You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"అఫ్గానిస్తాన్ బానిస సంకెళ్లను తెంచుకుంది": పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
రాజధాని కాబుల్‌ను తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత అఫ్గానిస్తాన్ అంతటా అల్లకల్లోలంగా మారింది.
ప్రాణ భయంతో దేశం నుంచి ఎలాగైనా పారిపోవాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
టేకాఫ్ అవుతున్న విమానాన్ని ఎక్కేందుకు కూడా నిన్న కొందరు తెగించారు.
కాబుల్ విమానాశ్రయంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ "అఫ్గానిస్తాన్ బానిస సంకెళ్లు తెంచుకుంది" అని అన్నారు.
సోమవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇమ్రాన్‌ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అఫ్గానిస్తాన్ బానిస సంకెళ్లను తెంచుకుంది, కానీ మానసిక బానిసత్వ సంకెళ్లున్నాయే అవి తెగవు" అని ఆయన అన్నారు.
తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్న తర్వాత, అఫ్గానిస్తాన్ ప్రజలు తాలిబాన్ల గత ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుంటున్న సమయంలో ఆయన ఇలా అన్నారు.
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
"పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తాలిబాన్లను ప్రేమిస్తున్నారు. తాలిబాన్లు బానిస సంకెళ్లు తెంచుకున్నారని ఆయన చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు కొడుకులకు బదులు కూతుళ్లుంటే, వారు బ్రిటన్‌లో కాకుండా, అఫ్గానిస్తాన్‌లో ఉండుంటే ఏం జరిగేదో" అని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు.
మరోవైపు, అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన ప్రతి ఘటనా పాకిస్తాన్ రాజకీయాలు, వ్యూహంపై ప్రభావం చూపుతుందని పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌధరి అన్నారు.
"అన్ని పరిస్థితుల నడుమ పాకిస్తాన్ తన మార్గాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేం కాబుల్‌లో ఒక సంఘటిత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం. అందులో అన్ని రాజకీయ పార్టీలు, అఫ్గానిస్తాన్ ప్రజలు కూడా ఉండాలి"
"మేం ప్రయత్నించవచ్చు. మేం తాలిబాన్లను అమెరికాతో చర్చలకు సిద్ధం చేశాం. వారి మధ్య చర్చలు మొదలయ్యేలా చేశాం. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబాన్ల మధ్య మేం చర్చలు జరిగేలా చూశాం. కానీ తాలిబాన్లు అక్కడ మరోసారి ఒక్కో ప్రావిన్స్ స్వాధీనం చేసుకుంటూ వెళ్తుంటే, దానికి పాకిస్తాన్‌ను ప్రశ్నించకూడదు. ఆ ప్రశ్నను అమెరికా, నాటో, అఫ్గాన్ ప్రభుత్వాన్ని అడగాల్సి ఉంటుంది" అని అన్నారు.
అంతకు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ కూడా ఇదే అంశంపై మాట్లాడారు.
"చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం ఒక్కటే మార్గమని మేం భావిస్తున్నాం. అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం కొనసాగడాన్ని మేం చూడలేం. అఫ్గాన్ ప్రజలు సజీవంగా ఉండడం కాదు, మేం వారి అభివృద్ధిని చూడాలనుకుంటున్నాం" అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో విజయం సాధించినందుకు పాకిస్తాన్‌లోని పెద్ద మతతత్వ పార్టీలు జమాత్-ఎ-ఇస్లామీ, జమీయత్-ఉలేమా-ఎ-ఇస్లాం తాలిబాన్లకు శుభాకాంక్షలు తెలిపాయి. వారికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాయి.
తాలిబాన్లు, అఫ్గానిస్తాన్ గురించి ఇమ్రాన్ ఖాన్ బహిరంగ వ్యాఖ్యలు
అఫ్గానిస్తాన్, తాలిబాన్ల గురించి ఇమ్రాన్ ఖాన్ తరచూ ప్రకటనలు చేస్తూనే ఉంటారు.
ఇదే ఏడాది ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన "అఫ్గానిస్తాన్ స్థితిని అమెరికా నాశనం చేసింది" అన్నారు.
"అఫ్గానిస్తాన్ చరిత్ర తెలిసిన నాలాంటి వారు దీనికి ఎలాంటి సైనిక పరిష్కారం కనుగొనలేమని చెబుతూనే ఉన్నారు. అలా అన్నందుకు నాలాంటి వారిని అమెరికా శత్రువులుగా వర్ణిస్తారు. నన్ను తాలిబాన్ ఖాన్ అని కూడా అన్నారు" అని ఆయన చెప్పారు.
తాలిబాన్లు సైనిక సంస్థ కాదు
తాలిబాన్లు సైనిక సంస్థ కాదని కూడా ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
"వారు సాధారణ పౌరులు. తాలిబాన్లు అక్కడి ప్రభుత్వంలో భాగమవుతారు" అన్నారు.
పాకిస్తాన్‌కు తాలిబాన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో 'డీల్' చేసుకోవడంలో పాకిస్తాన్ ఈ బంధాన్ని ఉపయోగించుకుంటూ వస్తోంది.
అయితే తాలిబాన్లు మాత్రం తమపై పాకిస్తాన్ ప్రభావం లేదని చెబుతున్నారు. దానిని మంచి పొరుగు దేశంగా భావిస్తున్నారు.
పాకిస్తాన్‌లో 30 లక్షల మందికి పైగా అప్గాన్ శరణార్థులు ఉన్నారు. రెండు దేశాల మధ్య రెండున్నర వేల కిలోమీటర్ల పొడవున్న సరిహద్దు ఉంది.
తాలిబాన్లకు పాకిస్తాన్ సాయం చేస్తోందని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని అఫ్గానిస్తాన్ అప్పటి అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చింది.
జులైలో అప్పటి అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య తాష్కెంట్‌లో మాటల యుద్ధం కూడా జరిగింది.
కాపీ - సందీప్ సోనీ
ఇవి కూడా చదవండి:
- బీజేపీకి రూ.2.5 వేల కోట్ల విరాళాలు.. ఎలక్టోరల్ బాండ్లపై మళ్లీ తలెత్తుతున్న ప్రశ్నలు
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 102 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది..
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)