బ్రిట్నీ స్పియర్స్: ఈ పాప్ గాయని కన్న తండ్రిపైనే కోర్టులో పోరాడాల్సి వచ్చింది ఎందుకు?

ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్‌పై ఆమె తండ్రికున్న సంరక్షణాధికారాలు ముగిసాయి. 13 ఏళ్ల పాటు ఈ ఒప్పందం ఆమె జీవితాన్ని నియంత్రించింది. వీటికి చట్టపరంగా ముగింపు పలకడంతో, ఇది తన జీవితంలోనే అత్యంత మంచి రోజని ఆమె వ్యాఖ్యానించారు.

"నాకిక కన్నీరు ఆగదేమో!" అని అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆమెకు ఇన్‌స్టా‌లో 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

39 సంవత్సరాల బ్రిట్నీ స్పియర్స్ తండ్రికి గతంలో ఇచ్చిన కన్సర్వేటర్‌షిప్‌ ముగిసినట్లు లాస్‌ఏంజెల్స్ కోర్టు ప్రకటించింది.

2008లో ఆమె తన సంరక్షణాధికారాలను ఆమె తండ్రికిచ్చారు.

స్పియర్స్‌కు మద్దతు పలికేందుకు ఆమె అభిమానులు లాస్‌ఏంజెల్స్ కోర్టు ముందు గుమిగూడారు.

తండ్రి సంరక్షణలో ఆమె చాలా వేదనను అనుభవించారని స్పియర్స్ అభిమానులు వ్యాఖ్యానించారు.

కానీ, గతంలో ఆమెకు సంరక్షణ అవసరమని తండ్రి జేమీ అన్నారు. ఇకపై ఆమె తన జీవితాన్ని స్వయంగా నియంత్రించుకునే సమయం వచ్చిందని అంగీకరించారు.

"ఆమె జీవితం అస్తవ్యస్తంగా ఉండేది. ఆమె మానసిక, శారీరక, ఆర్ధిక ఒత్తిళ్లతో బాధపడుతూ ఉండేవారు" అని గతంలో జేమీ స్పియర్స్ తరుపున వాదించిన న్యాయవాదులు పేర్కొన్నారు.

ఈ సంరక్షణ ఒప్పందం ద్వారా ఆమె ఆర్ధిక వ్యవహారాలు, కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు, వ్యక్తిగత వ్యవహారాలపై హక్కులను పూర్తిగా ఆమె తండ్రికే ఇచ్చారు.

ఆఖరుకు ఆమె టీనేజ్ కొడుకులను కలవడం, ఆమె తిరిగి వివాహం చేసుకోవాలా వద్దా అనే నిర్ణయాలు కూడా ఆమె తండ్రి ఇష్టానికే పరిమితమై ఉండేవి.

ఈ సంరక్షణ బాధ్యతలకు లాస్‌ఏంజెల్స్ కోర్టు శుక్రవారం చట్టపరంగా ముగింపు పలికింది. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు.

అయితే, కొన్ని ఆర్ధిక సమస్యలింకా కొనసాగుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు తాత్కాలిక సంరక్షణాధికారిగా పని చేసిన అకౌంటెంట్‌కు కొన్ని అధికారాలను ఉంచుతున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.

కోర్టు విచారణ కొనసాగుతున్నంత సేపూ ఈ గాయని ధైర్యంతో ఉండడాన్ని స్పియర్స్ న్యాయవాది మాత్యు రోసెన్ గార్ట్ ప్రశంసించారు. తీర్పు వెలువడిన తరువాత ఆమె అభిమానులనుద్దేశించి ఆయన కోర్టు ప్రాంగణంలో మాట్లాడారు.

ఆమె ఇచ్చిన సాక్ష్యాలు సంరక్షణాధికారాల కోసం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు దారి తీసినట్లు తెలిపారు. ఈ కొత్త చట్టం వల్ల స్పియర్స్ ఎదుర్కొన్న ఇబ్బందుల లాంటివి ఇతరులకు తలెత్తకుండా ఉంటాయని అన్నారు.

కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత ఆమె స్నేహితులు కూడా హర్షం వ్యక్తం చేసారు.

"ఇది ఎప్పుడో చోటు చేసుకోవలసిన క్షణం. నీకు మంచి రోజులు రానున్నాయి" అని అంటూ వ్యాపారవేత్త పారిస్ హిల్టన్ ట్వీట్ చేశారు.

"జీవితంలో ఇంత కంటే ఎక్కువ ఇమ్మని నేను దేముడిని ప్రార్ధించలేదు" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

"నేను కోపంతో చాలా మాట్లాడాను. ఏవేవో అన్నాను. క్షమించండి. నేను కూడా మనిషినే. నా లాంటి పరిస్థితిలో ఉంటే మీరు కూడా నా లాగే ఆలోచిస్తారు" అని ఆమె అన్నారు.

తనపై విధించిన సంరక్షణకు ముగింపు పలకమని బ్రిట్నీ స్పియర్స్ జూన్‌లో కోర్టును కోరారు.

ఈ ఒప్పందం తనకు చాలా వేదన కలుగచేసిందని, ఈ మొత్తం వ్యవహారంతో బెదిరిపోయానని చెప్పారు.

సంరక్షణలో ఉన్న సమయంలో తనకు బలవంతంగా మత్తు మందులు ఇచ్చి, తిరిగి వివాహం చేసుకుని పిల్లల్ని కనకుండా చేసి తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు స్పియర్స్ కోర్టుకు చెప్పారు.

ఆమె కోర్టులో చెప్పిన విషయాలతో ఆమె తండ్రి సంరక్షణ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులపై సాధారణంగా ఇతరులకు సంరక్షణాధికారాలు ఇస్తారు. స్పియర్స్ మానసిక ఆరోగ్యం బాగుండకపోవడంతో 2008లో ఆమె సంరక్షణాధికారాలను ఆమె తండ్రికిచ్చారు.

ఈ బాధ్యతలను ఆమె తండ్రి 13 సంవత్సరాల పాటు నిర్వహించారు.

సంరక్షణాధికారాలను ఎందుకిస్తారు?

బ్రిట్నీ స్పియర్స్ 2007లో కెవిన్ ఫెడర్లిన్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమె ప్రవర్తన కారణంగా ఇద్దరు పిల్లల కస్టడీని కూడా కోల్పోయారు.

బహిరంగ ప్రదేశాల్లో ఆమె మానసిక ప్రవర్తన ఆందోళన రేపింది. ఒక సారి ఆమె గుండు చేయించుకుని, గొడుగుతో ఒక ఫోటోగ్రాఫర్ కారును కొట్టిన ఘటన హెడ్ లైన్స్‌లోకి చేరింది.

ఆ సమయంలో ఆమె రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందవలసి వచ్చింది. ఆమె ఇద్దరు కొడుకులను తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోకుండా ఆమె పోలీసులతో గొడవ పడ్డారు.

అదే సమయంలో కోర్టు, జేమీ స్పియర్స్‌కు బ్రిట్నీపై సర్వాధికారాలను అప్పగించింది.

కన్సర్వేటర్‌షిప్‌ అంటే ఏమిటి??

స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తుల కోసం కోర్టు సంరక్షణాధికారాలను ఇస్తుంది. ముఖ్యంగా, డెమెన్షియా లేదా ఇతర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారి కోసం కోర్టు సంరక్షణాధికారాలను ఇస్తుంది.

స్పియర్స్ ఆర్ధిక, ఆస్తి వ్యవహారాలపై మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత వ్యవహారాల సంరక్షణాధికారాలను కూడా ఆమె తండ్రికిచ్చారు. ,

మొదట్లో ఆమె తండ్రే అన్ని బాధ్యతలను చూసుకునేవారు. కానీ, 2019లో అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఆమె వ్యక్తిగత బాధ్యతల సంరక్షణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత వ్యవహారాలను చూసుకునేందుకు కోర్టు మరొకరిని నియమించింది.

సెప్టెంబరు 2021లో జేమీ స్పియర్స్ సంరక్షణాధికారాలు చట్టపరంగా ముగిసాయి.

ఆమె తండ్రి సంరక్షణలో ఉన్న సమయంలో స్పియర్స్ మూడు మ్యూజిక్ ఆల్బమ్స్‌ను విడుదల చేశారు. అనేక సార్లు టీవీషో లలో కనిపించారు. యూఎస్‌ఎస్ ఫ్యాక్టర్ అనే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.

సంరక్షణాధికారులకు ఎటువంటి అధికారాలుంటాయి?

సంరక్షణాధికారులకు ఆర్ధిక వ్యవహారాలు, కెరీర్ నిర్ణయాలు, వ్యక్తిగత వ్యవహారాల పై నిర్ణయాలు తీసుకునే అధికారాలుంటాయి.

"ఆమె జూన్‌లో కోర్టుతో మాట్లాడుతూ, "నాకు పెళ్లి చేసుకుని బిడ్డను కనాలని ఉంది. కానీ, నేను పెళ్లి చేసుకుని బిడ్డను కనేందుకు తన కన్సర్వేటర్‌ (తండ్రి) ఒప్పుకోవట్లేదు" అని చెప్పారు.

బలవంతంగా టూర్‌కి పంపి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మత్తుమందులు ఇచ్చినట్లు చెప్పారు. తనకు పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు ఇష్టం లేదని చెప్పారు.

ఆమె తండ్రి కోసం పని చేస్తున్న భద్రతా సిబ్బంది ఆమె ఫోన్, బెడ్ రూమ్ పై కూడా నిఘా పెట్టారని 'ది న్యూయార్క్ టైమ్స్' తీసిన డాక్యుమెంటరీ పేర్కొంది.

జేమీ స్పియర్స్ ఏమంటున్నారు?

తన కూతురంటే తనకు అమితమైన ప్రేమని అంటూ, "ఆమె సంక్షేమం కోసం చేయగలిగినదంతా చేసాను" అని చెప్పారు.

"ఆమె కోర్టులో జడ్జికి చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత , స్పియర్స్ బాధపడటాన్ని చూడటం చాలా కష్టంగా ఉంది" అని జేమీ న్యాయవాది అన్నారు.

కానీ, ఆమె వ్యక్తిగత జీవితంపై తన క్లయింట్ నియంత్రణ పెట్టారన్న విషయాన్ని మాత్రం ఖండించారు. ఈ సాక్ష్యాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు.

సంరక్షణ ముగిసిన తర్వాత బ్రిట్నీ తిరిగి సాధారణ జీవితాన్ని జీవించేందుకు అవసరమైన స్థిరత్వాన్ని సాధించారని, జేమీ తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు.

బ్రిట్నీ భవిష్యత్తు ఏంటి?

బ్రిట్నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. ఆమె సామ్ అస్‌ఘరీని పెళ్లి చేసుకోబోతున్నారు.

ఆమె తండ్రితో పోరాడుతున్న కేసు మాత్రం కోర్టులో కొనసాగుతుంది. ఆమె తండ్రి సంరక్షణ బాధ్యతలు వహిస్తున్న సమయంలో తనను వేదనకు గురి చేసినందుకు గాను, తండ్రి పై కేసు వేసి ఆయనను వదిలించుకుంటానని ఆమె జూలైలో అన్నారు.

ఆర్ధిక నష్టం కలిగించడం, అవసరానికి మించి వ్యక్తిగత నిబంధనలు విధించడం సంరక్షణ వేధింపుల కిందకు వస్తాయి.

సంరక్షణాధికారిగా ఆమె తండ్రికి 16000 డాలర్ల (సుమారు రూ.11,89,000) జీతం, ఆఫీసు అద్దె, ఆయన కూతురు చేసిన వృత్తిపరమైన ఒప్పందాల్లో కొంత వాటాను పొందుతూ ఉండగా, ఆమెకు మాత్రం వారానికి ఖర్చుల కోసం 2000 డాలర్లు (సుమారు రూ.1,48,000) మాత్రమే ఇచ్చినట్లు న్యూ యార్క్ టైమ్స్ పత్రాలు బయటపెట్టిన కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.

ఆమె తండ్రి కూతురు ఖజానా నుంచి కొన్ని కోట్ల డాలర్లను కాజేశారని బ్రిట్నీ న్యాయవాదులు ఆరోపించారు.

బ్రిట్నీ తండ్రి వ్యవహరించిన తీరు, పెట్టిన వేదనలు, బ్రిట్నీ సొమ్మును కాజేయడం పట్ల విచారణ జరిపించాలని ఆమె తరుపు న్యాయవాదులు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)