Shinzo Abe : జపాన్ మాజీ ప్రధానిని కాల్చి చంపిన ఈ వ్యక్తి ఎవరు?

జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే శుక్రవారం ఉదయం 11.30కు దేశంలోని పశ్చిమ భాగంలోని నారాలో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై వెనుక నుంచి కాల్పులు జరిగాయి.

కాల్పులు జరిపిన తర్వాత ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కూడా జరిగింది. తర్వాత ఆస్పత్రిలో ఆయన మృతిచెందారు.

కాల్పులు జరిపిన 41 ఏళ్ల నిందితుడిని ఘటనాస్థలం నుంచే అరెస్ట్ చేశారు.

జపాన్ ప్రభుత్వ మీడియా ఎన్‌హెచ్‌కే వివరాల ప్రకారం నిందితుడికి షింజో అబే అంటే నచ్చదు. ఆయన్ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారు.

బుల్లెట్లు తగిలిన తర్వాత షింజో అబేను హెలికాప్టర్లో నారా మెడికల్ యూనివర్సిటీకి తీసుకెళ్లారు. కానీ, ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఎన్‌హెచ్‌కే వివరాల ప్రకారం బుల్లెట్ తగలడం వల్ల షింజో అబే గొంతుకు గాయమైంది. ఆయన గుండె దగ్గర నుంచి కూడా రక్తస్రావం అయినట్టు వార్తలు వచ్చాయి.

అనంతరం 67 ఏళ్ల షింజో అబే మరణించినట్లు ప్రకటించారు.

షింజో అబేను కాల్చి చంపిన వ్యక్తి ఎవరు?

ఎన్‌హెచ్‌కే వివరాల ప్రకారం దాడి చేసిన వ్యక్తిని 41 ఏళ్ల తెత్సుయా యామాగామీగా గుర్తించారు. తనకు అబే అంటే అసంతృప్తి ఉందని, ఆయన్ను హత్య చేయాలనుకున్నానని ఆయన పోలీసులకు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.

దాడి చేసిన వ్యక్తి గ్రే టీ-షర్ట్, పాంట్ వేసుకున్నాడు. అనుమానితుడు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ సభ్యుడు. ఆయన హాండ్ గన్‌తో కాల్పులు జరిపాడు. 2005 వరకూ ఆయన మూడేళ్ల పాటు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సులో పనిచేశారు అని రక్షణ శాఖ చెప్పినట్లు ఎన్‌హెచ్‌కే పేర్కొంది.

నారాలో నివసించే 50 ఏళ్ల ఒక మహిళ షింజో అబే బహిరంగ సభలో ఉన్నారు.

ఎన్‌హెచ్‌కేతో మాట్లాడిన ఆమె "నేను అబే ప్రసంగం వింటున్నా, అప్పుడే హెల్మెట్ వేసుకున్న ఒక వ్యక్తి రెండు సార్లు కాల్చడం చూశాను. రెండో బుల్లెట్ తగిలిన తర్వాత అబే పడిపోయారు. ఆ వ్యక్తిని అప్పటికప్పుడే అరెస్ట్ చేశారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి అబేను హాస్పిటల్‌కు తరలించారు. నేను భయపడిపోయా.. దాడి చేసిన వ్యక్తి నా ముందే నిలబడి ఉన్నాడు" అని చెప్పారు.

డెమాక్రటిక్ లిబరల్ పార్టీ పదాధికారి కూడా షింజో అబే తోపాటూ ఆ బహిరంగ సభలో ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ వ్యక్తి 10 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపాడు. అంటే అది ఎవరో టపాసులు పేల్చినట్టు అనిపించింది. నా కళ్ల ముందే ఇదంతా జరిగిందంటే నాకు ఇప్పటికీ షాక్‌గా ఉంది. నమ్మలేకపోతున్నా. కాల్పులు జరిపిన తర్వాత కూడా అతడు ప్రశాంతంగా ఉన్నాడు, పారిపోలేదు’’ అన్నారు.

జపాన్ అధ్యక్షుడు ఫుమియో కిషిదా శుక్రవారం దాడి చేసిన వ్యక్తి గురించి మాట్లాడారు.

‘‘దాడిచేసిన వ్యక్తి క్రిమినల్ నేపథ్యం గురించి మాకింకా తెలీదు. అతడి నేపథ్యానికి సంబంధించిన సమాచారం మాకు కీలకమవుతుందా లేదా అనేది పోలీసుల దర్యాప్తు తర్వాతే తేలుతుంది’’ అన్నారు.

షింజో అబే ఎవరు?

షింజో అబే 1954లో ఒక రాజకీయ కుటుంబంలో పుట్టారు.

ఆయన తండ్రి షింతారో అబే కూడా రాజకీయ నేత. జపాన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు.

షింజో అబే తాత నోబుసుకే కిషీ జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు.

2006లో షింజో అబే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌కు అతిపిన్న వయసు ప్రధానమంత్రి అయ్యారు.

అయితే ఆయన అదే ఏడాది రాజీనామా చేశారు. తర్వాత 2012 నుంచి 2020 వరకూ జపాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

అబే ఆరోగ్య సమస్యల వల్ల 2020లో రాజీనామా చేశారు.

అయితే తన పార్టీలో అబే ఇప్పటికీ చాలా పాపులర్ నేత.

67 ఏళ్ల అబే చాలా ఏళ్ల నుంచీ అల్సరేటివ్ కొలైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఇటీవల ఆయన స్థితి మరింత క్షీణించిందని చెబుతున్నారు.

షింజో అబే పదవీకాలం 2021 సెప్టెంబరులో ముగిసింది. అబే జపాన్‌లో అత్యంత సుదీర్ఘంగా ప్రధానిగా పనిచేసిన రికార్డు కూడా బద్దలు కొట్టారు.

2007లో ఆయన అల్సరేటివ్ కొలైటిస్ వల్ల హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. అది పెద్ద పేగుల్లో వచ్చే ఒక ప్రమాదకరమైన వ్యాధి. దానిని ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచీ భరిస్తున్నారు.

జపాన్‌లో హై ప్రొఫైల్ హత్య లేదా హత్యాయత్నం చరిత్ర ఉంది. ఇందులో 1932లో జపాన్ ప్రధాని ఇనుకాయి సుయోషీని ఒక నేవీ అధికారి హత్య చేయడం కూడా ఉంది.

అది అధికారమార్పిడికి జరిగిన విఫలయత్నం. తుపాకులు కలిగి ఉండటంపై అత్యంత కఠిన చట్టాలు ఉన్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి.

సుదీర్ఘ కాలంగా ఉన్న నిషేధాన్ని ఛేదించి జపాన్ అణ్వాయుధాలపై చురుకైన చర్చ ప్రారంభించాలని షింజో అబే ఇదే ఏడాది ఫిబ్రవరిలో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)