదర్శించాడు. అతను 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు.
కెప్టెన్ రిషభ్ పంత్‌తో కలిసి 33 బంతుల్లో 50 పరుగులు జోడించిన తర్వాత జడేజా బౌలింగ్‌లో మార్ష్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
వికెట్ కాపాడుకుంటూ పంత్ పరుగులు జోడించాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ టాప్ స్కోరర్. 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు.
ఆయూష్ బదోని (22), అబ్దుల్ సమద్ (20)లను ధోని అవుట్ చేశాడు. ఈ దశలో చెన్నై బౌలర్లు, ముఖ్యంగా నూర్ అహ్మద్ కట్టుదిట్టంగా బంతులేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. అతను 15వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇన్నింగ్స్‌లో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పంత్‌ను ఆఖరి ఓవర్‌లో ధోని అవుట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్, డేవాన్ కాన్వేలను తప్పించి షేక్ రషీద్, జేమీ ఓవర్టన్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది.
గురు శిష్యుల ముఖాముఖి
''ధోనితో నేను అన్ని విషయాలు చర్చిస్తాను. నేను మాట్లాడగలిగే అతికొద్ది మందిలో ధోని ఒకరు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ధోనితో చర్చించిన విషయాల గురించి మళ్లీ నేనెవరితోనూ చర్చించను.'' అని మ్యాచ్‌కు ముందు రిషబ్ పంత్ అన్నారు.
ఈ గురు శిష్యుల నేతృత్వంలోని జట్ల ప్రదర్శనను చూసుకుంటే, ప్రస్తుతం ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై జట్టు ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడి అయిదింటిలో ఓడింది. 4 పాయింట్లతో చిట్టచివరి స్థానంలో ఉంది.
పంత్ కెప్టెన్సీ వహిస్తున్న లఖ్‌నవూ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి మూడింటిలో ఓడింది. 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. తాజా సీజన్ టాప్-10 బ్యాట్స్‌మెన్‌లో చెన్నైకి చెందిన ఒక్క ప్లేయర్ కూడా చోటు దక్కించుకోలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)