You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రష్యా జవాన్ల సోషల్ మీడియా పోస్టులపై నిషేధం!
సైనికులు, ఇతర మిలటరీ సిబ్బంది సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులూ పెట్టకుండా నిషేధిస్తూ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలూ, వీడియోలూ, ఇతర పోస్టుల సాయంతో శత్రువులకు ఉపయోగపడే మిలటరీ రహస్యాలు బయటపడే అవకాశాలున్నాయని ప్రభుత్వం కొత్త బిల్లులో పేర్కొంది. ఆటోమేటిక్ జియో లోకేషన్ టెక్నాలజీతో ఫలానా మిలటరీ యూనిట్ ఎక్కడుందో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. గతంలో రష్యా జవాన్ల తప్పిదాల కారణంగా ఇలాంటి రహస్యాలు బయటపడిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టడానికి సిద్ధమైంది.
ఇతర దేశాల్లో పనిచేసే రష్యా జవాన్లందరికీ ఈ నిషేధం వర్తిస్తుంది.
గతంలో రష్యా జవాన్ల సోషల్ మీడియా పోస్టుల కారణంగా ఉక్రెయిన్, సిరియా దేశాల్లో వారు ఎక్కడెక్కడ ఉన్నారన్న విషయం బయటికొచ్చింది. 2014లో ఓ సైనికుడు ఉక్రెయిన్‌లో రెబల్స్‌కి గ్రాడ్ రాకెట్లని సరఫరా చేయడానికి వెళ్తున్నట్టు చెబుతూ ట్విటర్‌లో ఓ ఫొటో పెట్టాడు. దీని కారణంగా రెబల్స్‌కి రష్యా నేరుగా సాయపడుతుందన్న ఉక్రెయిన్ వాదనకు బలం చేకూరింది.
ఇవి కూడా చదవండి
వైస్ న్యూస్‌కి చెందిన సైమన్ ఓస్ట్రోస్కీ అనే రిపోర్టర్ అయితే, రష్యా జవాన్ల సోషల్ మీడియా పోస్టుల కారణంగా ఉక్రెయిన్‌లో వాళ్ల కార్యకలాపాల్ని ఎలా ధ్రువీకరించొచ్చో పూసగుచ్చినట్టు వివరిస్తూ ఓ వీడియోని రూపొందించి యూట్యూబ్‌లో పెట్టారు.
2014లో రష్యా జవాన్లలో కొందరు ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఇతర జవాన్ల సోషల్ మీడియా పోస్టింగులు స్పష్టం చేస్తున్నాయని బెల్లింగ్‌కాట్ విచారణ సంస్థ పరిశీలన చెబుతోంది. ఫొటోల్లో కనిపించే ప్రదేశాల ఆధారంగా కూడా సైనికులు ఎక్కడున్నారో చెప్పడం పెద్ద కష్టం కాదని అది అంటోంది. ఇలాంటి ఎన్నో ఉదంతాలు రష్యా రక్షణ శాఖకు తలనొప్పిగా మారాయి. దాంతో సైన్యం సోషల్ మీడియా పోస్టులనూ, మరీ ముఖ్యంగా సెల్ఫీలనూ పెట్టకుండా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కొత్త చట్టం 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు టాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)