రష్యా యుద్ధం యుక్రెయిన్‌తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?

    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముసుగులు లేవు, సాకులు లేవు, ప్రస్తుతానికి దౌత్యం విఫలమైంది. రష్యా, యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడికి దిగింది. యుక్రెయిన్ మనుగడ కోసం పోరాడుతోంది.

ఇకపై ఏం జరగుతుంది?

దీని వల్ల రష్యాకు దొరికే అతిపెద్ద బహుమతి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్క్సీ పదవి, రాజధాని కీయెవ్ నగరం. ఇప్పటికే ఈ నగరంలో యుద్ధం ప్రారంభమైంది.

పాశ్చాత్య అనుకూల పొరుగు దేశాన్ని తిరిగి తమతో కలుపుకునేందుకు తన రక్షణ యంత్రాంగం తయారుచేస్తున్న ప్రణాళికలను రష్యా అధ్యక్షుడు పుతిన్ నెలల తరబడి అధ్యయనం చేశారన్నది స్పష్టమవుతోంది.

ఉత్తరం, తూర్పు, దక్షిణం మూడు వైపుల నుంచి దాడి చేయాలన్నది ప్రణాళికలో భాగం. ట్యాంకులు, పదాతి దళాన్ని నడిపించే ముందే ప్రతిఘటనను తగ్గించడానికి ఫిరంగి, క్షిపణి దాడులు చేయడం కూడా ఇందులో భాగం.

జెలియెన్క్సీ ప్రభుత్వం వీలైనంత త్వరగా లొంగిపోయేలా చేయడమే రష్యా వ్యూహం. పుతిన్ కోరుకునేది అదే. ఆ తరువాత, రష్యా అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పరచవచ్చు.

జాతీయ స్థాయిలో యుక్రెయిన్ ప్రతిఘటన పెరగకుండా అడ్డుకోవడం రష్యా లక్ష్యం కావొచ్చు.

"స్వల్ప కాలంలో, రష్యా కీయెవ్‌ను స్వాధీనం చేసుకోవడం సైనిక, రాజకీయ విజయం అవుతుంది. వ్యూహాత్మకంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. కానీ, యుక్రెనియన్ ప్రభుత్వాన్ని నాశనం చేయకపోవచ్చు. ఎందుకంటే, ఆ దేశంలోని పశ్చిమ ప్రాంతంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రష్యా ప్రణాళిక సిద్ధం చేసింది" అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు చెందిన బ్రిగ్ బెన్ బారీ అన్నారు.

అయితే, రష్యా దండయత్ర అనుకున్నట్లు సాగట్లేదు. యుక్రెయిన్ నుంచి ప్రతిఘటన బలంగా ఉందని, వందలాది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చెబుతోంది. అయినప్పటికీ, రష్యా ముందుకు వెళుతోంది.

రష్యన్ బలగాలు, యుక్రెయిన్ బలగాలకన్నా మూడు రెట్లు ఎక్కువ. యుక్రెయిన్ సైనిక నాయకత్వం ఎంత బలమైనది, దాని బలగాలు ఎంతకాలం నిలదొక్కుకోగలవు అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

యుక్రెయిన్ ప్రతిఘటన

ఇప్పటికే యుక్రెయిన్‌లో ప్రతిఘటన మొదలైంది. సైన్యం గట్టిగా పోరాడుతోంది. అదనంగా, పోరాడే వయసులో ఉన్న వ్యక్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కీయెవ్ పౌరులకు 18,000 ఆటోమేటిక్ ఆయుధాలు అందజేశారు.

యుక్రెయిన్ తరువాత పుతిన్ తమ వైపు దృష్టి సారించవచ్చని భయపడుతున్న కొన్ని తూర్పు ఐరోపా దేశాలు తమ సరిహద్దులకు సమీపంలో రష్యన్ బలగాల కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

యుక్రెయిన్‌కు మరింత సైనిక సహాయం అందించడం కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఎస్టోనియా రక్షణ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి కుస్తీ సాల్మ్ ఒకరు.

"మనం వారికి జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులు, పేలుడు సామగ్రి, రక్షణ సామగ్రి వంటి ఆయుధాలను అందించాలి. ప్రతి నాటో దేశం వారికి సహాయం చేయాలి" అని ఆయన అన్నారు.

సుమారు నాలుగు కోట్ల జనాభా కలిగిన యుక్రెయిన్‌ను ఓడించడానికి రష్యా ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే, దానికి అన్ని సమస్యలు పెరుగుతాయి.

సొంత దేశంలో ప్రతిపక్షం నోరు నొక్కేసిన పుతిన్, పొరుగు దేశం బెలారస్‌లో గత రెండేళ్లల్లో నిరసనలను ఎలా సమర్థవంతంగా అణిచివేశారో గమనించే ఉంటారు. పోలీసులు నిరసనకారులను చుట్టుముట్టి, జైల్లో పడేశారు. నిర్బంధంలో వాళ్లని చిత్రహింసలు పెట్టారు. ఇది నిరసనకారులను భయపెట్టింది. ప్రతిఘటన ముందుకు సాగకుండా నిరోధకంగా పనిచేసింది.

"రష్యా తీవ్రమైన అణచివేత చర్యలకు పూనుకుంటుంది. డిజిటల్‌గా మెరుగైన నిఘా ఉపకరణాలను వాడుతుంది. తిరుగుబాటుకు సహకరించిన దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా బెదిరించగలదు" అని బ్రిగ్ బెర్రీ అభిప్రాయపడ్డారు.

నాటో ఏం చేస్తోంది?

నాటో ఉద్దేశపూర్వకంగా యుక్రెయిన్‌లోకి అడుగుపెట్టట్లేదు. పశ్చిమ దేశాలు తమకు సహాయం అందించాలని కీయెవ్ ఎంత కోరినా, యుక్రెయిన్‌కు దళాలను పంపడాన్ని నాటో నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

ఎందుకు?

యుక్రెయిన్ నాటో కూటమిలో లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే రష్యాతో యుద్ధానికి నాటో సిద్ధంగా లేదు.

ఒకవేళ రష్యా యుక్రెయిన్‌లో దీర్ఘకాలం తిష్ట వేస్తే, అప్పుడు పశ్చిమ దేశాలు యుక్రెయిన్ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వగలవని భావిస్తూ ఉండవచ్చు. 1980లలో అమెరికా, అఫ్గాన్ ముజాహిదీన్లకు మద్దతు ఇచ్చినట్టే.

ప్రస్తుతానికి, నాటో తూర్పు యూరప్‌లోని తమ సభ్య దేశాల సరిహద్దులకు కాపలా పెంచింది.

విచిత్రం ఏమిటంటే నాటో దళాలు తూర్పు యూరప్‌లో విస్తరించకూడదన్నది పుతిన్ వాదన. కానీ, తాజా రష్యా దాడితో దానికి విరుద్ధంగా జరుగుతోంది. నాటో దళాలు తూర్పు యూరప్‌లోకి మరింత చొచ్చుకుని వస్తున్నాయి.

"ఇది యూరప్‌కు పెద్ద మేలుకొలుపు. మూడు దశాబ్దాల శాంతికి తెర పడింది. నిరంకుశత్వాన్ని ఎదుర్కోవాలంటే మనం పెద్ద స్థాయిలో సన్నాహాలు చేసుకోక తప్పదు" అని బ్రిటన్ పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ ఛైర్మన్, ఎంపీ టోబియాస్ ఎల్‌వుడ్ అన్నారు.

పరిస్థితులు ఇంతకంటే దిగజారుతాయా?

యుక్రెయినియన్లకు ఇది దాదాపుగా ఘోరమైన పరిస్థితే. తూర్పు యుక్రెయిన్‌లో రష్యా మద్దతుతో విజృంభిస్తున్న వేర్పాటువాదులతో ఎనిమిదేళ్ల పాటు పోరాటం చేసిన తరువాత, చివరికి ఆ ప్రాంతమంతా బాంబులు, కాల్పులతో నిండిపోవడం చూస్తున్నారు.

రష్యా నుంచి విముక్తి కోరుకుని, 1991లో స్వతంత్రం సాధించుకున్న యుక్రెయినియన్లకు, కాలం మూడు దశాబ్దాలు వెనక్కి తిరిగినట్టు అనిపిస్తూ ఉండవచ్చు.

అయితే, ఇప్పుడు ప్రపంచ నేతలను వేధిస్తున్నది ఒకటే ప్రశ్న.. యుక్రెయిన్ తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం చేస్తారు? ఆయన మెదడులో ఎలాంటి ఆలోచనలున్నాయి?

2021 జులైలో పుతిన్ సుదీర్ఘ ప్రసంగాన్ని నాటో రక్షణ ప్రముఖులు పునఃపరిశీలించారు. ఫలితంగా, యుక్రెయిన్ తరువాత పుతిన్ కన్ను పోలాండ్, లిథువేనియా, లాట్ యా, ఎస్టోనియా వంటి దేశాలపై పడకుండా ముందు జాగ్రత్తగా తూర్పు యూరప్ సరిహద్దులకు రక్షణ పెంచాలనే నిర్ణయానికొచ్చారు.

ఆ పని పుతిన్ చేస్తారా?

"అలాంటి ఉద్దేశాలు పుతిన్‌కు ఉన్నాయని అనుకోను. కానీ, 'సబ్-థ్రెష్‌హోల్డ్ వార్‌ఫేర్'లో భాగంగా సమస్యలు సృష్టించడానికి నాన్-యూనిఫాం దళాలను పంపితే, బాల్కన్స్‌కు కూడా ఇది వ్యాపిస్తుందేమోననే ఆందోళనగా ఉంది" అని టోబియాస్ ఎల్‌వుడ్ అన్నారు.

నాటో కచ్చితంగా అలాంటిది జరిగే అవకాశం ఇవ్వదు. అందుకే 100 కంటే ఎక్కువ యుద్ధవిమానాలను అప్రమత్తం చేసింది. తొలుత ఎస్టోనియాకు బలగాలను పంపించిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. అయితే, అవేమి సాధిస్తాయన్నదానిపై కుస్తి స్లామ్‌కు నమ్మకం లేదు.

"ఎస్టోనియాలోని బ్రిటన్ బలగాలు ఒంటరిగా ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన అణు దేశాన్ని నిలువరించగలవని ఎవరూ భావించట్లేదు. అయితే, పెద్ద పెద్ద నాటో దేశాలను అప్రమత్తం చేసేందుకు ఇది పనికొస్తుంది" అని ఆయన అన్నారు.

ఇటీవల వరకూ, రష్యా నాటో దేశాల్లోకి చొరబడగలదన్న ఊహ కూడా ఎవరికీ రాలేదు.

ఇప్పటికీ, నాటో, రష్యా ముఖాముఖి యుద్ధానికి దిగితే తప్ప, నాటో సభ్య దేశాల్లోకి రష్యా చొరబడకపోవచ్చు.

అది ఇంతవరకు జరగలేదు. కఠినమైన ఆర్థిక ఆంక్షలు, ఉమ్మడి, సంఘటిత చర్యలతో రష్యాకు తమ సందేశం అందే ఉంటుందని, ఎలాంటి కయ్యానికీ కాలు దువ్వదని పశ్చిమ దేశాల నాయకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)