మడగాస్కర్‌లో ‘కోవిడ్-19కి మూలికల మందు’.. ప్రత్యేక విమానంలో తెప్పిస్తానంటున్న టాంజానియా దేశాధ్యక్షుడు

కోవిడ్-19కి చికిత్స చేసేందుకు ఫలానా మందు ఉపయోగపడుతుందన్న ఆధారం ఇప్పటి వరకూ లేదని ఒక పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) చెబుతున్నప్పటికీ టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మాత్రం కోవిడ్-19 కి మందు తెప్పించడానికి మడగాస్కర్‌కి ప్రత్యేక విమానం పంపిస్తానని చెబుతున్నారు. కోవిడ్-19కి చికిత్స చేసే ఒక హెర్బల్ మందు మడగాస్కర్‌లో లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదే మందుని కాంగో బ్రజావిల్లే అధ్యక్షుడు కూడా దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారు.

మరో వైపు స్వీయ పరిజ్ఞానంతో ఎటువంటి మందులు తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరిస్తోంది.

మూడు వారాల పాటు 20 మందిపై ప్రయోగించిన తరువాత ఈ మందుని కోవిడ్ ఆర్గానిక్స్ పేరుతో విడుదల చేసినట్లు మడగాస్కర్ అధ్యక్షుని కార్యాలయ ప్రధానాధికారి లోవ హసినిరినా రనోరోమరో బీబీసీకి చెప్పారు.

అయితే ఈ మందుని కోవిడ్ చికిత్సకి ఆమోదించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ బీబీసీకి ఇచ్చిన సమాధానంలో తెలిపింది.

కరోనావైరస్‌పై పోరాడేందుకు ఇంతవరకు ఖచ్చితమైన మందులేవీ లేవని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన అధికారి టెడ్రోస్ చేసిన వ్యాఖ్యలను మళ్లీ వక్కాణించింది.

దీనికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

కరోనావైరస్‌కి చికిత్సలు గా మూలికా మందులు, హెర్బల్ టీలు పని చేస్తాయని చెబుతున్న సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటెగ్రేటివ్ హెల్త్ హెచ్చరించింది.

వైరస్ సోకకుండా కాపాడుకోవటం ఒక్కటే వైరస్ బారిన పడకుండా ఉండటానికి మార్గమని సూచించింది.

ఈ హెర్బల్ పానీయాన్ని ఇతర ఆఫ్రికన్ దేశాలు కూడా వాడేందుకు సిద్దమవుతున్నాయి.

గునియా బిసౌ దేశానికి ఇప్పటికే ఈ మందుని మడగాస్కర్ సరఫరా చేసింది. ఈక్వటోరియల్ గినియా ప్రత్యేక రాయబారి ఈ మందు తొలి షిప్మెంట్‌ని అందుకున్నట్లు మడగాస్కర్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.

టాంజానియా అధ్యక్షుడు కూడా మడగాస్కర్ నుంచి ఈ మందుని దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు, అందుకోసం ఒక ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు తెలిపారు.

"నేను మడగాస్కర్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇప్పటికే వైరస్‌కి మందు కనిపెట్టినట్లు చెప్పారు. మందు తెప్పించడానికి విమానాన్ని పంపిస్తాం. దీంతో టాంజానియా దేశస్తులకి ఉపయోగం ఉంటుంది. మేము రాత్రి, పగలు వైరస్ నివారణకు పని చేస్తున్నాం" అని ఆయన చెప్పారు

ఆయన వైరస్ నివారణ పట్ల అవలంబించిన తీరుకి ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.

ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్‌ని పాటిస్తుంటే ఆయన మాత్రం ప్రజలు బహిరంగ స్థలాల్లో గుమిగూడటం పట్ల ఎటువంటి ఆంక్షలు విధించలేదు.

టాంజానియా అవలంబిస్తున్న విధానం వైరస్ సోకేవారి కేసుల సంఖ్యని పెంచే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పటికే దేశంలో 480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే ఈ సంఖ్య తప్పని, జాతీయ లాబొరేటరీస్ ఫలితాలు తప్పుగా ఇస్తోందని మగుఫులి వాదిస్తున్నారు. ప్రయోగశాలలో కొన్ని పళ్ళు, జంతువులపై రహస్యంగా పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక మేక, ఒక పక్షి, ఒక బొప్పాయిలో కూడా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

అంటే ఈ పరీక్షల్లో సాంకేతిక లోపాలు ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలకు సంబంధించి ఆయన ఎక్కువ వివరాలు వెల్లడించలేదు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)