You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ వ్యాక్సీన్: పేద దేశాల్లో పెద్దవాళ్లకే వ్యాక్సీన్ లేనప్పుడు ధనిక దేశాల్లో చిన్నారులకూ టీకా వేయడంపై అభ్యంతరాలు
అమెరికా, కెనడా లాంటి దేశాల్లో 12 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సీన్ ఇస్తున్నారు. అయితే, పేద దేశాల్లో వైరస్ ముప్పు ఉన్న వయో వర్గాలను వదిలిపెట్టి ఇలా ధనిక దేశాల్లో చిన్నారులకు(కోవిడ్ రిస్క్ తక్కువగా చెబుతున్నారు) వ్యాక్సీన్ ఇవ్వడం అనైతికమని కరోనావైరస్ ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూపు సభ్యులతో నిపుణులు అన్నారు.
వ్యాక్సీన్ పంపిణీలో ఉన్న అసమానతలను సత్వరమే పరిష్కరించాలని ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ అభివృద్ధికి సహకరించిన ప్రొఫెసర్ ఆండ్రూ పోలార్డ్ అన్నారు. ఆయన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెక ట్రయల్స్‌కు నేతృత్వం వహించారు.
పేద దేశాల్లో వైరస్ ముప్పు ఉన్నవారిలో ఇంకా చాలా మందికి వ్యాక్సీన్ ఇవ్వవలసి ఉంది.
భయంకరమైన పరిస్థితులు
"మహమ్మారి సమయంలో ప్రజలు మరణించకుండా ఆపేందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సీన్ కార్యక్రమం అమలు చేస్తారు" అని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ పోలార్డ్ అన్నారు.
"నేను నేపాల్, బంగ్లాదేశ్‌లో పని చేశాను. అక్కడ నా సహోద్యోగులు చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అక్కడ వారికి సహకారం అందించడానికి నేషనల్ హెల్త్ సర్వీసు లేదు" అని ఆయన పార్లమెంటరీ గ్రూపుతో చెప్పారు.
"వైరస్ ముప్పు తక్కువగా ఉన్న చిన్న పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడానికి అనుమతివ్వడం నైతికంగా తప్పు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
"పిల్లల్లో వైరస్ బారిన పడి తీవ్రంగా అనారోగ్యం పాలవ్వడం కానీ, మరణించడం కానీ తక్కువగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ సమస్య
అమెరికా, కెనాడాలలో ఆమోదం పొందిన ఫైజర్ వ్యాక్సీన్ యుక్త వయస్కుల వారి పై కూడా ట్రయల్స్ పూర్తి చేసింది. వీరితో పాటు, చిన్న వయసు వారిపైనా కూడా ఇంకా రకరకాల కోవిడ్ వ్యాక్సిన్లను పరీక్షించారు.
"ప్రస్తుతం వ్యాక్సీన్ డోసులు ఎక్కువ అవసరం ఉన్న చోట్లకు వెళ్లేలా చూడటమే ఇప్పుడు ముఖ్యమైన అంశం. ఇది మన ఆర్ధిక వ్యవస్థలను ప్రభావితం చేసి వైద్య వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చే అంతర్జాతీయ సమస్య" అని ప్రొఫెసర్ పోలార్డ్ అన్నారు.
తక్షణ అవసరం
కరోనావైరస్ వల్ల 50 ఏళ్లు నిండిన వారు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని చాలా ప్రాంతాల్లో ఇంకా చాలా మంది వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరో వైపు వ్యాక్సిన్ల కొరత విచారించదగ్గ సమస్య అని ప్రచారకర్తలు హెచ్చరిస్తున్నారు.
భారతదేశం నుంచి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో కోవాక్స్ పధకంలో కూడా 140 మిలియన్ డోసుల వ్యాక్సీన్ కొరత ఏర్పడింది. కోవిడ్ వ్యాక్సిన్లను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కోవాక్స్ పథకాన్ని ఏర్పాటు చేశారు.
ధనిక దేశాల దగ్గర ఉన్న అదనపు వ్యాక్సీన్ సరఫరాలను ఇతరులతో పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పిలుపునిచ్చాయి. కొన్ని దేశాలు తమ జనాభాకు అవసరమైన దాని కంటే ఎక్కువగా వ్యాక్సీన్ డోసులను ఆర్డర్ చేశాయి.
70కు పైగా దేశాలకు 100 కోట్లకు పైగా వ్యాక్సిన్లను సరఫరా చేయాలని 54.8 కోట్ల పౌండ్లను ఇచ్చినట్లు యూకే ఫారిన్, కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసు ప్రతినిధి చెప్పారు.
భవిష్యత్తులో కోవాక్స్ పూల్‌లో ఉన్న అదనపు వ్యాక్సీన్లు అందుబాటులోకి రాగానే వ్యాక్సీన్లను ఇతరులతో పంచుకుంటామని యూకే చెప్పింది.
ప్రభుత్వాలు అత్యంత వేగంగా చర్యలు చేపట్టాలని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యమని పోలార్డ్ చెప్పారు. "లేదంటే ఇప్పటి నుంచి సెప్టెంబరు మధ్యలో కొన్ని లక్షల మంది మరణిస్తారు" అని చెప్పారు.
"దీని పై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరాంతం వరకు ఆగవలసిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.
"ఈ వ్యాక్సీన్లు అందుబాటులో లేని దేశాలకు కోవాక్స్ ద్వారా తిరిగి సరఫరా చేసే పనిని సత్వరమే చేపట్టాలి" అని ఆయన అన్నారు.
ధనిక దేశాలు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను అధికంగా కొనుగోలు చేస్తున్నాయని మరొకరు చెప్పారు. బూస్టర్ షాట్‌లతో కూడా ఇదే విధంగా చేస్తారేమోనని భయాన్ని వ్యక్తం చేశారు.
కానీ, పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాల్లో వీటిని ఉత్పత్తి చేయడం వల్ల ఈ పరిస్థితిని నివారించవచ్చు.
"పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా లాంటి దేశాల్లో కొన్ని సంస్థలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పొందగలిగాయి." అని అమెరికా డ్యూక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ పాలసీ ఇంపాక్ట్ ఇన్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ గావిన్ యామె చెప్పారు.
"వ్యాక్సీన్లను విరాళంగా ఇవ్వడం మంచిదే! కానీ, దానికి ఒక దీర్ఘకాలిక దృష్టి ఉండాలి" అని అన్నారు.
"ఈ మహమ్మారి మనతో కొన్నేళ్ల పాటు ఉండవచ్చు. ఇది పూర్తిగా దానంలా కొనసాగితే, ధనిక దేశాల స్టాక్ తగ్గిపోవడం మొదలు కాదా? అలా జరగడం దీర్ఘకాలిక దృష్టి అనిపించుకోదు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)