డేటింగ్ యాప్స్: దుబాయ్‌లో 13 రోజుల సహవాసం, మాల్దీవుల్లో, మెక్సికోలో డేటింగ్, ఇండియాలో పెళ్లి

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీకి చెందిన పుపుల్ పచౌరికి 29 ఏళ్లు. కెనడాకు చెందిన రోహన్ వయసు 36 సంవత్సరాలు. వారిద్దరికీ డేటింగ్ యాప్‌లో జరిగిన పరిచయం ప్రేమగా మారింది.

జులై 16న యాప్‌లో సంభాషణ మొదలుపెట్టి, నవంబరు 16 నాటికి దుబాయ్‌లో కలుసుకుని, మాల్దీవులు, మెక్సికోకు డేటింగ్‌కు వెళ్లి, చివరకు దిల్లీలో డిసెంబరు 2021లో పెళ్లి చేసుకున్నారు.

తొలి పరిచయం..

"రోహన్‌ను కలిసేందుకు దుబాయి వెళ్లే విమానం ఎక్కగానే, ఒక ఉద్విగ్నత ఆవరించింది. ఒక డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు మరో పరాయి దేశం వెళ్ళబోతున్నాను. నా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. తీరా కలిసిన తర్వాత ఇద్దరికీ స్వభావాలు నచ్చకపోతే? చాలా ప్రశ్నలు చుట్టుముట్టాయి".

"నేను రోహన్ కంటే 3 గంటల ముందే ఎయిర్ బి‌ఎన్‌బి‌కి చేరుకున్నాను. రోహన్ అడుగుల చప్పుడు, తలుపు దగ్గరే ఒక 5 నిమిషాలు ఆగిపోయిన సమయం నాకింకా గుర్తుంది" అంటూ పుపుల్ తన ప్రేమ కథను బీబీసీకి వివరించారు.

రోహన్ పరిచయమెలా జరిగింది?

కోవిడ్ లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉంటూ సరదాగా డేటింగ్ చేద్దామనుకుని 'దిల్ మిల్' అనే యాప్‌లో ప్రొఫైల్ తయారు చేసుకున్న పుపుల్ అందులో రోహన్ ప్రొఫైల్ చూసి ఆకర్షితులయ్యారు.

ఈ యాప్‌లో వివిధ దేశాల్లో స్థిరపడిన దక్షిణాసియాకు చెందిన వ్యక్తులుంటారు. డేటింగ్ మాత్రమే కాకుండా వివిధ అంశాల పై చర్చించుకునే భిన్నాభిప్రాయాలకు చెందిన వ్యక్తులు కూడా అందులో ఉంటారు.

"నీ ప్రొఫైల్ నా ప్రతిబింబంలా అనిపించి ఇష్టపడ్డాను" అని అంటూ రోహన్ పుపుల్‌కి మెసేజ్ చేశారు.

చూపులు కలిసాయి. మాటలు మొదలయ్యాయి. ఫోన్ నంబర్లు షేర్ చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు మాట్లాడుకున్నారు. అభిప్రాయాలు పంచుకున్నారు.

ఒక వైపు లాక్ డౌన్, దేశాల మధ్య దూరం...కానీ, టెక్నాలజీ వారి దూరానికి వారధి వేసింది.

"డేటింగ్ యాప్ అనగానే కొన్ని భయాలుంటాయి. అపరిచితులు మోసం చేస్తారనే సందేహం ఉంటుంది. స్టీరియోటైప్ ఆలోచనలుంటాయి. దాంతో, గత పదేళ్లుగా నేను ఎవరికీ చేరువ కాలేదు" అని పుపుల్ అన్నారు.

దిల్ మిల్ యాప్‌లో నా సోషల్ సర్కిల్‌లో తెలిసిన వాళ్లుండరు అనే ధైర్యంతో ప్రొఫైల్ తయారు చేసినట్లు తెలిపారు.

"మాటల నేపథ్యంలో రోహన్‌కు విస్తృతమైన డేటింగ్ చరిత్ర ఉందని తెలిసింది. ప్రతీ 3 - 4 నెలలకొకసారి ఒక గర్ల్ ఫ్రెండ్ మారుతూ ఉండేవారని తెలిసింది. ఈ విషయాలన్నీ ఆయనే నాతో చెప్పారు. ఆయన నిజాయితీకి ప్రేమలో పడ్డాను" అని అంటారు పుపుల్.

ఇద్దరి మధ్యా ఫేస్‌టైం కాల్స్ పెరిగాయి. వారి సంభాషణలు ఒక గంట నుంచి 6-7 గంటల వరకు పెరిగాయి. ఇద్దరూ కలుసుకోవాలనుకున్నారు. మరో వైపు కోవిడ్ వల్ల విమాన సర్వీసులు పూర్తిగా పునరుద్ధరణ అవ్వలేదు.

ఒక రోజు రోహన్ అమ్మ ఫేస్ టైం లోకి వచ్చి, "ఇలా సమయం వృథా చేయకండి. ఇద్దరూ కలిసి బ్రతకాలని అనుకుంటే, మీరు కలుసుకుని ఒక నిర్ణయానికి రండి" అని సలహా ఇచ్చినట్లు పుపుల్ తెలిపారు.

జులై 2020లో వారి పరిచయం జరిగింది. ఆగస్టు నాటికి కలవాలనిపించేలా చేసింది. దీంతో, వీరిద్దరూ నవంబర్‌లో దుబాయ్‌లో కలుసుకోవాలని అనుకున్నారు.

13 రోజుల సహజీవనం

"ఇద్దరు అపరిచితులు, కొత్త ప్రదేశం, కొత్త దేశం... ఒక రెండు రోజులు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. మద్యం సేవిస్తూ కళ్ళతోనే సంభాషించుకున్నాం."

"ఇద్దరం కలిసి బ్రతకగలమో లేదో చూడాలనుకున్నాం. కలిసి వంట చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం లాంటి పనులు చేశాం."

13 రోజుల సహవాసం తర్వాత పుపుల్, రోహన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, వారి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు.

ఇంట్లో వారి నిర్ణయానికి సమ్మతి లభించింది. ఎదురు చూపులు మొదలయ్యాయి.

మాల్దీవుల్లో ప్రతిపాదన

"రోహన్ కు జీవితం పట్ల చాలా స్పష్టత ఉంది. దూరంగా ఉండటం చాలా కష్టమనిపించింది. కానీ, మా మధ్య ప్రేమ మాత్రం పెరుగుతూ వచ్చింది. 9 నెలల తర్వాత ఆగస్టు 2021లో మాల్దీవుల్లో రోహన్ మా తల్లితండ్రులను కలిసి నన్ను పెళ్లి చేసుకుంటాననే ప్రతిపాదన చేశారు. అక్కడ మరో 14 రోజులు ఇద్దరం కలిసి గడిపాం" అని పుపుల్ చెప్పారు.

ఆ తర్వాత మెక్సికోలో జరిగిన రోహన్ స్నేహితుడి వివాహానికి వెళ్లి, అక్కడ రోహన్ తల్లిని, స్నేహితులను కలిసి మరో రెండు వారాలు ఇద్దరూ మెక్సికోలో గడిపారు.

భారతదేశంలో పెళ్లి

చివరకు పెద్దల అంగీకారంతో డిసెంబరు 2021లో పుపుల్, రోహన్‌ల పెళ్లి జరిగింది.

"సంస్కృతి సంప్రదాయాల విషయంలో, పెద్దలను ఒప్పించడంలో పెద్దగా ఇబ్బందులు రాలేదు. ప్రేమ మాత్రమే మా బంధానికి పునాది" అని పుపుల్ పచౌరి అన్నారు.

డేటింగ్ యాప్‌ల ద్వారా ఏర్పడిన సంబంధాలను నిర్ణయాలను తల్లితండ్రులు వెంటనే ఆమోదిస్తారా?

"నేనైతే మా అమ్మాయి నిర్ణయం విని చాలా ఆనందపడ్డాను" అని పుపుల్ తల్లి ఇళా పచౌరి అన్నారు.

"నేను నా కూతురును స్వతంత్రంగా పెంచాను. సంబంధం అంటే జీవితకాలానికి సంబంధించింది అనే విషయం మా అమ్మాయికి తెలుసు. ఆమె నిర్ణయం ఆమెకు, కుటుంబానికి కూడా మంచిదని అనిపించింది. మేము మాల్దీవులకు వెళ్ళినప్పుడు రోహన్ మా దగ్గరకు వచ్చి మా అమ్మాయి చేతిని అడిగాడు. ఆ ప్రవర్తన మమ్మల్ని చాలా ఆకర్షితులను చేసింది" అని ఆమె అన్నారు.

డేటింగ్ యాప్స్ ఒక వేదిక మాత్రమే

డేటింగ్ అన్నది కొత్తదేమీ కాదు. డిజిటల్ యుగానికి ముందు పక్కింట్లో, కాలేజీలో వ్యక్తులతో జరిగే విషయమే వర్చువల్ వేదికల్లోకి మారి డేటింగ్ అనే పేరును సంతరించుకుంది. గతంలో ఊళ్లోని మనుషుల మధ్య జరిగేవి ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు దాటి జరుగుతున్నాయని అంటారొక మాజీ జర్నలిస్ట్. ఆమె ప్రస్తుతం ఒక గృహిణిగా ఉన్నారు.

"వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టా, మెసెంజర్‌లో ఒక ముసుగులో జరిగే డేటింగ్, చాటింగ్, డేటింగ్ యాప్స్‌లో ముసుగు లేకుండా జరుగుతోంది. ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది. మోసం ఎక్కడైనా జరగవచ్చు. ఒక్క డేటింగ్ యాప్స్‌లోనే జరగాలని లేదు" అని అన్నారు.

"డేటింగ్ యాప్స్ లేని కాలంలో కూడా అమ్మాయిలను మోసం చేయడం, ప్రేమించి వదిలేయడం లేదా కొన్ని సార్లు సెక్స్ ట్రాఫికింగ్ కోసం అమ్మాయిలను అమ్మేసిన వార్తలు విన్నాం కదా" అని ప్రశ్నించారు.

తెలుగబ్బాయి - మరాఠీ అమ్మాయి

"ఆయన తెలుగబ్బాయి, నేను మహారాష్ట్రకు చెందిన అమ్మాయిని. నేను క్రైస్తవురాలిని. ఆయన హిందూ. నేను షార్ట్ స్కర్ట్స్ వేసుకుంటాను. వాళ్ళింట్లో సంప్రదాయ తరహా దుస్తులు ధరిస్తారు. మేమిద్దరం ఐల్ అనే డేటింగ్ యాప్ లో కలిసాం" అని హైదరాబాద్ కు చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ డిలోరిస్ చెప్పారు.

వీరి పరిచయం పెళ్లిగా మారడం అంత సాఫీగా సాగలేదు. మతాలు, రాష్ట్రాలు, సంస్కృతి వారి మధ్య కొన్ని ఆటంకాలు సృష్టించింది.

"నాకు ఆయన పరిచయం అయిన ఆరు నెలల వరకు తనకు అంతకు ముందే పెళ్ళయిందనే విషయాన్ని, ఒక కూతురు కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టలేదు."

"దీంతో మా మధ్య కొన్ని గొడవలు జరిగాయి. కానీ, ఆయన నన్ను ప్రేమిస్తున్నానని చెబుతూ, భార్యకు విడాకులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు.

"ఇద్దరం కలిసి మా బంధాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించాం. ఇంట్లో కూడా వెంటనే ఒప్పుకోలేదు. ఆయనను కలిసిన తర్వాత మా పెళ్ళికి అంగీకరించడంతో వచ్చే ఆగస్టులో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం" అని డిలోరిస్ చెప్పారు.

"డేటింగ్ యాప్‌లో పరిచయమైనంత మాత్రాన అందరూ మోసం చేస్తారని చెప్పలేం. అవకాశమిస్తే, అక్కడ కూడా సోల్ మేట్స్ దొరకవచ్చు" అని అన్నారు.

డేటింగ్ యాప్స్ సురక్షితమేనా?

డేటింగ్ యాప్స్ వల్ల లాభాల కంటే నష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయని అంటారు నిపుణులు.

ప్రపంచంలో డేటింగ్ కోసం అత్యధికంగా వాడే టిండర్ యాప్‌లో 2020లో ఒక్క మార్చి నెలలోనే 300 కోట్ల స్వైప్‌లు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఈ యాప్ ఈ రికార్డును కనీసం 100 సార్లకు పైగా బ్రేక్ చేసింది.

అయితే, ఈ డేటింగ్ యాప్స్‌లో చాలా మంది మహిళలు రకరకాల లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారని ప్యూ రీసెర్చ్ సెంటర్ 2020 లో చేసిన అధ్యయనం చెబుతోంది. ఆన్‌లైన్‌లో డేటింగ్ చేసే 18 -34 వయసున్న అమ్మాయిల్లో 57% మంది అసభ్యకరమైన సందేశాలు లేదా ఫోటోలను సందేశాల ద్వారా అందుకుంటున్నట్లు తెలిసింది. టీనేజీ అమ్మాయిలు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు.

కొన్ని సార్లు ఇవి మానసిక ఆందోళనకు కూడా దారి తీస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ సమస్యలనెలా అధిగమించాలి?

వేధింపులను సూచించే భాషను కనిపెట్టేందుకు టిండర్ లో మెషీన్ లెర్నింగ్ ఉంది. భాష అసభ్యకరంగా ఉన్నప్పుడు టిండర్ దానిని కనిపెట్టి యూజర్‌ను అలెర్ట్ చేస్తుంది. అయితే, ఈ యాప్‌లు ఆంగ్లేతర భాషలను గుర్తిస్తాయా లేదా అనేది పెద్ద సందేహం.

2020లో బంబుల్ కూడా కొన్ని అసభ్యకర ఫోటోలను బ్లర్ చేసి వాటిని చూసేందుకు యూజర్ అంగీకారం అడిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టింది.

ఈ యాప్స్‌లో కూడా అసభ్యకరంగా లేదా అనుచితంగా ప్రవర్తించని వ్యక్తులను బ్లాక్ చేసే అవకాశముంది.

ఈ వేదికల్లో జరిగే మోసాలకు సదరు వేదికలు బాధ్యత వహించవనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

న్యూ యార్క్‌కు చెందిన రచయత షాని సిల్వర్ డేటింగ్ యాప్స్ నుంచి తన ప్రొఫైల్స్‌ను తొలగించానని చెబుతూ, "వాటి వల్ల నాకెటువంటి మేలు జరగలేదు. నన్ను, నా జీవితాన్ని, నా సమయాన్ని, నా డబ్బును తీసుకునే అవకాశం వాటికెందుకివ్వాలి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ ప్రశ్నను నాకు నేనే వేసుకున్నప్పుడు నాకొక దృక్పథం ఏర్పడింది. వెంటనే డేటింగ్ యాప్స్‌ను తొలగించాను. తిరిగి ఎప్పుడూ వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలనే కోరిక ఒక్కసారి కూడా కలగలేదు" అని తెలిపారు.

"చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ నా జీవితాన్ని తిరిగి పొందినట్లయింది" అని బీబీసీ బిజినెస్‌తో అన్నారు.

కుటుంబ సభ్యులకు తెలియచేయడం మేలు..

"డేటింగ్ యాప్స్‌లో 99 శాతం మంది వ్యక్తులు తమ గురించి అసలైన వివరాలను వెల్లడించరు. చాలా మంది సింగిల్ అని ప్రొఫైల్స్‌లో పెట్టుకుంటారు. వివాహమైంది అని రాస్తే, డేటింగ్‌కు ఎవరూ ముందుకు రారేమో అనే భయంతో కొందరు మోసం చేసే ఉద్దేశంతో కొందరు ఇలా చేస్తారు" అని అంటూ డిలోరిస్ ఆమెకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.

"ప్రొఫైల్ మాత్రం చూసి మోసపోవద్దు. అవతలి వ్యక్తుల గురించి పూర్తిగా విషయాలను తెలుసుకుంటే, మీ కథ కూడా వినూత్నంగా మారవచ్చు" అని డిలోరిస్ అంటారు.

"నేను విదేశాలకు వెళ్లి నా బాయ్ ఫ్రెండ్‌ని కలిసినట్లు అందరూ కలవాలని అయితే సలహా ఇవ్వను. అలా చేయడం ముప్పుతో కూడిన వ్యవహారం. సురక్షత, కుటుంబ నేపథ్యం తెలుసుకోవడం చాలా అవసరం" అని అంటారు పుపుల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)