పిల్లల ఏడుపు వినలేక కొట్టి చంపిన తండ్రి, ఎలా బయటపడిందంటే....

    • రచయిత, జొనాథన్ హెడ్
    • హోదా, బీబీసీ న్యూస్, బ్యాంకాక్

రెండేళ్ల కూతురితో పాటు ఇద్దరు నవజాత కుమారులను చనిపోయేంతవరకు కొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

గతంలో వివాహమైన మరో మహిళతో కలిగిన ఇద్దరు కన్నబిడ్డల్ని కూడా ఆయన ఇంతకు ముందు చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు కూడా పసి పిల్లలే.

ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. ఇందులో నిందితుడి పేరు సాంగ్సక్ సాంగ్‌సేంగ్.

వంటగదిలో పాతిపెట్టిన రెండేళ్ల చిన్నారి మృతదేహం గత వారం లభ్యమైన తర్వాత సాంగ్సక్‌పై ఈ అభియోగాలను నమోదు చేశారు.

పిల్లల ఏడుపును సహించలేకే సాంగ్సక్ వారిని చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయనకు మానసిక వ్యాధులు ఉన్నట్లు చెప్పారు.

రెండేళ్ల కుమార్తె మృతి కేసులో ఆయన ప్రస్తుత భార్యను, ఇద్దరు బాలుర మృతి విషయంలో ఆయన మాజీ భార్యను కూడా అరెస్ట్ చేశారు.

పిల్లల మరణాల నేపథ్యంలో మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాంగ్సక్ ఇప్పటివరకు 4 పెళ్లిళ్లు చేసుకున్నారు.

పోలీసులు తొలుత దీన్ని ఒక గృహ హింస కేసుగా భావించారు.

సాంగ్సక్, ఆయన 12 ఏళ్ల కూతురితో పాటు, నాలుగేళ్ల మరో కూతురిని శారీరకంగా వేధిస్తున్నాడని ఈ నెల మొదట్లో పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఆ ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఆ సమయంలో వారి తల్లిదండ్రులు ఇంట్లో లేరు.

తన రెండేళ్ల చెల్లెలిని తల్లిదండ్రులు కొట్టడంతో ఆమె చనిపోయిందని పోలీసులకు 12 ఏళ్ల బాలిక చెప్పారు. ఆ చిన్నారి మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టారో గుర్తించడంలో ఆమె పోలీసులకు సహకరించారు.

మూడో భార్యతో కలిగిన మరో ఇద్దరు కుమారులను కూడా సాంగ్సక్ చంపేసినట్లు గతంలో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

10 ఏళ్ల కిందట జరిగిన పిల్లల హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏలతో సాంగ్సక్ డీఎన్‌ఏ సరిపోలింది.

నలుగురు పసిబిడ్డలను సాంగ్సక్ చంపేసినట్లు ఆనాడే ఆయన మూడో భార్య ఆరోపించారు. అందులో ఇద్దరు పిల్లల్ని పాతిపెట్టిన ప్రదేశాలను ఆమె పోలీసులకు చూపించారు.

మరో ఇద్దరు పిల్లల్ని పాతిపెట్టిన ప్రదేశంలో ఇప్పుడొక పెట్రోల్ బంక్ ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)