పాకిస్తాన్‌లో మిడతలు పట్టి అమ్ముకుంటున్న రైతులు

పాకిస్తాన్‌పై మిడతలు దాడి చేసి, తీవ్రంగా దాడి తీవ్రంగా దాడి చేస్తున్నాయి. అయితే, వాటిని సజీవంగా పట్టుకుంటే డబ్బులు ఇచ్చి కొంటామని దేశ ఆహార భద్రతా విభాగం ప్రకటించింది.

దాంతో, స్థానికులు టన్నుల మిడతలను పట్టుకుని, అధికారులకు అమ్మారు.

"నా భార్య, పిల్లలు మిడతలను పట్టుకున్నారు. తర్వాత వాటిని అధికారులకు అమ్మేశాం. కిలో మిడతలకు 20 రూపాయల చొప్పున ఇచ్చారు" అని అలీ షేర్ అనే స్థానిక రైతు చెప్పారు.

మిడత గుంపులు మూడు నెలల కింద ఒకారా జిల్లాపై దాడి చేశాయి. ఇంతకు ముందెప్పుడూ ఇక్కడి రైతులు మిడతల దాడిని చూడలేదు. "మిడతలు దాడి చేసినప్పుడు, మేము పొలాల్లో పని చేస్తున్నాం. ఏం జరిగిందో చూసేందుకు అందరూ వచ్చారు. డప్పులు, పాత్రలను కొట్టినా అవి కదల్లేదు. మిడతల వల్ల చాలా నష్టపోయాం. వీటిని సజీవంగా పట్టుకుని విక్రయించాలని అధికారులు కోరారు. దాంతో మేమంతా కలిసి వీటిని పట్టుకోవడం మొదలుపెట్టాం. అయినా చాలానే నష్టపోయాం" అని అలీ వివరించారు.

మేము పట్టుకున్న మిడతలన్నింటికీ కలిపి 5000 రూపాయలు వచ్చాయి. కానీ, మేం నష్టంపోయింది 2 లక్షల రూపాయలని ఆయన చెప్పారు.

ఈ మిడతల గుంపులు గంటకు దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. మరి వాటిని ఎలా పట్టుకోగలిగారు?"వాటిని పట్టుకునేందుకు చాలానే కష్టపడాల్సి వచ్చింది. మిడతలను పట్టేందుకు అడవిలోకి వెళ్తే, పాములు, ఇతర కీటకాలు కూడా ఉన్నాయి. దాంతో మేం భయపడ్డాం. అయినా, మిడతలను పట్టుకోగలిగాం. మాకు వేరే దారిలేదు. మిడతలు అప్పటికే మా పంటలను నాశనం చేశాయి కాబట్టి మేం ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాల్సి వచ్చింది" అని గుల్జార్ అనే మరో రైతు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)