You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
అమెరికాతో కూడా తమ దేశం 'చర్చలకు, ఘర్షణకు' రెండింటికీ సిద్ధమవుతోందని కూడా కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ముఖ్యంగా, అవసరమైతే ఘర్షణకు పూర్తి స్థాయిలో తమ దేశం సిద్ధమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాలన మీద కిమ్ ఆ విధంగా తొలిసారి వ్యాఖ్యానించారు. అమెరికాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం చేసిన దౌత్యపరమైన ప్రయత్నాలను ఉత్తర కొరియా గతంలో తోసిపుచ్చింది.
ప్యోంగ్‌యాంగ్‌లో పార్టీ సీనియర్ లీడర్లతో ఏర్పాటైన సమావేశంలో కిమ్ మాట్లాడుతూ, "మన దేశ స్వతంత్ర అభివృద్ధిని, ప్రయోజనాలను, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమైతే ఘర్షణకు కూడా పూర్తిగా సిద్ధం కావాలి" అని అన్నారని ఉత్తర కొరియా అధికారిక మీడియీ కేసీఎన్ఏ తెలిపింది.
దేశంలో ఆహార కొరతను అంగీకరించిన కిమ్
ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి అధికారికంగా అంగీకరించారు.
దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు.
కిందటి ఏడాది తుఫానుల వల్ల చెలరేగిన వరదల కారణంగా వ్యవసాయ రంగం తగినంత ధాన్యం ఉత్పత్తి చేయలేకపోయిందని కిమ్ అన్నారు.
ఉత్తర కొరియాలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఉత్తర కొరియా వార్తా సంస్థ ఎన్‌కె న్యూస్ ప్రకారం, కిలో అరటిపళ్లను మూడు వేల రూపాయలకు అమ్ముతున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా దేశ సరిహద్దులు మూసివేయడంతో, దిగుమతులు కూడా లేక ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది.
చైనాతో వ్యాణిజ్య సంబంధాలు తగ్గిపోయాయి. ఉత్తర కొరియా ఆహారం, ఎరువులు, ఇంధనం చైనా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది.
దీనికి తోడు అక్కడ చేపడుతున్న అణు కార్యక్రమాల కారణంగా ఆ దేశం అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటోంది.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో ఈ వారం ప్రారంభమైన అధికార వర్కర్స్ పార్టీ సమావేశంలో కిమ్ తమ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆహార కొరత గురించి చర్చించారు.
వ్యవసాయ ఉత్పత్తి తగ్గినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే దేశ పారిశ్రామిక ఉత్పత్తి పెరిగిందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అమెరికా గురించి మాట్లాడిన కిమ్, దక్షిణ కొరియాలతో సంబంధాలపై కూడా చర్చించాల్సి ఉంది. అయితే, ఆ వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తమ దేశం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కిమ్ అంగీకరించారు. ఇది చాలా అరుదైన విషయమని నిపుణులు భావిస్తున్నారు.
తమ ప్రజలను కొంతైనా కష్టాల నుంచి బయటపడేయడానికి మళ్ళీ 'ఆర్డ్యువస్ మార్చ్' ప్రారంభించాలని కిమ్, అధికారులకు పిలుపునిచ్చారు.
1990లలో నార్త్ కొరియాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్నే అధికారికంగా ఆర్డ్యువస్ మార్చ్ అంటారు.
సోవియట్ యూనియన్ పతనం తరువాత, ఉత్తర కొరియాకు అందవలసిన కీలక సహాయం నిలిచిపోయింది. దాంతో దేశంలో తీవ్రమైన కరవు ఏర్పడింది.
ఆ సమయంలో ఎంతమంది ఆకలితో చనిపోయారో కచ్చితంగా తెలియదు. కానీ దాదాపు 30 లక్షలమంది చనిపోయుంటారని అంచనా.
కిమ్ జాంగ్ ఉన్ మాటలకు అర్థమేమిటి? - బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ
కిమ్ బహిరంగంగా ఆహార కొరత సమస్య ఉన్నట్లు అంగీకరించడం చాలా అరుదైన విషయం. అయితే, ఇప్పటికే తమ ఆర్థిక ప్రణాళికలు విఫలమయ్యాయని ఆయన ఒప్పుకున్నారు.
తన తండ్రి తరువాత అధికారంలోని వచ్చినప్పుడు, ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందిస్తానని కిమ్ మాటిచ్చారు. కంచంలో అన్నం ఉంటుందని, నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని ప్రమాణం చేశారు.
ఇది జరగలేదు సరి కదా, ప్రజలు మరింత కష్టపడి పని చేసే పరిస్థితులు దాపురించాయి.
ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఉన్న పరిస్థితులను కరోనా మహమ్మారికి అంటగట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో అన్ని చోట్లా పరిస్థితులు ఇలాగే దిగజారిపోతున్నాయని పార్టీ అధికారులకు చెప్పారని ప్రభుత్వ మీడియా రిపోర్ట్ చేసింది.
బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అంతటా పరిస్థితులు బాగోలేవని నమ్మబలకడం సులువే.
కోవిడ్ 19ను ఎదుర్కోవడం "సుదీర్ఘమైన యుద్ధం" అని కూడా కిమ్ అభివర్ణించారు. అంటే సరిహద్దులు ఇప్పుడప్పుడే తెరుచుకోవని సూచిస్తున్నారన్నమాట.
స్వచ్ఛంద సంస్థలకు ఇది ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులు మూసివేయడంతో ఉత్తర కొరియా ప్రజలకు ఆహారం, ఔషధాలను అందించేందుకు వీలుపడట్లేదు. వస్తువుల సరఫరా ఆగిపోయి, పని చేసే సిబ్బంది దొరకక అనేక ప్రభుత్వేతర సంస్థలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లవలసి వస్తోంది.
ఉత్తర కొరియా ప్రభుత్వం ఎప్పుడూ స్వయం సమృద్ధికే ఓటు వేసింది. సరిహద్దులు మూసివేసి ప్రపంచం నుంచి దూరంగా జరిగిపోవడంతో ఇతర దేశాలను సహాయం కోరే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ సహాయాన్ని ఇదే పద్ధతిలో నిరాకరిస్తూ ఉంటే ఉత్తర కొరియా ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ నేరాలు: 'మా జీవితం మీ పోర్న్ సినిమా కాదు' అంటున్న దక్షిణ కొరియా స్పై కెమేరా బాధితులు
- ఉత్తర కొరియా: సైబర్ దాడులు చేసి 200 కోట్ల డాలర్లు కొట్టేసింది.. ఆయుధాల కోసం: ఐరాస రహస్య నివేదిక
- భారత్ - చైనా: గాల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?
- సుశాంత్ సింగ్ రాజ్పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ ఎమర్జెన్సీ అడ్డంకి అవుతుందా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- ఉత్తర కొరియా గూఢచర్య కార్యక్రమాల కోసం జపాన్ బీచ్లో అమ్మాయిల కిడ్నాప్
- ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కిమ్ జోంగ్ ఉన్: తాత కిమ్ ఇల్-సంగ్ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేత
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కిమ్ జోంగ్ ఉన్ పాలన భరించలేని ఉత్తర కొరియన్లు సరిహద్దులు దాటి ఎలా పారిపోతున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)