యుక్రెయిన్ సంక్షోభం: 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్‌వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?

    • రచయిత, రసెల్ హాటెన్
    • హోదా, బిజినెస్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా సులభతర నగదు లావాదేవీలలో కీలకమైన స్విఫ్ట్ పేమెంట్ నెట్‌వర్క్ నుంచి రష్యాను వెలివేయడంలో పాశ్చాత్య దేశాలు విఫలమైతే ఆ పాపం వారిని అంటుకుంటుందని యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి అన్నారు.

ఈ మేరకు యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి దిమిత్రో కులేబా ట్వీట్‌ చేశారు. ''రష్యాను స్విఫ్ట్ నుంచి వెలియవేయడానికి వెనుకాడుతున్న వారంతా ఒక విషయం అర్థం చేసుకోవాలి. రష్యాను వెలివేయకపోతే యుక్రెయిన్‌లోని అమాయక చిన్నారులు, ఆడామగా అందరి రక్తం వారి చేతికీ అంటుకుంటుంది'' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బ్రిటన్, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియాల విదేశీ వ్యవహారాల మంత్రులు ఈ విషయంలో కులేబాకు మద్దతు పలికారు. అయితే, ఇతర పలు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై అలాంటి చర్యలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి.

ఇంతకీ స్విఫ్ట్ అంటే ఏమిటి?

సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ (స్విఫ్ట్) అనేది ఒక అంతర్జాతీయ నగదు లావాదేవీల వ్యవస్థ. వివిధ దేశాల మధ్య నగదు లావాదేవీలు సాఫీగా, వేగంగా జరిగేలా తోడ్పడుతుంది.

దీన్ని 1973లో బెల్జియం కేంద్రంగా ఏర్పాటు చేశారు. 200కి పైగా దేశాలకు చెందిన 11 వేల బ్యాంకులు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయి.

అయితే, స్విఫ్ట్ మీకు సాధారణంగా కనిపించే బ్యాంకుల్లాంటిది కాదు. ఖాతాలోకి నగదు వచ్చినప్పుడు, డెబిట్ అయినప్పుడు వినియోగదారుడికి సమాచారం పంపించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టమ్ ఇది.

ప్రభుత్వాలు, సంస్థల మధ్య జరిగే లక్షల కోట్ల డాలర్ల నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు 4 కోట్లకు పైగా సందేశాలను స్విఫ్ట్ పంపిస్తుంది.

ఇందులో 1 శాతం కంటే ఎక్కువ రష్యా సంబంధిత చెల్లింపులవే ఉంటాయి.

ఈ నెట్‌వర్క్ నుంచి రష్యాను తప్పించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

వేల బ్యాంకులు ఉపయోగించే ఈ నెట్‌వర్క్ నుంచి రష్యాను తప్పించడం వల్ల ఆ దేశంలోని బ్యాంకింగ్ నెట్‌వర్క్ గతి తప్పడమే కాకుండా నిధుల యాక్సెస్ కూడా దెబ్బతింటుంది.

అయితే, రష్యాను దీన్నుంచి వెలివేయడం వల్ల ఆ ప్రభావం తమ దేశంలోని బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపైనా పడుతుందని అనేక దేశాలు భయపడుతున్నాయి.

ఉదాహరణకు.. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఈ ప్రభావడం పడుతుంది. నగదు లావాదేవీల నెట్‌వర్క్‌ నుంచి రష్యాను నిషేధిస్తే ఇంధన కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడుతుంది.

రష్యాను స్విఫ్ట్ నుంచి నిషేధించాలని బ్రిటన్ పిలుపునిచ్చినప్పటికీ ఆ దేశ రక్షణ మంత్రి మాత్రం ''స్విఫ్ట్ వ్యవస్థ మా నియంత్రణలో లేదు. ఇదేమి ఏకపక్ష నిర్ణయం కాదు'' అని అసలు విషయం చెప్పారు.

మరోవైపు జర్మనీ ఇలాంటి నిషేధం వద్దంటున్నట్లు చెబుతున్నారు.

ఇక ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి, డచ్ ప్రధాని కూడా ఇలాంటి నిషేధం చివరి ఆప్షన్‌గా మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

స్విఫ్ట్ నుంచి రష్యాను నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని.. మిగతా అన్ని యూరప్ దేశాలు ఈ నిషేధానికి అనుకూలంగా లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

స్విఫ్ట్‌ ఎవరి నియంత్రణలో ఉంటుంది?

అమెరికా, యూరప్ బ్యాంకులు కలిసి స్విఫ్ట్ ఏర్పాటుచేశాయి. ఏదైనా సంస్థ సొంతంగా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి గుత్తాధిపత్యం సాధించరాదన్న ఉద్దేశంతో ఇవన్నీ కలిసి స్విఫ్ట్‌ను ఏర్పాటు చేశాయి.

ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ 2వేల కంటే ఎక్కువ బ్యాంకులు, ఆర్థిక సంస్థల యాజమాన్యంలో ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సహా ప్రపంచంలోని ప్రధాన సెంట్రల్ బ్యాంకుల భాగస్వామ్యంతో నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం దీన్ని నిర్వహిస్తోంది.

సభ్య దేశాలకు అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేయడంలో స్విఫ్ట్ తోడ్పడుతుంది. వివాదాలు ఏర్పడినప్పుడు ఇది నిష్పాక్షికంగా వ్యవహరిస్తుంది.

అణు కార్యక్రమం నేపథ్యంలో ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌ను 2012 నుంచి స్విఫ్ట్ నుంచి బహిష్కరించారు. ఈ నిషేధం వల్ల ఇరాన్ తన చమురు ఆదాయం, విదేశీ వాణిజ్యంలో 30 శాతం కోల్పోవాల్సి వచ్చింది.

ఆంక్షల విషయంలో తమ ప్రభావం ఏమీ ఉండదని.. ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి స్విఫ్ట్ పనిచేస్తుందని చెబుతోంది.

స్విఫ్ట్ నుంచి రష్యాను నిషేధిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది?

రష్యా కంపెనీల చమురు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

రష్యాపై నిషేధం విధించినట్లయితే బ్యాంకులు ఒకదాంతో మరొకటి నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది... దీనివల్ల లావాదేవీలలో ఆలస్యంతో పాటు అదనపు ఖర్చులు తప్పనిసరై రష్యాకు ఆదాయం తగ్గొచ్చు.

ఇంతకుముందు క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా రష్యాను స్విఫ్ట్ నుంచి నిషేధిస్తామని బెదిరించారు. అయితే, అది యుద్ధ ప్రకటనతో సమానమని రష్యా అప్పట్లో పేర్కొంది.

రష్యా అలా చెప్పడంతో పాశ్చాత్య దేశాలు వెనక్కు తగ్గాయి. అంతేకాదు... పాశ్యాత్య దేశాల బెదిరింపుల తరువాత రష్యా సొంతంగా ఒక కొత్త ఆర్థిక లావాదేవీల వ్యవస్థ అభివృద్ధి చేసుకుంది.

మీర్ అని పిలిచే నేషనల్ పేమెంట్ కార్డ్ సిస్టమ్‌ను ప్రస్తుతం రష్యాతో పాటు మరికొన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయి.

స్విఫ్ట్‌ విషయంలో పాశ్చాత్య దేశాలు ఎందుకు విడిపోయాయి?

స్విఫ్ట్ నుంచి రష్యాను నిషేధిస్తే ఆ దేశానికి వస్తువులు విక్రయించే, ఆ దేశం నుంచి కొనుగోలు చేసే ఇతర దేశాల కంపెనీలకు నష్టం తప్పదు. ప్రధానంగా జర్మనీ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

యూరోపియన్ యూనియన్ దేశాలకు చమురు, సహజ వాయువు ఎక్కువగా రష్యా నుంచే వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయం వెతుక్కోవడం ఆయా దేశాలకు అంత సులభం కాదు.

అంతేకాదు... రష్యా నుంచి చెల్లింపులు జరగాల్సిన కంపెనీలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదంతా అంతర్జాతీయంగా బ్యాంకింగ్ గందరగోళాన్ని సృష్టిస్తుంది.

ఇక ఈ నిషేధం వల్ల రష్యా ఆర్థిక వవ్యస్థకు 5 శాతం నష్టం కలగొచ్చని ఆ దేశా మాజీ ఆర్థిక మంత్రి అలెక్సీ కుర్దిన్ అన్నారు.

మరోవైపు అమెరికా కూడా ఇలాంటి నిషేధం వల్ల ఇతర దేశాలు, ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడతాయన్న ఉద్దేశంతో వేరే ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది.

కాగా రష్యాను స్విఫ్ట్ నుంచి నిషేధించాలంటే అనేక దేశాల ఆమోదం అవసరం. కానీ, ఈ నిషేధం వల్ల రష్యాతో పాటు తమ దేశాలూ ప్రభావితమవుతాయన్న భయంతో చాలా దేశాలు నిషేధానికి మద్దతివ్వడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)