You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తోందా
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్
ప్రస్తుతం యుక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఎంత ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ ఇప్పటివరకు నాటో బలగాలు, రష్యా ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు. అమెరికా, బ్రిటన్ ఎంత అసంతృప్తితో ఉన్నప్పటికీ రష్యా మాత్రం యుక్రెయిన్‌ను ఆక్రమించే దిశగా తన బలగాలను పెంచుకుంటూ పోతోంది.
అమెరికా, రష్యా పరస్పరం కాల్పులకు దిగితే అది ప్రపంచ యుద్ధమేనని జనవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ యుక్రెయిన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా బలగాలను పంపబోనని స్పష్టం చేశారు.
మరి ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత తీవ్ర యుద్ధానికి దారి తీస్తాయా? రష్యా తన దాడులను ఇంకా ముమ్మరం చేస్తుందా? ఇది యుక్రెయిన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణి దాడులకు దిగిందని బీబీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24 ఉదయం ఐదారు పేలుళ్లు వినిపించాయని చెప్పారు.
అయితే రష్యా.. నాటో సభ్య దేశాలను భయపెడితే మాత్రం ప్రమాదం తప్పకపోవచ్చు.
నాటోలో చేరాలనుకుంటున్న యుక్రెయిన్, వ్యతిరేకిస్తున్న రష్యా
నాటోలోని ఆర్టికల్ 5 ప్రకారం... నాటో సభ్య దేశాల్లోని ఏ దేశంపై దాడి జరిగినా మొత్తం అన్ని దేశాలు కలసి దాన్ని ఎదుర్కోవాలి. యుక్రెయిన్ ప్రస్తుతం నాటో సభ్యదేశం కాదు. కానీ తాము నాటోలో చేరాలనుకుంటున్నామని యుక్రెయిన్ చెప్పింది. దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఒకప్పటి సోవియెట్ యూనియన్‌లో భాగమైన ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, పోలండ్ ఇప్పుడు నాటోలో సభ్యులుగా ఉన్నాయి. అయితే, రష్యా ఆక్రమణ యుక్రెయిన్‌తో ఆగకపోవచ్చని ఈ దేశాలు కూడా ఆందోళనగా ఉన్నాయి. అందుకే ఇటీవల నాటో తమ బలగాలను ఈ ప్రాంతాలకు పంపించింది.
నాటో దళాలు, రష్యా బలగాలు నేరుగా తలపడనంత కాలం యుక్రెయిన్‌లో పరిస్థితి ఎంతగా దిగజారినా అది ప్రపంచయుద్ధానికి దారితీసే అవకాశాలు లేవు. కానీ, అమెరికా, రష్యాల దగ్గర 8000కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆందోళన పెరుగుతోంది.
నాటోతో యుద్ధానికి పుతిన్ సిద్ధంగా లేరు, ఆయన లక్ష్యం యుక్రెయిన్‌ను కూడా బెలారుస్‌లాగా ఓ సామంత దేశంగా మార్చుకోవడమేనని ఓ సీనియర్ బ్రిటిష్ మిలిటరీ అధికారి తెలిపారు. పుతిన్ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదని ఆయనన్నారు. ఫిబ్రవరి 21న ఆయన ప్రసంగం చూస్తే ఓ వ్యూహకర్త కన్నా కూడా ఆగ్రహంతో స్పందించే నియంతలా కనిపించారని వ్యాఖ్యానించారు.
రష్యా నుంచి వేరుగా సార్వభౌమాధికార దేశంగా ఉండడానికి యుక్రెయిన్‌కు హక్కు లేదని పుతిన్ అన్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే రష్యా దీనిపై కచ్చితంగా ప్రతిస్పందిస్తుంది.
ఆ ప్రతీకారం సైబర్ దాడుల రూపంలో కూడా ఉండొచ్చని నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఇప్పటికే హెచ్చరించింది. బ్యాంకులు, వ్యాపార సంస్థలు, వ్యక్తులే కాదు, ప్రభుత్వ సంస్థలు కూడా ఈ దాడులకు లక్ష్యంగా మారొచ్చు.
ఇప్పటికే చాలా సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు, రష్యా మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. అందుకే ప్రస్తుత యుక్రెయిన్ సంక్షోభానికి బాధ్యులు ఎవరు అనేది చెప్పడం కష్టం.
ఇవి కూడా చదవండి:
- దుబాయ్‌లో 13 రోజుల సహవాసం, మాల్దీవుల్లో, మెక్సికోలో డేటింగ్, ఇండియాలో పెళ్లి
- కస్తూర్బా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి
- యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై భద్రతామండలి అత్యవసర సమావేశం: భారత్, చైనా ఏమన్నాయంటే..
- లఖీంపుర్ ఖీరీ: ‘ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా మంచిదే కానీ మాకు న్యాయం కావాలి’
- తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)