నాన్-ఫంజిబుల్ టోకెన్: స్కూల్ సెలవుల్లో తిమింగలం బొమ్మలు సృష్టించి రూ.3 కోట్లు సంపాదించాడు

బెన్యమిన్ అహ్మద్ అనే 12 సంవత్సరాల పిల్లాడు స్కూల్ సెలవుల్లో దాదాపు 2,90,000 పౌండ్లు అంటే రూ.2,93,27,236 సంపాదించాడు.

లండన్‌లో ఉండే బెన్యమిన్.. కంప్యూటర్‌లో వియర్డ్ వేల్స్ అనే ఆర్ట్‌వర్క్స్ సృష్టించాడు. వాటిని నాన్‌ ఫంజిబుల్ టోకెన్స్‌ (ఎన్ఎఫ్‌టీ)గా విక్రయించి కోటీశ్వరుడు అయిపోయాడు.

'వియర్డ్ వేల్స్' డిజైన్ బెన్యమిన్ రెండో డిజిటల్ ఆర్ట్ కలెక్షన్. అంతకుముందు అతడు మైన్‌క్రాఫ్ట్ స్పూర్తితో రూపొందించిన డిజిటల్ సెట్ కాస్త తక్కువకు అమ్ముడయ్యింది.

ఈసారి బెన్యమిన్ ఒక పాపులర్ పిక్సిలేటెడ్ తిమింగలాల మీమ్ ఇమేజ్, పాపులర్ ఆర్ట్ స్టైల్ తీసుకుని వియర్డ్ వేల్స్ తయారు చేశాడు.

కానీ ఎమోజీల్లా కనిపించే 3,350 రకాల తిమింగలాల సెట్‌ను సృష్టించడానికి అతడు తన సొంత ప్రోగ్రాంను ఉపయోగించాడు.

"ఆ తిమింగలాలన్నీ ఏర్పడుతుంటే, నా స్క్రీన్ మీద అవి మెల్లమెల్లగా జనరేట్ అవుతుంటే చూడ్డం చాలా ఆసక్తిగా ఉంటుంది" అన్నాడు బెన్యమిన్.

బెన్యమిన్ అహ్మద్ ఈ ఆర్ట్‌వర్క్‌లు అమ్మి సంపాదించిన డబ్బును ఎథేరియం క్రిప్టో కరెన్సీ రూపంలో దాచుకున్నారు.

అంటే ఈ క్రిప్టో కరెన్సీ విలువ పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఆ మొత్తం ఉన్న డిజిటల్ వాలెట్ హ్యాక్ అయినా, వేరే ఏదైనా అయినా అధికారుల నుంచి ఎలాంటి బ్యాకప్ ఉండదు.

విచిత్రం ఏమిటంటే.. బెన్యమిన్‌కు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.

నాన్-ఫంజిబుల్ టోకెన్ అంటే?

ఎన్ఎఫ్‌టీలతో ఏదైనా డిజిటల్ కళాకృతిని 'టోకనైజ్' చేయవచ్చు.

అంటే దాని క్రయ విక్రయాలకు డిజిటల్ రూపంలో ఓన‌ర్‌షిప్ సర్టిఫికేట్‌ను తయారు చేయడం అన్నమాట.

అయితే, కొనుగోలు చేసిన వారికి కళాకృతులను నిజంగా ఇవ్వరు. వాటి కాపీ రైట్ కూడా కొనుగోలు చేసిన వారికి ఇవ్వరు.

వైరల్ వీడియో వెర్షన్లను, మీమ్‌లను, ట్వీట్‌లను కూడా ఎన్ఎఫ్‌టీ కళారూపాల్లా అమ్ముకోవచ్చు.

బెంజమిన్ తన హాబీ గురించి ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేశాడు. కానీ ఇప్పుడు వచ్చిన క్రిప్టో సంపద గురించి తన క్లాస్‌మేట్స్‌కు ఇంకా తెలీదు.

ఎన్‌ఎఫ్‌టీ క్రియేట్ చేయడంతోపాటూ బెన్యమిన్‌కు స్విమ్మింగ్, బాడ్మింటన్, టైక్వాంటో అంటే కూడా ఇష్టమే.

"ఇందులోకి రావాలనుకునే పిల్లలకు నేనిచ్చే సలహా ఒకటే. మీ అంతట మీరో, మీ తల్లిదండ్రుల ఒత్తిడితోనో బలవంతంగా కోడింగ్‌లోకి రావద్దు. అంటే మీకు వంట ఇష్టమైతే వంట, డాన్స్ ఇష్టమైతే డాన్స్ అలా మీకు నచ్చిన దానినే చేయండి" అని బెన్యమిన్ అంటున్నాడు.

గర్వంగా ఉంది-తండ్రి

బెన్యమిన్ తండ్రి ఇమ్రాన్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఆయన ట్రెడిషనల్ పైనాన్స్‌ పనిచేస్తారు. కోడింగ్ నేర్చుకునేలా బెన్యమిన్, అతడి సోదరుడు యూసఫ్‌ను ఆయన ఐదారేళ్ల వయసులోనే ప్రోత్సహించారు.

సలహాలు, సాయం అందించే టెక్నాలజీ నిపుణుల బలమైన నెట్‌వర్క్ వల్ల ఈ పిల్లాడికి మరింత ప్రయోజనం కలిగింది. ఇమ్రాన్ ఇప్పుడు తన కొడుకును చూసి చాలా గర్వపడుతున్నారు.

"ఇది కాస్త సరదా ఎక్సర్‌సైజ్‌లా ఉంటుంది. కానీ, వాళ్లు దాన్ని త్వరగా నేర్చుకోగలరని నాకు మొదటే అర్థమైంది. వాళ్లు చాలా బాగా చేశారు" అని ఇమ్రాన్ చెప్పారు.

"తర్వాత మేం దానిని కాస్త సీరియస్‌గా ప్రారంభించాం. ఇప్పుడు ఇది ప్రతి రోజూ జరుగుతోంది. కానీ మనం దీనిని వాళ్లతో బట్టీ పట్టించలేం. నేను మూడు నెలల్లో కోడింగ్ నేర్చుకోబోతున్నా అని మనం చెప్పలేం. నా పిల్లలు సెలవులతో సహా ప్రతి రోజూ 20, 30 నిమిషాలు కోడింగ్ ఎక్సర్‌సైజ్ చేసేవాళ్లు" అని ఆయన చెప్పారు.

ఈ కుర్రాడు ప్రస్తుతం తన మూడో సెట్ కోసం సూపర్ హీరో థీమ్ కలెక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు.

తిమింగలాలు కనిపించేలా ఒక అండర్ వాటర్ గేమ్ కూడా తయారు చేయాలని బెన్యమిన్ అనుకుంటున్నాడు.

తన కొడుకు కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించలేదని ఇమ్రాన్ వంద శాతం కచ్చితంగా ఉన్నారు. అతడు క్రియేట్ చేసిన వాటిని ఆడిట్ చేయడానికి, తన సొంత డిజైన్లకు ట్రేడ్‌మార్క్ ఎలా పొందాలో సలహాలు ఇవ్వడానికి ఒక లాయర్‌ను కూడా నియమించారు.

కానీ ఎన్‌ఎఫ్‌టీల ప్రస్తుత ట్రెండ్‌పై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ఆదాయానికి ఉపయోగపడే అదనపు వనరుగా కళాకారులు చెబుతున్నారు. ఇవి భారీ ధరలకు అమ్ముడవుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

మరోవైపు అవి నిజంగా దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉపయోగపడతాయా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి.

"వీటిని కొనుగోలు చేయడంలో అసలు అర్థం లేదు. అక్కడ లేనిదాన్ని కొనాలనే ఆలోచనే వింతగా ఉంది" అని క్రిస్టీలో ఒకప్పుడు వేలంపాటలు నిర్వహించిన చార్ల్స్ ఆల్‌సాప్ ఈ ఏడాది ప్రారంభంలో బీబీసీతో అన్నారు.

"దానిలో పెట్టుబడి పెట్టేవారు కాస్త మూర్ఖులేనని చెప్పాలి. కానీ వాళ్లు తమ డబ్బు పోగొట్టుకోరనే నేను అనుకుంటున్నా" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)