నజానిన్ జఘారీ రాట్‌క్లిఫ్: బ్రిటన్ మహిళను ఇరాన్ ఆరేళ్లు జైల్లో ఎందుకు బంధించింది

ఇరాన్ సంతతికి చెందిన బ్రిటన్ పౌరురాలు నజానిన్ జఘారీ రాట్‌క్లిఫ్‌ను ఆరేళ్లపాటు జైల్లో పెట్టిన ఇరాన్ ప్రభుత్వం గత బుధవారం విడుదల చేసింది.

2016లో గూఢచర్యం ఆరోపణల కింద ఇరాన్ ప్రభుత్వం నజానిన్‌ను అరెస్ట్ చేసింది.

ఇరాన్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించడానికి టెహ్రాన్‌లో నజానిన్ కుట్రలు పన్నారని ఇరాన్ అధికారులు ఆరోపించారు. కానీ, ఆమెపై మోపిన అభియోగాలను ఎప్పుడూ బయటకు వెల్లడించలేదు.

నజానిన్ వ్యతిరేకంగా ఆరోపణలు

నజానిన్ ఇరాన్‌లో పర్యటించినప్పుడు విదేశాలకు సంబంధించిన ఒక వ్యతిరేక నెట్‌వర్క్‌కు నేతృత్వం వహించారని ఆ కేసులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చెప్పారు.

నజానిన్ మాత్రం ఆ సమయంలో ఇరాన్ కొత్త సంవత్సరం వేడుకల కోసం తన కూతురు గాబ్రియెలాతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చానని చెప్పారు.

థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్‌తోపాటూ బీబీసీ మీడియా యాక్షన్ కూడా ఆమె ఇరాన్‌లో సెలవులు గడపడానికి వచ్చారని ఒక ప్రకటన జారీ చేశాయి.

నజానిన్ 2021లో పెరోల్ మీద ఉంటూనే తన శిక్షలో ఆఖరి ఏడాది వరకూ టెహ్రాన్‌లోని తన తల్లిదండ్రుల దగ్గర గడిపారు.

కానీ, తర్వాత ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారానికి సంబంధించిన ఒక కేసులో దోషిగా చెబుతూ ఆమెకు ఏడాది జైలు శిక్ష, పర్యటనలపై ఏడాది నిషేధం విధించారు.

ఈ తీర్పును సవాలు చేస్తూ నజానిన్ అపీల్ చేశారు. కానీ, ఆమె అందులో విజయం సాధించలేకపోయారు.

బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ఈ తీర్పును ఖండించారు. నజానిన్ పట్ల జరిగిన క్రూరత్వానికి ఇది దారుణమైన కొనసాగింపుగా చెప్పారు.

అరెస్ట్ ఎప్పుడు, ఎలా జరిగింది

నజానిన్ 2016లో ఇరాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ నుంచి జూన్ వరకూ ఆమెను ప్రశ్నించిన తర్వాత ఏకాంత కారాగారంలో ఉంచారు.

తర్వాత 2016 సెప్టెంబర్‌లో టెహ్రాన్ రెవెల్యూషనరీ కోర్ట్ ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

నజానిన్ ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో ఇరాన్ సుప్రీంకోర్టులో అపీల్ వేశారు. కానీ ఫలితం దక్కలేదు.

ఆ తర్వాత 2018 ఆగస్టులో తన కూతురు గాబ్రియెలాను కలవడానికి ఆమెను మూడు రోజుల పాటు విడుదల చేశారు.

2019 జనవరిలో జైల్లో సరైన మెడికల్ ట్రీట్‌మెంట్ లభించడం లేదని నజానిన్ మూడు రోజులు నిరాహార దీక్ష చేశారు.

ఆ తర్వాత 2019 జూన్‌లో కూడా తనను బేషరతుగా విడుదల చేయాలంటూ ఆమె 15 రోజులు నిరశన దీక్ష చేశారు.

2020 మార్చిలో కరోనా మహమ్మారి వల్ల ఆమెను జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేశారు. అప్పటి నుంచి నజానిన్ టెహ్రాన్‌లోని తన అమ్మనాన్నలతో కలిసి వారి ఇంట్లో ఉండేవారు.

2020 సెప్టెంబర్‌లో మరో కేసులో విచారణ ఎదుర్కోవాలని ఆమెకు చెప్పారు. 2021 ఏప్రిల్లో ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష విధించారు.

దీనిపై నజానిన్ అక్టోబర్‌లో మరోసారి అపీల్ చేశారు. కానీ, మళ్లీ ఆమెకు నిరాశే ఎదురైంది. చివరికి 2022 మార్చిలో నజానిన్ విడుదలయ్యారు.

ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత ఆమె తిరిగి బ్రిటన్ వెళ్తున్నారు.

అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారు

నాజ్నీన్ భర్త రిచర్డ్ రాట్‌క్లిఫ్ చాలా కాలం నుంచీ తన భార్య విడుదల కోసం పోరాడుతున్నారు. ఆమె జైల్లో ఉన్న సమయంలో ఆయన తన కూతురితోపాటూ లండన్‌లోనే ఉన్నారు.

ఇరాన్, బ్రిటన్ మధ్య 1970వ దశకం నుంచీ నడుస్తున్న కొన్ని మిలియన్ పౌండ్ల కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నామని, ఆ సమయంలో తన భార్యకు చెప్పారని నాజ్నీన్ శిక్ష గురించి మాట్లాడిన రిచర్డ్ రాట్‌క్లిఫ్ చెప్పారు.

నాజ్నీన్‌ను జైల్లో ఉంచి ఇరాన్ బ్రిటన్ మీద ఈ కేసు పరిష్కరించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని భావించింది. 1500 చీఫ్టెన్ ట్యాంక్‌ల కొనుగోలు కోసం బ్రిటన్‌కు తాము చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని ఇరాన్ వాదిస్తోంది.

ఇరాన్ 70వ దశకంలో బ్రిటన్ నుంచి 1500 చీఫ్టెన్ ట్యాంకులు కొనుగోలు చేయడానికి ముందస్తు చెల్లింపులు చేసింది.

కానీ, బ్రిటన్ ఈ ట్యాంకులు ఇరాన్‌కు ఇవ్వలేదు. ఆ దేశం ముందుగా చెల్లించిన మొత్తం కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో, బ్రిటన్ తమకు 400 మిలియన్ పౌండ్ల మొత్తం తిరిగి ఇవ్వాలని ఇరాన్ వాదిస్తోంది.

కానీ, బ్రిటిష్ అంతర్జాతీయ ఆంక్షలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని చెల్లించినట్లు నాజ్నీన్ విడుదల గురించి సమాచారం ఇఛ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ చెప్పారు.

ఒమన్ సాయంతో గత కొన్ని నెలలుగా ఇరాన్‌తో చర్చలు జరిపామని, నాజ్నీన్ ఒమన్ మీదుగా బ్రిటన్ తిరిగి వస్తున్నారని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)