South Korea: హాలోవీన్ వేడుకల తొక్కిసలాటలో 151 మంది మృతి

వీడియో క్యాప్షన్, South Korea: హాలోవీన్ వేడుకల తొక్కిసలాటలో 151 మంది మృతి

దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 151 మంది మరణించారు. మరో 82 మంది గాయపడ్డారు.

మృతుల్లో 19 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

హాలోవీన్ వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగింది.

చాలామంది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కాగా మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు.

కోవిడ్ అనంతరం మాస్కులు ధరించకుండా తొలిసారి నిర్వహిస్తున్న హాలోవీన్ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ఇటైవాన్ ప్రాంతానికి జనం వెల్లువెత్తారు.

ఈ ప్రాంతం నైట్‌లైఫ్‌కి ప్రసిద్ధి. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ఒక ఇరుకు వీధిలోకి జనం పోటెత్తటంతో.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటుచేసుకుందని, జనం ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్తున్నారు.

తొక్కిసలాట కారణంగా చాలామంది కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. వెంటనే అధికారులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రంగంలోకి దించినప్పటికీ పెద్దసంఖ్యలో ప్రాణ నష్టం తప్పలేదు.

మృతుల్లో అత్యధికులు టీనేజర్లు, 25 ఏళ్ల లోపు వారేనని అధికారులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)