You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ పుట్టుక రహస్యం తేలాల్సిందే... ఎందుకంటే?
- రచయిత, బ్రిట్ యిప్, వెలేరియా పెరాసియో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కోవిడ్ మూలాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల నుంచి పారదర్శకమైన, శాస్త్రీయమైన అధ్యయన నివేదికను సకాలంలో ఆశిస్తున్నామని జి-7 నేతలు అన్నారు.
కోవిడ్ సంక్షోభానికి కారణమైన వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు శక్తిమంతమైన ప్రపంచ నాయకులు మద్దతు తెలపడం ఇది మొదటిసారి కాదు.
కరోనావైరస్ మూలాల గురించి నిశితంగా పరిశోధించి 90 రోజులలోగా నివేదికను ఇవ్వాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశోధనలో భాగంగా వైరస్ చైనా ల్యాబ్‌లో పుట్టిందనే వాదనను కూడా పరిశీలించాలని కోరారు.
వైరస్ ల్యాబ్ నుంచి పుట్టిందనే వివాదాస్పద ఊహలను కూడా చాలా మంది కుట్ర సిద్ధాంతంగా కొట్టిపారేశారు.
ఈ వాదనల వల్ల ఇప్పటికే ఇబ్బందికరంగా ఉన్న చైనా, పశ్చిమ దేశాల సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
ఇదంతా తమ ప్రతిష్టపై మచ్చ వేసేందుకు చేస్తున్న నిందా పూర్వక ప్రచారమని చైనా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.
వుహాన్ లో కోవిడ్ తొలి కేసు నమోదై ఇప్పటికి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ, ఈ వైరస్ ఎలా పుట్టిందనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది.
ఈ ప్రయత్నం వెనుక దాగిన సైన్స్ ఏంటి? రాజకీయాలకు అతీతంగా వెళ్లి ఈ వైరస్ పుట్టుక గురించి తెలుసుకోవడం ఎందుకు అవసరం?
వైరస్ గురించి మనకేం తెలుసు? ఏం తెలియదు?
2019 చివర్లో చైనాలో తొలి సార్స్ కోవిడ్ వైరస్ కేసు నమోదయింది. జూన్ 2021 నాటికి ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 17.8 కోట్ల మందికి సోకగా, 3.9 లక్షల మంది మరణించారు.
వుహాన్‌లో మొట్టమొదట బయటపడిన కేసులకు అక్కడ జంతువులను అమ్మే మార్కెట్ కారణం అని చెప్పారు.
అయితే, ఈ వైరస్ జంతువుల వైరస్ నుంచి మనుషులకు వ్యాపించిందని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు.
ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు పాకి, మనిషి నుంచి మనిషికి చాలా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది.
అయితే, ఈ వైరస్ వుహాన్ నగరంలో మార్కెట్‌కు దగ్గరగా ఉన్న ఒక బయో పరిశోధన శాల వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి పుట్టిందనే మరో వాదన కూడా తలెత్తింది.
ఈ పరిశోధన శాలలో శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో ఉండే కరోనావైరస్ గురించి గత దశాబ్ధ కాలంగా అధ్యయనం చేస్తున్నారు.
మహమ్మారి మొదలయిన తొలి దశలో ఈ వివాదాస్పద సిద్ధాంతానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరింత ప్రాచుర్యం కల్పించారు.
అది జీవాయుధంగా ప్రయోగించేందుకు మనుషులే కృత్రిమంగా తయారు చేశారని కూడా కొంత మంది ఆరోపించారు.
అప్పటి నుంచి జరిగిన పరిశోధనలు మాత్రం, ఈ వైరస్‌ను కృత్రిమంగా తయారు చేశారనడానికి వ్యతిరేకమైన ఆధారాలే ఇచ్చాయి.
"సార్స్ సిఓవి 2 వైరస్‌ను కృత్రిమంగా తయారు చేశారనే సిద్ధాంతాలకు ఆధారాలు లేవు" అని గత జులైలో ఒక శాస్త్రవేత్తల బృందం అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ప్రచురించింది.
ఈ వైరస్‌లో ముందుగానే ఉన్న వైరస్‌ల నుంచి పంపించిన జన్యుపరమైన వేలి ముద్రలు కానీ, సీక్వెన్స్‌లు కానీ లేవని, ఈ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
అయితే, ఈ వాదనను అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచి కూడా సమర్ధించారు. కావాలని తమను తాము చంపుకోవడానికి చైనా ఈ వైరస్‌ను సృష్టించి ఉండదని ఆయన అన్నారు.
అయితే, ఇది అనుకోకుండా ల్యాబ్ నుంచి లీక్ అయి ఉంటుందనే అంశం ఇటీవల కాలంలో తిరిగి వినిపిస్తోంది.
వైరస్ మూలం గురించి శోధన
ల్యాబ్ ద్వారా లీక్ అయిన జంతువుల నుంచి సేకరించిన వైరస్, గబ్బిలాల నుంచి సహజంగా మనుషులకు వ్యాపించిన వైరస్ - ప్రచారంలో ఉన్న ఈ రెండు సిద్ధాంతాలను కూడా పరిశోధించాలనే ఆలోచనను కొంత మంది శాస్త్రవేత్తలు సమర్థిస్తున్నారు.
ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అవ్వడం అనే వాదనను పూర్తిగా కొట్టిపారేయడానికి లేదని, ఆస్ట్రియా, జపాన్, స్పెయిన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే, దీని గురించి నిజానిజాలు తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని చైనాకు పంపింది. కానీ, సార్స్ సిఓవి 2 వైరస్ ఎక్కడ నుంచి పుట్టిందనేది మాత్రం ఆ నివేదికలో తేల్చలేదు. ఈ నివేదికలో జవాబులు కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ అంశం పై మరిన్ని పరిశోధనలు చేయాలని కోరుతూ మే నెలలో 18 మంది శాస్త్రవేత్తలు కలిసి సైన్స్ పత్రికలో లేఖ రాశారు.
"సహజంగా వైరస్ పుట్టిందా, ల్యాబ్‌లో పుట్టిందా అనే రెండు సిద్ధాంతాలను సీరియస్‌గా పరిగణించి పరిశోధించాలని ఆ శాస్త్రవేత్తలు వక్కాణించారు.
ఈ పరిశోధన పారదర్శకంగా, లక్ష్యం దిశగా, డేటా ఆధారంగా జరగడంతో పాటు, స్వతంత్ర పర్యవేక్షణ కూడా జరగాలని అన్నారు.
ఈ ఉత్తరం రాసిన వారిలో యేల్ మెడిసిన్ స్కూలులో ఇమ్మ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ అకీకో ఇవాసకీ చెప్పారు.
భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను నివారించాలంటే, ఈ వైరస్ మూలాల గురించి తెలుసుకోవడం చాలా అవసరమని ఆమె పట్టుబట్టారు.
"వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు పాకి ఉంటే, భవిష్యత్తులో గబ్బిలాలకు దగ్గరగా వెళ్లకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
అలాగే, గబ్బిలాలకు దగ్గరగా వెళ్లిన మనుషుల పై మరింత పర్యవేక్షణ పెంచాలని, ఆమె బీబీసీకి చెప్పారు.
ఒకవేళ, వైరస్ ప్రమాదవశాత్తు ల్యాబ్ నుంచి లీక్ అయితే, అదెలా జరిగిందో పరిశీలించి, అలాంటి ప్రమాదాలు జరగకుండా మరిన్ని రక్షణ చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ అభిప్రాయంతో గ్లాస్గో యూనివర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ రాబర్ట్‌సన్ సమర్థిస్తున్నారు.
"ఒకవేళ ఈ వైరస్ పుట్టుకకు వుహాన్ లో ఉన్న సంస్థ పాత్ర ఉన్నప్పటికీ కూడా, ఈ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ, వైరస్ ల్యాబ్ నుంచి పుట్టిందని చెప్పడానికి మహమ్మారికి ముందు వారు వ్యవహరిస్తున్న వైరస్ లు సార్స్ సిఓవి 2 వైరస్ కు ఎక్కడా దగ్గరగా లేవు" అని రాబర్ట్ సన్ చెప్పారు.
ల్యాబ్ లీక్ సిద్ధాంతం, వైరస్ సహజంగా పుట్టడాన్ని ఒకే విధంగా చూడడాన్ని ఆయన కొట్టి పడేస్తున్నారు.
ఈ రెండు సిద్ధాంతాలు సాధ్యమైనవే అయినప్పటికీ, వైరస్ సహజంగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు లభించిన శాస్త్రీయ సమాచారం ప్రకారం, చాలా మంది శాస్త్రవేత్తలు వైరస్‌ను సహజ పరిణామంగానే భావిస్తున్నారు.
ల్యాబ్ నుంచి వైరస్ పుట్టిందనే సిద్ధాంతం గురించి లోతుగా విశ్లేషణ జరగకపోవడం వలన ఈ వాదన బలహీనంగా ఉందని మరికొందరు అంటున్నారు.
సహజ పరిణామమా లేక ల్యాబ్ లో జరిగిన ప్రమాదమా?
ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు పాకిందని నమ్మేవారికి - ప్రకృతి నుంచి పుట్టిన వైరస్‌లు ఎగిరి మనుషులకు వ్యాప్తి చెందడం వల్లే తీవ్రమైన అంటు రోగాలు ప్రబలినట్లు ఎపిడెమియాలజీ చరిత్ర అందించిన ఆధారాలు చెబుతున్నాయి.
ఇన్‌ఫ్లుయెంజా, హెచ్ఐవి, ఎబోలా, మెర్స్ విషయంలో ఇలాగే జరిగింది.
చైనా గబ్బిలాల్లో మనుషులకు సంక్రమించే సామర్ధ్యం ఉన్న కరోనా వైరస్‌లు ఉన్నట్లు మహమ్మారికి ముందే పొందుపరిచిన సమాచారం బట్టీ తెలుస్తోంది.
వుహాన్ ల్యాబ్‌లో జరుగుతున్న పరిశోధన కూడా ఇదే విషయాన్ని తెలియచేస్తోంది.
అయితే, వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందని వాదిస్తున్న వారు మాత్రం అనేక రకాల కరోనా వైరస్‌లకు స్థావరంగా ఉన్న అత్యంత భద్రతాయుతమైన కేంద్రాలు ఉన్న నగరం నుంచి లీక్ అవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వాదనను సమర్ధించుకునేందుకు, పరిశోధన శాలలో 2019లో ముగ్గురు శాస్త్రవేత్తలు అనారోగ్యానికి గురైనట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికను వాళ్ళు ఉటంకిస్తున్నారు. అయితే, ఈ వాదనను చైనా అధికారులు గట్టిగా ఖండించారు.
అయితే, సార్స్ సిఓవి 2 ను పోలిన ఆర్ ఏ టి జి 13 అనే సహజంగా కనిపెట్టిన కరోనావైరస్ కేవలం సిఓవి 2 వైరస్ లో 96 శాతం మాత్రమే జీనోమ్‌ను షేర్ చేసుకుంటుందనే వాస్తవం పై ల్యాబ్ లీక్ సిద్ధాంతం ప్రచారం అవుతోంది. మరి, అలాంటి వైరస్ 18 నెలల తర్వాత కూడా మరే జంతువులోనూ లభించలేదెందుకని ప్రశ్నిస్తున్నారు.
భవిష్యత్తులో మహమ్మారులకు చెక్ పెట్టాలంటే...
ఒక వైపు కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంటే, భవిష్యత్తులో మహమ్మారులు తలెత్తకుండా ఆపాలంటే, ఈ వైరస్ మూలాలను శోధించాల్సిందే అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
"జబ్బులకు కారణమయ్యే వైరస్‌లు చాలా ఉన్నాయి. కానీ, వైరస్ వల్ల మహమ్మారులు తలెత్తకుండా ఆపేందుకు వాటికి సమాధానాలు తెలుసుకోవడం చాలా అవసరం" అని సైంటిఫిక్ అమెరికన్ సీనియర్ ఎడిటర్ జోష్ ఫిస్చ్ మ్యాన్ ఇటీవల రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
అయితే, ఈ పరిశోధనల ఫలితాలు వైద్య రంగం పైనా, ప్రజారోగ్యం పైనా ప్రభావం చూపిస్తాయి.
దీని మూలాలను తెలుసుకోవడం వల్ల స్టీరియో టైపు అభిప్రాయాలను తిప్పికొట్టి, జాత్యహంకారపు ఊహాగానాలను ఆపుతుంది.
"ఆధార రహితంగా చేసిన వాదనల వల్ల అమెరికాలో ఆసియా వ్యతిరేక జాతి వివక్షను ప్రోత్సహించింది. దాంతో, కొన్ని వందల హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి" అని ఫిస్చ్‌మ్యాన్ రాశారు.
ఇది జంతువులను అమ్మే మార్కెట్ నుంచే పుట్టినట్లైతే, ఆసియా లో ప్రముఖంగా ఉండే వెట్ మార్కెట్ లతో పాటు పశువుల పెంపకానికి, వన్యప్రాణుల వాణిజ్యం విషయంలో మరిన్ని కఠినమైన నిబంధనలు విధించాలి.
ఈ వైరస్ ల్యాబ్ నుంచి పుట్టడం నిజమే అని నిరూపణ అయిన పక్షంలో, అది ప్రస్తుతం జరుగుతున్న అత్యున్నత స్థాయి పరిశోధనలను సవాలు చేస్తుంది. ఇది జీవభద్రత పరిశోధన శాలల్లో మరిన్ని కొత్త నిబంధనలు విధించడానికి దారి తీయవచ్చు.
ఈ వైరస్ మరో దేశం నుంచి దిగుమతి అయిన మాంసం నుంచి వచ్చి ఉంటుందనే మరో సిద్ధాంతాన్ని కూడా చైనా ప్రచారం చేస్తోంది.
దీనికి ఆ దేశంలో వైరాలజిస్టులు పరిశోధన చేశారనే వాదన వినిపిస్తోంది.
ఇదే సిద్ధాంతం గనక నిజమైతే, ఇది అంతర్జాతీయ వాణిజ్యం, ఆహార రవాణా, ఇతర వాణిజ్య పరిశ్రమల పైనా ప్రభావం చూపిస్తుంది.
కచ్చితమైన సమాధానం లభిస్తుందా?
సైన్స్ ఎప్పుడూ కొత్తగా ఆధారాలు లభిస్తున్న కొలదీ, పాత సిద్ధాంతాలను సవరించుకుంటూ, ఒక్కొక్కసారి వాటిని పూర్తిగా తిరగరాస్తూ తనను తాను సరిదిద్దుకుంటూనే ఉంటుంది.
మనకు ఎప్పటికీ ఈ వైరస్ గురించి ఒక నిర్దిష్టమైన జవాబు దొరకదు. ఒకవేళ దొరికినా కూడా, కొత్త జబ్బులు ఎక్కడ నుంచి పుడుతున్నాయనే విషయం తెలుసుకునేందుకు చాలా సంవత్సరాలు పట్టవచ్చు.
ఉదాహరణకు సార్స్ వైరస్ తలెత్తిన 15 సంవత్సరాల వరకూ ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వచ్చినట్లు నిర్ధారణ కాలేదు. ఈ వైరస్ సోకి 800 మంది మరణించిన తర్వాత 2017లో ఈ విషయం నిర్ధరణ అయింది.
హెచ్ఐవి మీద ప్రపంచ దృష్టి 1980లలో పడింది. అప్పటి నుంచి హెచ్ఐవి 7.6 కోట్ల మందికి సోకింది. దీని గురించి అవిశ్రామ పరిశోధన చేసినప్పటికీ కూడా 2000 దశకం మధ్య వరకూ ఈ వైరస్‌కు అడవి చింపాంజీలతో సంబంధం ఉందని అర్ధం కాలేదు.
కరోనావైరస్ విషయంలో మరిన్ని కొత్త వైరస్ లు బయటపడుతూ ఉండటంతో ఈ పరిశోధన మరింత ఒత్తిడితో కూడుకుని ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కరోనావైరస్ సహజంగానే తలెత్తి ఉంటుందని చరిత్ర, సైన్స్ కూడా సూచిస్తున్నాయి.
"మొదటినుంచీ రాజకీయాలే నిర్దేశించిన ఈ శోధన రాజకీయాలను తప్పించుకుని అయితే జరగదు" అని రోజర్స్ అంటారు.
ఈ వైరస్ మూలాలు తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలు, రాజకీయ పరికరాలుగా మారిపోయే అవకాశం ఉందని, ప్రొఫెసర్ ఇవాసాకి అన్నారు.
"తప్పును ఇతరుల పైకి తోయడం వల్ల వచ్చే ఫలితాల గురించి నాకు బాగా తెలుసు. ఆసియన్లపై ద్వేషం బయటపడకుండా చేయడమే మేము చేయగలిగే ఆఖరి పని" అని ఇవాసాకి అన్నారు.
ల్యాబ్ , ఫ్రంట్ లైన్
వైరస్ గురించి చేసే పరిశోధన సురక్షితమైన పరిశోధనా వాతావరణాన్ని సృష్టిస్తుందనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను వేధిస్తోంది.
ఈ వైరస్ ఒక వేళ ల్యాబ్ నుంచి లీక్ అయిందని నిరూపణ అయి, కొత్త భద్రతా నిబంధనలను అమలు పరిచినా కూడా వైరస్ తిరిగి తలెత్తకుండా ఉంటుందనడానికి భరోసా ఏమి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గతంలో కూడా వైరస్‌లు, క్రిములు పరిశోధన శాలల నుంచి బయటకు వచ్చి మనుషులకు వ్యాపించాయి.
1977లో రష్యాలో వచ్చిన ఫ్లూ, 2004లో సార్స్ వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
సైన్సు, వైద్యం పురోగతి కోసం పని చేసే హై సెక్యూరిటీ ల్యాబ్‌లకు కూడా అంతర్గతంగా ఈ ముప్పు పొంచి ఉంది.
వైరస్ మూలాలు తెలుసుకోవడం అవసరమే కానీ, అది ప్రస్తుతం ప్రాధాన్యత వహించాల్సిన అంశం కాదని మరికొందరు అంటారు.
"ఒక డాక్టరుగా ప్రాణాలు కాపాడడమే నా బాధ్యత" అని హైతీ లో కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ మేరీ మార్సెల్ డెస్‌చాంప్ అన్నారు.
శాస్త్రవేత్తలు మరింత అత్యవసరంగా చేయాల్సిన పనులున్నాయి అని ఈ డాక్టర్ అంటారు.
"మా దగ్గర చాలా తక్కువ వనరులు ఉన్నాయి. మేము ముందు ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా చూడాలి. వైరస్ పుట్టుక గురించి తెలుసుకుంటూ ఉండటం వల్ల నా విధి నిర్వహణకు ఏ విధంగానూ సహకరించదు" అని ఆమె బీబీసీతో అన్నారు.
"అయితే, దీర్ఘకాలంలో ప్రపంచంలో వైద్య అత్యవసర పరిస్థితి తలెత్తకుండా ఆపేందుకు ఉపయోగపడుతుంది" అని అన్నారు.
అందుకే, "ఏమి జరిగిందో, ఎక్కడ నుంచి వచ్చిందో శాస్త్రీయంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది."
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)