మొజాంబిక్: సెక్స్ బానిసలను విడిపించిన రువాండా సైనికులు... అసలేం జరిగింది?

    • రచయిత, ఆన్ సోయ్
    • హోదా, సీనియర్ ఆఫ్రికా కరస్పాండెంట్, బీబీసీ

ఉత్తర మొజాంబిక్‌ ప్రాంతంలో పెద్ద పెద్ద మామిడి చెట్ల కింద రాలిపడిన పండ్లు కనిపిస్తున్నాయి. అవన్నీ కుళ్లిపోయి పడిపోయాయి. వాటిని తినడానికి అక్కడ మనుషులు లేరు.

గత నాలుగేళ్లుగా కాబో డెల్గాడోలోని పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మిగిలాయి.

భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. పైకప్పులు కూలిపోయాయి. కాల్పులు, పేలుళ్ల ఆనవాళ్లు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోడలు కూలిపోయాయి. ఒకప్పుడు మనుషులు నివసించిన ఇళ్లల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి.

ఇస్లామిక్ మిలిటెంట్లు సృష్టించిన విధ్వంసం కళ్లెదుట కనిపిస్తోంది. స్థానికులు వారిని అల్-షబాబ్ అని పిలుస్తారు. అంటే అరబిక్‌లో యువత అని అర్థం.

సోమాలియాలో కూడా ఇదే పేరుతో మరో గ్రూపు ఉంది. కానీ, ఈ రెండు గ్రూపులకు సంబంధం లేదు.

వీళ్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు అనుబంధంగా ఉన్నారని చెబుతున్నారు.

"అది చాలావరకు సైద్ధాంతిక అనుబంధం" అని రువాండా సైనిక ప్రతినిధి కల్నల్ రోనాల్డ్ రువివాంగా చెప్పారు.

గత నెలలో రువాండా ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా వెయ్యి మంది సైనికులతో కూడిన ఆర్మీ బలగాలు మిలిటెంట్లను తరిమికొట్టాయి.

రువాండా ఆర్మీ ఎలా దాడి చేసిందంటే..

ఉత్తరంలోని పాల్మా నుంచి ఒక మిలటరీ దళం తరలి వచ్చింది. ఇక్కడే మార్చిలో ఒక హోటెల్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. ఇందులో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరిని తాళ్లతో బంధించి తలలు నరికారు. ఆ దెబ్బతో, ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం 'టోటల్', అక్కడున్న నేచురల్ గ్యాస్ ప్లాంట్‌ను మూసివేసింది.

మరొక సమూహం నైరుతి వైపు నుంచి వచ్చి మొకింబోవా డా ప్రైయా పోర్ట్ సిటీ వైపు కదిలింది. మొజాంబికన్ సముద్ర దళాలు సముద్ర ప్రవేశాన్ని నిరోధించడంతో పోర్ట్ సిటీని ఆక్రమించుకోవడం సులువైంది. ఆగస్ట్ 8కల్లా మిలటరీ దళాలు అక్కడకు చేరుకున్నాయి.

మిలిటెంట్లు తమ బందీలతో సహా దక్షిణం వైపు క్విరింబాస్ నేషనల్ పార్క్ అడవుల్లోకి పారిపోయే ప్రయత్నాలు చేశారు.

దాంతో, మెరుపుదాడులు చేస్తూ, చిన్న చిన్న పోరాటాలు చేస్తూ ముందుకు సాగాల్సి వచ్చిందని కల్నల్ రువివాంగా తెలిపారు.

సుమారు 100 మంది తిరుగుబాటుదారులు మరణించారు. రువాండా ఆర్మీలో నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

ఇస్లామిస్ట్ మిలిటరీ, ఆధ్యాత్మిక ప్రధాన కార్యాలయమైన ఎంబావులో అనేక భవనాలు, ఇళ్లు చాలా సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అక్కడ తమకు బంకర్లు దొరికాయని సైనికులు తెలిపారు.

'మసీదులు కూల్చేశారు'

క్విటుండాలో మాత్రమే మనుషుల అలికిడి వినిపించింది. పిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటూ కనిపించారు. 80ల వయసున్న ఒక పెద్దాయన వారి ఆటను చూస్తూ పక్కనే కూర్చున్నారు.

"తిరుగుబాటుదారులు ఏం కోరుకుంటున్నారో మాకు తెలీదు. మా మసీదులు కూల్చేశారు. చర్చిలపై దాడి చేశారు" అని ఆ పెద్దాయన అన్నారు.

మిలిటెంట్లు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లారని తెలిశాక ఆయన మళ్లీ ఆక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.

కానీ, ఆయన సొంత ఊరు మొకింబోవా డా ప్రైయా పోర్ట్ సిటీకి వెళిపోవాలని ఆశపడుతున్నారు. అయితే, అక్కడ శిథిలాలు తప్ప ఏమీ మిగల్లేదు. ఏళ్లకు ఏళ్లు సాగిన యుద్ధంలో అంతా సర్వనాశనమైపోయింది.

మిలిటెంట్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను రువాండా ఆర్మీ మాకు చూపించింది.

చాలావరకు ఏకే-47 తుపాకులే ఉన్నాయి. వాటిపై మిలిటెంట్ల పేర్లు రాసి ఉన్నాయి. బహుసా వాటిని వాడిన వాళ్ల పేర్లు కాబోలు.

రాకెట్‌తో నడిచే గ్రెనేడ్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాలు కూడా ఉన్నాయి.

ఒక యుద్ధ ఖైదీని కూడా చూపించారు. తనొక 18 ఏళ్ల కుర్రాడు. గతంలో చేపలు పట్టే వృత్తిలో ఉండేవాడు. మిలిటెంట్లు తనను బంధించి బలవంతంగా తమ దళంలో కలుపుకున్నారని ఆ కుర్రాడు చెప్పాడు.

సెక్స్ బానిసలను బెదిరించారు

మిలిటెంట్ల చెర నుంచి విడిపించిన లైంగిక బానిసలైన మహిళలను పెంబాలో కలిశాం.

వారిలో ఆరుగురు పిల్లల తల్లి ఒకామె ఉన్నారు. పొలంలో పనిచేసుకుంటూ ఉండగా మిలిటెంట్లు వచ్చి తనను, తన పిల్లలు ముగ్గురిని తీసుకెళ్లిపోయారని ఆమె చెప్పారు.

ఒక వారం రోజుల పాటు వాళ్లను నడిపించి తీసుకెళ్లారు. మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు ఇచ్చేవారు.

"అలిసిపోయామని చెప్తే పిల్లల్ని చితకబాదేవారు.

మిలిటెంట్లు ఆమెను సెక్స్ బానిసగా ఒక ఏడాదికి పైగా బంధించి ఉంచారు.

బందీగా ఉన్నప్పుడు ఆమె మళ్లీ గర్భవతి అయ్యారు. మరో బిడ్డకు జన్మనిచ్చారు.

"తినడానికి తగినంత ఆహారం, ఇతర సామగ్రి ఉండేది కాదు."

గత కొద్ది వారాల్లో రువాండా ఆర్మీ హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న శబ్దాలు విని మిలిటెంట్లు పారిపోవడానికి ప్రయత్నించారు.

అదే అదనుగా వారి చేతుల్లో బందీగా ఉన్న కొందరు సెక్స్ బానిసలు అక్కడి నుంచి పారిపోయారు.

పారిపోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తారు

సెక్స్ బానిసలుగా తీసుకొచ్చినవారిలో పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలను చంపేశారని మరొక మహిళ తెలిపారు.

మిలిటెంట్లు, వారిలో భయాన్ని, అపనమ్మకాన్ని పురికొల్పారని 24 ఏళ్ల ఆమె చెప్పారు.

దాంతో, ఆ మహిళల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేది కాదు. ఎవరైనా పారిపోయేందుకు ప్లాన్ చేస్తే, ఇతరులు ఆ విషయాన్ని మిలిటెంట్లకు చేరవేశారు.

మిలిటెంట్లు రాత్రిళ్లు చురుకుగా ఉండేవారు. ఉదయం పూట నిద్రపోయి, రాత్రి మెలకువగా ఉండమని తమను బలవంతపెట్టేవారని ఆమె చెప్పారు.

వారి నియంత్రణలో ఉన్న గ్రామాలకు ఆమెను తీసుకెళ్లి వ్యవసాయం చేయమనేవారు. కానీ, మిలిటెంట్లకు, వారి వద్ద బందీలుగా ఉన్నవారికి ఆ ఆహారం సరిపోయేది కాదు.

"వారి చెరలో ఉన్న మిగతావారిని కూడా దయచేసి విడిపించండి" అంటూ ఆమె ప్రాథేయపడ్డారు.

ఆమె మళ్లీ తన ఇంటికి వెళ్లి తన భర్త, పిల్లలను కలుసుకోవాలని అనుకుంటున్నారు. కానీ, వాళ్లు ఆమెను ఆహ్వానిస్తారో లేదో అని సందేహపడుతున్నారు. ఆమె జీవితం ఇంతకుమునుపులా మారడం దాదాపు అసాధ్యం.

రువాండా సైనికులు ఇప్పుడు హీరోలు

ఇటీవల ఉగ్రవాదులు ఆక్రమించిన ప్రాంతాల్లో ఇప్పుడు మొజాంబికన్ బలగాలు ఉన్నాయి.

పెంబాలో రువాండా ప్రెసిడెంట్ పాల్ కగామేను కలిసినప్పుడు ఈ మొత్తం ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అయ్యిందని అడిగాను.

"ఈ ఆపరేషన్ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. దీనికి బయట నుంచి మద్దతు అవసరం. మాకు నిధులు సమకూరాయి" అని ఆయన తెలిపారు.

అసమ్మతిని సహించని నాయకునిగా కగామె రువాండాలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

కానీ, ఆయన ఇప్పుడూ మొజాంబిక్‌లో హీరో అయిపోయారు.

ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్థానిక ప్రజలు జెండాలు ఊపుతూ, కగామె ఫొటోలు పట్టుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావాలని మొజాంబికన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

కాబో డెల్గాడోలో ప్రజలు మళ్లీ తమ నివాసాలను ఏర్పరచుకునేవరకు రువాండా దళాలు అక్కడే కాపుకాస్తాయి.

అయితే, మిలిటెంట్లు ప్రస్తుతం వెనక్కు తగ్గినట్లు కనిపిస్తున్నా, ఇది అంతం కాదని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)