You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ నిరసనలు: 'నోరు మూసుకుని ఉండకపోతే మమ్మల్ని రేప్ చేస్తామన్నారు'
"నన్ను కింద పడేశారు. ఒక అధికారి నా వీపు మీద బూటు కాలితో తొక్కారు. కడుపులో తన్నారు. నా చేతులు కట్టేశారు. నన్ను లేపి వ్యాన్‌లో నెట్టేశారు."
ఇలా 51 ఏళ్ల మరియంను అరెస్ట్ చేశారు. గతవారం సెంట్రల్ టెహ్రాన్‌లో ఇరాన్ అధికారులు.. నిరసనలకారులపై కొరడా ఝళిపించినప్పుడు జరిగిన సంఘటన ఇది.
22 ఏళ్ల మహసా అమీనీ మరణంతో ఇరాన్‌లో నిరసన జ్వాలలు ఎగశాయి. హిజాబ్ ధరించలేదని ఇరాన్ మొరాలిటీ పోలీసులు మహసా అమీనీని అరెస్ట్ చేశారు. నిర్బంధంలో ఆమె స్పృహ తప్పిపడిపోయారు. కొద్ది సేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత, సెప్టెంబర్ 16న ఆస్పత్రిలో మరణించారు.
ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు ఆమె తలపై లాఠీతో కొట్టారని, తలను వ్యానుకేసి బాదారని కుటుంబం ఆరోపిస్తోంది.
మహసా అమీనీ మరణంతో మహిళలు వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేపట్టారు. తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది ఇప్పుడు ఇరాన్ మొత్తం వ్యాపించింది. హిజాబ్ అంశాన్ని దాటి ఇరాన్ నాయకులు, మతాధికాలకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకున్నాయి.
'క్రూరమైన' కమాండర్లు
ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినప్పటికీ, నిరసనకారులను అరెస్ట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
"వీడియోల్లో మీరు చూస్తున్న దాని కన్నా ఇక్కడ పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉన్నాయి" అన్నారు మరియం. ఇది ఆమె అసలు పేరు కాదు.
"క్రూరంగా వ్యవహరించమని ఒక కమాండరు తన సైనికులకు చెబుతున్నారు. అది నేను విన్నాను. మహిళా అధికారులు కూడా అంతే ఘోరంగా ఉన్నారు. ఒకామె నన్ను చెంపదెబ్బ కొట్టి, ఇజ్రాయెల్ గూఢచారి అని, వేశ్య అని నిందించారు" అని చెప్పారు మరియం.
"నిరసనకారులపై జాలి చూపవద్దు, షూట్ చేయండి" అని కమాండర్లు తమ పోలీసు అధికారులకు ఆదేశాలిస్తున్న వీడియోలను బీబీసీ చూసింది.
బీబీసీ ధ్రువీకరించుకున్న ఇతర కొన్ని వీడియోల్లో.. భద్రతా అధికారులు నేరుగా నిరసనకారులపై తుపాకీలు ఎక్కుపెట్టడం, దొరికినవాళ్లను దొరికినట్టుగా అరెస్ట్ చేయడం కనిపించింది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఈ ఘర్షణల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య దీని కంటే చాలా ఎక్కువ ఉంటుందని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
ఎంతమందిని అరెస్ట్ చేశారన్నది తెలీదు. ఈ లెక్కలు ఇరాన్ ప్రభుత్వం బయటకు చెప్పలేదు. అయితే, ఒక్క మజాందరన్ ప్రాంతంలోనే కనీసం 450 మందిని అరెస్ట్ చేసినట్లు మజాందరన్ చీఫ్ ప్రాసిక్యూటర్ చెప్పారు. ఈ నగరం టెహ్రాన్‌కు ఉత్తరాన ఉంది.
వందలాది మందిని నిర్బంధించారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
"నా దగ్గరకు వచ్చిన అధికారిని తొసేసి, పారిపోదామనుకున్నా. కానీ, వెంటనే మరో ఇద్దరు అధికారులు చుట్టుముట్టారు. కొద్దిసేపటికే ఓ 15 మంది అధికారులు నన్ను క్రూరంగా కొట్టడం ప్రారంభించారు" అంటూ సామ్ అనే యువ నిరసనకారుడు తెలిపారు.
"నా నోట్లోంచి రక్తం కారింది. ఒంటి మీద స్టన్ గన్ దెబ్బలు తెలుస్తున్నాయి. నన్ను కింద పడేసి, చేతులు వెనక్కు విరిచి కట్టారు. నా షూ లేసులతోనే నా కాళ్లు కట్టారు. మిగతా ఖైదీలు ఉన్నచోటుకి నన్ను తీసుకెళుతూ ఒక సైనికుడు నా ఎడమ కన్ను మీద గట్టిగా తన్నాడు" అని చెప్పారు సామ్.
'భయమంటే తెలియని' యువతులు
ప్రస్తుతం ఇరాన్‌లోని 31 ప్రావిన్సులకు వ్యాపించిన నిరసనలతో "నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని" అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హామీ ఇచ్చారు.
అయితే, 1980లలో వేలాదిమంది రాజకీయ ఖైదీల సామూహిక మరణశిక్షలకు రైసీ కారకుడని చాలామంది ఇరానియన్లు విశ్వసిస్తారు. రహస్యంగా విచారణ జరిపి ఈ మరణశిక్షలను విధించిన నలుగురు జడ్జిలలో రైసీ ఒకరు.
"అరెస్ట్ చేసినవాళ్లందరినీ ఒక బస్సులో కింద పడుకోబెట్టారు. ఓ గంటన్నర సేపు మేమంతా అలా ఒకరిపై ఒకరు పడి ఉన్నాం. రాజకీయ ఖైదీల మరణశిక్షలలో రైసీ పాత్ర గుర్తొచ్చింది. నన్ను కూడా ఉరితీస్తారనిపించింది" అని చెప్పారు సామ్.
1980లలో ఉరిశిక్ష పడ్డవారు ఇరాన్ చట్టాల ప్రకారం దోషులుగా తేలారని మిస్టర్ రైసీ నొక్కి చెప్పారు.
కాగా, తాజా నిరసనలలో పాల్గొంటున్నవారిని చంపమని రైసీ ఆదేశించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.
అరెస్ట్ చేసినప్పటికీ నిరసనకారులు నిరసనలు తెలుపుతునే ఉన్నారని, వారందరినీ ఒక ప్రధాన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (IRGC) ఫెసిలిటీ కేంద్రానికి తీసుకెళ్లారని మరియం చెప్పారు.
"నాతో పాటు వ్యాన్‌లో ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ల ధైర్యాన్ని చూసి నేనూ ధైర్యం కూడదీసుకున్నా. ఆ అమ్మాయిలంతా అరుస్తూ, అధికారులను గేలి చేస్తూ నిరసనలు కొనసాగించారు. మా తరానికి, ఈ తరానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ తరానికి భయమంటే తెలీదు" అన్నారు మరియం.
ఉత్తర టెహ్రాన్‌లోని ఎవిన్ ప్రిజన్ ముందు అరెస్ట్ అయినవారి సన్నిహితులు, బంధువులు క్యూలు కట్టిన ఫొటోలు, వీడియోలను బీబీసీ ధృవీకరించింది. తమవారిని బెయిల్ మీద విడిపించడం కోసం లేదా సమాచారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
తమవారిని అరెస్ట్ చేసినట్టు ప్రచారం చేయవద్దని అధికారులు బెదిరించారని, అలా చేస్తే "వాళ్ల పరిస్థితి మరింత దిగజారుతుందని" హెచ్చరించారని ఒక వ్యక్తి బీబీసీకి తెలిపారు.
అయితే, అరెస్ట్ చేసినవారందరినీ ప్రధాన నిర్బంధ కేంద్రాలకు తరలించలేదు. చాలామందిని చిన్న చిన్న పోలీసు స్టేషన్లలోనూ, ఐఆర్‌జీసీ ఫెసిలిటీ కేంద్రాలలోనూ ఉంచుతున్నారు.
"మమ్మల్ని ఒక చిన్న పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇంతమంది అక్కడికి వస్తారని వాళ్లు ఊహించలేదు. నాతో పాటు కనీసం 60 మంది మహిళలను ఒక చిన్న గదిలో పెట్టారు. అక్కడ కదలడానికి, కూర్చోడానికి జాగా లేదు. అందరం అలా నిల్చునే ఉన్నాం. బాత్రూం వాడకూడదని మాకు చెప్పారు. ఆకలేస్తే ఎవరి మలం వాళ్లు తినండని చెప్పారు."
"ఒక రోజంతా అలా గడిపిన తరువాత, మేం అరిచి, గోల చేస్తే వాళ్లు మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టరు. నోరు మూసుకోకపోతే, మమ్మల్ని రేప్ చేస్తామన్నారు" అంటూ తన అనుభవాలను పంచుకున్నారు మరియం.
లైంగిక వేధింపులు జరుగుతాయని మహిళా అధికారులు బెదిరించినట్టు మరో ఇరాన్ మహిళ బీబీసీకి తెలిపారు.
"నిర్బంధ కేంద్రంలో మా వివరాలు రాసుకున్న అధికారిణి నా పేరు అడిగి, నన్ను వేశ్య అన్నారు. నేను ఫిర్యాదు చేస్తే, అక్కడున్న పురుష అధికారులకు నన్ను అప్పగించి నచ్చినట్లు చేసుకోమంటాను అని బెదిరించారు" అంటూ ఫెరెష్తే (పేరు మార్చాం) చెప్పారు.
బెహ్జాద్ అనే మరో వ్యక్తిని టెహ్రాన్‌లోని ప్రధాన నిర్బంధ కేంద్రంలో ఉంచారు.
"ఒక చిన్న గదిలో 80 కంటే ఎక్కువమందిని ఉంచారు. మేమంతా కోపంతో, బాధతో రగిలిపోయాం. మా మొబైల్ ఫోన్లను లాక్కుని, నిరసనలకు సంబంధించిన వార్తలను, ఫొటోలు, వీడియోలను ఎక్కడైనా పంచుకున్నామా అని తనిఖీ చేశారు. అలా చేస్తే, అది కూడా మా రిపోర్టులలో జతచేస్తామని చెప్పారు. మర్నాడు ఉదయం ఒక జడ్జి వచ్చి మమ్మల్ని కలిశారు. తరువాత, మాలో చాలామంది టీనేజర్లను విడుదల చేశారు. మధ్యవయస్కులను మాత్రం అలా వదల్లేదు. జడ్జి కొన్ని ప్రశ్నలు అడిగి, అక్కడికక్కడే విచారణ జరిపి శిక్షలు నిర్ణయించారు" అని బెహ్జాద్ చెప్పారు.
తనతో ఉన్నవారిలో సుమారు 10 శాతాన్ని వెంటనే విడుదల చేశారని, మిగతావారిని బెయిల్ మీద విడుదల చేశారని బెహ్జాద్ చెప్పారు.
టెహ్రాన్‌లోని జైల్లో రెండు రోజులు బందీగా ఉన్న మరొక నిరసనకారుడు బీబీసీతో మాట్లాడుతూ, "యువత ఎంత వేదన అనుభవిస్తున్నా, తమ ఉత్సాహాన్ని నీరుగానివ్వలేదని" చెప్పారు.
"నిర్బంధంలో నాతో పాటు 25 ఏళ్ల లోపు వయసువారు ఉన్నారు. కొందరికి ముఖమంతా రక్తం, కానీ వాళ్లు నవ్వుతూనే ఉన్నారు. కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. వారిలో ఒకరు నన్ను చూస్తూ 'నవ్వండి, మనం చేస్తున్నది సరైనది కాబట్టి విజయం మనదే' అన్నాడు" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'మా అబ్బాయిని లైంగికంగా వేధించారు.. మాకు న్యాయం కావాలి '
- కాంగ్రెస్‌పై గాంధీల పట్టు ఎలా సడలిపోయింది, నేతలు మారారా, పరిస్థితులు మారాయా?
- ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న యువతిని రాహుల్ హత్తుకున్నారా?
- పనికిరాని శాటిలైట్లు, రాకెట్ల ముక్కలు మనుషుల మీద పడే ప్రమాదం ఎంత, జాగ్రత్తపడటం సాధ్యమేనా?
- వీధి కుక్కలను చంపిన వారికి గతంలో బహుమతులు కూడా ఇచ్చారు, కేరళలో పరిస్థితి ఎందుకంత తీవ్రంగా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)