పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. న్యూజీలాండ్, ఇంగ్లండ్‌లపై గ్రౌండ్‌లో ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా

న్యూజీలాండ్ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాక్‌లోని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు, అధికారులు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయాన్ని కొత్తగా నియమితులైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా విమర్శించారు. పాకిస్తాన్‌లో భద్రతను సాకుగా చూపుతూ పర్యటనలను రద్దు చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

ఈ అంశంపై ఆయన ఓ వీడియో విడుదలచేశారు. ‘‘కొన్ని పశ్చిమ దేశాలు బృందంగా ఏర్పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పాకిస్తాన్‌ విషయంలో వీరి ధోరణి ఇక మారదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుందన్న వార్త విని తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాను. పశ్చిమ దేశాలన్నీ ఒకటై ఇలా చేయడం దురదృష్టకరం. మీరు భద్రతను సాకుగా చూపించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది నిజంగా ఆందోళనకరం’’అని రమీజ్ అన్నారు.

‘‘ఆ భద్రతా పరమైన ముప్పు ఏమిటో చెప్పకుండానే న్యూజీలాండ్ తమ టోర్నీని రద్దు చేసుకుంది’’అని ఆయన అన్నారు.

ఇటీవల పాకిస్తాన్ చేరుకున్న తర్వాత, భద్రతా పరమైన కారణాలను చెబుతూ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే, న్యూజీలాండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నిర్ణయంపై పాక్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

మరోవైపు సోమవారం తమ పురుషులు, మహిళల జట్ల పాకిస్తాన్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నట్లు ఈసీబీ కూడా ప్రకటించింది. ‘‘మా క్రీడాకారుల మానసిక, శారీరక ఆరోగ్యమే మా తొలి ప్రాధాన్యం’’అని ఈసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.

‘‘ఆ ప్రాంతంలో ప్రయాణానికి సంబంధించి ఆందోళనలు వినిపిస్తున్నప్పుడు క్రికెటర్లపై మరింత ఒత్తిడి పెంచడం సరికాదు. ఇప్పటికే కోవిడ్ వల్ల వారు చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు’’అని ఈసీబీ తెలిపింది.

‘‘పురుషుల టీ20 జట్టు విషయంలో పరిస్థితులు మరింత జఠిలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ-20 ప్రపంచ కప్‌కు సన్నద్ధమయ్యేందుకు పాకిస్తాన్‌ టూర్‌కు వెళ్లడం సరికాదని మేం భావిస్తున్నాం. టీ-20 వరల్డ్ కప్‌కు మేం తొలి ప్రాధాన్యమిస్తాం’’అని కూడా ఈసీబీ వివరించింది.

‘‘వీరు పర్యటనను రద్దు చేసుకునేందుకు సాకుల కోసం చూస్తున్నారు. కొన్నిసార్లు భద్రత.. మరికొన్నిసార్లు ఆటగాళ్లకు భయం.. ఇంకొన్నిసార్లు మానసిక ఒత్తిడి అంటున్నారు. ఒకవేళ మా క్రికెట్ ఎకానమీ, చాలా పెద్దదైతే, వారు కచ్చితంగా నో చెప్పేవారు కాదు. మా క్రికెట్ టీమ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన జట్టు అయినా, నో చెప్పేవారు కాదు. దీని నుంచి మేం పాఠాలు నేర్చుకుంటున్నాం. మేం ఇంకా బాగా ఆడాలి. మా క్రికెట్ ఎకానమీని పెంచుకోవాలి’’అని రమీజ్ అన్నారు.

‘‘ఈ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ సమాజం మాకు అండగా నిలవకపోతే, దీనికి అర్థమేలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలి. కానీ, న్యూజీలాండ్ వారు మాతో ఆడం అన్నారు.. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా అదే చెప్పింది. త్వరలో వెస్ట్ ఇండీస్‌తో సిరీస్ ఉంది. వారు కూడా ముప్పుందని చెబుతారేమో. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ కూడా ఉంది. అందరూ అలా అంటే ఎలా?’’అని రమీజ్ ప్రశ్నించారు.

ఇంగ్లండ్ నిర్ణయాన్ని పాక్‌కు చెందిన చాలా మంది తప్పుపడుతున్నారు.

‘‘ఇది చాలా బాధాకరం. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కూడా వెనక్కి తగ్గింది. క్రికెట్‌ను పాకిస్తానీలు ఎంతగా ఆరాధిస్తారో ప్రపంచం గుర్తించాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మేం ముందుకు కదులుతాం. పాకిస్తాన్ ఎప్పుడూ వెనకడుగు వేయదు’’అని పాకిస్తానీ క్రికెటర్ షహీన్ షా అఫ్రీదీ వ్యాఖ్యానించారు.

‘‘పాకిస్తానీలకు ఇది తీవ్ర నిరాశకు గురిచేసే పరిణామం. ఇటీవల రెండుసార్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వారికి కఠినమైన ఆంక్షలు విధించారు. 2020లో అయితే, ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి పాక్ క్రికెటర్లు పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు రాలేకపోతోందా?’’అని మరో క్రికెటర్ మఝెర్ అర్షద్ వ్యాఖ్యానించారు.

‘‘కరోనావైరస్ వ్యాప్తి నడుమ రెండుసార్లు పాక్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. సవాళ్ల నడుమే న్యూజీలాండ్ పర్యటనకూ పాక్ వెళ్లింది. అయితే, ఈ రెండు దేశాలూ ఇప్పుడు పాక్‌కు అండగా నిలవలేదు. ఇది చాలా విచారకరం. మమ్మల్ని మోసం చేసినట్లు అనిపిస్తోంది’’అని జియో న్యూస్‌లో స్పోర్ట్స్ రిపోర్టర్ ఫైజాన్ లఖానీ వ్యాఖ్యానించారు.

‘‘పాకిస్తాన్ లేకుండా క్రికెట్ లేదనే విషయాన్ని ప్రపంచ క్రికెట్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లండ్, న్యూజీలాండ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’అని జర్నలిస్టు ఫైజల్ అబ్బాస్ వ్యాఖ్యానించారు.

‘‘ఇంగ్లండ్, న్యూజీలాండ్ వెన్నుచూపడాన్ని చూసి పాక్ మరింత దృఢం కావాలి. ఎప్పుడు ఎవరికి సాయం కావాలన్నా ముందుకు వెళ్లడమే మనకు తెలుసు.. మిగతావారు వారి స్వభావాలకు అనుగుణంగా నడుచుకుంటారు’’అని పాకిస్తాన్ విమెన్ క్రికెట్ ప్లేయర్ జవేరియా ఖాన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు పాకిస్తాన్ పర్యటనను ఇంగ్లండ్ ఎందుకు రద్దు చేసుకుందో అర్థం చేసుకోగలనని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు. అయితే, యూఏఈలో మ్యాచ్‌లకు వెళ్లడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘‘భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌ పర్యటనను రద్దు చేసుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. మరి యూఏఈలో మ్యాచ్‌లో ఎలా ఆడుతున్నారో చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. త్వరలో అన్నీ సద్దుమణిగి పాక్‌కు మన జట్టు పర్యటనకు వెళ్తుదని ఆశిస్తున్నా’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ అసంతృప్తిని అర్థం చేసుకోగలనని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వ్యాఖ్యానించారు.

‘‘ఇంగ్లండ్ విషయంలో పాక్ ఎందుకు నిరాశకు గురైందో అర్థం చేసుకోగలను. గత ఏడాది వ్యాక్సీన్లు వేసుకోకముందే, ఇంగ్లండ్‌లో పాక్ జట్టు పర్యటించింది. పాక్, వెస్టిండీస్‌లకు ఇంగ్లండ్ రుణపడి ఉంది. ఆ రెండు దేశాల్లో ఇంగ్లండ్ జట్టు క్రికెట్ మ్యాచ్‌లు రద్దు చేసుకోకూడదు. అసలు క్రికెట్ మ్యాచ్‌లే జరగకపోతే, విన్నర్లే ఉండరు’’అని వసీం జాఫర్ వ్యాఖ్యానించారు.

ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల పర్యటనల రద్దు వల్ల తమకు కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగిందని పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ ఫవాద్ చౌధరి చెప్పినట్లు రేడియో పాకిస్తాన్ ఒక వార్త ప్రచురించింది.

పరిహారం వసూలు చేస్తాం

మరోవైపు న్యూజీలాండ్ విషయంలో పేపర్ వర్క్ పూర్తిచేస్తున్నామని, వారి నుంచి పరిహారం వసూలు చేస్తామని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా చెప్పారు.

‘‘టీ20 ప్రపంచ కప్‌లో మేం పొరుగునున్న దేశాలను లక్ష్యంగా చేసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు ఆ జాబితాలో మరో రెండు దేశాలు కూడా కలిశాయి. అవే న్యూజీలాండ్, ఇంగ్లండ్’’అని రమీజ్ వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఓడించలేరు. మేం ఈ చర్యలకు గ్రౌండ్‌లో ప్రతీకారం తీర్చుకుంటాం. మేం ముదుకు వెళ్తూనే ఉంటాం’’అని రమీజ్ అన్నారు.

టీ20 వరల్డ్ కప్ వచ్చే నెలలో యూఏఈలో జరగబోతోంది. ఈ కప్‌కు భారత్ అతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, కరోనా వ్యాప్తి నడుమ ఈ మ్యాచ్‌లను యూఏఈకి మార్చారు. ప్రస్తుతం ఐపీఎల్ కూడా యూఏఈలోనే జరుగుతోంది.

టీ20 కప్‌లో పాక్ జట్టు భారత్, న్యూజీలాండ్‌ జట్లతో కలిసి గ్రూప్-2లో ఉంది. ఇంగ్లండ్ జట్టు గ్రూప్‌-1లో ఉంది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ అక్టోబరు 24న జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)