You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Roger Federer, Rafael Nadal: ‘ప్రధాన ప్రత్యర్థులు ఇలా భావోద్వేగాలకు గురవుతారని ఎవరైనా అనుకుంటారా?’
- రచయిత, జొనాథన్ జొరకో
- హోదా, బీబీసీ స్పోర్ట్స్
రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పాడు. మరో దిగ్గజ ఆటగాడు రఫాల్ నాదల్‌తో జోడీగా లేవర్స్ కప్‌లో డబుల్స్ ఆడిన ఫెదరర్ ఆ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.
41 ఏళ్ల ఫెదరర్ ఆటకు వీడ్కోలు చెబుతూ చివరిసారిగా కోర్టులో నడిచి వెళ్తుంటే అంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
20 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచిన ఫెదరర్‌ను టెన్నిస్ చరిత్రలోని గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా కీర్తిస్తారు.
''నేను సంతోషంగా వీడ్కోలు పలుకుతున్నాను. నేనేమీ బాధపడడం లేదు. ఇక్కడ ఉండడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది'' అన్నారు ఫెదరర్.
వీడ్కోలు సమయంలో అక్కడే ఉన్న రఫాల్ నాదల్‌ను, ఇతర ఆటగాళ్లను హత్తుకుని ఫెదరర్ బోరున ఏడ్చేశాడు.
ఫెదరర్‌ను చూసి నాదల్ కూడా కన్నీరు ఆపుకోలేక ఏడ్చేశాడు. ఫెదరర్ పక్కనే కూర్చున్న 36 ఏళ్ల నాదల్ కూడా కన్నీరు పెట్టుకోవడంతో అక్కడ వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయింది.
పురుషుల టెన్నిస్‌లో చాలాకాలంగా కోర్టులో ప్రత్యర్థులుగా పోటీపడిన ఫెదరర్, నాదల్‌లు యూరప్, రెస్టాఫ్ ది వరల్డ్ మధ్య జరిగిన వార్షిక మ్యాచ్‌లో అమెరికా డబుల్స్ జోడీ జాక్ సాక్, ఫ్రాన్సిస్ టియాఫోతో మ్యాచ్‌లో యూరప్ తరఫున జోడీగా దిగారు.
ఈ మ్యాచ్‌లో ఫెదరర్, నాదల్ జోడీ 4-6 7-6 11-9 తేడాతో ఓటమి పాలైంది.
క్రీడాభిమానులు ఫెడల్‌గా పిలుచుకునే ఈ జోడీ దాదాపు గెలుపు అంచుల వరకు వచ్చినప్పటికీ మూడో సెట్‌లో 9-8 వద్ద నిర్ణయాత్మక మ్యాచ్‌పాయింట్‌లో ఫెదరర్ కొట్టిన బంతి నెట్‌కి తాకడంతో ఓటమి తప్పలేదు.
ఓటమి తరువాత ఈ మాజీ ప్రపంచ నంబర్ వన్ ఫెదరర్ తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫెదరర్ తన కెరీర్‌లో సింగిల్స్, డబుల్స్ కలిపి 1,750 మ్యాచ్‌లు ఆడాడు.
కొద్దికాలంగా ఫెదరర్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడిన ఆయన దాన్నుంచి బయటపడేందుకు మూడుసార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు.
గత ఏడాది వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌లో పోలాండ్ ఆటగాడు హ్యూబర్ట్ హర్కాజ్ చేతిలో ఓటమి పాలైన తరువాత ఫెదరర్ ఇంతవరకు మళ్లీ ఆడలేదు.
2020 తరువాత ఇప్పటివరకు జరిగిన 11 గ్రాండ్‌స్లామ్‌లలో మూడింటికే పరిమితమైన ఫెదరర్ మళ్లీ మేజర్ టోర్నీలలో ఆడగలనని ఆశిస్తూ వచ్చారు.
అయితే, ఓ స్కానింగ్ తరువాత ఫెదరర్ ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తానని గతవారం వెల్లడించారు.
తన చివరి మ్యాచ్ అంత్యక్రియలలా కాకుండా సరదా వేడుకలా జరగాలని ఫెదరర్ ఆశించాడు. అందుకు తగ్గట్లుగానే 17,500 మంది పట్టే సామర్థ్యం గల ఈ ఎరీనాలో ఉత్సవ వాతావరణం కనిపించింది.
ఫెదరర్ భార్య మిర్కా, వారి నలుగురు పిల్లలు, ఆయన తల్లిదండ్రులు ఈ మ్యాచ్‌కు హాజరై వీక్షించారు.
మ్యాచ్ అనంతరం కోర్టులో చిన్నపాటి సంబరం తరువాత ఫెదరర్ కుటుంబమూ కోర్టులోకి వచ్చి అక్కడున్న వారి కళ్లలో నీటిని, మిగతా ఆటగాళ్లు ఆయన్ను గాల్లోకి ఎత్తుకుని తిప్పడాన్ని చూసింది.
'అందరూ ఇక్కడ ఉన్నాను. నా కెరీర్ యావత్తు నా భార్య చాలా సపోర్ట్ చేసింది. ఆమె నన్ను ఆపాలంటే ఎప్పుడో ఆడొద్దని చెప్పి ఉండేది కానీ అలా చేయలేదు' అని ఫెదరర్ అన్నాడు.
ఇంతకాలం తనను ఆడడానికి అనుమతించిన భార్యకు ధన్యవాదాలు చెప్పాడు.
రాడ్ లేవర్ సహా అనేక మంది టెన్నిస్ దిగ్గజాలు, హ్యూ గ్రాంట్ వంటి హాలీవుడ్ నటులు, వోగ్ ఎడిటర్ ఆనా వింటూర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ జోడీ కార్లోస్ అల్కరాజ్, ఇగా స్వేటెక్‌లు ఫెదరర్ వీడ్కోలు సందర్భంగా తన భావోద్వేగాలను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
డేవిస్ కప్ స్విస్ జట్టులో ఫెదరర్ సహచరుడు కూడా ఈ మ్యాచ్‌ను టీవీలో చూస్తూ తన భావోద్వేగాలను ట్వీటర్ వేదికగా పంచుకున్నాడు.
మోకాలి గాయం కారణంగా ఫెదరర్ కదలికలు తగ్గి డబుల్స్ ఆడేందుకు సరిపడే ఫిట్‌నెస్‌తో మాత్రమే ఉన్నాడు.
మ్యాచ్ తరువాత ఆయన తన కాలి కండరాలు కానీ వీపులో కండరాలకు కానీ చికిత్స చేయాల్సిన అవసరం రాకుండానే మ్యాచ్ పూర్తి చేయడం సంతోషంగా ఉందంటూ చమత్కరించాడు.
కుర్రాళ్లతో కలిసి, కుటుంబం, స్నేహితులతో కలిసి ఉండడం వల్ల మ్యాచ్ సమయంలో ఒత్తిడి ఫీలవలేదని ఫెదరర్ చెప్పాడు.
ఫెదరర్ తన ఆట తీరుతో సరిహద్దులను చెరిపేయడమే కాకుండా రికార్డుల మోతా మోగించాడు. టెన్నిస్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరిగానూ ఫెదరర్ గుర్తింపు సంపాదించుకున్నాడు.
సొగసైన ఆయన ఆటతీరు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఆకర్షణీయమైన, మర్యాదపూర్వకమైన వ్యక్తిత్వమూ ఫెదరర్‌కు లక్షల మంది అభిమానులను ఇచ్చింది.
ఫెదరర్ టెన్నిస్‌నే మించిపోయాడు అంటారు ఆయన అభిమానులు కొందరు.. మరికొందరైతే ఏకంగా ప్రపంచాన్నే దాటేశాడు అంటుంటారు.
మ్యాచ్‌కు ముందు ఫెదరర్ బ్రాండ్ దుస్తులు, యాక్సెసరీస్ ధరించిన వేలాది మంది అభిమానులు మైదానంలోకి వచ్చారు.
స్విట్జర్లాండ్ జెండా రంగులైన ఎరుపు, తెలుపు టోపీలు, టీషర్ట్‌లు, స్కార్ఫ్‌లు, చెవిపోగులు పెట్టుకుని చాలామంది వచ్చారు.
ఇండోర్ ఎరీనా చుట్టూ కొన్ని స్విస్ జెండాలు కొన్ని కప్పారు.
ఓ2 ఎరీనా వద్దకు వచ్చిన ఫెదరర్ వీరాభిమాని, పోలీండ్ వాసి రాబర్ట్ స్ప్రింగర్ అయితే ఏకంగా 'కింగ్ ఆఫ్ టెన్నిస్' అంటూ అభివర్ణించాడు.
వార్షిక టీం ఈవెంట్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఫెదరర్ గత వారమే చెప్పడంతో ఈ మ్యాచ్ టికెట్లన్నీ ముందే అమ్ముడుపోయాయి.
మొదట 40 పౌండ్ల నుంచి 510 పౌండ్ల మధ్య ధరకు టికెట్లు విక్రయం కాగా ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని తెలిశాక రీసేల్ ప్లాట్‌ఫాంలలో చాలామంది తమ టికెట్లను 1000 పౌండ్లకు పైగా అధిక ధరలకు విక్రయించారు.
భావోద్వేగానికి గురవుతానని తెలుసు కాబట్టే కోర్టులో మాట్లాడడానికి భయపడ్డానని ఫెదరర్ చెప్పాడు.
'ఇది ముగింపు కాదు. జీవితం కొనసాగుతుందని మీకు తెలుసు. నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. ఇదొక క్షణం మాత్రమే'' అంటూ ఫెదరర్ వీడ్కోలు సందర్భంగా అభిమానులతో అన్నారు.
రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న టెన్నిస్ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు ట్వీట్లు చేశారు.
నేను చూసిన అందమైన క్రీడాచిత్రం ఇదే: విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఫెదరర్ రిటైర్మెంట్, ఆ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న భావోద్వేగాలపై స్పందించారు.
ఫెదరర్, నాదల్‌లు కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కోహ్లీ ‘‘ఆటలో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఒకరి గురించి మరొకరు ఇలా భావోద్వేగాలకు గురవుతారని ఎవరైనా అనుకుంటారా? ఆట అందమే అది. నేను చూసిన అత్యంత హృద్యమైన క్రీడాచిత్రం ఇది’’ అంటూ ఫెదరర్, నాదల్‌ల పట్ల తన గౌరవాన్ని ప్రకటించాడు.
ఇవి కూడా చదవండి:
- ఝులన్ గోస్వామి: మహిళల వన్ డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న స్టార్ ప్లేయర్‌కు ఆఖరి మ్యాచ్
- పర్యావరణ మార్పుల వల్ల పట్టణాలు, నగరాల్లోని చెట్లు అంతరించిపోతాయా? - తాజా పరిశోధన ఏం చెబుతోంది
- జపాన్: షింజో అబే అంత్యక్రియల ఖర్చు బ్రిటన్ రాణికైన ఖర్చుకన్నా ఎక్కువా, ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)