You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తాలిబాన్‌ల సాయం కోరిన న్యూజీలాండ్ గర్భిణి.. ఎవరీమె? చివరకు ఏమైంది
స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో తాలిబాన్‌ల సాయం కోరానని, ఆ తర్వాత తనను స్వదేశంలోకి అనుమతించారని న్యూజీలాండ్‌కు చెందిన జర్నలిస్ట్ ఒకరు చెప్పారు.
న్యూజీలాండ్‌కు చెందిన చార్లెటీ బెల్లిస్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. న్యూజీలాండ్ ప్రభుత్వం, కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉండటంతో ఆమె స్వదేశానికి వెళ్లలేకపోయారు. దీంతో ఆమె అఫ్గానిస్తాన్‌కు వెళ్లారు.
ఆమె కథనం వల్ల కోవిడ్ కట్టడి కోసం న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు హైలైట్ అయ్యాయి. అదే సమయంలో కొంతమంది మాత్రం తాలిబాన్లతో ఆమెకున్న ప్రత్యేక సంబంధాల గురించి చర్చిస్తున్నారు.అఫ్గానిస్తాన్‌లో అధికారం దక్కించుకున్న తర్వాత ... మహిళల హక్కుల్ని అణచివేయడంలో తాలిబాన్లు వ్యవహరించిన తీరు విమర్శలు ఎదుర్కొంది. హక్కుల కార్యకర్తల్ని, ప్రచారకుల్ని అరెస్ట్ చేయడం, హింసించడంతో పాటు చంపుతున్నారని తాలిబాన్లపై ఆరోపణలు ఉన్నాయి.
బెల్లిస్ క్వారంటైన్‌లో ఉండేలా తాము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, ఆమెను అఫ్గానిస్తాన్ నుంచి తీసుకువచ్చేందుకు విమానాన్ని పంపిస్తామని న్యూజిలాండ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. "బెల్లిస్, క్వారంటైన్‌లో ఉండటానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఆమె అక్కడకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం" అని న్యూజిలాండ్ ఉప ప్రధానమంత్రి గ్రాంట్ రాబర్ట్ సన్ చెప్పారు.ఆమె కథనం అంతర్జాతీయంగా ప్రచారం కావడం వల్లనే తాము స్పందించామన్న వార్తలను న్యూజీలాండ్ ప్రభుత్వం ఖండించింది. తమ సిబ్బంది అత్యవసర దరఖాస్తుల పరిశీలనలో బిజీగా ఉన్నారని ఉప ప్రధాని చెప్పారు."ప్రభుత్వ సిబ్బంది నిరంతరం అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పని చేస్తున్నారు" అని ఆయన చెప్పారు.ఇంతకు ముందు రెండుసార్లు బెల్లిస్‌కు కాన్సులేట్ సాయం అందించేందుకు ప్రయత్నించామని న్యూజీలాండ్ ప్రభుత్వం తెలిపింది. తన పరిస్థితి వివరిస్తూ బెల్లిస్ శనివారం ఒక జాతీయ పత్రికలో ఒక కథనాన్ని రాశారు. దీనిపై చర్చ జరగడంతో న్యూజీలాండ్ ప్రభుత్వం ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది.
తాలిబాన్‌లను బెల్లిస్ ఏం కోరారు?
న్యూజిలాండ్ హెరాల్డ్‌కు రాసిన కాలమ్‌లో బెల్లిస్... స్వదేశంలో బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతి ఇవ్వాలని గత వారం తాను పెట్టుకున్న దరఖాస్తుని తమ దేశ ప్రభుత్వం తిరస్కరించిందని పేర్కొన్నారు.ప్రస్తుతం న్యూజీలాండ్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారిని, శాశ్వత పౌరసత్వం ఉన్న వారిని తమ దేశంలోకి అనుమతిస్తోంది. అయితే వారు పది రోజులు క్వారంటైన్ సెంటర్లలో ఉంటేనే అందుకు అనుమతిస్తామని చెబుతోంది. ప్రస్తుతం అలాంటి క్వారంటైన్ కేంద్రాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. అయితే అవి చాలా తక్కువగా ఉన్నాయి. న్యూజీలాండ్ ప్రభుత్వం రెండేళ్లుగా తమ దేశ సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. విదేశాల్లో నివసిస్తోన్న న్యూజీలాండ్ ప్రజల్లో చాలా మంది సొంత దేశానికి వెళ్లాలని భావిస్తున్నారు.సొంత దేశానికి వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో తాలిబాన్లను సంప్రదించినట్లు బెల్లిస్ తన కథనంలో వివరించారు. వివాహం కాకుండానే గర్భం దాల్చిన మహిళను మీ దేశంలోకి అనుమతిస్తారా అని తాలిబాన్ నేతలను అడిగినట్లు ఆమె చెప్పారు. తాలిబాన్ సీనియర్ అధికారులతో మాట్లాడినప్పటికి బెల్లిస్ తన సహచరుడితో కలిసి బెల్జియంలో ఉన్నారు. ఆమె సహచరుడు బెల్జియంలో ఫోటోజర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. బెల్జియంలో ఆమె వీసా గడువు ముగిసింది. ఆమె ప్రస్తుతం బెల్జియం నివాసి కాదు.
గత ఏడాది కాలంగా బెల్లిస్, ఆమె సహచరుడు అఫ్గానిస్తాన్‌లో వార్తలు కవర్ చేస్తున్నారు. వారిద్దరికీ అఫ్గానిస్తాన్ వీసాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆమె తాలిబాన్ ఉన్నతాధికారులతో తనకు ఉన్న పరిచయాలతో అక్కడ ఆశ్రయం కోరారు.
‘‘మీరు రావచ్చు, మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఎవరైనా అడిగితే వివాహమైందని చెప్పండి. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మాకు కాల్ చెయ్యండని’’ తనకు ఓ తాలిబాన్ అధికారి చెప్పినట్లు బెల్లిస్ తన కథనంలో రాశారు. ఆ అధికారి పేరు చెప్పేందుకు ఆమె నిరాకరించారు.
‘‘వివాహం కాని ఓ గర్భవతికి తాలిబాన్లు ఆశ్రయం కల్పించడానికి సిద్ధపడ్డారు. మీరు వెనకడుగు వేస్తే అది ఎంత వివాదం అవుతుందో మీరు ఊహించుకోండి’’ అంటూ ఆమె న్యూజీలాండ్ అధికారులను ఉద్దేశిస్తూ కథనంలో పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్‌లో ఒంటరి తల్లులను తాలిబాన్ అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పిల్లల్ని తమకు ఇవ్వాలని వారిపై హక్కుల్ని వదులుకోవాలని బెదిరిస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.
ఆమె కథనానికి వచ్చిన స్పందన ఏంటి?
బెల్లిస్ లెటర్ పత్రికల్లో వచ్చిన తర్వాత న్యూజీలాండ్ అధికారులకు ఫోన్లు వచ్చాయి. గర్భిణులకు క్వారంటైన్ వసతులు కల్పించే విషయంలో నిబంధనలు మార్చాలని కొంతమంది సూచించారు.తమ నియమాలను సోమవారం అక్కడి అధికారులు సమర్థించుకున్నారు. తాము తీసుకున్న చర్యల వల్ల న్యూజీలాండ్‌లో కేసులు తక్కువగా ఉన్నాయని.. ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పడలేదని చెప్పారు.అత్యవసర కేటగిరీ కింద బెల్లిస్ మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యూజీలాండ్ ప్రభుత్వం ఆమెకు సూచించింది.
కొత్తగా ఆమె మళ్లీ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆమెను దేశంలోకి అనుమతిస్తున్నారా? లేక పాత దరఖాస్తు ఆధారంగానే ఆమెను ఆహ్వానిస్తున్నారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
తన కథనం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత తనకు మరో దేశంలో కూడా ఆశ్రయం లభించినట్లు బెల్లిస్ చెప్పారు. ఆమె కథనాన్ని కొందరు హక్కుల కార్యకర్తలు, పరిశీలకులు, ఆఫ్గాన్లు విమర్శిస్తున్నారు.
"అఫ్గాన్లు కానివారిని తాలిబాన్లు ఎలా చూస్తున్నారనే దానికి ఈ కథనం ఒక కొనసాగింపు మాత్రమే" అని ఆస్ట్రియన్ అఫ్గాన్ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఫిరోజ్ ట్వీట్ చేశారు. ‘‘అఫ్గాన్లను బెదిరించడం కొట్టడం, హింసించడం చంపేయడం లాంటి వాటిని జర్నలిస్టులు తరచుగా చూస్తున్నారు. కానీ ఆఫ్ఘానేతరులను గౌరవ మర్యాదలతో చూస్తున్నారు. వారికి అన్నిరకాలుగా స్వాగతిస్తున్నారు. వారి పట్ల మృదువుగా వ్యవహరిస్తున్నారని’’ ఆయన అన్నారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మహిళా హక్కుల కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేసి అరెస్ట్ చేశారు. వారిలో చాలా మంది ఇంత వరకూ కనిపించలేదు. వారందరినీ విడుదల చేయాలని తాలిబాన్లను కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కేంద్ర బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు: నదుల అనుసంధానం, కిసాన్ డ్రోన్లు, డిజిటల్ రూపీ
- క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్ను: బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఇండియాలో ఇక ఈ లావాదేవీలు లాభదాయకం కాదా
- కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలటానికి కారణాలేమిటి
- కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకుల మధ్య వివాదానికి మూలాలేంటి
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)