You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్: 'బతికి ఉండగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి' - రష్యా సైనికులకు యుక్రెయిన్ హెచ్చరిక
యుక్రెయిన్‌లో యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. రష్యా సుమారు 2,00,000 మంది సైనికులను యుద్ధ రంగంలోకి పంపి యుక్రెయిన్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల ప్రభావం తొలుత యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ నగరంపై తీవ్రంగా పడింది.
బీబీసీ ప్రతినిధి కెంటిన్ సోమర్‌విల్లీ , కెమెరా పర్సన్ డారెన్ కాన్‌వే యుద్ధం చేస్తున్న ఇద్దరు యుక్రెయిన్ సైనికులతో కొంత సమయం గడిపారు. ఆ ఇద్దరు సైనికులు యుద్ధం మొదలైనప్పటి నుంచి ముందువరసలో పోరాడుతున్నారు.
ఈ కథనంలో కొన్ని విషయాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు.
ఖార్కియెవ్ నగరం గురించి చెప్పాలంటే, ఇది ఇంకా ఓటమి చూడని, గెలుపు దక్కని సైనికుల పోరాట కథ
ఒక వైపు రష్యా బెదిరిపోతుంటే, యుక్రెయిన్ మాత్రం స్థిరంగా ఉంది. యుక్రెయిన్ త్వరలోనే ఓడిపోతుందనే అంచనాలను ఆ దేశ సైనికులు తిప్పికొడుతున్నారు.
ఖార్కియెవ్ చుట్టూ ఉన్న యుక్రెయిన్ సైనిక వలయాన్ని రష్యన్ సేనలు చేధించలేకపోయాయి. నగరాన్ని చుట్టుముట్టలేకపోయాయి.
రష్యా ఫిబ్రవరి 24 తెల్లవారుజామున యుక్రెయిన్ పై దాడి మొదలుపెట్టింది. ముందు రోజు రాత్రి 22 సంవత్సరాల వ్లాడ్ తన సోదరుడు మార్క్‌తో కలిసి ఒక వివాహ వేడుకలో ఉన్నారు. అక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో రష్యా ట్యాంకులు, ఆయుధాలతో కూడిన వాహనాలు మోహరించి ఉన్నాయి.
రష్యా యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే సేనలను సరిహద్దుల దగ్గరకు చేరుస్తున్నప్పటికీ, అది ఆకస్మికంగా చర్యకు దిగడం ఖార్కియెవ్ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నగరాన్ని రక్షించుకునేందుకు యుక్రెయిన్ సైనికులు వెంటనే రంగంలోకి దిగారు.
దాడి గురించి సమాచారం అందగానే, వ్లాడ్, మార్క్ కూడా వెంటనే సైనిక విధులకు హాజరయ్యారు. నేరుగా ఫ్రంట్‌లైన్ విధుల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ అక్కడే ఉన్నారు.
నేను వారిని రెండు సార్లు కలిశాను. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే నగరం ప్రస్తుతం చెల్లా చెదురుగా పడి ఉన్న శవాలతో, కాలిపోయిన రష్యా ట్యాంకులు, వాహనాలతో నిండిపోయింది. అక్కడ కనిపిస్తున్న దృశ్యాల కంటే శబ్దాలు చాలా ఆందోళనకు గురి చేస్తున్నాయి.
రష్యా ఫిరంగులు, క్షిపణులు ఆగకుండా పేలుతూనే ఉన్నాయి. బాంబుల దాడి నుంచి విరామం దొరికినప్పుడు ఏర్పడే నిశ్శబ్ధం కూడా ఆందోళన కలిగిస్తోంది. యుక్రెయిన్ సేనలు గత కొన్ని వారాలుగా ఈ భయం మధ్యలోనే బతుకుతున్నారు.
అక్కడకు దగ్గరలో ఉన్న కమాండ్ పోస్టులో కిటికీలన్నీ ఊడిపోయాయి. ఫర్నీచర్ చెల్లా చెదురుగా పడిపోయింది.
అక్కడే ఉన్న ఒక బేబీ ప్రామ్ (చిన్న పిల్లలను తీసుకుని వెళ్లే చక్రాల బండి)లో మెషీన్ గన్ పడి ఉంది. అక్కడకు దగ్గర్లో ఉన్న ఇంటి గోడకు తగిలించిన ఫర్ సేల్ (అమ్మకానికి ) అని రాసిన బోర్డు గాలికి ఊగుతోంది.
బాంబులు, తుపాకుల శబ్ధాల నడుమ నేను యుక్రెయిన్ ఎందుకు పోరాడుతోందని నేను మార్క్, వ్లాడ్‌లను అడిగాను.
"యుక్రెయిన్‌లో శాంతి కోసం" అని వ్లాడ్ సమాధానమిచ్చారు. ఈ మాటలు విన్న మార్క్ మాత్రం "ఎవరికి తెలుసు? రష్యా సేనలు మా భూభాగంలో అడుగుపెట్టాయి. మా మీద దాడికి దిగాయి" అని అన్నారు.
యుద్ధం మొదటి రోజున రష్యన్లు నగరం నడిబొడ్డుకు చేరారు. కానీ, మూడు రోజుల పోరాటం తర్వాత వారిని వెనక్కి తిప్పి పంపగలిగారు.
ఈ పోరాటంలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. దాంతో, రష్యన్ సైనికులు ఖార్కియెవ్ శివార్లకు వెళ్లాల్సి వచ్చింది.
యుద్ధం మొదలై ఒక నెల గడిచింది. నగరం పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 14లక్షల మంది ప్రజలు నగరం వదిలి పారిపోయారు. ఖార్కియెవ్ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు మొదట్లో ఈ దాడులకు గురవ్వలేదు.
కానీ, మూడు వారాల క్రితం చెక్కు చెదరకుండా ప్రశాంతంగా ఉన్న కొన్ని ప్రాంతాలు నేడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి.
ఒక చెట్టు మూలలో పేలని రష్యన్ బాంబు కనిపిస్తోంది. ఒక అపార్ట్మెంట్ బ్లాక్ పై కప్పు మీద 500 కేజీల బాంబు పడి ఉంది. అది పేలితే గనక ఆ అపార్ట్మెంట్ ఒక్కసారిగా కూలిపోతుంది.
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఈ యుద్ధం వల్ల కలుగుతున్న నిరాశ గురించి మాట్లాడకుండా ఉండేందుకు వ్లాడ్, మార్క్ ప్రయత్నిస్తున్నారు. పక్కనే పడి ఉన్న శవాల గురించి, రష్యన్ దాడుల్లో మరణించిన తోటి సైనికుల గురించి లేదా అంతకు ముందు రోజే మరణించిన ట్యాంక్ కమాండర్ గురించి ఇంట్లో వాళ్లతో మాట్లాడటం లేదు.
సైనిక ఆపరేషన్‌కు సంబంధించిన వివరాల గురించి అసలు వెల్లడించడం లేదు.
"ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సాధారణ జీవితం తిరిగి ఎప్పుడు మొదలవుతుందోనని మాత్రమే చర్చిస్తున్నాం. బయట నడవడానికి ప్రమాదం లేని రోజు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం" అని వ్లాడ్ చెప్పారు.
ఒక భవనంలోని జెనరేటర్‌కు చాలా ఫోన్ చార్జర్లను పెట్టి ఛార్జ్ చేస్తున్నారు. యుక్రెయిన్ సైనికులు పడుకున్న గది వెచ్చగా ఉంది.
వారితో పాటు ఒక జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క ఉంది. చుట్టూ వినిపిస్తున్న శబ్దాలకు అది బెంబేలెత్తిపోతోంది.
అది సైనికుల చుట్టూ తిరుగుతోంది. వారు దానిని నిమరగానే పక్కకు వెళుతోంది.
సైనిక స్థావరాల పై రష్యన్ సేనలు చేసే దాడులను ఈ ఇద్దరు సైనికులు ఎదుర్కొంటున్నారు.
రష్యా సేనలు యుక్రెయిన్‌లో దాడులు చేయడానికి తప్ప పూర్తి స్థాయి యుద్ధానికి సన్నద్ధమైనట్లు కనిపించడం లేదు. మంచులో నేను చూసిన మృతదేహాలు చలికాలానికి తగిన దుస్తులు వేసుకున్నట్లు కనిపించలేదు. వారికి తినేందుకు తగిన ఆహార పదార్థాలు కూడా లేవని యుక్రెయిన్ సైనికులు చెబుతున్నారు.
"పరుగెత్తండి. పారిపోండి. ఇంటికి తిరిగి వెళ్ళండి" అని రష్యా సేనలకు వ్లాడ్ సందేశమిచ్చారు. "పిల్లలను చంపకండి. ఇళ్లను, కుటుంబాలను ధ్వంసం చేయకండి" అని అన్నారు.
"బతికుండగానే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి" అని మార్క్ అన్నారు.
రష్యా క్రైమియాను ఆక్రమణ చేసినప్పటి దాడి నుంచి యుక్రెయిన్ సేనలు పాఠాలు నేర్చుకున్నాయి. నిజానికి, యుక్రెయిన్ సేనలు సంఖ్యలో, టెక్నాలజీలో, గగన శక్తిలో రష్యాతో ఏమాత్రం సరితూగలేవు.
అయినా సరే, రష్యన్ సేనలను యుక్రెయిన్ సైనికులు విజయవంతంగా ఎలా అడ్డుకోగలుగుతున్నారు?
పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ నివేదికల్లోని ఒక ఇంటర్ సెప్ట్ చేసిన కాల్ వివరాలు దీనికి సమాధానం చెబుతున్నాయి. రష్యా కమాండర్ మైకోలైవ్ మార్చి 11న ఒక ఫోన్ కాల్ చేశారు. ఆయన అధికారులతో మాట్లాడిన సంభాషణను యుక్రెయిన్ అధికారులు విడుదల చేశారు. ఈ కాల్ నిజమైనదేనా అన్నది ఇంకా ధ్రువీకరించలేదు.
ఆ కాల్‌లో రష్యా సైనికులు అనుభవిస్తున్న కష్టాలు, రష్యా దాడిలోని అసమర్ధత వినిపిస్తున్నాయి.
రష్యా సైనికులకు కనీస అవసరాలైన టెంట్లు, ధరించేందుకు తగిన రక్షణ కవచాలు లేవు. గడ్డ కట్టే చలిలో గోతులు తవ్వుకుని పడుకుంటున్నారు. రెండు వారాల క్రితం నేను మరొక యుక్రెయిన్ సైనికుడిని ఎక్కడ పడుకుంటున్నారని అడిగాను. "మేము ఇళ్లల్లో పడుకునే అవకాశముండగా, ఈ గోతుల్లో ఎందుకు పడుకుంటాం" అని అన్నారు.
రష్యన్లు ఆ గోతుల్లో పడుకుంటున్నారు. కానీ, మేము ఇక్కడ పడుకుంటాం" అని హీటింగ్ సౌకర్యంతో ఉన్న ఇంటిని చూపిస్తూ అన్నారు.
రష్యన్ సేనల దగ్గర నాణ్యమైన బాడీ ఆర్మర్ (రక్షణ కవచాలు) ఉన్నప్పటికీ, ఆ వెస్ట్‌ను దృఢంగా ఉంచేందుకు కవచాలతో కూడిన ప్లేట్లు లేవని ఆయన వివరించారు.
మార్క్, వ్లాడ్ దగ్గర ఆయుధ సంపత్తి మెరుగ్గా ఉంది. మేము ముందుకు కదిలే కొలదీ మా దగ్గర అవసరమైన ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్నాయి. మాకు అవసరమైన టీ, కాఫీ, ఇతర సరుకులు ఉన్నాయి.
వాళ్ళ వాహనాల్లో సిగరెట్లు విరివిగా ఉన్నాయి. ఒక వైపు విధ్వంసం జరుగుతున్నా, చాలా మంది చెయిన్ స్మోక్ చేస్తూనే ఉన్నారు.
తమ తోటి సైనికుడు దాడుల్లో గాయపడినట్లు రేడియోలో వార్త వినిపిస్తూ ఉంటుంది. మరో వైపు నిమిషాల్లో అంబులెన్సు వచ్చి వెచ్చటి దుప్పటి కప్పి గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకుని వెళుతుంది. వారికి చికిత్స వెంటనే అందుతుంది. ఆయన కోలుకుంటున్నారనే వార్త కూడా మరికాసేపట్లో వస్తుంది.
తమ సొంత దేశంలో పోరాడటం యుక్రెయిన్ సైనికులకు ప్రయోజనకారిగా ఉంది. వారు మాకు స్థానిక బేకరీలలో తయారైన బిస్కట్లు, కేకులు ఇస్తున్నారు. వారి శత్రువుకు ఈ అదృష్టం లేదు.
రష్యా సేనలు సరకుల కోసం కొన్ని గ్రామాల్లో కోళ్లు మొదలైన వాటిని దోపిడీలు చేస్తున్నట్లు కొంత మంది గ్రామస్థులు ఫిర్యాదులు చేశారు.
యుక్రెయిన్ సైన్యం స్వాధీనం చేసుకున్న రష్యా సేనల వంటశాల వీడియో కనిపించింది. అందులో సైన్యానికి వడ్డిస్తున్న భోజనం కనిపిస్తోంది. అందులో ఉల్లిపాయలు, దుంపలు, కొంత కొవ్వుతో కలిపి గుట్టలుగా పడి ఉన్నాయి. రష్యా సేనలకు సిద్ధం చేసిన రెడీ టూ ఈట్ ప్యాకెట్ల పై 2015 ఎక్స్‌పైరీ డేట్ కనిపిస్తోంది.
నేను మార్క్, వ్లాడ్ ను మొదటిసారి కలిసినప్పుడు, వాళ్ళ కమాండర్ నాకొక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చారు. అందులో 17 రకాల ఆహార పదార్ధాలున్నాయి.
జావ కోసం గోధుమ నూక , బీఫ్, బియ్యం, మాంసం సూపు, బీఫ్ స్ట్యూ, కాయగూరలు, చికెన్, పోర్క్, కాయగూరలు, క్రాకర్లు, బిస్కట్లు, టీ బ్యాగులు, కాఫీ, బ్లాక్ కరంట్ డ్రింక్, తేనె, పంచదార, మిరియాలు, చూయింగ్ గం, డార్క్ చాకొలేట్, ప్లాస్టిక్ స్పూన్లు, తుడుచుకునేందుకు న్యాప్కిన్ లు ఉన్నాయి.
యుక్రెయిన్ ధైర్యం ప్రదర్శించడానికి పాక్షికంగా పుతిన్ కారణం అని చెప్పవచ్చు.
2014లో యుక్రెయిన్ సైన్యం దారుణమైన స్థితిలో ఉండేది. రష్యా క్రైమియాను ఆక్రమణ చేసిన సమయంలో యుక్రెయిన్ సేనలు విఫలమయ్యాయి. ఆ సమయంలో యుక్రెయిన్ సేనలు ఆకలితో అలమటించాయి. అవినీతి రాజ్యమేలింది. వారికి సరైన శిక్షణ, యుద్ధ పరికరాలు లేవు. వారికి ఆదేశాలిచ్చే అధికారులూ స్పందించలేదు.
అదే సంవత్సరం మార్క్, వ్లాడ్ ప్రస్తుతం పని చేస్తున్న బెటాలియన్‌ను పునర్వ్యస్థీకరించారు.
దీంతో, యుక్రెయిన్ సైన్యంలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. రష్యాతో పోరాడేందుకు సన్నద్ధమయ్యాయి.
ప్రస్తుతం యుక్రెయిన్‌లో పోరాడుతున్న చాలా మంది సైనికులు తూర్పు దోన్బస్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్న వారే.
దోన్యస్క్, లూహాన్స్ ప్రాంతాల్లో ఉన్న దోన్బస్‌లో యుక్రెయిన్ సేనలు గత 8 సంవత్సరాలుగా యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంటూ వస్తున్నాయి. అక్కడ 2014 నుంచి 2,50,000 - 4,00,000 మంది యుక్రెయిన్ సైనికులు విధులను నిర్వహించారు.
"యుక్రెయిన్ 2014 నాటి దేశం కాదు" అని ఒక కమాండర్ అన్నారు.
యుక్రెయిన్ సైన్యం నైపుణ్యాన్ని సంతరించుకుంది. రష్యా క్రైమియాతోనో, దోన్బస్ ఆక్రమణతోనో ఆగేది కాదని, ఏదో ఒక రోజు రష్యాను ఎదుర్కోక తప్పదని వారికి తెలుసు.
రష్యా 190,000 మంది సైనికులను యుక్రెయిన్‌కు పంపింది. మరో వైపు చెచెన్, సిరియా సైనికులు కూడా తమ సేనలను పెంచుకుంటున్నారు. యుక్రెయిన్ సైన్యంలో 100,000 మంది ఉన్నారు. కానీ, మరింతమందిని సన్నద్ధం చేస్తున్నట్లు కీయెవ్ చెబుతోంది.
యుక్రెయిన్ సేనలు తమ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. "మేము మా దేశం కోసం పోరాడుతున్నాం" అని మార్క్ చెప్పారు.
నగరంలో అనేక చోట్ల రష్యా సైనికులు చనిపోయి పడి ఉన్నారు. మరో వైపు, యుక్రెయిన్ సైనికులు వారి శవాలను తొందరగా పూడ్చిపెడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా మరణించిన వారి సంఖ్యను ప్రకటించలేదు.
"రష్యన్ శవాలను చూస్తుంటే, వారు రష్యన్ల మాదిరిగా లేరు" అని మరొక యుక్రెయిన్ సైనికుడు చెబుతున్నారు. "వారిక్కడెందుకు ఉన్నారో వారికి తెలియదు" అని అన్నారు.
"మాకు చెచెన్లు అంటే భయం లేదు. మాస్కో రెస్టారెంట్లలో ఉన్న రష్యన్ లకు వారంటే భయం" అని ఒక ఖార్కియెవ్ వాసి చెప్పారు.
రష్యన్ సేనలకు తగినంత వేతనాలు లేవని, వారికి స్ఫూర్తి కలిగించేవారు లేరు" అని అమెరికా థింక్ ట్యాంక్ విల్సన్ సెంటర్ కు చెందిన కామిల్ గలీవ్ చెప్పారు.
రష్యాలో సైనికులను విధుల్లోకి చేర్చుకోవడం సమస్యగా ఉంది. పోరాడేందుకు ముందుకొచ్చే యువత చాలా తక్కువ.
ఖార్కియెవ్ లో మంచు నెమ్మదిగా కరుగుతోంది. నేను మార్క్‌తో పాటు ఉన్నాను. ఆయన బూట్లు మట్టిలో కూరుకుపోయాయి. నడవడానికి కష్టంగా ఉంది.
ఈ వాతావరణం రష్యాకు కూడా సానుకూలంగా ఉండకపోవచ్చు. రెండు వారాల క్రితం ఇక్కడ 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలుండగా, ప్రస్తుతం 8 డిగ్రీలుంది. వాహనాలు, కిట్లు, బూట్లు మట్టిలో కూరుకున్నప్పుడు దాడి చేసే వారికి అదొక ఆటంకంగా మారుతుంది.
నగరం చుట్టూ ఉన్న పంట భూములను సంరక్షిస్తున్న వారికి అదొక వరంగా మారుతుంది.
మరో చోట, మరో సైనికుడు కదలికలను విని కాల్పులు చేశారు. అటు వైపు నుంచి ప్రతిస్పందనగా తుపాకీ కాల్పులు వినిపించాయి.
"మనం ముందుకు కదలాలి. ఇక్కడ తగినంత రక్షణ లేదు" వాళ్ళు తప్పకుండా ఫిరంగులతో కాలుస్తారు" అని మార్క్ అన్నారు.
కొన్ని మీటర్ల దూరంలో షెల్స్ దాడి మొదలయింది. గాలిలోకి ధూళి ఎగిరింది. గుండెల్లో దడ పుట్టించేందుకు ఆ షెల్స్ మనకు దగ్గర్లోనే రాలాయి. మా బృందమంతా దగ్గర్లో ఉన్న వాహనం కింద తలదాచుకునేందుకు పరుగు పెట్టాం.
కానీ, మార్క్, వ్లాడ్ మాత్రం తొణకలేదు. ఇక్కడ మొదటి మూడు రోజులు చాలా దారుణంగా ఉంది.
"ప్రస్తుతం చాలా సులభంగా మారింది" అని కమాండర్ చెప్పారు.
ఒక వైపు ఆగకుండా షెల్లింగ్ కొనసాగుతున్నా ఆయన పారిపోరు, పెదవుల పైనున్న సిగరెట్ తీయరు.
మార్క్, వ్లాడ్ టీ బ్రేక్ తీసుకోవడానికి వెళుతూ దారిలో అమెరికా, యూకే సరఫరా చేసిన యాంటీ ట్యాంక్ ఆయుధాలను దాటుతూ వెళ్లారు.
ఈ రెండూ ఈ యుద్ధాన్ని నిర్ణయించే కారకాలు. నేను క్షిపణి దాడి జరిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను.
"యుక్రెయిన్ వైపు అంతా బాగుంది" అని మరొక సైనికుడు చెప్పారు, దేశ భక్తి నిండిన గొంతుతో.
ఒకప్పుడు మా శక్తియుక్తులపై అనుమానాన్ని ప్రదర్శించిన పశ్చిమ దేశాలు మాకు ఆయుధాలు, ఇంటెలిజెన్స్ తో మరింత సహకారం అందించాలి" అని మరొక కమాండర్ అన్నారు.
యుక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సేనలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
రష్యా ఇప్పటికే కీయెవ్‌కు ఉత్తరం వైపున కొన్ని రక్షణ స్థావరాలను ఏర్పరుచుకుంటున్నట్లు నివేదికలొచ్చాయి. అయితే, వారి కదలికలకు కొంత వరకు ఆటంకం కలిగించారు. రష్యా దగ్గర న్యూక్లియర్, రసాయన ఆయుధాలతో పాటు అధునాతన ఆయుధ సంపత్తి కూడా ఉంది. ఖార్కియెవ్ లాంటి నగరాలపై దాడులు చేసే శక్తి కలిగి ఉంది. గతంలో అది గ్రోజ్నీ, సిరియాలపై అదే విధంగా దాడి చేసింది.
అయితే, యుక్రెయిన్ సేనలు మాత్రం అందరి అంచనాలను తిప్పి కొట్టామని భావిస్తూ సంతృప్తికరంగానే ఉన్నాయి.
రోజులు గడుస్తున్న కొలదీ వారు స్వతంత్రంగా వ్యవహరించే తీరు మరింత బలపడుతోంది.
రష్యా ఎక్కడికీ వెళ్లడం లేదు. అలా అని మార్క్, వ్లాడ్‌తో కూడా డజన్ల కొద్దీ యుక్రెయిన్ సైనికులు కూడా ఎక్కడికీ వెళ్లడం లేదు.
చివరి వరకు పోరాడతామని నేను కలిసిన ప్రతి యుక్రెయిన్ సైనికుడు చెబుతున్నారు. అది ఎప్పటి వరకు అయినా సరే.
ఇవి కూడా చదవండి:
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)