ఐవరీ కోస్ట్: క్యాబినెట్ మీటింగ్‌లో అస్వస్థతకు గురై ప్రధాన మంత్రి కౌలిబలి మృతి

ఐవరీ కోస్ట్ ప్రధాన మంత్రి అమడౌ గాన్ కౌలిబలి.. మంత్రి మండలి సమావేశంలో అస్వస్థతకి గురై మరణించారు.

ప్రస్తుత దేశాధ్యక్షుడు అలస్సనే ఔట్టారా మూడవ సారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనని స్పష్టం చేయడంతో 61 సంవత్సరాల అమడౌని అధికార పార్టీ తమ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఐవరీ కోస్ట్‌లో అక్టోబర్‌లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

గాన్ కౌలిబలి ఫ్రాన్స్‌లో రెండు నెలల పాటు హృద్రోగానికి చికిత్స తీసుకుని ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు.

ప్రధాని మృతి పట్ల దేశం మొత్తం సంతాపం ప్రకటిస్తోందని ఔట్టారా తెలిపారు.

ఐవరీ కోస్ట్ దేశ క్యాబినెట్ ప్రతి వారం సమావేశం అవుతుంది. ఎప్పట్లాగే మంత్రి మండలి సమావేశం అయ్యిందని, ఆ సమావేశం జరుగుతుండగానే ప్రధానమంత్రి కౌలిబలి అస్వస్థతకి గురవడంతో హాస్పిటల్‌కి తరలించామని, ఆస్పత్రిలో ఆయన చనిపోయారని ఔట్టారా వెల్లడించారు.

“30 సంవత్సరాలుగా నా సహచరుడిగా ఉన్న నా సోదరుడు, కొడుకుకి నేను నివాళి అర్పిస్తున్నాను. అత్యంత విస్వాసపాత్రుడు, కార్యదక్షత, జన్మ భూమి పట్ల గౌరవం ఉన్న వ్యక్తి జ్ఞాపకాలకు వందనాలు అర్పిస్తున్నా” అని ఔట్టారా అన్నారు.

అమడౌ మరణంతో దేశంలో అధ్యక్ష ఎన్నికల పట్ల తీవ్రమైన అనిశ్చితి నెలకొంది.

అమడౌకి 2012లో హృదయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. మే 2వ తేదీన స్టెంట్ అమర్చుకోవడం కోసం పారిస్ వెళ్లారు.

ఆయన గత గురువారమే స్వదేశానికి తిరిగి వచ్చారు. "నేను నా దేశానికి తిరిగి వచ్చాను. దేశాభివృద్ధి, నిర్మాణం కోసం దేశాధ్యక్షునితో కలిసి పని చేస్తానని" అన్నారు.

అధ్యక్ష ఎన్నికలలో గెలిచేందుకు అమడౌ ఆమోదయోగ్యమైన అభ్యర్థి.

ఒక వేళ అమడౌ ఎన్నికలలో పోటీ చేసేందుకు సంసిద్ధంగా లేకపోతే , ఔట్టారా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయక తప్పదని లీ మాండ్ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఈ అంశంపై ఎవరూ మాట్లాడలేదు. ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ చేయనని చెబుతూ, తన స్థానాన్ని భర్తీ చేసే అభ్యర్థిని కూడా ఔట్టారా సూచించారు.

ఈ నిర్ణయం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.

అధికారం కోసం పాకులాడకుండా మరొకరిని సూచించడంతో ఔట్టారాపై రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారని బీబీసీ ప్రతినిధి జేమ్స్ కోప్ నాల్ పేర్కొన్నారు.

అమడౌకి ఔట్టారా నుంచి పూర్తి సహకారం ఉంటుందనేది కూడా అర్ధమైంది .

ఔట్టారా పాలనా కాలంలో ఐవరీ కోస్ట్‌కి ఆర్ధిక వృద్ధి, స్థిరత్వం తెచ్చి, ప్రపంచ దేశాలలో ఐవరీ కోస్ట్‌కి ఒక సరికొత్త స్థానాన్ని కల్పించారని ఆయన మద్దతుదారులు చెబుతారు.

దేశాన్ని ఒకే తాటిపైకి తేవడానికి ఆయన పెద్దగా కృషి చేయలేదని, ఐవరీ కోస్ట్‌ని విభజించిన కలహాల వలన ఏర్పడిన గాయాలను నయం చేయలేదని, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి.

2010 అధ్యక్ష ఎన్నికలలో ఔట్టారా చేతిలో ఓడిపోయిన లారెంట్ బాగ్బో ఓటమిని అంగీకరించలేక తలపెట్టిన యుద్ధంలో సుమారు 3000 మంది మరణించి ఉంటారని అంచనా. ఏప్రిల్ 2011 లో బాగ్బోని అరెస్ట్ చేశారు.

ఔట్టారాకి బాగ్బోతో పాటు గతంలో అధ్యక్షునిగా పని చేసిన హెన్రి కొనాన్ బేడితో కూడా సుదీర్ఘ కాలంగా నెలకొని ఉన్న రాజకీయ కక్షలు, ఐవరీ కోస్ట్‌కి వినాశకరంగా పరిణమించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)