You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని హత్య, ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ సాయుధుడు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిన అబే ఆ తరువాత చికిత్స పొందుతూ మరణించారు.
67 ఏళ్ల షిబె జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేశారు.
కాల్పులు జరిపిన వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయి. కాల్పుల అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
జపాన్‌లోని నారా నగరంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయని ఎన్‌హెచ్‌కె వార్తా సంస్థ తెలిపింది.
కాల్పులు జరగడంతో ఆయన కింద పడిపోయారని, రక్తమోడుతున్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారని పేర్కొంది.
ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఎన్‌హెచ్‌కె తెలిపింది.
కాల్పుల అనంతరం షింజో కార్డియో పల్మనరీ అరెస్ట్ దశలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ యోచీ మసౌజో ట్వీట్ చేశారు.
ఒక వ్యక్తి మరణాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు ఆయన కార్డియో పల్మనరీ అరెస్ట్ దశలో ఉన్నట్లు అధికారులు ప్రకటించడం జపాన్ లో సంప్రదాయమని నివేదికలు చెబుతున్నాయి.
అనంతరం అబే మృతిని అధికారికంగా ప్రకటించారు.
జపాన్‌లో గన్ ఫైరింగ్ ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. హ్యాండ్ గన్‌లను ఉపయోగించడం ఇక్కడ నిషేధం.
నారాలో ఒక అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా అబే ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి వెనుక నుంచి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బీబీసీ జపాన్ కరస్పాండెంట్ రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేస్ తెలిపారు.
సాయుధుడు తొలుత కాల్చినప్పటికీ అది గురి తప్పిందని... రెండో తూటా నేరుగా షింజో అబేకు వెనుక నుంచి తగలడంతో ఆయన రక్తమోడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కాల్పుల తరువాత కూడా ఆ సాయుధుడు పారిపోయే ప్రయత్నమేమీ చేయలేదు, దీంతో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి పోలీసులు ఆయుధం స్వాధీనం చేసుకున్నారని స్థానిక మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది.
జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన అబే అనారోగ్య కారణాలతో 2020లో పదవి నుంచి తప్పుకొన్నారు.
అనంతరం ఆయన పేగు సంబంధిత వ్యాధి అల్సరేటివ్ కొలిటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు.
అబే తరువాత ఆయన పార్టీకే చెందిన యొషిహిడే సుగా కొద్దికాలం ప్రధానిగా ఉండగా, అనంతరం ఫ్యుమియో కిసిడా ప్రధాని పీఠమెక్కారు.
జపాన్‌లో హ్యాండ్‌గన్స్‌పై నిషేధం ఉండడతో కాల్పుల ఘటనలు అక్కడ చాలా అరుదు. ఇక రాజకీయపరమైన హత్యలనేవి అక్కడ ఇంతవరకు విన్న దాఖలాలు లేవు.
2014లో జపాన్‌లో కేవలం 6 కాల్పుల ఘటనలు నమోదు కాగా అదే ఏడాది అమెరికాలో 33,599 ఘటనలు నమోదయ్యాయి.
జపాన్‌లో తుపాకీ కొనాలంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంకా అనేక ఇతర పరీక్షలు పెడతారు. వాటన్నిటిలోనూ పాసయితేనే తుపాకీ కొనడానికి అనుమతిస్తారు.
అప్పుడు కూడా ఎయిర్ రైఫిల్ కానీ షాట్ గన్ కానీ కొనుగోలు చేయడానికి మాత్రమే అనుమతిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)