You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'లింగమార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిపోయాను, నా కథ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే...'
లిలీ వయసు 20 ఏళ్లు. ఆమె లింగ మార్పిడి చేయించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘లిలీ: ఎ ట్రాన్స్‌జెండర్ స్టోరీ’ అనే డాక్యుమెంటరీ ద్వారా తన జీవితం గురించి, తనకు ఎదురైన అనుభవాల గురించి ఆమె అందరితో వివరాలు పంచుకున్నారు.
‘‘మాది చిన్న పట్టణం. అక్కడ బాల్యం కొంచెం కష్టమే. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో సరిపడని పరిస్థితుల్లో ఉన్నానని అనిపించేది. నాలో మార్పు రాకముందు నుంచే ఇలా అనిపించేది. నాకు మరీ ఎక్కువగా స్నేహితులు లేరు’’ అని లిలీ చెప్పారు.
‘‘నాలో మార్పు మొదలైనప్పుడు నా చుట్టూ ఉన్న స్నేహితుల బృందం నాకు తోడుగా నిలిచింది. తప్పుగా మాట్లాడే వారిపై నేను దృష్టి పెట్టకుండా చేసింది’’ అని ఆమె అన్నారు.
తన తల్లిదండ్రులు కూడా తనకు ఎంతగానో సహకరించారని, అన్నింటికన్నా తనకు ‘ఇంటర్నెట్’ ఎక్కువ సాయపడిందని లిలీ అన్నారు.
‘మొదటి సారి యూట్యూబ్‌లోనే చూశా’
తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి యూట్యూబ్‌లో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిని చూశానని లిలీ అన్నారు.
ప్రస్తుతం లిలీకి ఓ యూట్యూబ్ చానెల్ ఉంది. తాను లింగ మార్పిడి చేసుకోవడం గురించి, ఇతర విషయాల గురించి అందులో ఆమె మనసు విప్పి మాట్లాడుతుంటారు.
‘‘యూట్యూబ్‌లో లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి గురించి చూశాక మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని వారాల తర్వాత నా మెదడు నిండా ఆ ఆలోచనలే. అంతకుముందు నాకు వింత భావనలు కలిగేవి. నాలా ఇంకా చాలా మందికి అనిపిస్తుందని అప్పుడే నాకు తెలిసింది. నన్ను నేనే కొత్తగా తెలుసుకున్నట్లు అనిపించింది’’ అని లిలీ చెప్పారు.
లిలీ నెమ్మదిగా తనను తాను ఒక మహిళగా చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగే పరిచయం చేసుకోవడం, ఆడవాళ్ల బట్టలే వేసుకోవడం కూడా ప్రారంభించారు.
‘‘అప్పుడు కొందరు బాధపెట్టేలా మాట్లాడారు. అయితే, నా స్నేహితుల బృందం నాకు అండగా ఉంది’’ అని లిలీ చెప్పారు.
టీనేజీలో లింగం మారుతున్నవారికి తమలా చాలా మంది ఉన్నారని తెలియజెప్పేందుకే తాను డాక్యుమెంటరీలో పాల్గొంటున్నానని ఆమె అన్నారు.
‘‘ఈ డాక్యుమెంటరీ ద్వారా జనాలకు అవగాహన వస్తుందని భావిస్తున్నా. లింగం మార్చుకున్నవారిపై అపోహలు దూరమవ్వాలని కోరుకుంటున్నా. ఒక సాధారణ అమ్మాయిలానే నేను జీవిస్తున్నానని వారికి తెలియాలి’’ అని లిలీ చెప్పారు.
‘‘పిల్లలుగా ఉన్నప్పుడు లింగ మార్పిడికి ఎలాంటి సమస్యా ఉండకూడదు. ఇతరులు, ముఖ్యంగా వారి తోటివాళ్లు వారిని చిన్నచూపు చూడకూడదు. కానీ, వాస్తవ పరిస్థితి వేరేలా ఉంటోంది’’ అని ఆమె అన్నారు.
లింగం మారుతున్నవారిలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవాలు ఉంటాయని, అయితే ఆన్‌లైన్ వేదికలో వారి తరఫున నిలబడాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తానని లిలీ అన్నారు.
‘‘నా లాంటివారికి రోజూ ఉదయం లేచి, బయటకు వెళ్లడమే రాజకీయం లాంటిది. నా తరఫున నేను మాట్లాడుకోవాలి. నేను నమ్ముతున్నదాని గురించి చెప్పుకోవాలి. నా గురించి, నా లాంటి వారి గురించి నేను నిలబడతా. ఇంకొకరు మమ్మల్ని చిన్నచూపు చూడకూడదు. మా పోరాటం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు’’ అని ఆమె అన్నారు.
లింగ మార్పిడి చేసుకున్నవారిపై టీవీల్లో, ఇంటర్నెట్‌లో నిత్యం వివక్ష కనిపిస్తూనే ఉంటుందని లిలీ అన్నారు.
‘‘నా బాయ్‌ఫ్రెండ్, నేను దీని గురించి చాలా మాట్లాడుకుంటాం. ‘నేరుగా కలిస్తే, నువ్వు ఎంత మాములుగా ఉంటావో వారికి తెలుస్తుంది. నీ వల్ల ఎవరికీ సమస్య లేదు’ అని ఆయన అంటుంటారు. చాలా మంది అభిప్రాయాలు మార్చగలనని అనిపిస్తుంది. కానీ, నా వయసు ఇంకా 20 ఏళ్లే’’ అని లిలీ అన్నారు.
లిలీ బాయ్‌ఫ్రెండ్ పేరు ఆడమ్. ఆయన కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించారు.
కరోనావైరస్ సంక్షోభం కారణంగా లిలీకి జరగాల్సిన లింగ మార్పిడి సర్జరీ వాయిదాపడింది.
కరోనావైరస్ సంక్షోభం కన్నా ముందు లిలీ బర్మింగ్హమ్‌కు మారిపోయారు. అక్కడే ఆడమ్‌ను ఆమె కలిశారు.
‘‘నేను లింగం మార్చుకున్నానని చెప్పినప్పుడు మా సంభాషణ ఎలా సాగిందన్నది నాకు గుర్తుంది. ఆయన తనకు తానుగానే ఆ విషయం తెలుసుకున్నారు. నా పాత వీడియో ఆన్‌లైన్‌లో చూశారు. అదంతా సరదాగా సాగింది. ‘ఆడమ్, నేను నీకు ఓ విషయం చెప్పాలి’ అని అనగానే... ‘హా, నాకు ముందే తెలుసులే’ అనేశారు’’ అని లిలీ గుర్తు చేసుకున్నారు.
‘‘మనసు విప్పి మాట్లాడుతూ, అండగా నిలిచే భాగస్వామి దొరకడం నా అదృష్టం. నేను లింగం మారాను కాబట్టి, ఆడమ్ ‘స్వలింగ సంపర్కుడు అవుతాడా, కాడా’ అని కొందరు ఆలోచిస్తుంటారు. ఆడమ్‌తో నాకు ఆ చర్చేమీ ఉండదు. నన్ను నన్నుగానే ఆయన చూస్తారు’’ అని లిలీ అన్నారు.
డాక్యుమెంటరీ చూసే వారు కూడా ఇలాగే స్పందిస్తారని తాను అనుకుంటున్నానని చెప్పారు.
‘‘నాలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పిల్లాడికి జీవితం మీద ఆశ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీకి నేను అంగీకరించాను. లింగ మార్పిడి చేసుకున్నవారి పట్ల సదభిప్రాయం లేనివారు ఈ డాక్యుమెంటరీ చూసి మారితే నాకు సంతోషం’’ అని లిలీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)