You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనాలో మిగతా దేశాల్లాగా ఈమెయిల్స్ వాడరు... ఎందుకో తెలుసా?
- రచయిత, లు హాయ్ లియాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పది పన్నెండేళ్ల క్రితం చైనాలో క్యూక్యూ, ఎంఎస్ఎన్ మెసెంజర్ లాంటి డెస్క్‌టాప్ యాప్‌లు ఎక్కువగా వాడుకలో ఉండేవి. వీటి ద్వారానే ఎక్కువ మంది సంభాషించుకునేవారు. ఫేస్‌బుక్‌ను కొంతమందే వాడేవారు. అప్పట్లో చైనాలో ఆ వెబ్‌సైట్ మీద నిషేధమేమీ లేదు. ఇక, ఈమెయిల్ సేవలను వాడే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. రానురానూ అది ఇంకా తగ్గిపోతూ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులకు సంబంధించిన పనులన్నీ దాదాపు ఈమెయిల్స్ ద్వారానే జరుగుతాయి. కానీ, చైనాలో మాత్రం అలా కాదు.
అక్కడ వీచాట్ యాప్ ఈమెయిల్ పద్ధతిని అధిగమించేసింది.
చైనాలో వీచాట్ యాప్ చాలా పాపులర్. ఆఫీస్‌కు సంబంధించిన పనులు, నగదు చెల్లింపులు, షాపింగ్... ఇలా అన్నీ ఆ యాప్ ద్వారానే జరుగుతాయి. చైనా మొబైల్స్, యాప్స్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయంటే ఏ పనైనా క్షణాల్లో జరిగిపోతుంది.
బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ఆన్‌లైన్ కార్యకలాపాల్లో ఈమెయిల్స్‌దే పైచేయి. 85-90% ఈమెయిల్స్ వాడతారు. కానీ, చైనాలో పద్ధతి వేరు.
2018లో డెల్లాయిట్ చేసిన చైనా మొబైల్ కస్టమర్ సర్వే ప్రకారం చైనాలో మిగతా దేశాలకన్నా 22% తక్కువగా ఈమెయిల్స్ వాడతారని తేలింది.
స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నవారిలో దాదాపు 79% మంది వీచాట్ వాడతారని గణాంకాలు చెబుతున్నాయి. మెసేజింగ్ యాప్స్ వాడుతున్నవారిలో 84.5% మంది వీచాట్ వాడతారని తేలింది.
ముఖ్యంగా ఆఫీస్ కార్యకలాపాలలో ఎక్కువమంది వీచాట్ వాడుతున్నారని టెన్సెంట్ చేసిన ఒక సర్వేలో తేలింది. ఈ టెన్సెంట్ కంపెనీనే వీచాట్ యాప్ తయారుచేసింది.
టెన్సెంట్‌లోని పరిశోధనా విభాగం పెంగ్విన్ ఇంటెలిజెన్స్ 2017లో చేసిన సర్వేలో... 20,000 మందిలో దాదాపు 88% మంది ఆఫీస్ పనులకు వీచాట్ వాడతారని తేలింది. ఫోన్లు, ఎస్ఎంఎస్, ఫ్యాక్స్‌లాంటివి 59.5% మంది వాడగా, కేవలం 22.6% మాత్రమే ఈమెయిల్స్ వాడతారని తేలింది.
చైనాలో 100 కోట్లకన్నా ఎక్కువమంది వీచాట్ వాడతారు.
1999లో టెన్సెంట్ కంపెనీ క్యూక్యూ అనే మెసేజింగ్ యాప్ తయారుచేసింది. దీన్ని కంప్యూటర్‌లో డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. అప్పట్లో ప్రతీ వెయ్యి మందిలో 12 మందికే కంప్యూటర్లు ఉండేవని ప్రపంచ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి.
2000ల ఆరంభంనుంచీ చైనాలో ఇంటర్నెట్ కెఫేలు ప్రారంభమై, మెల్లిమెల్లిగా పుంజుకోవడం మొదలెట్టాయి. ఇంటర్నెట్ కెఫేలలో క్యూక్యూ యాప్‌దే పైచేయి.
గేమ్స్, సంగీతం, బ్లాగులు ఇవన్నీ క్యూక్యూ మెసెంజర్ యాప్‌లో ఉండేవి. ఈమెయిల్స్ కన్నా క్యూక్యూ మెసెంజర్ యాప్‌లో ఎక్కువ ఫీచర్లు ఉండడంతో ఇంటర్నెట్ కెఫేలకు వచ్చేవాళ్లంతా క్యూక్యూను ఎక్కువగా వాడేవారు.
పశ్చిమ దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం ఎంత సాధారణమో చైనాలో క్యూక్యూ వాడడం అంత సాధారణమైపోయిందని 2018లో వచ్చిన 'సూపర్ ట్రెండ్స్ ఆఫ్ ఫ్యూచర్ చైనా' పుస్తకంలో ప్రస్తావించారు.
విజిటింగ్ కార్డ్‌లమీద కూడా క్యూక్యూ అకౌంట్ నంబర్లు ఇచ్చేవారు.
ఇదే పంథాను అనుసరిస్తూ 2011లో అదే టెన్సెంట్ కంపెనీ ప్రవేశపెట్టిన వీచాట్ పాపులర్ అయిపోయింది.
కంప్యూటర్ల స్థానాన్ని మొబైల్స్ ఆక్రమించడంతో క్యూక్యూ స్థానాన్ని వీచాట్ ఆక్రమించింది.
ఈ ఒక్క యాప్‌తో దాదాపు అన్ని ఆన్‌లైన్ కార్యకలాపాలూ సాగించవచ్చు. బిల్లులు చెల్లించడం, షాపింగ్, ఆఫీసు పనులు, డాక్టర్ అపాయింట్మెంట్లు తీసుకోవడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం... ఇలా ఏదైనా ఈ యాప్ ద్వారా చేయొచ్చు.
తక్షణమే జరిగిపోవాలి
చైనా ప్రజల పనితీరుకు వీచాట్ సరిగ్గా సరిపోతుందని షెంగ్ కాంగ్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ జాంగ్ లింగ్ అభిప్రాయపడుతున్నారు.
"చైనా ప్రజలకు ఏదైనా క్షణాల్లో జరిగిపోవాలి. దీన్ని వారి సంస్కృతిక, వ్యాపార లక్షణంగా చెప్పుకోవచ్చు. వీచాట్, ఈమెయిల్స్ కన్నా ఇంఫార్మల్‌గా ఉంటుంది. అలా ఉండడం వల్ల తక్షణమే స్పందించడానికి వీలు కలుగుతుంది. వీచాట్‌లో తక్షణమే స్పందన వస్తుంది" అని జాంగ్ లింగ్ అన్నారు.
"చైనాలో ఆఫీస్ పనులకు, వ్యక్తిగత జీవితాలకు మధ్య ఉన్న రేఖ చాలా సన్నగా ఉంటుంది. పని వేళలు దాటిన తరువాత కూడా ఆఫీస్ పనులు అప్పగించడం ఇక్కడ సర్వ సాధారణం. అలాంటప్పుడు వీచాట్‌లాంటి ఇంఫార్మల్ యాప్స్ ఇక్కడ బాగా పనిచేస్తాయి" అని ఆయన వివరించారు.
ఇతర ప్రధాన యాప్‌లు
పెద్ద పెద్ద సంస్థల్లో వ్యాపార నిమిత్తం వీచాట్ కాకుండా అలిబాబా సంస్థ యాప్ డింగ్‌టాక్, బైట్ డాన్స్ సంస్థ యాప్ లార్క్, వీచాట్ బిజినెస్ వెర్షన్‌లను కూడా వాడుతుంటారు.
చైనా ప్రజలు ఇతర దేశాల ప్రజలతో పనిచేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈమెయిల్స్ వాడతారు. చైనాలో స్థానికంగా వీచాట్ మాత్రమే వాడతారు.
"ఇతర దేశాల్లో, బట్టలు కొనుక్కోవాలంటే ఒక యాప్, గృహోపకరణాలకు ఒకటి, సరుకులకు ఒకటి, చెల్లింపులకొకటి…ఇలా రకరకాల యాప్స్ వాడతారు. చైనాలో ఒక్క వీచాట్ ఉంటే చాలు. అన్ని పనులూ జరిగిపోతాయి" అని 30 ఏళ్ల హైలన్ జియా అంటున్నారు. చైనీస్ క్రిప్టోకరెన్సీ ట్రడింగ్ కంపెనీ హైలన్‌లో పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా ఆమె పనిచేస్తున్నారు.
"మేము ఈమెయిల్స్ ఎక్కువగా వాడం కాబట్టి ఈమెయిల్‌కు వెంటనే జవాబివ్వాలని నాకు తోచదు. వేరేవాళ్లు నా ఈమెయిల్‌కి స్పందించాలని కూడా నేను ఎదురుచూడను. కానీ, వేరే దేశాలవారితో పనిచేయాలంటే ఈమెయిల్స్ తరచూ చూసుకోవడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది" అని అంటున్నారు హైలన్.
అందుకే, వీచాట్ చైనా ప్రజల జీవితాల్లో అంతర్భాగమైపోయింది. ఈమెయిల్స్ మాత్రం అక్కడ గత చరిత్ర స్మృతుల్లా అనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)