You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వ్లాదిమిర్ పుతిన్ 70వ పుట్టిన రోజు: రష్యా అధ్యక్షుడి జీవితాన్ని మలిచిన ఏడు కీలక ఘట్టాలు
- రచయిత, ప్రొఫెసర్ మార్క్ గెలియాటీ
- హోదా, రచయిత
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారంతో 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 1952 అక్టోబరు 7న ఆయన సోవియట్ రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌లో జన్మించారు.
పుతిన్ జీవితంలో ఒక ఏడు కీలక ఘట్టాలను చూస్తే ఆయన ఆలోచనా విధానం ఎలా మారిందో తెలుసుకోవచ్చు. అలాగే పశ్చిమ దేశాలతో పుతిన్ పెంచుకుంటున్న విరోధం వెనుక కారణాలను కూడా అర్థం చేసుకోవచ్చు.
1964: జూడో
రెండో ప్రపంచయుద్ధంలో 872 రోజుల పాటు లెనిన్‌గ్రాడ్‌ను హిట్లర్ సైన్యాలు చుట్టుముట్టాయి. ఆ యుద్ధ ప్రభావం యువ పుతిన్ మీద పడింది. స్కూల్‌లో ఉన్నప్పుడు కయ్యానికి కాలు దువ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు పుతిన్.
'ఎవరితోనైనా పోట్లాటకు దిగడానికి అతను(పుతిన్) సిద్ధంగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి భయమనేది లేదు' అని పుతిన్ బెస్ట్ ఫ్రెండ్ గుర్తు చేసుకున్నారు.
స్ట్రీట్ గ్యాంగులు చెలరేగిపోతున్న సమయంలో 12ఏళ్ల పుతిన్, తొలుత రష్యా మార్షియల్ ఆర్ట్స్ అయిన సాంబో శిక్షణలో చేరాడు. ఆ తరువాత జూడో నేర్చుకున్నాడు. పట్టుదల, క్రమశిక్షణతో 18ఏళ్ల వయసులో యువ పుతిన్, జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించాడు.
అంతేకాదు జాతీయ జూనియర్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు.
జూడో కూడా పుతిన్ పర్సనాలిటీని అగ్రెసివ్‌గా మార్చింది. ప్రమాదకర ప్రపంచంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలనే ధైర్యాన్ని కూడా అది ఇచ్చింది. పుతిన్ సొంత మాటల్లో చెప్పాలంటే... 'యుద్ధం అనివార్యమైతే తొలి దెబ్బ నీదే కావాలి. శత్రువు మళ్లీ నిలబడకుండా ఆ దెబ్బ చాలా గట్టిగా ఉండాలి'.
1968: కేజీబీ
సాధారణంగా లెనిన్‌గ్రాడ్‌లో కేజీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. స్టాలిన్ పాలనలో ఎంతో మందిని కేజీబీ ఆఫీసులో విచారించి, అటునుంచి అటే బలవంతంగా వెట్టి చాకిరి చేయించే 'ద గులాగ్ లేబర్ క్యాంప్స్'కు పంపేవాళ్లు.
కానీ 16ఏళ్ల పుతిన్ మాత్రం నేరుగా ఆ ఆఫీసులోకి నడుచుకుంటూ వెళ్లి... 'నేను ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి?' అని అడిగాడు. ఆ మాటలు విన్న అవతలి వ్యక్తి అయోమయంగా పుతిన్ వైపు చూస్తూ ఉండిపోయాడు.
ఆ తరువాత తేరుకుని, 'మిలిటరీ సర్వీస్ లేదా డిగ్రీ పూర్తి చేయాలి' అని ఆ వ్యక్తి పుతిన్‌కు బదులిచ్చారు.
'ఏ డిగ్రీ అయితే బాగుంటుంది?' వెంటనే అడిగాడు పుతిన్.
'లా' అని ఆ వ్యక్తి చెప్పాడు.
ఆరోజు నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ సాధించాలనే పట్టుదలో పుతిన్‌లో పెరిగింది. అనుకున్న విధంగా లా పట్టా సాధించి కేజీబీలో ఆయన చేరారు.
'ఒక గూఢచారి వేల మంది ప్రజల భవిష్యత్తును మార్చగలడు' అని పుతిన్ నమ్మేవారు.
1989: చుట్టు ముట్టిన మూక
కేజీబీలో చేరిన తొలి రోజుల్లో పుతిన్ కెరియర్‌లో పెద్ద మార్పులు రాలేదు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ అవకాశాలు వచ్చేవి కావు. జర్మన్ భాష నేర్చుకోవడానికి పుతిన్ దరఖాస్తు చేసుకున్నారు.
అలా 1985లో డ్రెస్‌డెన్‌లోని కేజీబీ ఆఫీసులో పుతిన్ చేరారు. కానీ 1989 నవంబరులో తూర్పు జర్మనీ విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. డిసెంబరు 5న ఒక మూక డ్రెస్‌డెన్‌లోని కేజీబీ ఆఫీసును చుట్టుముట్టింది. రక్షణ కోసం దగ్గరలోని రెడ్ ఆర్మీ శిబిరానికి పుతిన్ ఫోన్ చేశారు.
'కానీ మాస్కో నుంచి ఆదేశాలు రానిదే తాము మేం ఏమీ చేయలేం' అని రెడ్ ఆర్మీ బదులిచ్చింది. మాస్కో కూడా మౌనంగా చూస్తూ ఉండి పోయింది.
సోవియట్ రష్యా అధికార కేంద్రం కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని అప్పుడే పుతిన్ అర్థం చేసుకున్నారు. సోవియట్ నాయకుడు మిఖాయిల్ గోర్బఛేవ్ చేసిన తప్పును తాను ఎన్నటికీ చేయకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
పోటీ ఎదురవుతున్నప్పుడు వేగంగా స్పందించకుండా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
1992: తిండి కోసం చమురు
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవుతున్న తరుణంలో కేజీబీ నుంచి బయటకు వెళ్లిపోయారు పుతిన్. ఆ తరువాత సెయింట్ పీటర్స్‌బర్గ్(ఒకనాటి లెనిన్‌గ్రాడ్) మేయర్ దగ్గర ఫిక్సర్‌గా ఆయన చేరారు.
నాడు ఆర్థికవ్యవస్థ రోజురోజుకు పతనమవుతూ ఉంది. నగరంలోని ప్రజలకు తిండి ఏర్పాటు చేసే పనిని పుతిన్‌కు అప్పగించారు. ఇందుకు 100 మిలియన్ డాలర్ల విలువైన చమురు, ఇనుమును విక్రయించే బాధ్యతను ఇచ్చారు.
కానీ ఎవరికీ తిండి దొరకలేదు. చమురు, ఇనుము అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును పుతిన్, ఆయన స్నేహితులు సొంతం చేసుకున్నట్లు ఆ తరువాత ఒక విచారణలో తేలింది.
1990లలో ఆర్థిక అనిశ్చితి మధ్య రాజకీయ పరపతిని క్యాష్ చేసుకోవడం ఎలాగో పుతిన్ చాలా త్వరగా నేర్చుకున్నారు. ఆ క్రమంలో ఆయనకు గ్యాంగస్టర్లు నమ్మకమైన స్నేహితులుగా మారారు.
పుతిన్ చుట్టూ ఉన్న వాళ్లు ఎవరి లాభం వాళ్లు చూసుకుంటున్నప్పుడు? మరి పుతిన్ కూడా ఎందుకు చూసుకోకుండా ఉంటారు?
2008: జార్జియా మీద దండయాత్ర
2000 సంవత్సరంలో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయిన తరువాత, పశ్చిమ దేశాలతో సంబంధాలను తనకు నచ్చిన రీతిలో మెరుగుపరచుకోవచ్చని ఆయన భావించారు. మాజీ సోవియట్ యూనియన్ దేశాలల్లో తన ప్రభావం ఉండాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు.
దాంతో పుతిన్‌లో కోపం పెరిగి పోయింది. రష్యాను ఏకాకిని చేసి అణచి వేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయని నమ్మడం ప్రారంభించారు.
నాటోలో చేరాలని జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్ నిశ్చయించుకున్నప్పుడు పుతిన్ ఆగ్రహం చెందారు. దాంతో ఆయన ఆ దేశం మీద దండయాత్రకు సిద్ధమయ్యారు.
జార్జియాలోని సౌత్ ఒస్సేతియా రష్యా మద్దతుగల బలగాల అధీనంలో ఉంది. ఆ ప్రాంతాన్ని మళ్లీ దక్కించుకునేందుకు జార్జియా సేనలు ప్రయత్నించాయి.
దాన్ని సాకుగా చూపుతూ, పుతిన్ నేతృత్వంలోని రష్యా సైన్యం జార్జియా బలగాలను కకావికలం చేసింది. చివరకు జార్జియా అవమానకరమైన సంధి చేసుకునేలా చేశారు పుతిన్.
జార్జియా మీద దాడితో పశ్చిమ దేశాలు ఆగ్రహం చెందినా ఒక ఏడాదిలోపే రష్యాతో మళ్లీ సంబంధాలను నెరపేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందుకు వచ్చారు. 2018 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నిర్వహించే అవకాశం కూడా రష్యాకు ఇచ్చారు.
గట్టి సంకల్ప బలంతో ముందుకు వెళితే, బలహీనంగా ఉన్న పశ్చిమ దేశాలు తొలుత గంభీరంగా కనిపించినా ఆ తరువాత తలొంచక తప్పదు అని అర్థం చేసుకున్నారు పుతిన్.
2011-13: మాస్కో నిరసనలు
2011 రష్యా పార్లమెంటు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే వార్తలతో మాస్కోలో నిరసనలు చెలరేగాయి. 2012లో మరొకసారి తాను ప్రెసిడెంట్ పదవికోసం పోటీ చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించడంతో ఆ నిరసనలు మరింత పెరిగాయి.
నాడు మాస్కో స్వ్కేర్ మొత్తం నిరసకారులతో నిండి పోయింది. పుతిన్ పాలనలో అంత భారీ స్థాయిలో ప్రజా నిరసనలు వ్యక్తం కావడం అదే తొలిసారి.
అయితే ఈ నిరసనలను ప్రేరేపిస్తోంది అమెరికా అని పుతిన్ నమ్మారు. అందుకే నాటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను వ్యక్తిగతంగా దూషించారు.
పశ్చిమ దేశాలు నేరుగా తననే లక్ష్యంగా చేసుకొని వస్తున్నాయని పుతిన్ భావించారు. దాంతో ఆయన యుద్ధంలో దిగారు.
2020-21: కోవిడ్-19 ఐసోలేషన్
కోవిడ్-19 సంక్షోభంలో పుతిన్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆయనను ఎవరైనా కలవాలంటే 15 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. అలాగే సూక్ష్మ జీవులను చంపే అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉండే కారిడార్ గుండా నడవాలి.
ఈ ఐసోలేషన్ మధ్య పుతిన్‌ను కలిసే సలహాదారులు, అధికారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. చివరకు ఆయన తానా అంటే తందానా అనే కొందరు మాత్రమే పుతిన్‌తో మిగిలారు.
ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకోకుండా కొద్ది మంది సలహాలతోనే యుక్రెయిన్ విషయంలో పుతిన్ ముందుకు వెళ్లారు.
ప్రొఫెసర్ మార్క్ గెలియాటీ విద్యావేత్త, రచయిత. పుతిన్‌పై ఆయన ‘వి నీడ్ టు టాల్క్ అబౌట్ పుతిన్’, ‘ఫోర్త్‌కమింగ్ పుతిన్స్ వార్స్’ పుస్తకాలు రాశారు.
ఇవి కూడా చదవండి:
- సెక్సోమ్నియా: నిద్రలో సెక్స్ చేసే ఈ వ్యాధి ఏమిటి? దీన్ని కారణంగా చూపించి అత్యాచారం కేసును కొట్టేయవచ్చా?
- కొల్హాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- హీరోయిన్, రొమాన్స్, సాంగ్స్ లేని చిరంజీవి సినిమా ఎలా ఉంది?
- పొన్నియన్ సెల్వన్ 1: మణిరత్నం కలల సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి కారణాలేంటి?
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)