You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిమ్ జోంగ్ ఉన్: ‘అణ్వస్త్రాలు మోహరించడానికి రెడీగా ఉన్నాం’
- రచయిత, మెలిసా జూ
- హోదా, బీబీసీ న్యూస్
ఉత్తర కొరియా అణ్వాయుధాలను మోహరించడానికి సిద్ధంగా ఉందని ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు.
నార్త్ కొరియాలో ఒక యుద్ధ వార్షికోత్సవ కార్యక్రమంలో కిమ్ మాట్లాడుతూ, "అమెరికాతో ఎలాంటి సైనిక ఘర్షణకైనా తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని" చెప్పారని ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ తెలిపింది.
నార్త్ కొరియా ఏడో అణు పరీక్షకు సిద్ధమవుతోందన్న నేపథ్యంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర కొరియా ఏ సమయంలోనైనా అణు పరీక్షలు నిర్వహించవచ్చని అమెరికా గత నెలలో హెచ్చరించింది.
ఆ దేశం చివరిగా 2017లో అణుపరీక్ష జరిపింది. మరో వైపు, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతూ వస్తున్నాయి.
ఈ ఏడాది ఉత్తర కొరియా విపరీతంగా క్షిపణి పరీక్షలు జరిపిందని ఉత్తర కొరియాలోని అమెరికా ప్రత్యేక ప్రతినిధి సంగ్ కిమ్ అన్నారు. 2019లో రికార్డు స్థాయిలో 25 సార్లు క్షిపణి పరీక్షలు జరపగా, ఈ ఏడాది ఇప్పటికే 31 పరీక్షలు జరిపిందని తెలిపారు.
ఉత్తర కొరియాకు స్పందనగా, దక్షిణ కొరియా జూన్‌లో ఎనిమిది సొంత క్షిపణులను పరీక్షించింది.
1950-53 కొరియా యుద్ధం సంధితో ముగిసినప్పటికీ, ఉత్తర కొరియా దానిని అమెరికాపై విజయంగా పరిగణిస్తుంది. ప్రతి ఏడాది 'విక్టరీ డే' పేరుతో సంబరాలు జరుపుకొంటుంది.
ఈ వార్షికోత్సవ వేడుకలో కిమ్ మాట్లాడుతూ, అమెరికా నుంచి వస్తున్న అణు బెదిరింపుల కారణంగా ఉత్తర కొరియాకు ఆత్మరక్షణ పటిష్టం చేసుకునే అత్యవసరం ఏర్పడిందని అన్నారు.
నార్త్ కొరియా నిత్యం చేసే సైనిక విన్యాసాలను కవ్వింపు చర్యలుగా అమెరికా అపార్థం చేసుకుందని ఆయన అన్నారు.
ఉత్తర కొరియా నుంచి అణ్వాయుధాల ముప్పును ఎదుర్కోవడానికి దక్షిణ కొరియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోదనే వ్యాఖ్యలపై కూడా కిమ్ జోంగ్ ఉన్ స్పందించారు.
దక్షిణ కొరియాలో "కిల్ చెయిన్" అనే వ్యూహాన్ని ప్రవేశపెట్టారు. నార్త్ కొరియా పాలనకు వ్యతిరేకంగా ముందస్తు దాడులకు పిలుపునిస్తుంది ఈ వ్యూహం. ఇది సొంత దేశానికి ప్రమాదంగా పరిణమించవచ్చని కొందరు నిపుణులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో, దక్షిణ కొరియా ముందస్తు దాడులకు పాల్పడితే అక్కడి యూన్ సుక్-యోల్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కిమ్ అన్నారు.
ఉత్తర కొరియా 'యుద్ధం అంచున' ఉందా? - బీబీసీ జర్నలిస్ట్ రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేయస్ విశ్లేషణ
కొరియా ద్వీపకల్పం "యుద్ధం అంచున ఉంది" అంటూ కిమ్ జోంగ్ ఉన్ చేసిన హెచ్చరికలు భయంగొల్పుతున్నాయి. అయితే, నార్త్ కొరియా మాటలు ఎప్పుడూ ఆవేశపూరితంగానే ఉంటాయి. ముఖ్యంగా, ఇలాంటి వార్షికోత్సవ వేడుకల్లో.
దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్-యోల్ పట్ల ఉత్తర కొరియా పాలన ఎంత కోపంగా ఉందో ఈ వ్యాఖ్యలు సూచిస్తాయి.
ఈ ఏడాది మేలో యూన్ అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత, మరింత దూకుడు రక్షణ విధానాన్ని అమలులోకి తెచ్చారు. నార్త్ కొరియా నుంచి తీవ్రమైన ముప్పు ఉందని సౌత్ కొరియా భావిస్తే, ముందస్తు దాడులకు పాల్పడమని ఈ విధానం సూచిస్తుంది. దీన్నే "కిల్-చెయిన్" వ్యూహంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యూహం ప్రకారం, నార్త్ కొరియాను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, వైమానిక దాడులు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిస్తుంది. నార్త్ కొరియాలో అధికార భవనాలను, పాలనను లక్ష్యంగా చేసుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే కిమ్ జోంగ్ ఉన్‌ను చంపే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు, అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ, ఇరు దేశాల మధ్య చర్చలు జరగకపోవడం పట్ల నార్త్ కొరియా ప్రభుత్వం చాలా అసంతృప్తిగా ఉంది.
ఇవన్నీ చూస్తుంటే, నార్త్ కొరియా ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందనే అనిపిస్తోంది.
నార్త్ కొరియా ఏడో అణు పరీక్ష నిర్వహిస్తుందని అందరూ ఊహిస్తున్నారు. మార్చి నుంచి పుంగ్యే-రి టెస్ట్ సైట్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చెస్ ఒలింపియాడ్ 2022: చెన్నైలోని ఈ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్స్ అమెరికాకు చెక్ పెడతారా?
- ఏపీ, తెలంగాణల్లో డబ్బును బ్యాంకుల్లో వదిలేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది... ఆ సొమ్మును ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)