రష్యా జర్నలిస్ట్: టీవీ లైవ్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మరీనా ఓవ్‌స్యన్నికోవా ఏమయ్యారు?

టీవీ లైవ్ కార్యక్రమంలో యుక్రెయిన్‌‌పై రష్యా యుద్ధం చెయ్యడానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రష్యా జర్నలిస్టు మరీనా ఓవ్‌స్యన్నికోవా మంగళవారం మాస్కోలోని ఒక న్యాయస్థానంలో కనిపించారు.

న్యాయస్థానం ఆమెకు 30 వేల రూబెల్స్ (సుమారు రూ.21 వేలు) జరిమానా విధించింది. అయితే, ఆమె చానెల్‌లో తెలిపిన నిరసనకు ఈ జరిమానా విధించలేదని, ఆమె రికార్డు చేసి, విడుదల చేసిన వీడియోకు సంబంధించే న్యాయస్థానం ఈ శిక్ష విధించిందని స్వతంత్ర వెబ్‌సైట్ మెదుజా పేర్కొంది.

రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చానెల్ 1 లో ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్న మరీనా ఓవ్‌స్యన్నికోవా.. సోమవారం లైవ్ కార్యక్రమం నడుస్తున్న సమయంలో సెట్‌లో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు. తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

‘‘యుద్ధం వద్దు, యుద్ధాన్ని ఆపండి, ప్రచారాన్ని నమ్మవద్దు, వీళ్లు మీకు అబద్ధాలు చెబుతున్నారు’’ అని ఆ ప్లకార్డుపై రాసి ఉన్నట్లు ఆ కొన్ని సెకన్ల విజువల్స్‌లో స్పష్టంగా తెలుస్తోంది.

ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేక పోతున్నాం అని ఓవ్స్యానికోవా తరపు న్యాయవాది పావెల్ చికోవ్ తొలుత ట్వీట్ చేశారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమెను అరెస్టు చేయడానికి అవసరమైన ఆధారాలు దొరకలేదని ఆయన వెల్లడించారు.

‘అక్రమ ప్రజా కార్యక్రమం’ నిర్వహించినందుకు గాను ఆమెపై అభియోగాలు మోపారు.

పోలీసులు నమోదు చేసిన అభియోగాల ప్రకారం ఈ కేసులో ఆమెకు జరిమానా, సమాజ సేవ లేదంటే పదేళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు.

వాస్తవానికి రష్యా సరికొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆమెపై మరింత తీవ్రమైన అభియోగాలు మోపుతారేమోనన్న ఆందోళనలు కూడా రేకెత్తాయి.

'భయపడవద్దు'

రష్యా ప్రధాన న్యూస్ చానెల్1 రాత్రి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమ సమయంలో.. మరీనా ఓవ్‌స్యన్నికోవా "యుద్ధం వద్దు, యుద్ధాన్ని ఆపండి'' అని నిరసన తెలిపారు.

ఈ సంఘటనకు ముందు ఆమె యుక్రెయిన్‌పై దాడిని ''నేరం'' అంటూనే, క్రెమ్లిన్ గురించి ప్రచారం చేయడానికి పని చేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నానని ఒక వీడియోను రికార్డ్ చేసింది.

''టెలివిజన్‌లో అబద్దాలు చెప్పడానికి, రష్యన్లకు కల్పిత కథలు చెప్పడానికి అనుమతించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. "మేము అతిక్రూరమైన ఈ పాలనను నిశ్శబ్దంగా చూశాము" అని ఆమె వివరించింది.

తన తండ్రి యుక్రేనియన్ అని చెప్పిన మరీనా ఓవ్‌స్యన్నికోవా, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని రష్యన్ ప్రజలకు పిలుపునిచ్చారు, ప్రజలు మాత్రమే ఈ ఉన్మాదాన్ని ఆపగలరని అన్నారు.

''దేనికీ భయపకండి, వాళ్ళు మనందరినీ జైల్లో పెట్టలేరు'' అని ఆమె అన్నారు.

మరీనా ఓవ్‌స్యన్నికోవా తెలిపిన నిరసన గురించి తెలిసినప్పటి నుంచి, యుక్రెయిన్, రష్యా నుండి చాలా మంది ప్రజలు ఆమెకు ఫేస్‌బుక్‌లో ధన్యవాదాలు తెలుపుతున్నారు.

"నిజం చెప్పినందుకు" ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ కూడా ఆమెను ప్రశంసించారు.

కానీ క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆమె చర్యలను పోకిరి చర్యలుగా పేర్కొన్నారు.

రష్యన్ అన్ని ప్రధాన చానెల్స్‌కు స్వతంత్ర దృక్కోణాలు చాలా అరుదు. టెలివిజన్‌లో ప్రసారం అయ్యే వార్తలను చాలా కాలం నుండి ప్రభుత్వం నియంత్రిస్తోంది.

రష్యన్ అధికారిక మీడియా యుద్ధాని ''ప్రత్యేక సైనిక చర్య''గా పేర్కోంటుంది. అదేవిధంగా యుక్రెయిన్ నేతలను దురాక్రమణదారులుగాను, నియో-నాజీలుగాను చిత్రీకరిస్తున్నారు.

ఎకో ఆఫ్ మాస్కో, టీవీ రెయిన్, ఆన్‌లైన్ టీవీ చానెల్‌తో సహా అనేక స్వతంత్ర మీడియా సంస్థలు అధికారుల ఒత్తిడితో ప్రసారం చేయడం, ప్రచురించడం ఆపేశాయి.

నోవాయా గెజిటా వంటి ఇతర వార్తాపత్రికలు, కొత్త సెన్సార్‌షిప్ చట్టాల జోలికి పోకుండా పరిస్థితిని నివేదించడానికి ప్రయత్నిస్తున్నాయి.

బీబీసీతో పాటు విదేశాలకు చెందిన అనేక మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని రష్యాకు చెందిన మీడియా వాచ్‌డాగ్ ఒకటి ఆరోపించింది.

అనేక సోషల్ మీడియా సైట్‌లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండే వార్తా సంస్థలను మరింత పరిమితం చేసింది.

చాలా రోజులుగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్ సేవలను కూడా పరిమితం చేసింది. రష్యాలో మంచి జనాదరణ పొందిన ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ప్రభుత్వం సోమవారం బ్లాక్ చేసింది. అయినప్పటికీ చాలా మంది రష్యన్‌లు ఆంక్షలకు వేరే మార్గాలను కనుగొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)