కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత? - Fact Check

    • రచయిత, కీర్తి దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత ఏడాది భారతదేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన దగ్గర నుంచీ ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ క్రమంలో, ఈ నెల 7వ తేదీన చేసిన ప్రసంగంలో రెండు ముఖ్య ప్రకటనలు చేశారు.

మొదటిది, జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు దాటినవారందరికీ ఉచితంగా వ్యాక్సీన్లు వేస్తారు. దీనికి అయ్యే ఖర్చంతా కేంద్రం భరిస్తుంది.

రెండవది, గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేద ప్రజలకు నవంబర్ వరకు ఉచితంగా రేషన్ అందిస్తారు.

ఈ రెండూ కాకుండా, ప్రధాని మోదీ ఆ ప్రసంగంలో మరో పెద్ద విషయాన్ని ప్రస్తావించారు.

"భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా వేగంగా జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా వేగంగా జరుగుతోంది" అని మోదీ అన్నారు.

దేశంలో తీవ్ర వ్యాక్సీన్ డోసుల కొరత నడుమ మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేశాయి.

ఈ నేపథ్యంలో మోదీ ఈ రకమైన వాదన చేశారు. ఈ వాదనలో నిజానిజాలను పరిశీలించేందుకు భారతదేశం, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో వ్యాక్సినేషన్ గణాంకాలను బీబీసీ సేకరించింది.

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నాలుగు దేశాలు ముందుంటాయి కాబట్టి ఈ తులనాత్మక అధ్యయనానికి వీటిని ఎన్నుకున్నాం.

అంతే కాకుండా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమెరికాతో పదే పదే పోల్చి చెప్పారు.

ఎంతమందికి టీకాలు వేశారు?

జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, 2021 జూన్ 6 నాటికి అమెరికాలో 30 కోట్ల 16 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను వినియోగించారు.

బ్రిటన్లో జూన్ 6 వరకు 7 కోట్ల డోసులు వాడారు. అదే, జర్మనీలో 5 కోట్ల 65 లక్షల డోసులు, ఫ్రాన్స్‌లో 4 కోట్ల కన్నా కాస్త ఎక్కువగా వ్యాక్సిన్ డోసులను వినియోగించారు.

కాగా, భారతదేశంలో జూన్ 6 వరకు 23 కోట్ల 27 లక్షల వ్యాక్సిన్ డోసులు వాడారు.

ఈ గణాంకాలను పరిశీలిస్తే వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని తెలుస్తోంది.

అయితే, పై గణాంకాలు మనకు పూర్తి వాస్తవాన్ని చూపించలేవు. వ్యాక్సీన్ విషయంలో డోసులు వృథా కావడం కూడా జరుగుతుంటుంది.

తక్కువ వృథాతో, ఎక్కువమందికి టీకాలు అందించడంపైనే వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయం ఆధారపడి ఉంటుంది.

ఈ దేశాల్లో టీకాలు వేయించుకున్నవారి సంఖ్యను పరిశీలిస్తే, జూన్ 7 నాటికి అమెరికాలో 13 కోట్ల 89 లక్షలమంది వ్యాక్సీన్ రెండు డోసులూ వేయించుకున్నారు.

జూన్ 6 నాటికి బ్రిటన్‌లో 2.7 కోట్ల కన్నా ఎక్కువమందికి రెండు డోసుల వ్యాక్సీన్లు వేశారు.

జర్మనీలో కోటి 81 లక్షల కన్నా ఎక్కువమందికి, ఫ్రాన్స్‌లో కోటి 29 వేల కన్నా ఎక్కువమందికి రెండు డోసులూ వేశారు.

ఇండియాలో జూన్ 6 నాటికి 4 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సీన్లు పూర్తయ్యాయి.

ఈ గణాంకాల దృష్ట్యా కూడా భారత్ రెండవ స్థానంలోనే ఉంది.

అయితే, ఒక డోసు తీసుకున్నవారి సంఖ్యను మాత్రమే పరిశీలిస్తే అమెరికా కన్నా భారతదేశం ముందుంది.

శాతాలు లెక్కలు ఎలా ఉన్నాయి?

తులనాత్మక అధ్యయనాల్లో సంఖ్యల కన్నా శాతాలు మనకు పూర్తి చిత్రాన్ని చూపిస్తాయి. మొత్తం దేశ జనాభాలో ఎంత శాతం వ్యాక్సీన్లు వేయించుకున్నారు అనేది పరిశీలించడం అవసరం.

ఈ ఐదు దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. అమెరికాలో 32.8 కోట్లు, బ్రిటన్ జనాభా 6.9 కోట్లు కాగా భారత జనాభా 131 కోట్లు. జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు మరీ చిన్నవి.

ఇక శాతాలను పరిశీలిస్తే, అమెరికాలో 42 శాతం, బ్రిటన్‌లో 41 శాతం, జర్మనీలో 21 శాతం, ఫ్రాన్స్‌లో 19 శాతం వ్యాక్సినేషన్ (రెండు డోసులూ) పూర్తయ్యింది.

కానీ, భారతదేశంలో కేవలం 3.28 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు వేశారు.

ఏ దేశాల్లో ఎన్నెన్ని రోజుల్లో టీకాలు వేశారు?

ఈ ఐదు దేశాల్లో ఎప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు అనేది చూడ్డం కూడా ముఖ్యమే.

అన్నిటికన్నా ముందుగా బ్రిటన్‌లో 2020 డిసెంబర్ 8న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. ఆ దేశంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సీన్లను ప్రజలకు అందిస్తున్నారు.

తరువాత 2020 డిసెంబర్ 14న అమెరికాలో, డిసెంబర్ 27న జర్మనీ, ఫ్రాన్స్‌లలో వ్యాక్సినేషన్ మొదలైంది. ఈ మూడు దేశాల్లోనూ మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు వేస్తున్నారు.

అందరికన్నా ఆలస్యంగా 2021 జనవరి 16న భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అందిస్తున్నారు.

వీటన్నిటినీ పరిశీలిస్తే మిగతా దేశాల కన్నా ఇండియాలో వ్యాక్సినేషన్ నెమ్మదిగానే జరుగుతోందని అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)