You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్ నిరసనలు: ఆంక్షలను లెక్క చేయని ప్రజలు... తలకు తీవ్ర గాయమై మృత్యువుతో పోరాడుతున్న మహిళ
మియన్మార్‌లో సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఒక మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
రాజధాని నేపీతాలో ప్రదర్శనకారులను తరిమేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, రబ్బర్ బులెట్లు ప్రయోగించినప్పుడు ఆ మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
ఆ మహిళ తలకు షూట్ చేశారని మానవ హక్కుల సంఘాలు, వార్తా సంస్థలు చెబుతున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, దాని వల్ల చాలా మందికి గాయాలయ్యాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఇంతవరకూ ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదు.
సైనిక కుట్రతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని పడగొట్టడాన్ని నిరసిస్తూ సైనిక లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూను, నిషేధాజ్ఞల్ని కూడా వారు లెక్క చేయడం లేదు.
వరుసగా అయిదో రోజైన బుధవారం కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాజధానిలో సివిల్ సర్వెంట్లు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు.
తూర్పు ప్రాంతంలోని కాయా రాష్ట్రంలో పదుల సంఖ్యలో పోలీసులు కూడా నిరసనకారులతో చేయి కలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు.
'మియాన్మర్ నవ్' పత్రిక కథనం ప్రకారం 'మేం ప్రజలతోనే ఉన్నాం' అనే పోస్టర్లను వారు పట్టుకున్నారు.
ఈ ప్రదర్శన వద్ద ఒక వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ, '40 మంది దాకా పోలీసులు మాతో కలిసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మా మీదకు వస్తున్న పోలీసుల నుంచి వారు మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేశారు' అని చెప్పారు.
మంగళవారం ఏం జరిగింది...
మియన్మార్ రాజధాని నేపీటాలో నిరసన ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని ధిక్కరించి వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి రావడంతో, పోలీసులు వారిపై రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు.
వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఇద్దరు నిరసనకారులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
మియన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలటూ వేలాదిమంది నిరసనల్లో పాల్గొంటున్నారు.
సోమవారం నిరసన ప్రదర్శనలపై కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ, వరుసగా నాలుగో రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి.
దేశంలోని పలు నగరాల్లో బహిరంగ సభలపై నిషేధం, రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.
ఎవరూ చట్టానికి అతీతులు కారని మిలటరీ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు బర్మీస్ ప్రభుత్వ టీవీ ఛానెల్ తెలిపింది.
నిర్బంధంలో ఉన్న తమ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) సీనియర్ నేతలను విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల్లో కుట్ర జరిగిందనే నిరాధారమైన ఆరోపణలతో ఫిబ్రవర్రి 1న మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆంగ్ సాన్ సూచీతో పాటూ, ఆ దేశ ప్రెసిడెంట్ విన్ మింట్, ఇతర పార్లమెంటు సభ్యులనూ నిర్బంధించింది. దేశంలో ఏడాదిపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
పరిస్థితి ఎలా ఉద్రిక్తం అయ్యింది?
మంగళవారం ఉదయం నేపీటాలో నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించడం మొదలుపెట్టారు.
అయితే, ఆందోళకారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని తమపై కొడుతున్న నీటిని తట్టుకుని అలాగే నిలబడ్డారని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.
"సైనిక నియంతృత్వం అంతం కావాలి" అంటూ వారంతా నినాదాలు చేశారు.
వారిని హెచ్చరిస్తున్నట్లుగా పోలీసులు మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. తరువాత నిరసనకారులపై రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఇద్దరు ఆందోళనకారులకు తలపై, ఛాతీపై తీవ్ర గాయాలైనట్లు నేపీటా ఆసుపత్రిలోని ఒక డాక్టర్ తెలిపారు.
గాయపడిన మరో ముగ్గురికి చికిత్స అందించానని ఎమర్జెన్సీ క్లినిక్‌లోని మరొక డాక్టర్ తెలిపారు. వీరికి రబ్బరు బుల్లెట్ల వల్లే గాయాలు అయినట్లు అనుమానిస్తున్నారు.
పలుచోట్ల పోలీసులు కూడా నిరసనకారుల్లో చేరి ఆందోళనల్లో పాల్గొంటున్నారని, బ్యారికేడ్లు తెరిచి నిరసనకారులకు దారి ఇస్తున్నారని కథనాలు వచ్చాయి.
మియన్మార్‌లో 1988, 2007లలో సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
నిరసనకారులు ఏమంటున్నారు?
"బహిరంగ సభలపై నిషేధం ఉందని తెలిసే మేము ఇక్కడకు వచ్చాం" అని నిరసనల్లో పాల్గొన్న ఒక వ్యక్తి చెప్పారు.
మియన్మార్‌లో జరుగుతున్న ప్రజా ఉద్యమంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో వారంతా యాంగాన్ నగరంలో ఉన్న ఒక ఐక్యరాజ్య సమితి భవనం ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
"ఏది ఏమైనా, మా ప్రెసిడెంట్, మా తల్లి సూ విడుదల అయ్యేంతవరకూ మేము ఆందోళనలు చేస్తూనే ఉంటాం" అని ఆయన అన్నారు. ఆంగ్ సాన్ సూచీని గృహ నిర్బంధంలోకి తీసుకున్నప్పటి నుంచీ ఆమెనుంచి ఎటువంటి సమాచారం లేదు.
"మా యువతకు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సహించం. మా ప్రెసిడెంట్, మా అందరికీ అమ్మలాంటి సూ విడుదల అయ్యేవరకూ మేము పోరాడుతూనే ఉంటాం" అని ఒక మహిళ అన్నారు.
గతంలో ఆంగ్ సాన్ సూచీపై మానవ హక్కుల అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, మియన్మార్‌లో ఆమెకు చాలా ఫాలోయంగ్ ఉంది. సాన్ సూచీని ఎంతోమంది తల్లిలా భావిస్తారు. 2020 ఎన్నికల్లో ఆమె గెలిచినట్లు పలు విదేశీ పర్యవేక్షణ సంస్థలు ధృవీకరించాయి.
సైన్యం ఏమంటోంది?
మియన్మార్‌లో సంక్షోభం నెలకొన్న తరువాత, సోమవారం తొలిసారిగా మిలటరీ జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్ ఒక టెలివిజన్ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఎన్నికల ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయి కాబట్టే సైన్యం తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని ఆయన తమ చర్యలను సమర్థించుకున్నారు. 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలోని అవకతవకలను విచారించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆయన ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఎన్నికల సంఘం అంటోంది.
పలు సంస్కరణలతో కూడిన కొత్త ఎన్నికల సంఘం పర్యవేక్షణలో దేశంలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచినవారికి సైన్యం అధికారాన్ని అప్పగిస్తుందని జనరల్ మిన్ ఆంగ్ హ్లయింగ్ హామీ ఇచ్చారు.
మియన్మార్‌లో 49 సంవత్సరాలపాటూ కొనసాగి, 2011లో అంతమైన సైన్యం పాలనకన్నా తన పాలన భిన్నంగా ఉంటుందని ఆయన తెలిపారు.
క్రమశిక్షణ కలిగిన, నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించడం గురించి ఆయన మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు.
మియన్మార్‌తో అన్ని రకాల ఉన్నత స్థాయి సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యూజిలాండ్ మంగళవారం ప్రకటించింది. ఆ దేశ సైనిక అధికారుల రాకపోకలపై నిషేధం విధించింది.
అంతే కాకుండా, మిలటరీకి ప్రయోజనం చేకూర్చే సహాయ నిధిపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు న్యూజీలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ ప్రకటించారు.
మియన్మార్‌లో మిలటరీ అధికారం చేపట్టిన తరువాత వచ్చిన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రతిఘటన ఇదే.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)