You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Mr Goxx: క్రిప్టో ట్రేడింగ్‌లో వారెన్ బఫెట్‌ను మించిపోయిన చిట్టెలుక
- రచయిత, డేవిడ్ మొలోయ్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్ చేసే చాలామంది లాగే తాను కూడా మంచి ట్రేడర్‌గా మారి, డబ్బు సంపాదించాలని మిస్టర్ గాక్స్ అనుకుంటుంది.
రెండు కారణాలతో మిస్టర్ గాక్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అందులో మొదటిది కెరీర్‌లో 20 శాతం లాభాలతో చాలామంది దిగ్గజ ట్రేడర్లను, సంస్థలను మిస్టర్ గాక్స్ ఓడించడం.
రెండోది, మిస్టర్ గాక్స్ అనేది ఒక చిట్టెలుక కావడం.
ఈ చిట్టెలుక ట్రేడింగ్ ఎలా చేస్తుందంటే
మిస్టర్ గాక్స్ కలుగులో ఒక ట్రేడింగ్ ఆఫీస్ కూడా ఉంటుంది. ప్రతిరోజు, గాక్స్ ఆఫీసులోకి ప్రవేశించగానే ట్విచ్‌లో లైవ్‌స్ట్రీమ్ మొదలవుతుంది. అంతే కాకుండా ఫాలోయర్లకు తెలియడానికి గాక్స్ ట్రేడింగ్ సెషన్‌ను ప్రారంభించింది అనే ట్వీట్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అవుతుంది.
ట్రేడింగ్ కార్యాలయంలోని "ఇంటెన్షన్ వీల్"లో పరిగెత్తుతూ ఏ క్రిప్టో కరెన్సీ కొనాలో గాక్స్ ఆలోచిస్తుంది. ఈ ఇంటెన్షన్ వీల్ తిరుగుతుండగా వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి.
మిస్గర్ గాక్స్ ఆఫీస్ ఫ్లోర్ దగ్గర రెండు టన్నెల్స్ ఉంటాయి. ఒకటి కొనడానికి, ఒకటి అమ్మడానికి.
కొనే టన్నెల్ లేదా అమ్మే టన్నెల్ గుండా వెళ్లిన ప్రతిసారి దానికి అనుసంధానించిన ఉన్న ఎలక్ట్రానిక్స్ గాక్స్ ఇష్టాయిష్టాల ప్రకారం ట్రేడ్ చేస్తాయి.
ఇద్దరు యువకుల ఆలోచన
అయితే, ఈ మొత్తం ఏర్పాటు వెనక జర్మనీకి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు.
"ఈ రోజుల్లో ప్రతిదీ ఖరీదైనదిగా తయారవుతోందని మేము భావించాము. పెద్ద మొత్తంలో అద్దెలు కడుతూ, పొదుపు చేయడం చాలా కష్టంగా మారింది" అని వారు చెప్పారు.
"ఏం జరుగుతుందో తెలియకుండా, ఇతర అవకాశాలను గమనించకుండానే మా తరానికి చెందిన చాలా మంది కష్టపడి సంపాదించిన డబ్బును క్రిప్టో మార్కెట్‌లో ధారపోస్తున్నారు" అన్నారు.
"మా చిట్టెలుక మనుషుల కంటే తెలివిగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలదు అని మేం వెరైటీగా నిరూపించి చూపించాం" అన్నారు వారిద్దరు.
ఈ చిట్టెలుకకు మిస్టర్ గాక్స్ అనే పేరు కూడా క్రిప్టో మార్కెట్‌లో దివాలా తీసిన ఓ కంపెనీ పేరు ఆధారంగా పెట్టారు. ఎం.టి. గాక్స్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌గా ఉండేది.
గాక్స్ క్యాపిటల్
మిస్టర్ గాక్స్‌కి మొదటి నెలలో ట్రేడింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. జూన్ 12న 326 యూరోలతో గాక్స్ ట్రేడింగ్ మొదలు పెట్టింది. తొలిసారి స్టెల్లార్ (ఎక్స్‌ఎల్‌ఎమ్) ఆర్డర్‌ను పెట్టారు.
ఒక నెలలో మొత్తం 95 ఆర్డర్‌ల తరువాత, గాక్స్ క్యాపిటల్ 7.3శాతం నష్టాలను మూటకట్టుకుంది. కానీ సెప్టెంబర్ 27 నాటికి, కెరీర్ పెర్ఫార్మెన్స్ 19.41 శాతం పెరిగింది.
క్రిప్టో న్యూస్ సైట్ ప్రోటోస్ లెక్కల ప్రకారం, ఎఫ్‌టీఎస్‌ఈ 100 లేదా డౌజోన్స్ వంటి ప్రధాన స్టాక్ మార్కెట్‌ల రాబడిని మాత్రమే కాకుండా, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే పెర్ఫార్మెన్స్‌ను కూడా ఇది అధిగమించింది.
క్రిప్టో మార్కెట్‌లో కరెన్సీలలో అతి పెద్దదైన బిట్‌కాయిన్‌ను కూడా గాక్స్ కొన్ని సందర్భాల్లో అధిగమించింది.
వాస్తవానికి గాక్స్ క్యాపిటల్ అనేది నిజమైన పెట్టుబడి సంస్థ కాదు. తమ సూచనలను పెట్టుబడి సలహాగా తీసుకోకూడదని మిస్టర్ గాక్స్‌కు సహకరిస్తున్న జర్మన్ యువకులు ప్రతి ట్వీట్‌తో పాటూ ఓ డిస్‌క్లైమర్‌ను కూడా జోడిస్తారు.
మిస్టర్ గాక్స్‌ను వెనకుండి నడిపించే ఇద్దరు యువకులు, అజ్ఞాతంగా ఉండటానికి ఇష్టపడతారు.
"క్రిప్టోకరెన్సీలు చాలా వివాదాస్పదమైన అంశాలు. ఈ రోజు ఇంటర్నెట్‌లో చర్చ జరిగే ఏదో ఒక అంశంలానే, మాపై కూడా చర్చలు వాడీ వేడిగా జరిగి, త్వరగా అసాంఘికంగా మారవచ్చు" అని వారు బీబీసీ న్యూస్‌తో అన్నారు.
అందుకే తమ "లైట్ హార్టెడ్ సైడ్ ప్రాజెక్ట్"కు మిస్టర్ గాక్స్ ఫేస్‌గా ఉండాలని వారు కోరుకుంటారు.
''మా జీవితాలు కరోనా ప్రభావానికి గురైన సమయంలో ఒక హాబీ ప్రాజెక్టుగా ఇది ప్రారంభించాం'' అని వారు వివరించారు.
మిస్టర్ గాక్స్ యజమానుల్లో ఒకరు లెక్చరర్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్. కొత్త టెక్నాలజీలతో ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించడం తనకు ఇష్టమని, సరదాగా జీవితం గడపాలని కోరుకుంటానని వెల్లడించారు.
మరో యువకుడు ప్రోగ్రామర్. వీరిద్దరూ యూనివర్సిటీలో చదువుకునే సమయం నుంచే బెస్ట్ ఫ్రెండ్స్.
వీరిద్దరూ వందల కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. గాక్స్ క్యాపిటల్ కోసం రిమోట్‌గా పనిచేస్తూనే, ఆన్‌లైన్‌లోనే కలుసుకుంటున్నారు.
ఈ చిట్టెలుక యాదృచ్ఛికంగా చేసే ట్రేడ్‌లు ఇటు ఆన్‌లైన్‌లో, అటు నిజ జీవితంలో ప్రజల్లో చాలా ఆసక్తిని కల్పిస్తున్నాయి.
"నా చిట్టెలుక తన వ్యాపారాన్ని చేపట్టినప్పటి నుండి, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి క్రిప్టో గురించి మరింత సమాచారం అడిగి తెలుసుకున్నాను" అని మిస్టర్ గాక్స్ యజమాని బీబీసీ న్యూస్‌తో అన్నారు.
గాక్స్ బాక్స్
ఈ స్నేహితులిద్దరు ఉపయోగించిన కొన్ని ప్రోగ్రామింగ్ కోడ్‌లు మినహా మిస్టర్ గాక్స్ ట్రేడింగ్ కార్యాలయంలోని ప్రతిదీ ఇంట్లోనే తయారు చేశారు.
సాఫ్ట్‌వేర్ స్క్రిప్టింగ్, మైక్రోకంట్రోలర్లు, సింగిల్-బోర్డ్ కంప్యూటర్‌లు, కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్, 3డి ప్రింటింగ్, లేజర్-కటింగ్ సహా విస్తృత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిస్టర్ గాక్స్ కార్యాలయాన్ని పూర్తి ఆటోమేటెడ్‌గా తయారు చేశారు.
దీనిని మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వారు చెప్పారు.
" చూడటానికి మరింత ఆహ్లాదకరంగా ఉండేలా, మిస్టర్ గాక్స్ ఆడుకోవడానికి మరింత ఎక్కువ స్థలాన్ని అందించేలా మా ఫీచర్లు ఉన్నాయి" అని వారు చెప్పారు.
నిజమైన విజయవంతమైన ఎగ్జిక్యూటివ్ లాగా మిస్టర్ గాక్స్ తనకు నచ్చిన సమయంలోనే ట్రేడ్ చేస్తుంది. శుభ్రపరిచే సమయంలో తప్ప తన ఆఫీసులో వెళ్లే మార్గం ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంటుంది.
ఆసక్తి ఉన్న వీక్షకులు ఎవరైనా ఉంటే "మిస్టర్ గాక్స్ ఆఫీసులో ఉన్నారు" అనే తదుపరి లైవ్‌స్ట్రీమ్ నోటిఫికేషన్ వచ్చేదాకా వేచి ఉండాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- మంగమ్మ హోటల్ కరెంట్ బిల్ రూ. 21 కోట్లు
- పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
- తాలిబాన్ల ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, రష్యా ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు..
- భారతదేశపు రాజులు నిజంగానే ‘ఆడంగి లక్షణాలు’ ఉన్న, మగతనం లేని అసమర్ధులా?
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ‘కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)