అఫ్గానిస్తాన్: ఆగస్ట్ 31 తరువాత విదేశీ సేనలు ఉంటే తీవ్ర పర్యవసానాలు తప్పవు - తాలిబాన్ల హెచ్చరిక

దేశం విడిచి వెళ్లొద్దని, అఫ్గానిస్తాన్‌లోనే ఉండి దేశ పునర్నిర్మాణం కోసం పనిచేయాలని తాలిబాన్లు అఫ్గాన్ ప్రజలను కోరుతున్నారు.

దేశం విడిచివెళ్లాలనుకుంటున్నవారితో కలిసి ఎయిర్‌పోర్టులో బారులు తీరొద్దని తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ శహీన్ అన్నారు.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ... అఫ్గాన్‌ ప్రజలు కూడా ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్లొచ్చని, కానీ, విదేశీ బలగాలు వెళ్లిపోవడానికి తుది గడువైన ఆగస్ట్ 31 తరువాత వారు వెళ్లాలని అన్నారు.

''సరైన పత్రాలున్నవారిని ఎవరినీ అడ్డుకోవడం లేదు, అయితే, కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమైన తరువాత వారు ఎప్పుడైనా వెళ్లొచ్చు'' అన్నారు.

అయితే, ఆగస్ట్ 31 తరువాత విదేశీ సేనలు అఫ్గానిస్తాన్‌లో ఉంటే మాత్రం తీవ్ర పర్యవసానాలు తప్పవన్నారు.

ఆయన మాటలకు అర్థమేంటో.. ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఆయన వివరించలేదు.

మరోవైపు ఆగస్ట్ 31 తరువాత విదేశీ సేనలు అఫ్గానిస్తాన్‌లో ఉండాలా వద్దా అనే విషయంలో జీ7 దేశాలు నిర్ణయం తీసుకోవడానికి మంగళవారం వర్చువల్‌గా సమావేశమవుతున్నాయి.

పంజ్‌షీర్‌లో ఏం జరుగుతోంది?

పంజ్‌షీర్ లోయలోకి ప్రవేశించే మార్గంలో తాలిబాన్‌‌లు భారీ ఎత్తున సాయుధులను మోహరించేందుకు ప్రయత్నించారని అఫ్గానిస్తాన్ నేత అమరుల్లా సాలేహ్ చెప్పారు.

వారు అక్కడకు చేరుకోవడానికి ముందే అందరాబ్ లోయలో తాలిబాన్‌‌లకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

అక్కడ పోరాటం చేస్తున్న దళాలు సాలంగ్ హైవేను మూసివేశాయని, అలాంటి ప్రాంతానికి తాలిబాన్ ఫైటర్లు దూరంగా ఉండాలని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.

సాలేహ్ తాజా వ్యాఖ్యలపై తాలిబాన్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ, తమ ఫైటర్ల ద్వారా చర్చలు జరిపి ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం బీబీసీకి చెప్పారు.

కమాండర్ కారీ ఫసీహుద్దీన్ పంజ్‌షేర్‌లో ఈ యుద్ధానికి నేతృత్వం వహిస్తున్నట్లు తాలిబాన్ వర్గాల ద్వారా తమకు తెలిసిందని బీబీసీ ఉర్దూ చెప్పింది.

మరోవైపు తాము దాదాపు 300 మంది తాలిబాన్ ఫైటర్లను చంపామని తాలిబాన్ వ్యతిరేక వర్గాలు చెబుతున్నాయి. కానీ తాలిబాన్ నేతలు ఆ వాదనలను ఖండించారు.

‘అనుకూల ప్రచారం’

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి మద్దతుగా నిలిచిన మీడియా గ్రూపులు ఒకవైపు దేశంలో పరిస్థితి బాగానే ఉందని చూపించే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు తాలిబాన్ శత్రువులను హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి.

అఫ్గానిస్తాన్ అల్ ఎమారాహ్ టీవీ సిబ్బంది గత కొన్ని రోజులుగా కాబుల్ రోడ్లపై కనిపిస్తున్నారు. జనాలతో మాట్లాడుతూ, దేశంలో అంతా ఇప్పుడు మళ్లీ మామూలుగా ఉందని చూపించడానికి ప్రయత్నిస్తున్నారని రాయిటర్స్ చెప్పింది.

ఈ మీడియా సంస్థ తాలిబాన్ మద్దతుగా వీడియోలు ప్రసారం చేస్తుంటుంది.

సిటీ సెంటర్‌లో అల్-ఎమారాహ్ ప్రతినిధులు ఒక వ్యక్తిని "మీరు ఎంత కచ్చితంగా చెప్పగలరు" అని అడుగుతారు. వారు "వంద శాతం, భద్రత బాగుంది, ఇక్కడ దొంగలెవరూ లేరు, మేం చాలా సంతోషంగా ఉన్నాం" అని చెబుతున్నారు.

గత ఆదివారం అఫ్గానిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత కాబుల్‌లో అరాచక పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఇది దేశ ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించింది.

వేలాది ప్రజలు ఎయిర్ పోర్ట్ దగ్గర గుమిగూడి, దేశం వదిలి వెళ్లిపోవాలని ఎంతకైనా తెగిస్తుంటే, అల్-ఎమారహ్ మాత్రం తమ ఇంటర్వ్యూల ద్వారా దేశంలో అంతా బాగుందని చూపించాలని ప్రయత్నిస్తోంది.

శనివారం తాలిబాన్ ప్రతినిధులు చాలామంది టీవీ స్టూడియోకు చేరుకున్నారు. కాబుల్‌లో అన్ని రోడ్లూ సురక్షితంగా ఉన్నాయని ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

అఫ్గానిస్తాన్ జాతీయ చానల్లో ఉపదేశాలు

మరోవైపు తాలిబాన్ ఆదేశాలతో ప్రభుత్వ టీవీ చానల్లో మతపెద్దలు ఉపదేశాలు వినిపిస్తున్నారు.

బీబీసీ మానిటరింగ్ వివరాల ప్రకారం ఆగస్టు 20న అఫ్గానిస్తాన్ జాతీయ టీవీ చానల్ ఒక హెచ్చరికతో కూడిన ఉపదేశాలు ప్రసారం చేసింది. ఇస్లాం శత్రువులకు లొంగిపోకుండా ఉండాలని దేశ యువతను హెచ్చరించింది.

అఫ్గానిస్తాన్ మీద పట్టు సాధించిన తర్వాత ఈ చానల్ తాలిబాన్ల నియంత్రణలోకి వచ్చింది.

శుక్రవారం నమాజు తర్వాత జాతీయ టీవీలో ఒక మౌల్వీ ప్రసంగిస్తున్నారు. ఉపదేశాలు ఇస్తున్నారు.

"ఈ దేశంపై మీకు హక్కు ఉంది. దేశం మన తల్లి లాంటిది. మనకు జన్మనిచ్చే తల్లి ఒకరైతే, మతం మనకు మరో తల్లి లాంటిది" అని బోధిస్తున్నారు.

దేశాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్న తర్వాత మొదటి శుక్రవారమే జాతీయ టీవీలో నమాజు సమయంలో ఉపదేశాలు ఇవ్వాలని మౌల్వీలకు తాలిబాన్ ఆదేశాలు జారీ చేశారు.

జాతి నిర్మాణానికి అఫ్గాన్ ప్రజలందరూ ఏకమయ్యేలా వారిలో స్ఫూర్తి నింపాలని, శత్రువుల ప్రచారాలను తిప్పి కొట్టాలని వారికి సూచించారు.

దేశ యువతకు మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, దేశ మీడియాపై ఉందని మతపెద్దలు ఆ సమయంలో చెబుతుంటారు.

ఒకవైపు ప్రభుత్వ టీవీ చానల్లో మతపెద్దల ఉపదేశాలు ప్రసారం అవుతుంటే, మరోవైపు టోలో న్యూస్, అరియానా న్యూస్ టీవీ, వన్ టీవీ లాంటి ప్రైవేటు టీవీ చానళ్లు తమ మామూలు న్యూస్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్నాయి.

అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్న 146 మంది. ఇప్పటివరకూ 400 మంది తరలింపు

సోమవారం మరో 146 మంది భారత పౌరులను అఫ్గానిస్తాన్ నుంచి దోహా మీదుగా భారత్ చేరుకున్నారు. వీరంతా మూడు వేరు వేరు విమానాల్లో దిల్లీ చేరుకున్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

వీరితో కలిపి గత వారం రోజులుగా ఇప్పటివరకూ దాదాపు 400 మందిని అఫ్గానిస్తాన్ నుంచి సురక్షితంగా భారత్ తీసుకువచ్చారు.

ఆగస్టు 15న అఫ్గానిస్తాన్‌ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత దేశం నుంచి బయటపడాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

అయితే, తాము ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడబోమని తాలిబాన్‌లు చెబుతున్నారు. అయితే, ఆ సంస్థ గత చరిత్రను బట్టి చూస్తే వారి మాటలు నమ్మడం తొందరపాటే అవుతుందని నిపుణులు అంటున్నారు.

నిన్న అఫ్గానిస్తాన్ నుంచి 168 మంది భారత్ వచ్చారు.

ఇప్పటికే భారత రాయబారి, దౌత్యవేత్తలను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చిన భారత్ ఇప్పుడు అక్కడ చిక్కుకుపోయిన మిగతా భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

పంజ్‌షీర్ మీద దాడికి బయల్దేరిన వందలాది తాలిబాన్

వందలాది ఫైటర్లు పంజ్‌షీర్‌ లోయ వైపు బయల్దేరారని తాలిబాన్ నేతలు ఆదివారం రాత్రి చెప్పారు.

ఇప్పటికీ తాలిబాన్ నియంత్రణలోకి రాని అఫ్గానిస్తాన్‌లోని ప్రాంతాల్లో పంజ్‌షీర్ ఒకటి.

కాబుల్‌కు ఉత్తరంగా ఉన్న పంజ్‌షీర్‌ను తాలిబాన్ ప్రత్యర్థులకు కంచుకోటగా భావిస్తారు. అది ఇప్పుడు ముజాహిదీన్ మాజీ కమాండర్ అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ నియంత్రణలో ఉంది.

అమెరికాలో అల్ ఖైదా 9/11 దాడులకు రెండు రోజుల ముందు అహ్మద్ షా మసూద్‌ హత్యకు గురయ్యారు.

"పంజ్‌షీర్ ప్రాంతాన్ని శాంతియుతంగా తమకు అప్పగించడానికి స్థానిక అధికారులు ఒప్పుకోలేదు. అందుకే వందలాది ఇస్లామీ ఎమిరేట్ ముజాహిదీన్‌లు దానిని తమ నియంత్రణలోకి తెచ్చుకోడానికి ముందుకు వెళ్తున్నారు" అని తాలిబాన్ తమ ట్విటర్ హాండిల్లో చెప్పింది.

తాలిబాన్ కాబుల్ ఆక్రమణ తర్వాత వేలమంది పంజ్‌షీర్ ప్రాంతంవైపు వెళ్లిపోయారు.

తాలిబాన్‌ ఫైటర్లతో యుద్ధం కోసం తాము సుమారు 9 వేల మందిని సిద్ధం చేసినట్లు మసూద్ నాయకత్వంలోని దళాలు చెబుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌లోని ఎన్నో ప్రాంతాల నుంచి పారిపోయిన ప్రభుత్వ భద్రతా బలగాలు పంజ్‌షీర్ చేరుకున్నాయని కూడా మసూద్ సౌదీ అరేబియా మీడియా చానల్ అల్-అరబియాకు చెప్పారు.

అఫ్గానిస్తాన్ రక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామని, రక్తపాతం జరగవచ్చని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)