ఐఫోన్ 14 అమ్మకాలను నిషేధించిన బ్రెజిల్, కారణం ఏమిటంటే...

బ్రెజిల్ తమ దేశంలో పవర్ అడాప్టర్ లేకుండా ఐఫోన్‌లను విక్రయించటాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

బ్రెజిల్ న్యాయ, ప్రజా భద్రత శాఖ మంత్రి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపిల్ సంస్థ మీద 18.50 కోట్ల రూపాయల మేర జరిమానా విధించినట్లు చెప్పింది.

కొత్త ఐఫోన్లతో పాటు పవర్ అడాప్టర్‌లను కలిపి అమ్మకూడదన్న ఆపిల్ నిర్ణయం.. వినియోగదారుల పట్ల వివక్ష చూపటమేనని, అది 'అసంపూర్ణ ఉత్పత్తి' అవుతుందని బ్రెజిల్ వినియోగదారు సంస్థ సెనాకాన్ చెప్పింది.

ఈ నిషేధం మీద అప్పీలు చేస్తామని ఆపిల్ తెలిపింది.

బ్రెజిల్ ఆందోళనలను పరిష్కరించడానికి ఆ ప్రభుత్వ యంత్రాంగాలతో తాము కృషి చేస్తామని రాయిటర్స్ వార్తా సంస్థకు ఒక ప్రకటన ద్వారా ఆపిల్ తెలిపింది. అయితే.. ఈ విషయమై గతంలో బ్రెజిల్ మీద తాము పలు కేసులు గెలిచామని చెప్పింది.

''మా వినియోగదారులకు వారి డివైజ్‌లను చార్జ్ చేసుకోవటానికి, కనెక్ట్ చేసుకోవటానికి గల వివిధ ప్రత్యామ్నాయాల గురించి అవగాహన ఉందని మేం నమ్ముతున్నాం'' అని ఆపిల్ పేర్కొంది.

యూఎస్‌బీ పవర్ అడాప్టర్ లేకుండా ఐఫోన్లను విక్రయించటంపై నిషేధాన్ని, జరిమానాని.. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 14, 14 ప్రోలతో పాటు ఆపిల్ వాచ్ అల్ట్రాలను ప్రదర్శించటానికి ఒక రోజు ముందు బ్రెజిల్ ప్రకటించింది.

సౌపౌలో వినియోగదారుల రక్షణ సంస్థ గత ఏడాది ఆపిల్ మీద 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది. ఐఫోన్ 12, తదనంతర మోడళ్ల విక్రయం వినియోగదారుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఎందుకంటే ఆ మోడల్ ఫోన్లతో పాటు చార్జర్లను అందించటం లేదని చెప్పింది.

ఆపిల్ సంస్థ 2020లో విడుదల చేసిన ఐఫోన్ 12 విక్రయాల నుంచీ.. ఐఫోన్ బాక్స్‌లలో పవర్ అడాప్టర్లు, హెడ్‌ఫోన్లు చేర్చటం నిలిపివేసింది.

దానికి ముందు ఆపిల్ వాచ్‌ బాక్స్‌ల నుంచి పవర్ అడాప్టర్లను తీసివేసింది. ఐఫోన్లతో పాటు అడాప్టర్లు కలిపి విక్రయించకపోవటం వల్ల.. ప్యాకేజీల పరిమాణం చిన్నగా ఉంటుందని, అది తమ సంస్థ కలిగించే పర్యావరణ నష్టం తగ్గటానికి దోహదపడుతుందని ఆపిల్ చెప్పుకొచ్చింది.

''కొన్నిసార్లు మేం ఏం తయారు చేస్తున్నాం అనేది కాకుండా, మేం ఏం తయారు చేయటం లేదు అనేది లెక్కలోకి వస్తుంది'' అని ఆపిల్ పర్యావరణ, విధాన, సామాజిక కార్యక్రమాల విభాగం ఉపాధ్యక్షురాలు లీసా జాక్సన్ 2020 సెప్టెంబర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో 200 కోట్లకు పైగా అధికారిక యాపిల్ పవర్ అడాప్టర్లు ఉన్నాయని ఆమె అప్పుడు చెప్పారు.

ఐఫోన్ బాక్సుల నుంచి యూఎస్‌బీ పవర్ అడాప్టర్లను తొలగించటానికి ప్రాతిపదిక పర్యావరణమనే ఆపిల్ వాదనలను హేతుబద్ధత లేదని ఆ సంస్థ మీద గత ఏడాది కేసు వేసిన సెనాకాన్ పేర్కొంది.

చార్జర్లను తొలగించటం వల్ల పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయనేందుకు ఆధారాలేవీ లేవని చెప్పింది.

ఆపిల్ సంస్థ పర్యావరణంపై తన ప్రభావాన్ని తగ్గించటానికి.. వినియోగదారుల మీద భారం మోపని ప్రత్యామ్నాయాలను పరిగిణించి ఉండవచ్చునని సెనెకాన్ పేర్కొంది. ఈ-వ్యర్థాలను తగ్గించటం కోసం యూఎస్‌బీ-సీ కేబుల్‌ను అడాప్ట్ చేసుకోవటం వంటి మార్గాలు ఉన్నాయని ఉదహరించింది.

చిన్నపాటి విద్యుత్ పరికరాలకు ఉమ్మడి యూఎస్‌బీ-సీ చార్జింగ్ కేబుల్‌ను అమలు చేయాలన్న ప్రణాళికకు యూరోపియన్ యూనియన్ ఇంతకుముందు ప్రాధమికంగా అంగీకరించింది.

'అసంపూర్ణ ఉత్పత్తి'

పవర్ అడాప్టర్లు లేకుండా కొత్త ఐఫోన్ల విక్రయించటం ద్వారా.. వినియోగదారులు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత రెండో ఉత్పత్తిని కొనక తప్పని పరిస్థితిని ఆపిల్ సంస్థ సృష్టిస్తోందని సెనెకా పేర్కొంది.

పవర్ అడాప్టర్‌ను ఉత్పత్తిలో భాగంగా చేర్చాల్సి ఉంటుందని.. ఎందుకంటే ఫోన్‌ను ఆపరేట్ చేయాలంటే దానికి పవర్ అడాప్టర్ అవసరమని, అది లేకపోతే ఫోన్ 'అసంపూర్ణ ఉత్పత్తి' అవుతుందని చెప్పింది.

అడాప్టర్లు లేకపోయినా ఐఫోన్ల ధర తగ్గలేదని, కాబట్టి ఈ చర్య వల్ల బాధ్యత థర్డ్-పార్టీ ప్రొవైడర్ల మీదకు, వినియోగదారుల మీదకు బదిలీ అయిందని సెనెకా పేర్కొంది.

ఈ అంశంపై స్పందించటానికి ఆపిల్‌ను సంప్రదించాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)