You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- రచయిత, తన్వీర్ మలిక్
- హోదా, జర్నలిస్ట్, కరాచీ
"పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్లు స్మగ్లింగ్ చేయడానికి చాలా దారులు, పద్ధతులు ఉన్నాయి. సరకు రవాణా ట్రక్కుల ద్వారా, రెండు దేశాల మధ్య రాకపోకలు జరిపేవారు ఇదే పని చేస్తుంటారు. గతంలో అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు చాలా డాలర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది."
పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ ఎందుకు జరుగుతోందో, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో పాకిస్తాన్ క్వెట్టా నగరంలోని కమాల్ ఖాన్(పేరు మార్చాం) బీబీసీకి వివరంగా చెప్పారు.
అయితే, కమాల్ ఖాన్ భారీ స్థాయిలో జరిగే డాలర్ల స్మగ్లింగ్ వ్యాపారానికి సంబంధించిన వారు కాదు. కానీ, ఆయన చిన్నస్థాయిలో అక్రమంగా 'మనీ చేంజింగ్' పని చేస్తుంటారు.
డాలర్లతోపాటూ విదేశీ కరెన్సీని కొనుగోలు, అమ్మకాల కోసం పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ లైసెన్సులు జారీ చేస్తుంది. కానీ, ఈ వ్యాపారంలో అక్రమ మనీ చేంజర్ కూడా ఉంటారు. వీరంతా గ్రే మార్కెట్‌లో ఈ పనిచేస్తుంటారు.
ప్రస్తుతం డాలరుతో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి మారక విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ఒక డాలరు విలువ 170 పాకిస్తానీ రూపాయలు దాటింది.
పాకిస్తాన్ రూపాయితో పోలిస్తే డాలరు ధర చరిత్రాత్మకంగా పెరగడానికి ప్రధానంగా ఆ దేశంలో దిగుమతి వ్యయం పెరగడమే కారణం. దానివల్ల వాణిజ్యం, కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. దీంతో మారక రేటుపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
అయితే, అధిక దిగుమతుల వల్ల రూపాయిపై పడుతున్న ఒత్తిడితోపాటూ అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి కూడా రూపాయితో పోలిస్తే డాలర్ విలువ పెరిగేలా చేసింది.
డాలర్ స్మగ్లింగ్
గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ ప్రైవేటు రంగంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, ఒక సమావేశంలో దీనిపై ప్రశ్నించినపుడు పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ ఇది నిజమేనని అధికారికంగా అంగీకరించారు.
అఫ్గానిస్తాన్‌లో మారిన పరిస్థితి, అక్కడ డాలర్ల కొరత వల్లే పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్స్ స్మగ్లింగ్ జరుగుతోందా, దాని వల్ల పాకిస్తాన్ రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం పడుతోందా అని ఆయనను ప్రశ్నించారు.
సమాధానంగా ఒక విధంగా అఫ్గానిస్తాన్‌కు డాలర్ స్మగ్లింగ్ జరుగుతుండడం వల్ల కూడా రూపాయితో డాలర్ విలువ పెరుగుతోంది అని స్టేట్ బ్యాంక్ గవర్నర్ చెప్పారు.
పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు ఏ విధంగా, ఏ ప్రధాన వనరుల నుంచి డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోంది అనే దాని గురించి ఎక్కువ సమాచారం లేదు.
అయితే కరెన్సీ వ్యాపారం చేసే వారిని సంప్రదించినపుడు, వారు అక్రమంగా మనీ చేంజింగ్ పని చేసే ఒక వ్యక్తిని నాకు పరిచయం చేశారు. పేరు బయటపెట్టద్దనే షరతుతో ఆయన నాతో మాట్లాడ్డానికి అంగీకరించారు.
స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది?
అక్రమంగా 'మనీ చేంజింగ్' చేసే కమాల్ ఖాన్ అఫ్గానిస్తాన్‌కు డాలర్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో చెప్పారు.
రెండు రకాలుగా పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు.
చమన్ గుండా అఫ్గానిస్తాన్ వెళ్లే డాలర్లను కరాచీ మార్కెట్లో కొనుగోలు చేస్తారు. వాటిని కరాచీలో చట్టబద్ధమైన మార్కెట్ నుంచి కాకుండా గ్రే మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు.
క్వెట్టాలో డాలర్ కోసం ప్రత్యేక మార్కెట్ ఏం లేదు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విదేశీ కరెన్సీ వ్యాపారం జరుగుతుంది. అంటే హజ్, ఉమ్రాహ్ సమయంలో వారికి విదేశీ కరెన్సీ అవసరం అవుతుంది. ఆ సమయంలో కొంత కార్యకలాపాలు జరుగుతాయి.
కరాచీ నుంచి క్వెట్టా వరకూ మొత్తం మార్గం ఒకరి దగ్గరే ఉంటుందని కమాల్ చెప్పారు. క్వెట్టా నుంచి చమన్, తర్వాత అఫ్గానిస్తాన్ వరకూ అక్రమంగా డాలర్లు తరలించే పనిని మరో గ్రూప్ చూసుకుంటుందని తెలిపారు.
అయితే క్వెట్టా, చమన్ నుంచి అఫ్గానిస్తాన్ వెళ్లే డాలర్ల మొత్తం, పెషావర్ నుంచి అఫ్గానిస్తాన్ వెళ్లే డాలర్ల మొత్తంతో పోలిస్తే చాలా తక్కువని కమాల్ చెప్పారు.
పెషావర్ నుంచి అఫ్గానిస్తాన్ వెళ్లే డాలర్లు ఎక్కువగా పంజాబ్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. దానికి రావల్పిండి కేంద్రంగా ఉంది. అక్కడ నుంచి గంటా, గంటన్నరలో డాలర్లను సులభంగా పెషావర్ చేర్చవచ్చు అంటారు కమాల్.
అఫ్గానిస్తాన్‌కు డాలర్లు స్మగ్లింగ్ చేయడం అంత కష్టమైన పనేం కాదు. ఎందుకంటే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య జనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వారి ద్వారా ఈ పని సులభంగా చేయవచ్చని చెప్పారు.
పాకిస్తాన్ సరిహద్దు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అఫ్గానిస్తాన్ సరిహద్దు లోపల ఉన్న స్టాక్ మార్కెట్‌కే రోజూ కొన్ని వేల మంది వస్తూపోతూ ఉంటారని కమాల్ చెప్పారు.
డాలర్లు స్మగ్లింగ్ చేసే వారు క్వెట్టా, కాందహార్‌లో నిరంతరం టచ్‌లో ఉంటారు. మరోవైపు పెషావర్ పరిశ్రమల్లో, మార్కెట్, చౌక్ యాద్గర్‌లో కూడా ఈ కార్యకలాపాలు ఉంటాయి. అక్కడ నుంచి డాలర్ల స్మగ్లింగ్ జరుగుతుంది అన్నారు.
ట్రక్కుల్లో ఉండే రహస్య అరల ద్వారా ఈ స్మగ్లింగ్ జరుగుతుంటుంది. డాలర్లు చిన్న చిన్న మొత్తాల్లో కూడా అంటే 10, 20, 30 వేల డాలర్లు అయితే ప్రజల ద్వారా పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్ పంపిస్తుంటారు.
ఇలాంటి పనులు చమన్, కిలా అబ్దుల్లాలో ఉంటున్న వాళ్లు కాకుండా క్వెట్టా, కాందహార్‌లో ఉన్న వాళ్లు ఎక్కువగా చేస్తుంటారని కమాల్ చెప్పారు.
పాకిస్తాన్‌లో చట్టబద్ధంగా కరెన్సీ ఎక్చేంజ్ నిర్వహించే ఒక కంపెనీకి జఫర్ పరాచా యజమాని. ఎక్ఛేంజ్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ అధ్యక్షులు.
అఫ్గానిస్తాన్‌లో డాలర్ స్మగ్లింగ్ ఎక్కువగా పెషావర్ నుంచే జరుగుతుందని ఆయన చెప్పారు. అది ఎక్కువగా రోడ్డు మార్గంలోనే ఉంటుందని తెలిపారు.
దానికి రెండు రూట్‌లు ఉన్నాయి. పెషావర్, క్వెట్టా నుంచి వాళ్లు ఈ పని చాలా సులభంగా చేయవచ్చు అంటారు జఫర్.
అఫ్గానిస్తాన్‌కు డాలర్ స్మగ్లింగ్ ఎందుకు?
అఫ్గానిస్తాన్‌కు డాలర్ స్మగ్లింగ్ వల్ల పాకిస్తాన్ కరెన్సీ మారకం రేటుపై ప్రతికూల ప్రభావం పడుతోందని పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ అంగీకరించారు.
అయితే, పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్స్ ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు.
డాలర్ విలువ పాకిస్తాన్ కంటే కాబుల్‌లో ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అంటారు కమాల్ ఖాన్.
"ప్రస్తుతం కాబుల్‌లో ఒక డాలర్ విలువ 178 పాకిస్తాన్ రూపాయలకు సమానంగా ఉంది. మేం పాకిస్తాన్‌లో 170 లేదా 171 రూపాయలకు ఒక డాలర్ కొంటే.. ఈ స్మగ్లింగ్ వల్ల చాలా ఆకర్షణీయమైన లాభాలు అందుకోవచ్చు" అన్నారు.
ప్రస్తుతం క్వెట్టా, పెషావర్ గ్రే మార్కెట్‌లో ఒక డాలర్ 175 రూపాయలు పైనే పలుకుతోందని కమాల్ చెప్పారు. కరాచీ, పంజాబ్ గ్రే మార్కెట్‌లో డాలర్ అంతకంటే తక్కువకే దొరుకుతోందని తెలిపారు.
అందుకే, ఇక్కడ కొన్న డాలర్లను అఫ్గానిస్తాన్‌కు తరలిస్తే కాబుల్‌లో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు.
కరాచీ, లాహోర్‌తో పోలిస్తే పెషావర్‌లో డాలర్ ధర అధికంగా ఉందని జఫర్ పరాచా కూడా చెప్పారు.
అయితే అక్కడ ఒక డాలర్ 175 రూపాయలు ఉండదంటున్నారు. కరాచీలో డాలర్ 170 రూపాయలు ఉంటే పెషావర్‌లో 172 రూపాయలు ఉందని చెప్పారు.
కాబుల్‌లో డాలర్ 178 రూపాయలు పలుకుతుంటే, దానివల్ల డాలర్ల స్మగ్లింగ్ మరింత పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో డాలర్ల కొరత కూడా ఈ స్మగ్లింగ్‌కు కారణం అన్నది నిజమేనంటారు పరాచా. కొత్త తాలిబాన్ ప్రభుత్వం డాలర్ ఖాతాలను అమెరికా స్తంభింప చేయడమే దానికి ప్రధాన కారణం అని ఆయన తెలిపారు.
"తాలిబాన్ ప్రభుత్వానికి ముందు సంకీర్ణ దళాల కోసం ప్రతి వారం 50 కోట్ల డాలర్లు వచ్చేవి. వాటిని ఖర్చులకు చెల్లించేవారు. అంత భారీగా డాలర్లు రావడంతో అవి అక్కడ నుంచి పాకిస్తాన్‌కు కూడా చేరేవి" అని ఆయన చెప్పారు.
"తాలిబాన్ అధికారంలోకి రావడానికి ముందు 50 లక్షల నుంచి కోటి డాలర్ల వరకూ అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు చేరేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బదులుగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచే రోజుకు 10 లక్షల నుంచి 20 లక్షల డాలర్లు అఫ్గానిస్తాన్‌కు అక్రమ రవాణా చేస్తున్నారు" అన్నారు.
మారక రేటుపై ఎంత ప్రభావం పడింది
ప్రస్తుతం డాలరుతో పాకిస్తాన్ రూపాయి మారక విలువ అత్యధిక స్థాయికి చేరడానికి నిరంతరం పెరుగుతూ వస్తున్న దిగుమతి వ్యయమే అని ఫారెక్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు మలిక్ బోస్తాన్ చెప్పారు.
పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ ప్రకటనపై మాట్లాడిన ఆయన "డాలర్ స్మగ్లింగ్ వల్ల మారక విలువపై చాలా తక్కువ ప్రభావం పడుతుంది. అయితే అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి పాకిస్తాన్‌లో దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం అనే భావన కూడా మారక రేటును ప్రభావితం చేస్తుంది" అన్నారు.
పాకిస్తాన్ ఈ ఏడాది జులైలో 5.5 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. అదే ఆగస్టులో ఈ దిగుమతులు 6.5 బిలియన్ల డాలర్లకు చేరింది. దీనికి కారణం ఆహార పదార్థాల దిగుమతులే అని బోస్తాన్ తెలిపారు.
"ఈ దిగుమతుల్లో ఒక పెద్ద భాగం అఫ్గానిస్తాన్ వెళ్తోంది. అంటే ఆహార పదార్థాల దిగుమతి కేవలం పాకిస్తాన్ కోసమే కాదు, అఫ్గానిస్తాన్ కోసం కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్ మినహా వేరే దారుల గుండా ఏదీ వెళ్లడం లేదు. అందుకే అధిక దిగుమతుల రూపంలో ఆ ప్రభావం పాకిస్తాన్ మీద పడుతోంది" అన్నారు.
"తాలిబాన్ ప్రభుత్వం నిధులను అమెరికా ఫ్రీజ్ చేసింది. అఫ్గానిస్తాన్‌లో బ్యాంకింగ్ సెక్టార్ ప్రస్తుతం పని చేయడం లేదు. అందుకే ఆ మొత్తం భారమంతా పాకిస్తాన్ మీద పడుతోంది" అంటారు పచారా.
ఒక వైపు అఫ్గానిస్తాన్‌లో ప్రజలు తమ డిపాజిట్లను విత్ డ్రా చేసుకోవాలని చూస్తుంటే.. మరోవైపు వారి ఆహార అవసరాలు తీర్చడానికి పాకిస్తాన్ మీద దిగుమతుల వ్యయం భారం అవుతోంది" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగానే ఎందుకు జరుపుకోవాలి? - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాసం
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- పీవీ నరసింహారావు, మన్మోహన్లు సంక్షోభంలో అవకాశాలను ఎలా అందిపుచ్చున్నారు ?
- పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు
- బియ్యం, పంచదార కోసం భారీ క్యూలైన్లు, ప్రభుత్వ చర్యల వల్లే ధరలు పెరిగాయా?
- ‘నువ్వు కూడా దళితుడివే అయ్యుంటావ్, అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నావ్’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా
- అడాల్ఫ్ హిట్లర్: ఆర్యుల మూలాలు కనుక్కోవాలని పరిశోధకులను హిమాలయాలకు పంపినప్పుడు ఏమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)