You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
WHO: ‘కోవిడ్-19 రోగులపై రెమెడెసివీర్ ప్రభావం అంతంత మాత్రమే’
కోవిడ్-19 రోగులపై యాంటీ వైరల్ ఔషధం రెమెడెసివీర్ ప్రభావం అంతంత మాత్రమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా అధ్యయనం తెలిపింది. ఈ ఔషధ ప్రభావం స్పల్పంగా ఉంటుందని లేదా అసలు ఉండదని పేర్కొంది.
కరోనావైరస్ రోగులపై సమర్థంగా పనిచేసే ఔషధాల అన్వేషణే లక్ష్యంగా రెమెడెసివీర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో తాజా పరిశోధన చేపట్టింది.
కరోనావైరస్‌పై చికిత్సల్లో ఎక్కువగా, మొదట్నుంచీ ఉపయోగిస్తున్న ఔషధాల్లో రెమెడెసివీర్ ఒకటి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఆసుపత్రిలో చేర్పించినప్పుడు దీన్నే ఇచ్చారు.
తాజా ఫలితాలను రెమెడెసివీర్ తయారీ సంస్థ గిలియాడ్ తోసిపుచ్చింది.
ఇదివరకు చేపట్టిన పరిశోధన ఫలితాలతో ఈ ఫలితాలు విభేదిస్తున్నాయని, ఈ పరిశోధన ఫలితాలను ఇంకా సమీక్షించలేదని గిలియాడ్ ఆందోళన వ్యక్తంచేసింది.
పరిశోధన ఫలితాల్లో ఏముంది?
ఎబోలా ఔషధమైన రెమెడెసివీర్, మలేరియా ఔషధమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెపటైటిస్ ఔషధం ఇంటెర్‌ఫెరాన్, హెచ్‌ఐవీ ఔషధ సమ్మేళనాలైన లోపినావిర్, రిటోనావిర్‌లపై డబ్ల్యూహెచ్‌వో తాజా పరిశోధన చేపట్టింది.
30 దేశాల్లోని 500 ఆసుపత్రుల్లో 11,266 మంది రోగులు దీనిలో పాలుపంచుకున్నారు.
రోగుల్లో మరణ ముప్పును తగ్గించడం లేదా, ఆసుపత్రిలో గడిపే రోజుల్ని తగ్గించడంలో ఈ ఔషధాలేవీ పనిచేయడంలేదని ఫలితాల్లో రుజువైనట్లు గురువారం డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే, ఈ పరిశోధన ఫలితాలను ఇంకా సమీక్షించలేదు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్‌లు ఇదివరకే పనిచేయడంలేదని తెలియడంతో వాటి ప్రయోగాలు జూన్‌లోనే నిలిపివేశామని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. మిగతా ఔషధాలపై తాజా పరిశోధన కొనసాగిందని వివరించారు.
ప్లాసిబోతో పోల్చినప్పుడు కోవిడ్-19 రోగులు కోలుకునే సమయాన్ని ఐదు రోజుల వరకు తగ్గించొచ్చని ఇటీవల గిలియాడ్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. వెయ్యి మందిపై సంస్థ ఈ పరిశోధన చేపట్టింది. అయితే, వీటికి భిన్నంగా డబ్ల్యూహెచ్‌వో పరిశోధన ఫలితాలున్నాయి.
గిలియాడ్ స్పందన ఇదీ
డబ్ల్యూహెచ్‌వో పరిశోధన ఫలితాలను గిలియాడ్ సైన్సెస్ తోసిపుచ్చింది.
''డబ్ల్యూహెచ్‌వో సమాచారం చాలా అస్తవ్యస్తంగా ఉంది. భిన్న ప్రాంతాల్లో చేపట్టిన పరిశోధనల్లో ఈ ఔషధం మెరుగ్గా పనిచేస్తోందని ప్రముఖ వైద్య మ్యాగజైన్‌లలో వార్తలు కూడా వచ్చాయి''అని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
''వివిధ దేశాల్లో నిర్వహించిన డబ్ల్యూహెచ్‌వో పరిశోధనల సమాచారాన్ని సరిగ్గా సమీక్షించలేదని మాకు అనిపిస్తోంది''
అయితే, ఈ పరిశోధన ఫలితాలు చాలా ముఖ్యమైనవని బ్రిటన్‌లో జరిగిన పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే వ్యాఖ్యానించారు. రెమెడెసివీర్ ధర, అందుబాటులపై ప్రజల్లో ఇప్పటికే ఆందోళనలు ఉన్నాయని ఆయన అన్నారు.
''ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి కరోనావైరస్ సోకుతోంది''
''ఇదేమీ అరుదైన వ్యాధికాదు. దీనికి కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే చికిత్సలు రావాలి. డబ్ల్యూహెచ్‌వో తాజా పరిశోధన స్పష్టమైన, స్వతంత్ర ఫలితాలను మన ముందు ఉంచింది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ భారీ పరిశోధనల అవసరాన్ని ఇది తెలియజెప్పింది''
అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో రెమెడెసివీర్‌ను ఉపయోగించేందుకు మే 1న ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. ఆ తర్వాత చాలా దేశాలు ఈ ఔషధ వినియోగానికి అనుమతులు జారీచేశాయి.
కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ రెమెడెసివీర్‌ను సమర్థమంతమైన ఔషధంగా చెబుతూ వస్తున్నారు. డోనల్డ్ ట్రంప్‌కు చికిత్సలో ఉపయోగించడంతో దీనిపై చర్చ మరింత ఎక్కువైంది.
అయితే ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో పరిశోధన భిన్నమైన ఫలితాలు ఇచ్చింది.
డేటా విషయంలో కొంత అసందిగ్ధత ఉన్న మాట వాస్తవమే. అయితే, లక్షల మంది ప్రాణాలను కాపాడగల సత్తా రెమెడెసివీర్‌కు ఉందన్న వాదనను పరిశోధన నిర్ద్వంద్వంగా డబ్ల్యూహెచ్‌వో తోసిపుచ్చింది.
ప్రస్తుతం కరోనావైరస్‌తో పోరాడగల అందుబాటులో ఉండే ఔషధాల కోసం వైద్యులు, పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే మలేరియా, హెచ్‌ఐవీ ఔషధాలు పోరాడలేవని తెలిసింది. ఇప్పుడు ఎబోలా ఔషధమూ ఆ జాబితాలో చేరిపోయింది. స్టెరాయిడ్ డెక్సామెథాసోన్ మాత్రమే ప్రాణాలను కొంతవరకు కాపాడగలుగుతోంది.
దీంతో వైరస్‌లతో పోరాడేలా తయారుచేసిన యాంటీబాడీల చికిత్స, కొత్త యాంటీ వైరల్ డ్రగ్స్ వైపు పరిశోధనల దృష్టి పడుతోంది.
ఆ ఫలితాల కోసం ఇంకొంత సమయం పడుతుంది. అయితే, కొత్త ఔషధమంటే ధర కూడా ఎక్కువే ఉంటుంది. దీంతో ఇవి ఎవరికి ముందు దొరుకుతాయనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.
ఇతర చికిత్సల సంగతేంటి?
డబ్ల్యూహెచ్‌వో పరిశోధన ఫలితాలతో తర్వాత ఏమిటి? అనే అంశంవైపు అందరి దృష్టి పడుతోందని డాక్టర్ స్వామినాథన్ చెప్పారు.
''ప్రస్తుతం యాంటీబాడీలు, ఇమ్యునోమోడ్యులేటర్లు, గత కొన్ని నెలలలో అభివృద్ధి చేసిన ఇతర యాంటీ వైరల్ ఔషధాలపై మేం దృష్టిసారిస్తున్నాం''అని ఆమె చెప్పారు.
మరోవైపు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ ప్రాథమిక, మధ్య స్థాయి ప్రయోగ పరీక్షల్లో సమర్థంగా వ్యాధి నిరోధక స్పందనలను కలగచేస్తోందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. ఇది సురక్షితమైన టీకా అని కూడా చెబుతున్నారు.
అయితే, కరోనావైరస్ నుంచి కాపాడేందుకు ఈ వ్యాధి నిరోధక స్పదనలు సరిపోతాయా? అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం చెప్పలేమని, ఎందుకంటే టీకా సామర్థ్యం అంచనా వేసేందుకు ఈ పరీక్ష చేపట్టలేదని పరిశోధకులు వివరించారు.
ఈ టీకాను బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని అత్యవసరంగా దేశంలో అందరికీ ఇచ్చేందుకు అనుమతులు కూడా వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)