మియన్మార్: సాయుధ సైనికులను అడ్డుకునేందుకు ఒక నన్ మోకాళ్ల మీద కూర్చున్నపుడు ఏం జరిగింది?

    • రచయిత, పాబ్లో ఉచోవా, కొ కొ ఆంగ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

అది 2021, ఫిబ్రవరి నెల. మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత దానిని వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటం ప్రారంభమైంది. సైనిక పాలన వద్దంటూ అనేకమంది వీధుల్లోకి వచ్చారు.

వారిని అణచివేసే క్రమంలో సైనికులు జరిపిన దమనకాండను వ్యతిరేకిస్తూ ఓ నన్ చూపిన సాహసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువతను పోలీసులు నుంచి రక్షించడానికి సిస్టర్ ఆన్ రోజ్ సాయుధ బలగాలను ఎదురించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారుల వైపు రాకుండా, వారి ముందు మోకాళ్ల మీద కూర్చున్నారు.

ఆ ఘటనకు సంబంధించిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ ఘటన జరిగి ఈ నెలతో ఏడాది అవుతుంది. మరి ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఆమె పేరు సిస్టర్ ఆన్ రోజ్ ను-తవాంగ్. క్యాథలిక్ చర్చికి సంబంధించిన ఆమె ఒక సన్యాసిని. ఏడాది కిందట మియన్మార్‌లో తిరుగుబాటుకు ఆమె ప్రతిరూపంలా నిలిచారు.

మియన్మార్‌లోని కాచిన్ రాష్ట్రంలో సిస్టర్ ఆన్ రోజ్ మిడ్‌వైఫ్ (ఆరోగ్య కార్యకర్త)గా పని చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 28న సైనిక పాలకులకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో యువకులు ప్లకార్డులు పట్టుకుని ఆమె పని చేస్తున్న క్లినిక్‌కు సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. కాసేపట్లోనే పోలీసులు రంగప్రవేశం చేశారు.

'నేను చనిపోయినా మంచిదే అనుకున్నా'

''ట్రక్కుల నిండా పోలీసులు, సైనికులు దిగారు. వాటార్ క్యానన్లు చేరుకున్నాయి. సాయుధ బలగాలు జనం మీద పడి కొట్టడం మొదలుపెట్టాయి. కాల్పులు కూడా మొదలయ్యాయి. కొందరు దెబ్బలు తగిలి కింద పడిపోయారు. మరికొందరు పెద్దగా ఏడుస్తూ పరుగులు పెడుతున్నారు. అక్కడొక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది'' అని సిస్టర్ ఆన్ ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుంటూ బీబీసీతో అన్నారు.

''ఇవన్ని చూస్తూ ఉండలేకపోయాను. నాకు ప్రమాదమని తెలిసినప్పటికీ, ఆందోళనకారులను రక్షించడానికి బయలుదేరాను. నేను చనిపోయినా మంచిదే అనుకున్నాను'' అన్నారామె.

అలా ఆమె పోలీసులను ఎదిరించడానికి ముందుకు కదిలారు.

'ముందు నన్ను చంపండి'

‘‘వాళ్లను కాల్చడానికి కన్నా ముందు నన్ను కాల్చండి అని వారితో అన్నాను. ఆ రోజు చనిపోవడానికి నేను సిద్ధమయ్యాను. నన్ను నేను ఒక డెడ్‌బాడీగా భావించుకున్నాను'' అన్నారు సిస్టర్ రోజ్. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు అక్కడి నుంచి తప్పించుకోవడం ప్రారంభించారు.

సిస్టర్ ఆన్‌ రోజ్ నిరసన తర్వాత పోలీసులు, మిలిటరీ అధికారులు వెనక్కి తగ్గారు. కానీ, వాళ్లు తిరిగి వస్తారని ఆమెకు తెలుసు. అందుకే ఆ రోజంతా ఆమె అక్కడే ఉండిపోయారు.

''ఈ ప్రాంతంలో ఉండటం మంచిది కాదని చర్చి అధికారులు నాకు చెప్పారు. మరోవైపు కొందరు ప్రభుత్వాధికారులు కూడా నాతో చర్చలు జరపడానికి ప్రయత్నం చేశారు'' అని సిస్టర్ రోజ్ వెల్లడించారు.

సరిగ్గా ఈ ఘటన జరిగిన వారం తర్వాత, అంటే మార్చి 8న కొంతమంది సైనికులు ఒక ఆందోళనకారుల గ్రూప్‌ను తరుముకుంటూ చర్చిలోకి ప్రవేశించారని, వారిని దొరకబుచ్చుకుని తీవ్రంగా కొట్టారని, కొందరిని కాల్చి చంపారని ఆన్ గుర్తు చేసుకున్నారు.

'ఫొటోలో ఏముంది'

ఆ ఫొటోలో ఆన్ రోజ్ మోకాళ్ల మీద కూర్చుని, నిరసనకారులను ఏమీ చేయవద్దని కోరుతున్నట్లు కనిపిస్తారు. ''ప్రజలను అంతలా హింసించడం నేను చూడలేను అని అన్నాను. మీరు వారిని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి, నా ప్రాణాలివ్వడానికి సిద్ధమని వారికి చెప్పాను'' అని నాటి ఘటనను వివరించారు సిస్టర్ రోజ్.

రోజ్ మోకాళ్ల మీద కూర్చోగానే, ఇద్దరు సైనికులు కూడా మోకాళ్ల మీద కూర్చుకున్నారు. తమ విధులకు అడ్డు తగలవద్దని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని వాళ్లు ఆమెను కోరారు.

''వాళ్లు నన్ను బతిమాలారు. నేను వాళ్లను బతిమాలాను. హింస జరగవద్దని, ఎవరినీ చంపవద్దని వారిని కోరాను. అవసరమైతే నన్ను చంపమని అడిగాను'' అన్నారామె.

'చనిపోతానని భయమేసింది'

ఆ రోజు జరిగిన ఘటన తర్వాత తన ధైర్యాన్ని చూసి తానే ఆశ్చర్యపోయానని సిస్టర్ ఆన్ రోజ్ అన్నారు.

''అదంతా నా తెగువ కాదు. అక్కడున్న ఆందోళనకారులను కాపాడటానికి ఆ భగవంతుడే నాకు అంత ధైర్యం ఇచ్చాడు. లేకపోతే నేనూ సామాన్యమైన మనిషినే. నాకూ చావంటే భయం ఉంది. కానీ, ఆ రోజు నేను ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించా'' అన్నారు రోజ్.

అయితే, హింస వద్దని పోలీసులను వేడుకున్నా సమీప ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఇద్దరు ఆందోళనకారులు మరణించారు. వారిలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. బుల్లెట్ల కారణంగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.

''ఇంత క్రూరత్వం ఉంటుందని నేను ఊహించలేదు'' అన్నారు రోజ్.

గాయపడిన ఆందోళనకారులను చర్చిలోకి తీసుకెళ్లడానికి ఆమె సహాయం చేశారు. ఆ ప్రాంతమంతా భయానకంగా కనిపించింది. చాలామంది యువకులు ఆందోళనతో పరుగులు పెడుతూ కనిపించారు.

'ఆశలు లేవు'

ఈ ఘటనలు జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. ఆనాటి హింసలో గాయపడిన అనేకమంది బాధితులను ఇంటికెళ్లి పరామర్శించారు రోజ్. తమ ప్రాణాలు కాపాడారంటూ ఆమెకు చాలామంది కృతజ్ఞతలు తెలిపారు.

అయితే, వారిలో చాలామందికి భవిష్యత్తుపై ఆశలు లేవు. ప్రజాస్వామ్యం కోసం ఆందోళన చేస్తున్న వారిని సైనిక ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. అక్కడి పరిణామాలు రానురాను సివిల్ వార్‌లా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

''తమ ఉద్యమాలు సఫలమవుతాయన్న ఆశ యువతలో సన్నగిల్లుతోంది. ప్రాణాలు పోవడం, జైలు పాలవడం తప్ప తమ డిమాండ్‌లు నెరవేరవని వారు అనుకుంటున్నారు'' అని రోజ్ వ్యాఖ్యానించారు.

'ప్రజాస్వామ్యం అంటే వారికి తెలుసు'

''ప్రజాస్వామ్యానికి, సైనిక పాలనకు మధ్య తేడా వారికి తెలుసు. తమ దేశం మళ్లీ 70 ఏళ్లు వెనక్కి వెళ్లాలని వారు కోరుకోవడం లేదు. రాజకీయ సంక్షోభం, కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. పిల్లల చదువులు పాడయ్యాయి. సామాజిక పరిస్థితులు మారిపోయాయి'' అని రోజ్ అభిప్రాయపడ్డారు.

దేశంలో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడంతో ఒకప్పుడు పేదల ఆరోగ్య కేంద్రంగా ఉన్న సిస్టర్ రోజ్ క్లినిక్‌కు ధనికులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు.

''ప్రస్తుతం యువతరం రోడ్ల మీదకు వచ్చి ధైర్యంగా పోరాడుతోంది'' అని సిస్టర్ రోజ్ అన్నారు. సైనిక అధికారుల నుంచి తనకు హెచ్చరికలు వచ్చాయని, చర్చి అధికారులు తన భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని ఆమె వెల్లడించారు.

''కానీ నేను సత్యంవైపు నిలబడతాను. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తాను'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)