చైనాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్ ఎందుకు పెద‌వి విప్ప‌ట్లేదు?

చైనా, ఇరాన్‌ల మ‌ధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. అయితే, వ‌చ్చే 25ఏళ్ల‌పాటు ఈ ఒప్పందం అమ‌ల‌వుతుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

సామాన్యుల నుంచి నిపుణుల వ‌ర‌కూ అంద‌రూ ఈ ఒప్పందంపై తమ అభిప్రాయాల‌ను చెబుతున్నారు. చాలా ఊహాగానాలు కూడా వ‌స్తున్నాయి.

అయితే, ఇరాన్ వాసులు మాత్రం ఈ ఒప్పందంపై కొంత నిరాశ‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ ఒప్పందంపై ఇరాన్ అతివాద ప‌త్రిక "జ‌వాన్" ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఆ క‌థ‌నంలో ఒప్పందాన్ని "ల‌య‌న్‌-డ్రాగ‌న్ డీల్‌"గా అభివ‌ర్ణించింది.

ఏమిటీ ఒప్పందం?

ఈ ఒప్పందానికి సంబంధించి తొలిసారిగా 23, జ‌న‌వ‌రి 2016న ఇరాన్‌లో చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ ప‌ర్య‌టించినప్పుడు రెండు దేశాలూ క‌లిసి ఓ సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి.

ఒప్పందంలోని ఆర్టిక‌ల్‌-6 ప్ర‌కారం.. రెండు దేశాలు సాంకేతిక‌త‌, ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాలు, ఇంధ‌న రంగాల్లో స‌హ‌కారాన్ని పెంపొందించుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ త‌స్‌నీమ్ వెల్ల‌డించింది.

"వ‌చ్చే 25 ఏళ్ల‌వ‌ర‌కూ ఉమ్మ‌డి స‌హ‌కారం కొన‌సాగించాల‌ని రెండు దేశాలు నిర్ణ‌యించాయి" అని త‌స్‌నీమ్ పేర్కొంది.

చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్‌తో స‌మావేశ‌మైన‌ప్పుడు కొన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికా ఆధిప‌త్య విధానాల‌ గురించి ఇరాన్ అత్యున్న‌త నాయ‌కుడు అయ‌తొల్లా ఖ‌మేనీ ప్ర‌స్తావించారు.

"ప్ర‌స్తుత ప‌రిస్థితుల న‌డుమ‌.. స్వ‌తంత్ర దేశాలు ఒక‌రికి మ‌రొక‌రు స‌హ‌క‌రించుకుంటూ ముందుకు వెల్లాలి. వ‌చ్చే 25 ఏళ్లు ఈ వ్యూహాత్మ‌క ఒప్పందాన్ని రెండు దేశాలు తూచా త‌ప్ప‌కుండా అనుస‌రించాలి" అని ఆయ‌న పేర్కొన్నారు.

అమెరికా ఆంక్ష‌ల‌కు వ్య‌తిరేకంగా చైనా అందించిన‌ మ‌ద్ద‌తుపై చాలాసార్లు ఇరాన్ అధ్య‌క్షుడు హ‌స‌న్ రౌహానీ ప్ర‌శంస‌లు కురిపించారు.

మౌలిక స‌దుపాయాల‌కు సంబంధించిన ప్రాజెక్టుల్లో రెండు దేశాల‌కు ఈ ఒప్పందం కొత్త అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంద‌ని జూన్ 21న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో రౌహానీ చెప్పారు. చైనాతో చ‌ర్చ‌లు జ‌రిపి, మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్టే బాధ్య‌త విదేశాంగ మంత్రి జావెద్ జారిఫ్‌కు అప్ప‌గించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ఇంధ‌న రంగంలో స‌హ‌కారం

చ‌మురుకు సంబంధించి ఇరాన్‌, చైనా, ర‌ష్యాల మ‌ధ్య ఏ ఒప్పందం జ‌రిగినా.. అది ఇంధ‌నం, భ‌ద్ర‌త‌, ఆర్థిక రంగాల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని ఇరాన్‌‌కు చెందిన ఐఎల్ఎన్ఏ వార్తా సంస్థతో ఇరాన్ ఆర్థిక వేత్త అలీ అష్‌గ‌ర్ జర్గార్ చెప్పారు.

"ఏ దేశం నియంత్రణ‌లోలేని దేశాల‌నే చైనా ఎంచుకుంటుంది. అందుకే ఈ ఒప్పందానికి ఇరాన్‌ను ఎంచుకుంది. చైనాకు స్వ‌తంత్రంగా ఇరాన్ సాయం చేయ‌గ‌ల‌దు. అదే స‌మ‌యంలో మా ప్రాజెక్టులో చైనా కూడా పాలుపంచుకుంటుంది. ఇక్క‌డ వ‌ల‌స‌వాదం ప్ర‌స‌క్తే లేదు. రెండు దేశాల‌కూ ఒప్పందంతో ల‌బ్ధి చేకూరుతుంది. ఇరాక్‌లో ఇరాన్ స‌దుపాయాల‌తో చైనాకూ ఉప‌యోగం ఉండొచ్చు" అని జ‌ర్గార్ వివ‌రించారు.

"చైనాకు ఇంధ‌న వ‌న‌రుల అవ‌స‌ర‌ముంది. ఇరాన్‌కు సాంకేతిక‌త‌, పెట్టుబ‌డులు అవ‌స‌రం. ఈ ఒప్పందంతో రెండు దేశాల అవ‌స‌రాలూ తీరుతాయి"

చైనా, ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా

చైనా ముందు అమెరికా కాస్త బ‌ల‌హీనంగా, అమెరికా ముందు చైనా కొంచెం అభ‌ద్ర‌తా భావంతో ఉన్న త‌రుణంలో చైనా-ఇరాన్‌ల మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డానికి ఇదే మంచి స‌మ‌య‌మ‌ని ఇరాన్ ప‌త్రిక జ‌వాన్ వ్యాఖ్యానించింది.

చైనాలోని అమెరికా వ్య‌తిరేక విధానాలతో ఈ ఒప్పందానికి మ‌రింత ప్రా‌ధాన్యం ఏర్ప‌డింద‌ని జ‌వాన్ పేర్కొంది.

"ఇత‌ర దేశాల సొంత విష‌యాల్లో ట్రంప్ ప్ర‌భుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందో మ‌నం చూశాం. చైనా, ఇరాన్‌ల విష‌యంలో అమెరికా ప‌దేప‌దే ఇలానే చేస్తోంది. అందుకే చైనాతో స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రి. దీన్ని మ‌నం త‌క్కువ‌గా చూడ‌లేం"అంటూ ఇరాన్ పార్ల‌మెంటు మ‌జ్లిస్ స్పీక‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ఖ‌లీబాఫ్ ప్ర‌క‌ట‌న‌ను జ‌వాన్ ఉటంకించింది.

ఈ ఒప్పందానికి సంబంధించి నిబంధ‌నావ‌ళి పూర్త‌యింద‌ని ఇరాన్ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి అలీ ర‌బీ జూన్ 23న వెల్ల‌డించారు.

అంత‌ర్జాతీయంగా ఇరాన్‌ను ఏకాకిని చేయాల‌నే అమెరికా విధానం విఫ‌ల‌మైంద‌ని తాజా ఒప్పందం నిరూపించ‌బోతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇరాన్ విధానాలు మారుతున్నాయా?

"ఈ ఒప్పందంతో ఇరాన్ ఈస్ట్ పాల‌సీ వైపు వెళ్ల‌డంలేదు. అయితే, అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌లో భాగ‌స్వాములం అవుతున్నాం" అని ఇరాన్‌కు చెందిన సీనియ‌ర్ పాత్రికేయుడు అహ్మ‌ద్ జిదాబాదీ వ్యాఖ్యానించారు.

"ప్ర‌పంచ దేశాల మ‌ధ్య శ‌త్రుత్వం కంటే స్థిర‌త్వానికే చైనా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇరాన్‌, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల‌తో స్నేహ పూర్వ‌క సంబంధాల‌ను చైనా కోరుకుంటోంది"అని అహ్మ‌ద్ వివ‌రించారు.

అదే స‌మ‌యంలో, ఈ ఒప్పందంతో ఇరాన్ విధానాలు చాలా మార‌తాయ‌ని, చైనా విధానాల‌ను తాము కూడా అనుస‌రించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అమెరికా, ఐరోపా దేశాలు ఇక‌పై ఆంక్ష‌లు విధించ‌కుండా హెచ్చ‌రిక‌లు చేసేందుకే చైనాతో ఇరాన్ అధికారులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారా? అని అహ్మ‌ద్ ప్ర‌శ్నించారు.

విధానాల‌ను మార్చుకోవడం త‌ప్పితే వేరే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇరాన్ ప్ర‌భుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంటోంద‌ని అహ్మ‌ద్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇంత గోప్య‌త ఎందుకు?

ఈ ఒప్పందం గురించి పూర్తి వివ‌రాలు బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డంపై ఇరాన్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, కోరిక‌లు తెలుసుకోకుండా కుదుర్చుకున్న ఏ ఒప్పంద‌మైనా దేశానికి వ్య‌తిరేక‌మైన‌దే. అది చెల్ల‌దు కూడా.. అని ఇరాన్ మాజీ అధ్య‌క్షుడు మ‌హ‌మూద్ అహ్మ‌దినేజాద్.. జూన్ 27న ఓ బహిరంగ స‌భ‌లో వ్యాఖ్యానించారు.

ఈ ఒప్పందం వ్య‌వ‌హారం గంద‌ర‌గోళంగా ఉందంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. అన్ని వివ‌రాల‌ను గోప్యంగా ఉంచ‌డంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా దీని వివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

మ‌హ‌మూద్ వ్యాఖ్య‌ల‌పై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి అబ్బాస్ మౌసావీ స్పందించారు. చైనా నుంచి అనుమ‌తి తీసుకున్నాక‌.. పూర్తి వివ‌రాలు ప్ర‌జ‌ల ముందు ఉంచుతామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఒప్పందం వ్య‌వ‌హారం, నిబంధ‌న‌ల్లో గంద‌ర‌గోళం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఖండిచారు.

"తాజా ఒప్పందంతో ఇరాన్ తూర్పు దేశాల సంబంధాలే ల‌క్ష్యంగా త‌మ‌ వ్యూహాల‌కు మెల్ల‌గా ప‌దునుపెడుతోంది. ఈ ఒప్పందాన్ని సంకీర్ణంగా చూడ‌కూడ‌దు. ఇదొక వ్యూహాత్మ‌క స‌హ‌కారం. చైనా, ఇరాన్‌ల విధానాలు, రాజ్యాంగం, దృక్ప‌థాలు పూర్తి భిన్న‌మైన‌వి" అని ఆర్థిక‌వేత్త మోసిన్ షరియాతినా వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్ర‌జ‌లు ఏమంటున్నారు?

ఈ కొత్త ఒప్పందంపై ఇరాన్ ప్ర‌జ‌లు అంత సంతోషంగా ఏమీలేరు. ఈ ఒప్పందంతో చైనా వ‌ల‌స‌వాదం మొద‌ల‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి.

చైనాకు వ్య‌తిరేకంగా ఇరాన్‌నాట్‌4సెల్‌... నాట్‌4రెంట్ అనే ట్వీట్ ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)