You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎవర్ గ్రాండ్: ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కుప్పకూలుతుందని చైనా ఎందుకు భయపడుతోంది?
ఎవర్ గ్రాండ్. చైనాకు చెందిన ఈ బిజినెస్ జెయింట్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. పతనానికి చేరువలో ఉన్న ఈ కంపెనీ పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. మరి, నిజంగానే ఆ సంస్థ కుప్పుకూలుతుందా?
అప్పుల్లో కూరుకుపోయిన ఎవర్ గ్రాండ్ తన అప్పులకు సంబంధించిన సుమారు 84 మిలియన్ డాలర్ల( సుమారు రూ.619 కోట్లు) వడ్డీని చెల్లించాల్సి వచ్చింది.
ఈ వారంలోనే తన పెట్టుబడిదారులకు డబ్బును వెనక్కి ఇవ్వడం ప్రారంభించిన ఆ కంపెనీ, నగదును సమీకరించలేక పోవడంతో ఆస్తుల రూపంలో చెల్లింపులు జరుపుతోంది.
ఎవర్ గ్రాండ్ ఏం చేస్తుంది?
ఎవర్ గ్రాండ్ వ్యవస్థాపకుడు హుయి కా యాన్. చైనాలోని గ్వాంగ్ఝౌలో 1996 సంవత్సరంలో స్థాపించిన ఈ సంస్థను మొదట్లో హెంగ్డా గ్రూప్ అని వ్యవహరించేవారు.
చైనాలోని 280 నగరాలలోని సుమారు 1300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఈ కంపెనీ సొంతం. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఈ సంస్థ ఇతర కార్యకలాపాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించింది.
వెల్త్ మేనేజ్‌మెంట్ నుంచి, ఎలక్ట్రిక్ కార్లు, ఫుడ్స్, డ్రింక్స్ తయారీ వరకు ఈ సంస్థ కార్యక్రమాలు విస్తరించాయి. గ్వాంగ్ఝౌ ఎఫ్‌సి పేరుతో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌ను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.
ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఈ సంస్థ అధినేత వ్యక్తిగత సంపద 10.6 బిలియన్ డాలర్లు ఉంటుంది.
ఎవర్ గ్రాండ్ ఎందుకు సమస్యల్లో చిక్కుకుంది?
సుమారు 300 బిలియన్ డాలర్ల రుణాలను సమీకరించి చైనాలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఎగర్‌గ్రాండ్ అవతరించింది.
అయితే గత ఏడాది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర పెద్ద ఎత్తున ధనం పోగుపడటానికి వీలులేదు.
దీంతో తన వ్యాపారాలను నిలబెట్టుకోవడానికి ఎవర్ గ్రాండ్ తన ప్రాజెక్టులను చౌక ధరలకు, డిస్కౌంట్‌లకు కట్టబెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ తాను చేసిన అప్పులకు పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వచ్చింది.
ఈ పరిస్థితులలో ఎవర్ గ్రాండ్ కంపెనీ షేర్ విలువ 85% పడిపోయింది. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీల దగ్గర ఆ సంస్థ బాండ్ల విలువ కూడా పడిపోయింది.
ఎవర్ గ్రాండ్ కుప్పకూలితే ఏమవుతుంది?
ఎవర్ గ్రాండ్ సంస్థ కుప్పకూలితే అనేక సమస్యలున్నాయి. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ప్రజలు కొనుక్కున్న అనేక ఇళ్లకు సంబంధించి పనులు కూడా ప్రారంభం కాలేదు. ఈ సంస్థ కుప్పకూలితే వారు కట్టిన డిపాజిట్లన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇంకా ఈ సంస్థకు అనుబంధంగా అనేక కంపెనీలు పని చేస్తున్నాయి. కన్‌స్ట్రక్షన్, డిజైనింగ్ కంపెనీలన్నీ ఈ సంస్థ నష్టాల్లో కూరుకపోవడం వల్ల దెబ్బతిని మూతపడే ప్రమాదం ఉంది.
''ఈ సంస్థ పతనం చైనా ఆర్ధిక వ్యవస్థ మీద కూడా ఉంటుంది. దేశంలోని 171 బ్యాంకులు, 121 ఆర్ధిక సంస్థలకు ఎవర్ గ్రాండ్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఇది క్రెడిట్ క్రంచ్‌కు దారి తీస్తుంది'' అని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన మాటీ బెంకిక్ బీబీసీతో అన్నారు.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థకు ఈ క్రెడిట్ క్రంచ్ లాంటి పరిణామాలు అంత మంచివి కాదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల విదేశీ పెట్టుబడి దారులు కూడా వెనకడుగు వేస్తారని వారు చెబుతున్నారు.
పతనమయ్యే స్థాయికి చేరుతుందా?
ఎవర్ గ్రాండ్‌ని రక్షించడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
''ప్రజలను ఇబ్బందులు పెట్టేకన్నా, దానికి ఏదో మార్గం వెతికే ప్రయత్నం ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది'' అని మాటీ బెంకిక్ వ్యాఖ్యానించారు. అయితే, మరికొందరు మాత్రం దీనితో విభేదిస్తున్నారు.
''ప్రభుత్వం ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజ్‌ల కోసం ఎదురు చూడకుండా, ఎవర్ గ్రాండ్ తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తే మంచిది'' అని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ న్యూస్ పేపర్ ఎడిటర్ హు షిన్ చాటింగ్ యాప్ వీచాట్‌కు రాసిన ఓ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
కార్పోరేట్ రుణాలను నియంత్రించాలనుకుంటున్న బీజింగ్, ఈ బెయిలౌట్‌ను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా చూపాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
(రిపోర్టింగ్: పీటర్ హస్కిన్స్, కేటీ సిల్వర్)
ఇవి కూడా చదవండి:
- కెనడాలో ఒక సిక్కు 'కింగ్ మేకర్' ఎలా అయ్యారు?
- పాకిస్తాన్లో ఆగ్రహావేశాలు.. న్యూజీలాండ్, ఇంగ్లండ్‌లపై ప్రతీకారం తీర్చుకుంటామన్న రమీజ్ రాజా
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- ఒక్క భోజనం 40 వేల రూపాయలు.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు... ఏంటి దీని ప్రత్యేకత
- తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'
- ‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్.. చనిపోయే దాకా ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతానంటున్న కమలాత్తాళ్
- బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
- 'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'
- ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)