You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ ఎన్నికలు: ఇరాన్ రాజకీయ వ్యవస్థ ఎలా పని చేస్తుంది.. అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది
ఇరాన్‌లో అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? కీలకమైన పదవులను ఎవరు నియంత్రిస్తారు? సైన్యం ఎవరి కనుసన్నల్లో నడుస్తుంది?
సుప్రీం లీడర్
ఇరాన్‌లో సుప్రీం లీడర్ అత్యున్నత అధికారాలు కలిగి ఉంటారు.
1979లో ఇస్లామిక్ విప్లవం చోటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో ఇద్దరే ఇద్దరు సుప్రీం లీడర్లు పదవిలో ఉన్నారు.
అయతొల్లా రుహల్లా ఖొమైనీ (ఇరాన్ రిపబ్లిక్ వ్యవస్థాపకులు), ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన అయతొల్లా అలీ ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడర్లుగా ఉన్నారు.
షా మొహమ్మద్ రేజా పహ్లావిను పదవి నుంచి దించిన తర్వాత అయతొల్లా రుహల్లా ఖొమైనీ తన పదవికి అత్యున్నత అధికారాలు కల్పించుకున్నారు.
సుప్రీం లీడరే ఇరాన్ సైనిక దళాలకు కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉంటారు. దేశ భద్రతకు సంబంధించిన రంగాలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి.
ప్రధాన న్యాయమూర్తితో పాటు కీలకమైన గార్డియన్ కౌన్సిల్ సభ్యులు, మతాధికారులు, జాతీయ టెలివిజన్, రేడియో అధినేతలను కూడా ఆయనే నియమిస్తారు.
సుప్రీం లీడర్ చేతిలో ఉన్న కోట్ల విలువ చేసే కీలకమైన సంస్థలు ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను దాదాపుగా నియంత్రిస్తాయి.
ఖొమైనీ మరణం తర్వాత అయతొల్లా ఖొమైనీ 1989లో సుప్రీమ్ లీడర్ పదవిని చేజిక్కించుకున్నారు. ఆయన అధికారంపై పట్టు సాధించి.. పాలనా వ్యవస్థకు ఉన్న సవాళ్ళను అణగదొక్కారు.
అధ్యక్షుడు
ఇరాన్ అధ్యక్షుడిని నాలుగేళ్లకొకసారి ఎన్నుకుంటారు. వీరు రెండు విడతల కంటే ఎక్కువ సార్లు పదవిలో ఉండేందుకు వీలు లేదు.
రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు దేశంలోని రెండో అత్యున్నత స్థానంలో ఉంటారు. ఇరాన్ అధ్యక్షుడు కార్యనిర్వాహక యంత్రాంగానికి అధికారిగా ఉంటారు. రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత అధ్యక్షుని పైనే ఉంటుంది.
దేశీయ విధానాలతోపాటు విదేశీ వ్యవహారాలనూ అధ్యక్షుడు ప్రభావితం చేయగలడు. అయితే, దేశానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో అయినా, సుప్రీం లీడర్‌కే తుది అధికారాలు ఉంటాయి.
శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
గత రెండు విడతల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హసన్ రౌహానీ భారీ మెజారిటీతో గెలిచారు.
అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులను తొలుత గార్డియన్ కౌన్సిల్ ఆమోదించాలి. ఈ కౌన్సిల్‌లో 12 మంది మతపెద్దలు, న్యాయ నిపుణులు ఉంటారు.
ఈ సారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 590 మంది పోటీ చేసేందుకు నమోదు చేసుకోగా.. కేవలం ఏడుగురు అభ్యర్థులను మాత్రమే కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ఆమోదించింది.
మహిళలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి లేదు.
పార్లమెంట్
290 మంది సభ్యులుండే ఇరాన్ పార్లమెంటు మజిలీస్‌లో సభ్యులను నాలుగేళ్లకొకసారి ఎన్నుకుంటారు.
ఈ చట్టసభకు కొత్త చట్టాలను ప్రవేశపెట్టడంతోపాటు మంత్రులను, అధ్యక్షుడిని పదవీచ్యుతులనుచేసే అధికారాలు కూడా ఉంటాయి. కానీ, చట్టసభలో జారీ చేసే చట్టాలన్నిటినీ గార్డియన్ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది.
2020లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గార్డియన్ కౌన్సిల్ 7,000 మందికిపైగా అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి.. సంప్రదాయ వాదులకు లాభం చేకూర్చింది. అనర్హులుగా ప్రకటించిన వారిలో సంస్కరణ వాదులు, మితవాదులు ఎక్కువగా ఉన్నారు.
గార్డియన్ కౌన్సిల్
పార్లమెంటు జారీ చేసే చట్టాలను ఆమోదించేందుకు, తిరస్కరించేందుకు గార్డియన్ కౌన్సిల్‌కు అధికారం ఉంటుంది. ఇది ఇరాన్‌లో శక్తిమంతమైన సభ. చట్టసభలకు, అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం కూడా ఈ సభకు ఉంటుంది.
ఈ కౌన్సిల్‌లో సుప్రీం లీడర్ నియమించిన ఆరుగురు మత పెద్దలు, న్యాయవ్యవస్థ ఎంపిక చేసిన ఆరుగురు న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు. వీరందరి సభ్యత్వాన్ని పార్లమెంటు ఆమోదిస్తుంది.
వీరిని దశలవారిగా ఆరేళ్లకొకసారి నియమిస్తారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి కౌన్సిల్‌లో సగం మంది సభ్యులు మారుతూ ఉంటారు.
ఈ కౌన్సిల్‌లో చైర్మన్ అయతొల్లా అహ్మద్ జన్నతితో సహా సంప్రదాయవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.
అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్
ఇస్లామిక్ మత పండితులు, మతాధికారులతో కూడిన 88 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం లీడర్‌ను నియమించే బాధ్యతను చేపడుతుంది.
సుప్రీం లీడర్ పనితీరును కూడా నిపుణుల అసెంబ్లీ పర్యవేక్షిస్తుంది.
సుప్రీం లీడర్ ఒకవేళ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయిన పక్షంలో, ఆ నాయకుడిని పదవిలోంచి తప్పించే అధికారం కూడా ఈ అసెంబ్లీ సభ్యులకుంటుంది.
అయితే, ఇప్పటి వరకు సుప్రీం లీడర్ నిర్ణయాలను ఈ అసెంబ్లీ సవాలు చేసిన దాఖలాలు లేవు.
సుప్రీం లీడర్ మరణించినా లేదా విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినా, వారసుడిని ఎన్నుకునేందుకు నిపుణుల అసెంబ్లీ సీక్రెట్ ఓటును నిర్వహించి నాయకుడిని ఎన్నుకుంటుంది.
ఈ అసెంబ్లీ సభ్యులకు ప్రత్యక్ష ఎన్నికలు ప్రతీ 8 ఏళ్లకొకసారి జరుగుతాయి. ఇవి 2016లో జరిగాయి. ఇందులో సంస్కరణవాదులు, మితవాదులు 60 శాతం స్థానాలను సంపాదించారు. అంతకు ముందు వారి ప్రాతినిధ్యం కేవలం 25 శాతం మాత్రమే ఉండేది.
సంప్రదాయవాదుల వర్గానికి చెందిన అయతొల్లా అహ్మద్ జానాతి గార్డియన్ కౌన్సిల్‌కు అధినేతగా ఉన్నారు.
ఎక్స్‌పీడియన్సీ కౌన్సిల్
ఎక్స్‌పీడియన్సీ కౌన్సిల్ సుప్రీం లీడర్‌కు సలహాలు ఇస్తుంది. పార్లమెంటుకు, గార్డియన్ కౌన్సిల్‌కు మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంలో తుది నిర్ణయాన్ని వెలువరించే అధికారం ఈ కౌన్సిల్‌కు ఉంటుంది.
ఈ కౌన్సిల్‌లో ఉండే 45 మంది సభ్యులను సుప్రీం లీడర్ నియమిస్తారు. వీరిలో ముఖ్యంగా మత, సాంఘిక, రాజకీయ ప్రముఖులు ఉంటారు.
మాజీ ప్రధాన న్యాయమూర్తి అయతొల్లా సాదిఖ్ అమోలీ లారీ జానీ ఈ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నారు.
ప్రధాన న్యాయమూర్తి
ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిని సుప్రీం లీడర్ నియమిస్తారు. న్యాయవ్యవస్థ అధీనంలో ఉన్న కోర్టుల పర్యవేక్షణ, ఇస్లామిక్ చట్టాలు అమలయ్యేలా చూడటం ప్రధాన న్యాయమూర్తి బాధ్యత.
ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అతివాద వర్గానికి చెందిన ఇబ్రహీం రైసి కూడా గార్డియన్ కౌన్సిల్‌కు సభ్యులను నామినేట్ చేస్తారు.
దేశంలో ఉన్న భద్రత, ఇంటెలిజెన్స్ సేవలతో ఇక్కడి న్యాయవ్యవస్థ చేతులు కలుపుతూ... ప్రజల్లో వ్యతిరేకతను అణిచివేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
అస్పష్టంగా నిర్వచించిన జాతీయ భద్రతా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఓటర్లు
8.3 కోట్ల జనాభా కలిగిన ఇరాన్‌లో 5.8 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు వేసే హక్కు ఉంటుంది.
1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాతి నుంచి ప్రతిసారీ ఓటు వేసే వారి శాతం 50 శాతానికి పైనే ఉంటోంది. క్లెరికల్ వ్యవస్థ నియామకం, ఆర్ధిక వ్యవస్థ డీలాపడటంతో నిరుత్సాహం చెందిన ఓటర్లు 2020లో మాత్రం వోటింగ్‌కు దూరంగా ఉన్నారు.
సాయుధ దళాలు
ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జిసి) , సాధారణ సైన్యాన్ని కలిపి ఇరాన్ సాయుధ దళాలుగా పిలుస్తారు.
ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇస్లామిక్ విధానాన్ని సమర్ధించేందుకు, మిలటరీకి అదనపు సామర్ధ్యాన్ని ఇచ్చేందుకు ఐఆర్‌జిసిని నియమించారు. అప్పటి నుంచీ ఇది ఇరాన్‌లో ప్రధాన సైనిక, రాజకీయ, ఆర్ధిక శక్తిగా అవతరించింది. దీనికి సుప్రీం లీడర్‌తో దగ్గర సంబంధాలు ఉంటాయి.
ఐఆర్‌జిసికి ప్రత్యేకంగా సైనిక, నావికా, వాయు దళాలు ఉంటాయి. ఇది ఇరాన్ వ్యూహాత్మక ఆయుధాలను కూడా పర్యవేక్షిస్తుంది.
దీనితో పాటు పారా మిలటరీ బాస్జి రెసిస్టెన్స్ ఫోర్స్‌ను కూడా నియంత్రిస్తుంది. ఈ దళం జాతీయ వ్యతిరేకతను అణచివేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.
ఐఆర్‌జిసిలో సీనియర్ అధికారులు, మిలటరీ కమాండర్లను సుప్రీం లీడర్ నియమిస్తారు. ఈ దళాలన్నిటికి సుప్రీం లీడర్ కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఈ అధికారులందరూ సుప్రీం లీడర్‌కు జవాబుదారీగా ఉండాలి.
క్యాబినెట్
క్యాబినెట్‌లో మంత్రిమండలిని అధ్యక్షుడు ఎంపిక చేస్తారు. వీరందరినీ పార్లమెంటు ఆమోదించాలి. పార్లమెంటుకు మంత్రులను పదవీచ్యుతులను చేసే అధికారం కూడా ఉంటుంది.
క్యాబినెట్‌కు దేశాధ్యక్షుడు లేదా తొలి ఉపాధ్యక్షుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీరే క్యాబినెట్ వ్యవహారాలకు కూడా బాధ్యులుగా ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్ వీడియో టెక్ వ్యాపార సామ్రాజ్యాన్ని జయించిన ఇరానీ మహిళ
- ఏపీ: నూతన విద్యా విధానంతో వచ్చే మార్పులేంటి.. ఉపాధ్యాయ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఎందుకు పంపారు
- సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సీన్ తీసుకున్నారా... ప్రశ్నించిన బీజేపీ, స్పందించిన కాంగ్రెస్
- అజర్బైజాన్, అర్మేనియాల యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారనుందా?
- కరోనావైరస్ మృతుల విషయంలో ఇరాన్ ఎందుకు వాస్తవాలను దాచి పెడుతోంది...
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ‘ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా... అది నా ప్రాణాలు తీసే బులెట్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)